Monday, August 24, 2026

rukmini kalyana katha praarambhamu - రుక్మిణీ కల్యాణ కథా ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - రుక్మిణీ కల్యాణ కథాప్రారంభము

ఓ పరీక్షిన్మహారాజా! మునుపు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడం వల్ల రైవతుడనే రాజు తన పుత్రిక రేవతిని తీసుకొనివచ్చి బలరాముని కిచ్చాడు. ఈ విషయాన్ని గురించి నీవు వివరంగా విన్నావు కదా!

ఆ తర్వాతి విషయం ఏమనగా,

పక్షులకు రాజైన గరుత్మంతుడు మునుపు దేవేంద్రుడిని జయించి అమృతాన్ని తెచ్చాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు శిశుపాలుడినీ, అతడిని అనుసరించే సాళ్వుడు మొదలైన రాజులనూ జయించాడు. భీష్మకుని పుత్రిక రుక్మిణిని వరించాడు. ఆమెశరీరం తామరపూలసువాసనతో ఉంది. ఆమె లక్ష్మీదేవిఅంశ. గొప్పగుణాలతో ప్రకాశిస్తున్నది. కన్యకలలో శ్రేష్ఠురాలు.

(ఖగ - 'ఖ' అంటే ఆకాశం; 'గ' అంటే గమించేది = పక్షి అని అర్ధం. అలాంటి పక్షిలోకానికి రాజు గరుత్మంతుడు. ఆయన వినతాతనయుడు. ఇంద్రాదులను జయించి, స్వర్గంనుండి అమృత భాండాన్ని తెచ్చి ఇచ్చి, తన తల్లి దాస్యాన్ని పోగొట్టిన గరుడునిశౌర్యంవలె శ్రీకృష్ణుడు రాజులను జయించి రుక్మిణిని పొందాడు.)

ఈ విధంగా శుకమహర్షి చెప్పగానే వింటున్నపరీక్షిత్తు ఇలా అడిగాడు. రుక్మిణీదేవిస్వయంవరానికి వచ్చిన శ్రీకృష్ణుడు రాక్షసవివాహపద్ధతిలో ఆమెను తీసుకుని వెళ్లాడని మునుపు చెప్పావు. సాళ్వుడు మొదలైన రాజులందరినీ శ్రీకృష్ణుడు ఒక్కడే ఎలా ఓడించాడు? రుక్మిణీదేవిని తన నగరానికి ఎలా తీసుకెళ్లాడు? అదీ కాకుండా -

బ్రాహ్మణులలో ఉత్తముడవైన శుకమహర్షీ! శ్రీమహావిష్ణువుకథలను వింటూ సంసార దుఃఖాల నుండి విముక్తి పొందిన వారు, ఇక వినింది చాలనుకుంటారా? అలా ఎవరైనా తృప్తి పొందుతారా? 

ఆ కథలను వింటూ ఉంటే అవి ఎప్పటికప్పుడు కొత్తవిగా ఉంటూ చవులూరిస్తాయి. కాబట్టి, రుక్మిణీదేవి వివాహగాథను గురించి మొదటి నుంచి చివరిదాకా మొత్తం వినిపించు. ఎపుడెపుడు విందామా అని మనసంతా కుతూహలంగా ఉంది.

శ్రీ మహావిష్ణువుగుణాలను గురించి చెప్పుకోవడంలో విశేషం - ఆ కథలు వినేవారిచెవులకు ఆభరణాలు. విద్వాంసులకు ఆనందకారకాలు. జన్మజన్మాల పాప ప్రవాహాల్ని ఎండింప చేసేవి. ఆ కథలను పలుకుతుంటేనే శుభాలు కలుగుతాయి. అంతటి మహిమ ఉన్నవి ఆ గరుడగమనుడైన శ్రీవిష్ణువు కథలు. (ఇంతటి ప్రయోజనం, ఆనందం, ఫలం కల్గుతుందని భావం)

ఈ విధంగా రాజు శుకుడిని అడిగాడు. శుకుడు ఇలా చెప్పసాగాడు.

