షోడశసహస్ర స్త్రీ సంగతుండైన శ్రీకృష్ణుని మహిమ నారదుడు తెలిసికోవడం
ఓ రాజా! శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి అతని భవనంలో బందీలుగా ఉన్న పదహారువేలమందిసుందరాంగుల్ని ఒకేమాటుగా తాను పదహారువేల రూపాలు ధరించి పెండ్లి చేసుకొన్న వృత్తాంతం ఒకనాడు నారదమహర్షి విని, ఆ వేడుక చూడాలి - అని
శ్రీకృష్ణుని పెండ్లివేడుకలు చూడాలనే ఆలోచనతో నారదుడు కృష్ణుడు కాపాడుతున్న ద్వారకానగరానికి వెళ్లి ఎదుటగా చిలుకలు, గోరువంకలు, నెమళ్లు, కోయిలలు అనే పక్షుల మనోహరమైన కలకలనాదాలతో, పువ్వులతో విలసిల్లే ఉద్యానవనాల సమూహాల్ని హంసలు, బెగ్గురుపక్షులువంటి నీటిపక్షులతోను, తామరలు, ఎర్రతామరలు, తెల్లకలువలు మొదలగు పుష్పాలతోనూ ప్రకాశిస్తున్న కొలకులనూ, వరి మొదలైన పైరులతో, చెఱకుతోటలతో అందంగా కనిపించే ఏటిఒడ్లను, కొండచరియలనుండి పడే సెలయేళ్ల నీటితుంపురులచే మంచుకురిసే హేమంతఋతువును తలపించే ప్రదేశాల్నీ బ్రహ్మ అనే కంసాలిచేత నవరత్నాలు పొదిగి చేయబడిన పురమనేలక్ష్మి చేతికి ఉండే బంగారుకడియమా? అనేట్లు ప్రకాశించే కోటగల ద్వారకాపట్టణాన్ని నారదుడు చూశాడు.
మిక్కిలి ఎత్తుగా కట్టబడిన రత్నాలమేడల కిటికీల నుండి బయటికి వ్యాపించే కర్పూరహారతుల అగరుధూపాల పొగల్ని చూచి మబ్బులనుకొని, ఆ పురమందలి స్త్రీలచేత పెంపబడి నృత్యం చేయడానికి సిద్ధమవుతున్న నెమళ్లగుంపులు గలదీ; చంద్రకాంతశిలలతోనూ, స్ఫటికాలతోనూ కట్టబడిన స్తంభాలతో నవరత్నాలు పొదిగి స్వర్ణమయంగా తీర్చి అంతస్తుల పైభాగం మీద పెట్టిన బంగారు కలశాలు - చాలామంది సూర్యులవలె ఒప్పుతున్నదీ; సమస్తమైన వస్తువులు పేర్చిన వైశ్యుల వీథులు అరుగులతో ఒప్పుచున్నదీ; తాపాన్ని పోగొట్టడానికి కట్టిన రంగు రంగుల టక్కెముల రెపరెపలు, వాటికి కట్టిన నెమళ్లు, వింటినారుల ధ్వనులతో దిక్కులన్నీ నిండినదీ; శ్రీకృష్ణుడు పూతన మొదలైన రాక్షసుల్ని చంపి, జయించిన విశేషాలు బంగారు రేకులమీద చెక్కబడిన అక్షరపంక్తులతో ప్రకాశిస్తున్న ద్వారబంధపు చూరులు గలదీ; కృష్ణుని దర్శనానికి ఆహ్వానించగా వచ్చిన రాజుల యేనుగులయొక్క మదజలం కారడంవల్ల బుదర బురదగా తయారైన ప్రదేశం - ఆ వచ్చిన రాజులు సమ్మర్దంతో వారి చేతుల కడియాలు ఒకరివి ఒకరికి ఒరుసుకుని ఆ కంకణాలలోని మణుల ధూళిరాలిపడడంవల్ల - ఈ బురద ఇంకి నేల బిగుసుకొన్నట్టిదీ, ఇళ్లముంగిళ్లన్నీ రత్నాలముగ్గులతో నిండి శుభసూచకాలతో ఒప్పునట్టిదీ, కంకుమాది పరిమళద్రవ్యాలు కలిపిన నీళ్లు చల్లుటచే