ఆ మాటలు విన్న సీత మనస్సు తృప్తిపడింది. హనుమంతుని వైపు తిరిగి:
అయితే నర వానరులకు సఖ్యం ఎలా కలిగింది? నువ్వు రాముణ్ణి ఎక్కడ చూశావు? లక్ష్మణుని గురించి నీకేం తెలుసు? వారి ఆకార స్వభావాలేమిటి? ఆయన అవయవ నిర్మాణం అంతా కళ్ళకు కట్టేలా చెప్పు, అని ప్రశ్నించింది.
హనుమ : అమ్మా!
రామ లక్ష్మణుల ఆకార విశేషాలు వివరిస్తాను. రామభద్రుడు పద్మదళ విశాలనయనాలతో సర్వలోక మనోహరంగా ఉంటాడు. దయా హృదయుడు. సూర్యసమతేజస్వి. పృథ్వికున్నంత ఓరిమి ఉంది. ధీశక్తిలో బృహస్పతి. కీర్తికి ఇంద్రుడు.
సర్వభూత రక్షణతో తన పరిజనరక్షణ కూడా చూసుకునే వాడు. ముందు తన జీవనధర్మాన్ని నిర్వహిస్తూ లోకధర్మ రక్షణ చేస్తాడు లోక మర్యాద వీడకుండా సర్వవర్ణాలనూ ధర్మపదాన నిల బెడతాడు. బ్రహ్మచర్య నియమంతో, సజ్జనులకు సాయపడుతూ, ఇహ పరాలను చూసుకుంటూ ఉంటాడు.
రాజనీతి నిపుణుడు, విద్వాంసులను నిరంతరం ఆరాధిసాడు, వినయ, విద్యాసంపన్నుడు, శత్రుసంతాపకుడు. యజుర్వేదం అధ్యయనం చేసినవాడు. ధనుర్వేదం కరతలామలకం. వేదవేత్తల పూజలు పొందేవాడు.
ఇక ఆయన అవయవాల విశేషాలు-
విపులాంసుడు, దీరబాహుడు, శంఖకంఠుడం, అరుణారుణ నయనుడు. ఆయన కంఠం దుందుభిస్వనంలా ఉంటుంది. శరీరం అంతా తీర్చిదిద్ది హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుంది. ఉరఃస్దలం, మణికట్టు, పిడికిలి చాలా దృఢంగా ఉంటాయి. ఆయన నడక, నాభి, మాట బహుగంభీరాలు. సింహ, శార్దూల, గజ, వృషభ గమనుడు.
దేశ కాల పాత్రాలు గ్రహించి సంగ్రహానుగ్రహాలు చేయగలవాడు. సర్వజన ప్రియంగా మాట్లాడగలవాడు.
ఆయన తమ్ముడు సర్వవిధాలా ఆయననే పోలి ఉంటాడు. వారుభయులూ నిన్ను వెదకుతూ వెదకుతూ మా కిష్కింధలో సుగ్రీవుని చేరారు.
అన్నగారి భయంతో మా రాజు ఋశ్యమూకంపై ప్రవాసంలో ఉన్నాడు. మేమంతా సుగ్రీవ సేవలో ఉన్నాం.
అక్కడకు-
నార చీరలతో, ధనుర్పాణధరులై వచ్చిన వారిని చూసి మా ప్రభువు పరుగు ప్రారంభించాడు. కొంత సేపయోాక నన్ను పిలిచి వారెవరో తెలుసుకురమ్మన్నాడు. వారితో విషయాలన్నీ వివరించి, వెంటబెట్టుకుని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాను.
ఉభయులూ మాట్టాడుకున్నారు. లక్ష్మణస్వామి మీ కథ చెప్పాడు. అది వింటున్నవేళ మా సుగ్రీవుడు విషాదభర హృదయు డయాడు.
అనంతరం౦-
నిన్ను రావణుడు అపహరించుకు వెడుతుండగా నువ్వు విడిచిన నగల మూటను రాముని ముందుంచగా అయన వాటిని ఒడిలో ఉంచుకుని విలపించాడు. నీకోసం, కొంతసేపటికి ఆయనను ఆశ్వాసించగలిగాము.