మనుష్యులలో శ్రేష్ఠుడవైన పరీక్షిన్మహారాజా! ఆలకించు. విదర్భ అని ఒక దేశముంది. అందులో కుండిన పురం అని ఒక నగరం. దానికి అధిపతి భీష్మక మహారాజు. అతనికి ఐదుమంది కొడుకులు. వారిలో పెద్దవాడు రు
క్మి. అందరికంటె చిట్టచివరిది చెల్లెలు రుక్మిణి అనబడే అమ్మాయి. ఆమె అభిమానవతి. ప్రసిద్ధురాలు.

సన్ననిచంద్రరేఖ ఉదయిస్తూనే పడమటిదిక్కు మనోహరంగా కనిపిస్తుంది. అలాగే, ఆ చిట్టిపాప రు
క్మిణి పుట్టి పెరుగుతూ ఉంటే మహారాజైన భీష్మకునిఇల్లు మనోజ్ఞంగా ప్రకాశిస్తూంది.

రు
క్మిణి రోజురోజుకూ ఎదుగుతూ ఉండగా

రుక్మిణీదేవి తనతోడి అమ్మాయిలతో ఆడుకుంటూ ఉంది. బొమ్మలకు పేర్లు పెట్టి, వాటికి పెళ్లిళ్లు చేయిస్తూ తన సహచర కన్యలతో వియ్యమందుకుంటుంది. గురుగులతో వంటకాలు చేయిస్తూ తన చెలులకు వడ్డింపజేస్తుంది.

అంతఃపురంలో ఉండేతోటల్లో పూలతీగెలకు పాదులు చేసి 'నీళ్ళు పోసి' పోషణ చేస్తుంది. శుభ్రంగా ఉండే మేడపైభాగాల్లో విలాసంగా బంగారు ఊయలలూగుతుంది; అమ్మాయిలతో ఉత్సాహంగా బంతులాట లాడుతుంది. గోరువంకలకు, రామచిలుకలకు పలుకులు చెపుతుంది. 

పింఛం విప్పుకున్న నెమళ్లగుంపులకు ఒయ్యారాలను నేర్పుతుంది. మదించిన హంసలకు నడకల సొగసులను చూపుతుంది (అంటే వాటికే గతులు నేర్పగలిగిన అందగత్తె రుక్మిణి అని అర్ధం)

ఆ తర్వాత

శ్రీకృష్ణునికి రు
క్మిణిపట్ల కోరిక విస్తరించింది. రుక్మిణికి తీగలాగ శరీరం విస్తరించింది. శ్రీకృష్ణునికి మనసనే పద్మం విరబూసింది. రుక్మిణికి ముఖమనే పద్మం వెలుగులు చిమ్మింది. 

శ్రీకృష్ణునిమదిలో మన్మథాగ్ని కనిపించింది. రుక్మిణికి స్తనాలజంట కనిపించింది. శ్రీకృష్ణునికి ధైర్యం సన్నగిల్లింది. రుక్మిణికి నడుము సన్నగిల్లింది. ఆ కృష్ణునికి ప్రేమబంధం ఎక్కువయింది. రుక్మిణికి కేశబంధం ఎక్కువయింది. శ్రీకృష్ణునిలో సంతోషం నిండి ఉండగా, రుక్మిణిలో యౌవనం విప్పారింది. 

(శూరునికొడుకు వసుదేవుడు. అతని కొడుకు శ్రీకృష్ణుడు. శూరుని మనుమడు కాబట్టీ 'శౌరి' అని శ్రీకృష్ణునికి పేరు.)

ఈ విధంగా రు
క్మి, రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు - అనే అయిదుమందికి చెల్లెలుగా ఉన్న రుక్మిణి లేతవయసులో ఉండగా

రుక్మిణి తండ్రి అయిన భీష్మకునిఇంటికి ఎందరో అతిథులు వస్తూ ఉండే వారు. వాళ్లు శ్రీకృష్ణుని అందం గురించి, శక్తిని గురించి చెపుతూ ఉండే వారు. వాటిని విని, శ్రీకృష్ణుడే తనకు తగిన భర్త అని రు
క్మిణి తలంచింది.