తడిసిన అంగడివీథులు గలదీ, వంశచరిత్రల్ని కీర్తించే వందిమాగధుల; సంగీతగాయకుల - మేలైన ధ్వనులతో ఒప్పుతున్నదీ; సముద్రఘోషను తక్కువ చేయగల భేరీలు, నగారాలు, మద్దెలలు, మొదలైన తూర్యరావాల ధ్వనులతో కూడిందీ; ఇంద్రుడు మొదలగు దిక్పాలకుల పట్టణాలతో పోల్చదగిన గురుతులు గలిగి ఉగ్రసేనునిచేత పాలింపబడుతూ, వేదంలాగా, గ్రహమండలంలాగా, ప్రకాశిస్తూ, కల్యాణవేదికవలె, బలిచక్రవర్తి చేతివలె దానధారలతో కూడిందై ఒప్పుతున్న ఆ ద్వారకాపట్టణంలో ప్రవేశించి నారదుడు - ఆ నగరంలో విశ్వకర్మచే నిర్మింపబడిన పదియాఱువేల శ్రీకృష్ణుని పత్నుల మేడలలో
స్ఫటికాలతో చేసిన స్తంభాలు, పగడాలతో కుచ్చిన అడ్డకర్రలు, పచ్చలు తాపిన గోడలమీది కప్పులు ఒప్పగా వైడూర్యమణులతో, పద్మరాగమణులతో కూర్చిన బొగడలు అమరగా (గోడలమీద కోసుగా కట్టిన అలంకారాలు) జాతి వజ్రాల మేలైనకాంతితో ఒప్పే నీలాలు తాపిన మెట్లతో, గరుడపచ్చలతో ప్రకాశిస్తున్న చూరులు, అత్యంత కాంతిమంతాలైన చంద్రకాంతశిలామణులతో కట్టిన అరుగులు, ముత్యాలు తాపిన తలుపులు, మేలిమి బంగారంతో చేసిన సాలభంజికలూ, అవ్యక్తమధురమైన ధ్వనులతో క్రీడించే పావురాలజంటలగూళ్లు గలిగి
పరిచారికల సమూహంయొక్క కాలిఅందెల చప్పుళ్లు వ్యాపించిందీ; రత్నాలనే ద్వీపాలవరుసతో ప్రకాశించేదీ అయిన ఒక స్త్రీ మెడపై విలాసంగా ప్రకాశిస్తూ
పరిచారికలు తమ చేతులయందలి బంగారుగాజులు ఝణఝణమని మోగుచుండగా వీచే వింజామరలవల్ల బుట్టిన గాలిచేత కదలుతూండే ముంగురులుగలవాడూ, గోపికల ప్రియుడూ అయిన శ్రీకృష్ణుణ్ణి
బంగారుకాసులదండలు మెడలో వేసుకొని, తలపాగాలు ధరించి, చొక్కాలు తొడుగుకొని, చెవులకు బంగారం పోగులు పెట్టుకొని, అంతఃపురంలో కలియ తిరుగుచున్న కావలివాండ్రూ, సమానమైన వయస్సు, చక్కదనం, మంచిగుణాలు వినోదచేష్టలు గలిగి ఉత్సాహంతో మెలగునట్టి వేడుకకత్తెలూ సేవిస్తూ ఉండగా బంగారుసింహాసనంపై కూర్చుని కొలువుతీరియున్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూశాడు. ఆ కృష్ణుడును నారదుణ్ణి చూచి ఎదురేగి
ఆ మునిశ్రేష్ఠుడైన నారదుని పాదపద్మాలకు తన కిరీటంలో పొదగబడిన మణులు సోకునట్లుగా నమస్కరించి, తాను కూర్చున్న సింహాసనంమీద ఆ మహర్షిని కూర్చుండబెట్టి మిక్కిలి వినయంతో
ఎల్ల లోకాలను తన పాదంలో పుట్టిన గంగాజలంతో పవిత్రంగా చేయునట్టి ఆదిముని అయిన నారాయణఋషి అవతారమైనవాడూ, ఎల్లలోకాలకు తండ్రియైనవాడూ, అయిన ఆ శ్రీకృష్ణుడు నారదమహర్షియొక్క కాళ్లుకడిగిన నీళ్లను తన శిరస్సున చల్లుకొన్నాడు.