అమ్మా!
విరహాగ్నితో ఆయన దేహం తపిస్తున్నది. భూకంపవేళ పర్వతంలా ఆయన హృదయం విచలితవువుతున్నది.
అత్యంత సుందరమయిన ఉద్యానవనాలు, మహానదీ ప్రవాహాలు, సెలయేరులు ఏవి కనిపించినా ఆయన మనస్సు నీ కోసమే పరితపిస్తున్నది.
అమ్మా! ఆ రాజశార్టూలుడు నిస్సంశయంగా ఈ రాక్షస రావణుని సర్వనాశనం చేసి నిన్ను స్వీకరిస్తాడు. అందుకు సుగ్రీవుడు కూడా ప్రతిన పూని ఉన్నాడు. చెప్పాను కదా, వాలిని హతమార్చాడు రాముడని.
అనంతరం వానరులందరూ అన్ని దిశలకూ నిన్ను అన్వేషించడానికి బయలుదేరారు. అందులో నేను లంకకు వచ్చి యిక్కడ నిన్ను చూడగలిగాను.
మా బలాధిపతి వాలిసుతుడు అంగదుడు. ఆయన నాయకత్వంలో మేము వింధ్య పర్వతంమీద ఎన్ని రోజులు గడిపామో, అప్పటికే సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది. తిరిగి వెడితే ఆయన మా ప్రాణాలు తీసి వేయడం తధ్యం, అని మేము ప్రాణత్యాగం చేయడానికి కొండ శిఖరం చేరాము.
అంగదుడు తీవ్రంగా రోదిస్తున్నాడు. అప్పుడక్కడకు భయం కరముయిన పెద్ద పక్షి వచ్చింది. జటాయువుకు సోదరుడయిన సంపాతి ఆ పక్షి. మా మాటలలో జటాయువు మరణవార్త విని:
'ఎవడురా నా సోదరుని చంపినవాడు.'
అని గర్జించాడు. అప్పుడు మేము రావణుని చేతులలో జటాయువు మరణించిన వార్త వినిపించగా, ఆ పక్షి యింతసేపు విచారించి, నీ వర్తమానం చెప్పాడు.
అప్పుడు మాకు ధైర్యం కలిగింది.
ఉత్సాహంతో సముద్ర తీరానికి బయలుదేరాం. విశాల సాగరాన్ని దాటడం సాధ్యమా అని మా వారందరూ శోకసాగరంలో మునిగారు. వారికి ధైర్యం చెప్పి నేను బయలుదేరాను.
రాత్రి అంతా లంకానగరం మూల మూలలా వెదికాను. రావణుని చూచాను. నిన్ను చూడగలిగాను. ఇది యింతవరకూ జరిగిన కథ. ఇప్పుడు నన్ను విశ్వసించగలవా తల్లీ!
ధనుర్వేద విదుడయిన రాముడు, ఆయన సేవకే జీవితాన్ని అంకితం చేసిన లక్ష్మణుడు కుశలంగా వున్నారు. వారి దూతగా నేనిక్కడకు వచ్చాను.
ఇప్పుడు నేను వెళ్ళి మా వానర వీరులకు నీ దర్శనభాగ్య విషయం చెపుతాను. అంతకంటె నాకు కీర్తికరం మరొకటి లేదు.
నా కధ కూడా చెపుతాను విను-
పర్వతాలలో శ్రేష్ఠుమయిన మాల్యవంతం మీద మా తండ్రి కేసరి ఉండేవాడు. ఆయన దేవర్షుల ఆజ్ఞానుసారం సముద్రతీరాన గోకర్ణం వద్ద శంబసాదనుడనే రాక్షసుని కడతేర్చిన మహావీరుడు. ఆ కేసరి భార్యకు నేను వాయువువలన కలిగాను నన్ను హనుమంతుడంటారు ఇది నా విషయం.
ఇప్పటికి నీకు విశ్వాసం కలగాలి, అని చెపుతూంటే సీతాదేవికి ఆనంద బాష్పాలతో హృదయం సంతోష తరంగితం అయింది.
No comments:
Post a Comment