ఆ రుక్మిణీదేవియొక్క అందమైన రూపాన్ని ఆమె తెలివిని, నడివడికను, శుభలక్షణాన్ని సద్గుణాన్ని గురించి తెలుసుకొని, శ్రీకృష్ణుడు కన్యలలో రత్నంవంటి రుక్మిణిని తనకు భార్యగా చేసుకోవాలని అనుకున్నాడు.

ఆ తర్వాత

రుక్మిణీదేవి వైపున్న బంధువులందరూ బాగా ఆలోచించి, ఆమెను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేయాలని తీర్మానించుకొన్నారు. వాళ్ల ఆలోచనలను లక్ష్యపెట్టకుండా, వాళ్లను కాదని, దుష్టులతో స్నేహంకల రు
క్మి శ్రీకృష్ణుని పై చాలా శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. గుడ్డిగా తాను తలచిందే చేస్తానని మొండి పట్టుపట్టాడు. నల్లని తుమ్మెదల బారువలె ఒత్తైన జడ ఉన్న రుక్మిణిని శిశుపాలుని కిస్తాను అని తలచాడు.

(దుస్‌+సంధుడు - దుష్టమైన సంధి కలవాడు - శ్రీకృష్ణుడికి రుక్మిణితో సంబంధాన్ని కలపాలనుకునే వాళ్లు శేముషీ సింధువులు. అలా కాదనుకునే వాడు దుస్సంధుడు. వాడికి ఆలోచన లేదు. ముందు చూపు లేదు. అందుకే 'అంధుడు' అయినాడు.)

తన అన్న రుక్మి ఆలోచనలను రు
క్మిణి గ్రహించింది. అప్పుడే పూచిన తామరపూలవలె పరిమళించే శరీరం గల ఆమె మనసులో దిగులు పడింది. తనకు బాగా ఆప్తుడైన ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచింది. గర్వంతో కూడినవాడైన మా అన్న రుక్మి ఇపుడు నన్ను చేదిరాజైన శిశుపాలునికి ఇవ్వాలని అనుకుంటున్నాడు. పండితోత్తమా! ఏ విధంగానైనా సరే వెళ్లి ఈ విషయాన్ని చక్రాయుధుడైన శ్రీకృష్ణునికి విన్నవించుము.

పూజ్యుడా! కొడుకైన రు
క్మి చేస్తున్న ఆలోచనలను మా తండ్రికూడా కాదనలేకున్నాడు. రుక్మి అనుకున్నట్లు జరుగకుండా, శ్రీకృష్ణునికి నా స్నేహాన్ని విన్నవించు. తనను సేవించే వారికి తోడుగా నిలిచే ఆయనను వెంటనే పిలుచుకొనిరా.

పైవిధంగా మాట్లాడి, రుక్మిణి ఇంకా కొన్ని రహస్యవిషయాలను చెప్పింది. అన్నిటినీ విని ఆ బ్రాహ్మణుడు ద్వారకానగరానికి వెళ్లాడు. ద్వారపాలకుల ద్వారా తన రాకను గురించి తెలిపాడు. 

గోవర్ధన గిరిధారి అయిన శ్రీకృష్ణుడున్న ఆ నగరును ప్రవేశించాడు. అందులో బంగారు పీఠంపై కూర్చొని ఉన్న పురుషోత్తముడైన శ్రీకృష్ణుణ్ణి చూచి 'పెండ్లికొమరుడివి' కమ్మని ఆశీర్వదించాడు. 

దానికి శ్రీకృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ తన ఆసనం నుండి గబుక్కున లేచి దిగాడు. ఆ బ్రాహ్మణుని కూర్చోబెట్టాడు. తనకు దేవతలు ఎలాంటి పూజలను చేస్తారో అలాంటిపూజను ఆ బ్రాహ్మణునికి చేశాడు.

పిదప షడ్రుచులతో కూడిన రుచికరమైన భోజనం సమృద్ధిగా పెట్టించినాడు. ఇష్టంతో, వినయంతో అతని దగ్గర కూర్చొని, లోకరక్షణలో ప్రశస్తికెక్కిన తన చేతితో ఆయనపాదాలను ఒత్తుతూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

బ్రాహ్మణోత్తమా! సంతోషపడే మనస్సు నీది. ఈ స్వభావం నీకు అతి సులభంగా అలవడింది. పెద్ద లందరూ ఇది మంచి పద్ధతి అని అంగీకరించారు. బ్రాహ్మణుడు తనకు లభించిన సొమ్ము ఎలాంటిదైనా తృప్తిపడతాడు. తన ధర్మాన్ని ఎప్పుడూ తప్పడు.