ఈ విధంగా వేదోక్తప్రకారంగా ధర్మాన్ని నడుపునట్టివాడూ; అర్జునునిస్నేహితుడూ అయిన శ్రీకృష్ణుడు - లోకాలలోని తీర్ధాలన్నిటితో పోల్చదగినంతటి పవిత్రమైన నారదమహాముని పాదతీర్థాన్ని శిరసున ధరించి, అమృతతుల్యమైన, మితమైన మాటలతో నారదునితో ఇలా అన్నాడు.
ఓ మునిశ్రేష్ఠ! మీరు ఏ పని చేయాలని ఆజ్ఞాపించినా ఆ పని చేస్తానని శ్రీకృష్ణుడు చెప్పగా, నారదుడు కృష్ణా! ఓ జ్ఞానస్వరూపా! నీవు అవతారమెత్తింది దుష్టుల్ని శిక్షించటానికే కదా! అన్నాడు.
అన్న లోకాలకు ముఖ్య ప్రభుడివి. మిక్కిలి దయగలవాడివి. సర్వలోక సంరక్షకుడివి. శాశ్వతంగా ఉండేవాడివి. కష్టాల్లో మునిగి ఉన్న వారిదుఃఖాన్ని పోగొట్టె చుట్టానివి తెప్పడం ఉంది.
బ్రహ్మరుద్రుడు, ఇంద్రాదిదేవతలచే పూజింపదగినవాడా! సంసారమనే మహాసముద్రాన్ని దాటించి, నాశనంలేని ఆనందాన్ని ముక్తిని ప్రసాదించే నీ పాదపద్మాల్ని ధ్యానించటాన్నే నా మనస్సులో ఎల్లప్పుడూ నిలిచేటట్లు చేయవయ్యా!
ఆ విధంగా శ్రీకృష్ణుని వేడుకొని ఆయన అనుగ్రహాన్ని పొంది, ఆ ఇల్లు విడిచి బయలుదేరి కృష్ణపరమాత్మ యోగమాయా మహిమను తెలుసుకోవాలనే కోరికతో మరియొక ఇల్లాలియింటికి వెళ్తాడు. అక్కడ ఉద్ధవునితో కలిసి జూదమాడుతున్న శ్రీకృష్ణుణ్ణి దర్శించి ఆశ్చర్యపడి శ్రీకృష్ణునిచే ఆ యింటిలో కూడా సన్మానం పొంది ఆ ఇంటినుండి బయలుదేరినవాడై
నారదమహర్షి మరియొక భార్య యింటికి పోయి, అచట జయశీలుడు, సర్వవిషయ సహనశీలుడు, కొనియాడబడిన గుణాలు కలవాడు, సర్వవ్యాపకుడునై కొడుకులతో కూడి వేడుకతోనున్న శ్రీకృష్ణుణి (నారదుడు) చూచాడు.
నారదుడు ఆ ఇంటినుండి మరొక పద్మముఖీ ఇంటికి పోయి అచట ముత్యాలహారాలు ధరించినవాడూ, రాక్షసులను సంహరించేవాడూ, లక్ష్మిదేవి మనస్సులో విహరించేవాడూ, మురాసురుణ్ణి సంహరించి మురారి అని ప్రసిద్ధి పొందినవాడూ, శూరునివంశజుడై శౌరిగా వ్యవహరింపబడేవాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి చూచాడు.
నారదమహర్షి ఈ విధంగా ఒక్కొక్క సుందరాంగిగృహంలో శ్రీకృష్ణుడు ఒక్కొక్క వినోదంతో ఉండగా చూస్తూ పోతుండగా ఒకచోట శ్రీకృష్ణుడు ఆ మునీంద్రునికి ఎదురువచ్చి నమస్కరించి - మునీంద్రా! మీరు కోరికలన్నియు దీరిన మహానుభావులు. మేము కోరికలు తీరక వాటికై వెంపరలాడేవాళ్లం. మీ వంటివారిని మేము ఏ విధంగా పరితృప్తుల్ని చేయగలం? మీవంటి మునీంద్రుల దర్శనంచే సకల శుభాలూ పొందుతున్నాము అని ప్రియపూర్వకంగా చెప్పగా - ఆ మాటలు విని నారదుడు మనసులో ఆనందిస్తూ చిరునవ్వుతో మరికొన్ని ఇండ్లకు వెళ్లాడు.