అలాంటి వాడికి కోరికలు వాటంతట అవే నెరవేరుతాయి. ఒకవేళ తృప్తికలగకపోతే, వాడు ఇంద్రుడైనా సరే నాశనమవుతాడు. అదే, సంతోషించేవాడయితే అలాంటి వాడు ధనహీనుడయినాసరే ఇంద్రునితో సమానమవుతాడు.

సృష్టిలోని అన్ని ప్రాణులపట్ల మంచిమనసుతో ప్రవర్తించేవాళ్లకు, దొరికినదేదైనా దానితోనే సంతోషించే మంచి మనస్సున్న వాళ్లకు; ప్రశాంతంగా ఉండేవాళ్లకు; గర్వం లేనివాళ్లకు నేను నమస్కారాలు చేస్తాను.

పండితోత్తమా! ఏ దేశంలో ఉంటున్నావు? ఎవరు మీ క్షేమ సమాచారాలు విచారిస్తున్నారు? ఎవరి రాజ్యంలో ప్రజలు సుఖిస్తారో ఆ రాజు నాకు ప్రీతిపాత్రుడు. సముద్రమధ్యంలో ఉన్న ఈ కోటకు ఎలా వచ్చావు? వట్టి పరిహాసాలు కావు. నీవేం కోరుకుంటున్నావో చెప్పు తీరుస్తాను.

(ఎవని రాజ్యంలో ప్రజలు సుఖశాంతుల్తో ఉంటారో అట్టి రాజుయొక్క ధర్మ పరిపాలనకు సంతోషించి, దేవతలుకూడా ఆ రాజుకు నమస్కరిస్తారనే దివ్యప్రబోధం - ఇక్కడ శ్రీకృష్ణుని మాటల ద్వారా తెలుస్తూంది.)

ఇలా లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. “దేవా! విదర్భ అనే దేశానికి అధిపతిగా భీష్మకుడు అని ఒక రాజున్నాడు. అతనికి రుక్మిణి అని ఒక కూతురుంది. ఆమె కన్యకామణి. చందమామవంటి ముఖం కల ఆమె నీకు సేవలను చేయాలను ఆశపడుతూ ఉంది. ఆ ఆశతో తనను మీరు వివాహం చేసుకోవాలని ఆశిస్తూ ఉంది. ఆ వివాహ మంగళప్రశస్తమైన విషయంగా నా ద్వారా మీకు సందేశంపంపింది. దయతో ఆలకించండి.

కంసుణ్ణి చంపినవాడా! దుష్టుల్ని నాశనం చేసేవాడా! సౌందర్యమనే సంపదతో అలరారే అందమైన ఆకృతి కలవాడా! మానవతుల మనస్సును కొల్లగొట్టే వాడా! శ్రీకృష్ణా! నీ గుణాల్ని గురించి చెవిన పడితే చాలు, శరీరతాపాలన్నీ తీరిపోతాయి. సర్వశుభాలనూ కలిగించే నీ ఆకృతిని చూస్తే చాలు, కళ్లకు అన్ని ప్రయోజనాలూ లభిస్తాయి. 

నీ పాదాలను ఏ వేళలో సేవించినా కూడా, లోకంలో ఉన్నత స్ధితి కలుగుతుంది. నీ దివ్యమైన నామాన్ని ఏ వేళలో స్మరించినా సంసార బంధాలు తొలగిపోతాయి. అలాంటి మహిమాన్వితుడవైన నీ పట్ల నా మనస్సు నిరంతరం లగ్నమై ఉంది. నీ మీద ఒట్టు. సిగ్గు వదిలి చెప్తున్నాను. నన్ను దయ చూడుము.

శత్రురాజులనే గజాలను సంహరించే సింహంవంటి శ్రీకృష్ణా! నీవు ధన్యుడివి. లోకుల మనస్సులను రంజింపజేసేవాడివి. వంశం, విద్య, చక్కదనం, జవ్వనం, మంచితనం, సంపద, బలం, దానం, పరాక్రమం, కారుణ్యం అనే సద్గుణాలతో అలరారుతున్నావు. 

ఇటువంటి నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉండగలరు? వనితలలో ఉత్తమురాలైన శ్రీమహాలక్ష్మి అలనాడు నిన్ను చెట్టబట్టలేదా? నే నొక్కతెనే నిన్ను మోహించితినా ఏమి? వలపు అనేది నా వల్లనే జన్మించిందా?

శ్రీ లక్ష్మీదేవితో కూడి ఉన్న మంగళమూర్తీ! పురుషులలో సింహంవంటివాడా! శ్రీకృష్ణా! సింహానికి చెందవలసిన పదార్ధాన్ని నక్క కోరుకొన్నట్లుగా - నీ పాదకమలాలను ధ్యానించే నన్ను - మదించినవాడు, చేదిదేశస్థుడు (అయిన శిశుపాలుడు) వెంటనే తీసుకుపోవాలని అనుకుంటున్నాడు. ఆ నీచాతినీచునికి నీ అద్భుతమైన పరాక్రమం గురించి తెలియదు.

నేను పూర్వజన్మల్లో వ్రతాలు చేసిఉంటే, గురువుల, బ్రాహ్మణుల, జ్ఞానుల సేవలను చేసి ఉంటే, దానధర్మాలు మొదలైనవి చేసిఉంటే, సర్వాధిపతి, లోకానికి శుభం కలిగించేవాడు అయిన శ్రీమహావిష్ణువును సేవించిఉంటే, వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడు నా మనస్సు నేలుకొనేవాడు అగుగాక! చేదిరాజు మున్నగు పరమనీచులు యుద్ధంలో ఓటమిపాలై పోవుదురుగాక!

పద్మనాభా! పురుషులలో శ్రేష్ఠుడా! కృష్ణా! నీకు అడ్డుపడడానికి ఏమీలేదు. రేపు నీవు రథ గజ తురగ పదాతి దళాలనే నాలుగు రకాల సేనలతోనూ వచ్చి, శిశుపాలుణ్ణీ, జరాసంధుణ్ణీ జయించి నా దిక్కుకు వచ్చి, రాక్షసవివాహరీతిలో నన్ను గ్రహించు. నీ ప్రతాపాన్నే కట్నంగా (ఓలె) ఇచ్చి నన్ను తీసుకుని పో, నేను వస్తాను.

పద్మాలవంటి అందమైన కండ్లుగలవాడా! శ్రీకృష్ణా! నీవు రుక్మిణిని ఎలా తీసుకురావడం అని ఆలోచిస్తూంటావేమో! “ఆమె ఎక్కడో రాజకన్యలు ఉండే అంతఃపురంలో ఉంటుంది ఎలా బయటికి తీసుకురావడం? ఒకవేళ చొరబడి తెస్తే అక్కడి కాపలాదారులుగా ఉండే వాళ్లనూ, ఎదిరించిన బంధుజనాలనూ చంపాలి, తప్పదు” - అని భావిస్తున్నావా స్వామీ! 

దానికో ఉపాయం ఉంది. చెబుతాను. విను. పెళ్లి జరగడానికి ముందుగా. మా కులదేవత అయిన పార్వతీదేవికి పెళ్లికూతురిచేత పూజింపచేసి మొక్కిస్తారు. అలా నేనుకూడా దేవికి మొక్కడానికి బయటకు రావాలి. ఊరిబయట ఉన్న పార్వతీదేవిఆలయానికి నేను వస్తాను. వారించడానికి వీలులేనిపద్ధతి తెలిసినవాడవు. ఆ సమయంలో వచ్చి నన్ను తీసుకుని పో!

నాథా! శ్రీకృష్ణా! మహాత్ములు తమ అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకోవడానికి పరమేశ్వరునివలె ఎవరి పాదకమలాలనుంచి పుట్టినపవిత్రజలాలలో మునగాలని కోరుకుంటారో అతడివే నీవు! అలాంటి నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే నూరు జన్మలైనాసరే నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు విడుస్తాను. ఇది నిజం!