నారదమహాముని - మరో ఉత్తమ స్త్రీ ఇంట వనవిహారంతో ఆనందిస్తున్నవాడూ, దేవతలచే మొక్కులు గైకొనేవాడూ, ఎఱ్ఱని పాదపద్మాలతో ప్రకాశించేవాడూ అయిన ఆ ముకుందుణ్ణి చూచాడు.
నారదమహాముని మరో సుందరాంగి ఇంటిలో పరబ్రహ్మయైన తన్ను తానే హృదయంలో ధ్యానిస్తున్నవాడూ, నరకాసురుని సంహరించిన శూరుడూ నందకుమారుడూ అయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు.
ఇంకనూ ముందుకు వెళ్ళగా
ఒకచోట సంధ్యావందనం చేస్తూ, ఒక ఇంట పురాణం వింటూ, మరొక తావున పంచమహాయజ్ఞాలు చేస్తూ, ఇంకొకయింట అమృతం సేవిస్తూ మరొక్కచోట స్నానం ఆచరిస్తూ, వేరొక తావున ఆభరణాలు ధరిస్తూ, మరొకచోట లేగదూడ తోడి ఆవును దానమిస్తూ, మరొక యింట కొడుకులతో కూడి ఆనందిస్తూ, వేరొక యింట సంగీతం వింటూ, ఇంకొక్కచోట మంచెలపై ఎక్కి వినోదిస్తూ, మరోచోట బలరామునితో కూడి తిరుగుతున్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూచాడు.
సర్వవిషయాలు తెలిసినవాడు; మిక్కిలి కీర్తి కలవాడు, కరుణాసముద్రుడు, పుండరీకాక్షుడు, నిర్మలమైన మనస్సుగలవాడు, యోగీశ్వరులకు లోబడినవాడు, పాపము లేనివాడు అగు శ్రీకృష్ణపరమాత్మ ఆయా ఇండ్లలో ఉండే ప్రియురాళ్లతో తన ఇష్టానుసారం ఒకచోట ముచ్చటలాడుతూ, ఒకచోట సరసాలాడుతూ, ఒకచోట ప్రియురాలి కొప్పును పూలదండలతో అలంకరిస్తూ, ఒక ప్రేయసితో కలసి తాంబూలం సేవిస్తూ ఒకచోట పాటలు పాడుతూ, ఒకచోట సుఖంగా ప్రొద్దుపుచ్చుతూ, ఒకచోట సంతోషంతో విహరిస్తుంటాడు. శ్రీకృష్ణుడు పదహారువేలమంది యువతీజనంతో కొత్త కాపురాలు నడిపేవిధాన మిది.
నాల్గుముఖాలుగల బ్రహ్మదేవునికి పుత్రుడైననారదుడు శ్రీకృష్ణునియెడ గౌరవప్రదమైన బుద్ధితో ఒక యిల్లాలి యింటికి పోయి - అచట యజ్ఞకర్మలు నడుపుతూ, ఆశ్రితుల్ని కాపాడుతున్నట్టి, ఇంద్రునిచే సేవింపబడే పాదపద్మాలతో ప్రకాశించే శ్రీకృష్ణుణ్ణి చూచాడు.
దేవేంద్రునిచే కొనియాడబడెడువాడూ, పవిత్రుడూ, అంతంలేనివాడూ, సర్వశుభలక్షణో పేతుడూ అయిన శ్రీకృష్ణుడు
కొడుకులతో, మనుమలతో, కూతుళ్లతో భార్యలతో కూడియుండగా నారదుడు మరొక యింటిలో చూచాడు.
అందగత్తెయగు మఱియొక ప్రియురాలి యింటిలో సజ్జనులైనవారికి సంతోషాన్ని కలుగచేస్తూ, వేదాలచే తెలియబడువాడు, నందుణ్ణి ఆనందింప చేయువాడు, సనందునిచే నమస్కరింపబడే వాడు అయిన ముకుందుణ్ణి నారదుడు చూచాడు.
నారదుడు మరియొక స్త్రీ యింటిలో తుమ్మెదల్ని గెలువజాలిన నల్లని ముంగురులు గలవాణ్ణి, నీలమేఘశ్యాముణ్ణి లోభములేనివాణ్ణి, పద్మనాభుణ్ణి, భద్రజాతి ఏనుగులచే నమస్కారములు అందుకొంటున్న శ్రీకృష్ణుణ్ణి చూచాడు.
ఒక ఇంటిలో ఏనుగులను, గుఱ్ఱాలను ఎక్కి వినోదించే వాణ్ణి, ఒక యింటిలో భోజనం చేస్తూ, పదహారువేల స్త్రీల గృహాలలో తన మాయా ప్రభావం వల్ల ప్రకాశిస్తున్న - పవిత్రుణ్ణి, వరప్రదాత, వేదధర్మ ప్రవర్తకుణ్ణి, విరాట్పురుషుణ్ణి, బ్రహ్మచే సేవింపబడేవాడైన శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూచాడు.
గొప్పప్రవర్తనకలవాడూ, ఎల్లదేవతలచే మ్రొక్కులందుకొనేవాడూ, ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన పాదకమలాలు గలవాడూ, తనను ఆశ్రయించినవారి పాపాలన్నీ తొలగించేవాడూ, సర్వోత్తముడైన శ్రీకృష్ణుణ్ణి నారదుడు చూచాడు.
పరమభాగవతుల్లో ద్వితీయుడైనా అద్వితీయస్థానాన్ని ఆక్రమించిన నారదుడు (ప్రహ్లాదునికి అసలు గురువు. నారాయణ మంత్రోపదేశం చేసినవాడు) బ్రహ్మమానసపుత్రుడు. ఆ పరమభక్తాగ్రేసరుడు, సకల ఇంద్రియాలకు అధిపతియైన శ్రీకృష్ణపరమాత్మ, సాధారణమైన నరజన్మను ధరించి, మానవాతీతమైన గొప్పసుఖాలలో యోగమాయాప్రభావంతో జీవితాన్ని గడపడం చూచి, ఆయన సామర్థ్యానికి ఆత్మలో సంతోషించాడు.
ఔరా! శ్రీహరీ! వరదా! అమేయగుణాకరా! అంటూ ఆశ్చర్యంతో శ్రీకృష్ణుణ్ణి తన మనస్సులో మెచ్చుకొంటూ నారదమహర్షి సజ్జనవిధేయుడైన శ్రీకృష్ణుణ్ణి చూచి ఓ దేవా! మూడులోకాలలో నీ మాయ తెలియగలవా రున్నారా?
మూడు లోకాల్లో బుద్ధిమంతులై నీ మీది భక్తి అనే అమృతాన్ని సేవించి, వృద్ధిపొందే కృతార్థులు తప్ప, బ్రహ్మ ఇంద్రాదిదేవతలుగాని, మహర్షులుగాని నీ మాయాప్రభావాన్ని తెలుసుకోగలరా? (తెలిసికోలేరు అని తాత్పర్యం.)
ఇట్లు పలికి ఆనందిస్తూ దేవా! నేనిక మీనుండి సెలవు తీసుకొంటాను. ఎల్ల లోకాలను పావనంచేసేదీ, మంచివారికి హితం చేకూర్చేదీ అయిన నీ గొప్పతనాన్ని అన్నిలోకాల్లో తెలియపరుస్తాను అన్నాడు.
శ్రీకృష్ణుని అమృతతుల్యమగు మాటలతో ఆనందాన్ని పొందినవాడై, ఆ దేవదేవునిరూపాన్ని మనసులో నిల్పుకొని, హరిని కీర్తించడమే జీవితధ్యేయమని భావించిన పాండిత్యంగలవాడై నారదుడు బయలుదేరాడు.
ఓ రాజా! ముల్లోకాలలో విశేషంగా ప్రకాశించే నడవడిగల శ్రీకృష్ణపరమాత్మ లోకాలకు మేలు చేయాలనే ఆలోచనతో మానవుడుగా జన్మించి పదహారువేల స్త్రీలను ఆనందింప చేయడానికి బహురూపాలు ధరించి ప్రవర్తించాడు.