ప్రాణవల్లభా! నీ తియ్యనిమాటలను వినలేకపోతే, ఈ చెవిరంధ్రాలు ఉండీ ఏం ప్రయోజనం? పురుషులలో రత్నంలాంటివాడా! నీవు అనుభవించడానికి నోచుకోకపోతే ఈ తీగలాంటి అందమైన శరీరంలోని చక్కదనం దేనికి? ప్రపంచాన్ని సమ్మోహనపరచేవాడా! నిన్ను చూడలేకపోతే ఈ కళ్లకు చూపు ఉండడం ఎందుకు? 

ప్రియుడా! నీ పెదవిలోని అమృతాన్ని ఆస్వాదించలేకపోతే నాలుకకు ఫలరసాలను గురించిన తెలివిడి దేనికి? పద్మాలవంటి కండ్లున్నవాడా! నీ మెడలోని పూలమాలసువాసనను చూడజాలకపోతే ముక్కు ఎందుకు? అందమైన నడవడిక గలవాడా! నీకు పరిచర్య చేయడానికి నోచుకోని జన్మదేనికి? ఇలా ఎన్ని జన్మలెత్తినా ఏం ప్రయోజనం?

ఇలా అగ్నిద్యోతనుడు సందేశాన్ని తెలిపాడు. రుక్మిణీదేవి విన్నవించిన విషయాలతోపాటు, ఆమె ఆకృతిని, చక్కదనాన్ని మొదలైన అంశాలను గురించీ చెప్పాడు. 'ఇక చేయదగిన పని ఏమో దేవరవారు చేయాలి' అని మనవి చేశాడు. రుక్మిణి నీకు వరించదగింది అని మరోసారి వివరిస్తూ శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.

శ్రీకృష్ణా! ఆమెపాదాలు చిగురాకుల సొగసులకు ఉనికిపట్టు. ఆమె తొడలు బంగారు అరటిబోదెలనుకూడా మించి ప్రకాశిస్తుంటాయి. ఆమెచేతులు లేత ఎరుపు వన్నెతో మనసును దోచుకుంటాయి, ఆమెకంఠం శంఖంవలె శ్రేష్ఠమైన సాగసుతో ఉంటుంది. నడుము చూస్తే ఉందా లేదా అన్నట్లుగా చాల నాజూకుగా ఉంటుంది. 

ఆమెచనుదోయి కనులపండుగ చేస్తుంది. నుదురు కాంతిమంతంగా ఉండి, అర్ధచంద్రుని కాంతిమండలాన్ని గేలిచేస్తుంది. ఆమెజడనల్లనితుమ్మెదల బారును జయిస్తుంది. ఆమెచూపులు మన్మథునిబాణాలకు ఆశ్రయాన్నిస్తాయి. ఆమెకనుబొమలు మన్మథునివింటి కొమ్మలు. 

ఆ అందగత్తెపలుకులు మనస్సుకు హాయిని కలిగిస్తాయి. కలువకన్నులున్న ఆమెముఖము చందమామకు తోడుగా నిలుస్తుంది.

శ్రీకృష్ణా! ఆ లేతజవరాలు నీకు తగింది. నీవుకూడా ఆమెకు తగినవాడవి; మా గురువులమీద ఒట్టేసి చెపుతున్నాను. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. తప్పదు. ఇంకా ఆలస్యం చేయడాలు దేనికి? నీవు నీవర్గంవాళ్లతో కలిసి, ఆ పద్మముఖిని తెచ్చుకుందువు గానీ, వచ్చేసేయి. ఎదిరించినవాళ్లను పొడి పొడి చేయి. ఈ లోకానికి మేలు కలిగించు.

శ్రీకృష్ణుడు కుండిన నగరంబునకు రథారూఢుడై చనుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

rukmini kalyana katha praarambhamu - రుక్మిణీ కల్యాణ కథా ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  రుక్మిణీ కల్యాణ కథాప్రారంభము ఓ పరీక్షిన్మహారాజా! మునుపు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడం వల్ల రైవతుడనే రా...