ఓ రాజా! ఈ రీతిగా శ్రీకృష్ణుడు పదియారువేల స్త్రీలను రతికేళి తేలించి సంతోషపెట్టిన మానవాతీతశక్తిని గూర్చి సమగ్రమైన భక్తితో ఎవరైతే విందురో, చదువుదురో వారికి శ్రీవిష్ణు పాదభక్తితోపాటు, వెలలేని ధనసంపద, గోసంపద, కొడుకులు, మిత్రులు, భార్యలు లభించి వారివలన అనేకసుఖాలు సమకూడుతాయి. (అని ఈ ఘట్టాన్ని విన్నా చదివినా లభించేదాన్ని ఫలశ్రుతిగా వివరించాడు శుకమహర్షి)
అని ఈ విధంగా చెప్పి, శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇంకా ఇలా చెప్పసాగాడు. ఆ నారదుడు వచ్చి వెళ్లిన మరునాటి తెల్లవారుజామున తామరతీగలకు వికాసం కల్పిస్తూ ముందుముందుగా సూర్యభగవానుడు వస్తున్నాడు అనేవార్తను తెలియజేస్తున్నయా? అన్నట్లు కలహంసలు, బెగ్గురుపక్షులు, చక్రవాకాలు వంటి నీటిపక్షుల కలధ్వనులు వినబడగా, అరుణోదయ సమయంలో మేలుకొలుపులు పాడేవారి పాటలు చెవులకు ఇంపు కొలుపుతూ ఉండగా, మద్దెలల, వీణల, వేణువుల వంటి వాద్యాల మనోహరమైన ధ్వనులు వినబడగా శ్రీకృష్ణుడు నిద్రలేచి - జ్ఞానానంద స్వరూపుడు, పరమాత్ముడు, నాశరహితుడు, అవికారుడు, అద్వితీయుడు, అజితుడు, తుదిలేనివాడు, జ్ఞానంనుండి జాఱనివాడు, ఏ కొలతలకు అందనివాడూ, చావు పుట్టుకలు లేనివాడైన పరబ్రహ్మ తనకు తాను ధ్యానించుకొని, కొంతసేపు గడపి పిమ్మట శత్రువులకు సంకోచం, భక్తులకు విరాగం కలిగేటట్లుగా, దోషాలనెడిచీకట్లను పోగొట్టే సూర్యునివంటి శ్రీకృష్ణుడు మూసినకన్నులు తెరచి మంచం దిగి వచ్చి తరువాత
మంచి గంధం, కస్తూరి మొదలైన పరిమళద్రవ్యాలు కలపడంచే సువాసనా భరితాలైన బంగారుకలశాలలోని జలాలతో స్నానం చేసి, కొత్తవి, మెత్తనివి దివ్యాలైన మంచివస్త్రాలు కుచ్చెళ్లు అందంగా పెట్టుకొని, కట్టుకొని మకర కుండలాలు, అందెలు, హారాలు, భుజకీర్తులు, కంకణాలువంటి ఆభరణాలు అలంకరించుకొని, పచ్చకర్పూరంతో కలిపి తయారు చేసిన చందనాన్ని ఒడలి నిండా పూసుకొని, కొత్తగా కోసిన పువ్వులను తలలో ముడుచుకొని, ఆకృతి పొందిన శృంగారరసమో, దయాసముద్రమో అన్నట్లు ప్రకాశిస్తూ తనసౌందర్యాన్ని నిలువుటద్దంలో చూచుకొని
సారథి పూనికతో తెచ్చిన బంగారు రథం మీద శ్రీకృష్ణుడు సాత్యకి తోడను తనకు హితుడూ, ఇష్టుడూ అయిన ఉద్ధవునితోను ఎక్కి తన శరీరకాంతి దిక్కులన్నిట వ్యాపించగా తూర్పుకొండపై ప్రకాశించే సూర్యునివలె ప్రకాశించాడు.
కొత్త అలంకారాలతో ప్రకాశిస్తూ తన శరీరకాంతులు అంతఃపురస్త్రీల కన్నులనే తామరలకు ఆనందాన్ని కూర్చగా, మనోహరమైన తన ముఖమనే చంద్రుని కాంతులు అనగా వెన్నెలలు పురజనులనే చకోరాలకు పండుగ చేస్తుండగా, మణులతో ప్రకాశించే తన బంగారుఆభరణాల కాంతిదిక్కులన్నిట వ్యాపిస్తుండగా, మెల్లమెల్లగా వచ్చి రథం దిగి - తన పాదాలందు గల - హలరేఖ, కులిశరేఖ, అంకుశరేఖ, జలజరేఖ, కలశరేఖలు భూదేవికి అలంకారాలుగా చేసి ఉద్ధవుని చేయి ఊతగా చేసుకొని నెమ్మదిగా నడచి సుధర్శి అను సభామధ్యంలో సింహాసనంపై సంతోషంతో కూర్చున్నాడు.
మిక్కిలి వైభవంతో తన శరీరకాంతి వెలుగగా - ఆప్తులు, పురోహితులు, రాజులు, స్నేహితులు, చుట్టాలు, పండితులు, తనయులు, స్తుతిపాఠకులు, మంత్రులు, సారథులు భక్తితో పరివేష్ఠించి సేవింపగా - నక్షత్రాలచే సేవింపబడుతున్న ఆ చుక్కల్లో చంద్రుడా అన్నట్లు శ్రీకృష్ణుడు ప్రకాశిస్తున్నాడు.
ప్రజలందరినీ దయతో కూడిన చల్లనిచూపులతో లెస్సగా పరిరక్షిస్తూ తన తెలివితో, చాతుర్యంతో వివిధ వ్యాపారాలు నిర్వర్తించే కళను ప్రదర్శిస్తూ, ఇష్టగోష్ఠి చేస్తూ ఎంతో ఆనందంతో రాజ్యభారాన్ని వహించి పరిపాలన సాగించే వాడవుతూ.
ఈ ప్రకారం శ్రీకృష్ణుడు కొలువు చేస్తుండగా ఒకనాడు మున్నెన్నడు చూచి ఎరుగని ఒక బ్రాహ్మణుడు వచ్చి, కొలువు కూటంలో కొలువున్న శ్రీకృష్ణుణ్ణి జూచి సాగిలబడి మ్రొక్కి అతివినయంతో చేతులు జోడించి, ఇలా పలికాడు.
తామరలవంటి కన్నులుగలవాడా! రాక్షసులను నాశనం చేసేవాడా! యోగీశ్వరుల మనస్సులకు జ్ఞానాంజనమైన వాడా! కాంతికి నిదర్శనమై 'వెలుగు' వాడా! బలరాముని తమ్ముడా! శ్రీకృష్ణా!
ఓ కృష్ణా! వినవయ్యా! జరాసంధుడు మిక్కిలిబలాఢ్యుడు. తనకు సాటి లేనివాడు; తన ఆజ్ఞకు అణగి తనకు నమస్కరించని రాజుల్ని వెదకి తెప్పించి గిరివ్రజమనే పట్టణంలో ఇరువది వేలమందిని చెఱసాలలో బంధించాడు.
ఓ పుణ్యాత్ముడా! రాజశ్రేష్ఠుడా! శ్రీకృష్ణా! ఆ రాజులు పంపగా వచ్చినవాణ్ణి నేను. వారు మనవి చేయుమన్న విషయాలు నేను నీకు విన్నవిస్తాను. నా మాటలు విన్న మీదట వారి అదృష్టానికి తగిన రీతిలో నీదయ వారికి లభించునుగాక!
అని చెప్పి, ఆ రాజులందరూ వచ్చి, మనవి చేసుకొన్నట్లే ఆ బ్రాహ్మణుడు వారిమాటలను విన్నవించాడు.
బొడ్డున పద్మంగలవాడివి, భక్తజనులయందు ప్రమగలవాడివి, దుష్టరాక్షసులను సంహరించినవాడివి, బ్రహ్మ, శివుడు మున్నగు దేవతలచే నమస్కరింపదగిన పాదపద్నాలు గలవాడివి, ఎల్లలోకాలలో కీర్తింపబడిన దివ్యప్రభావం గలవాడివి, సంసార సంబంధం లేనివాడివి, నందుని కుమారుడివి, లక్ష్మీదేవి ప్రాణనాయకుడవైన శ్రీకృష్ణా! మాధవా!
గొప్ప మహిమగలవాడా! భక్తుల భయాన్ని తొలగించేవాడా! పుణ్మాత్ముడా! సాంసారికబాధలచే దుఃఖీతులమైన మమ్మల్ని కాచి రక్షించవయ్యా! నిన్ను మదిలో స్తుతించి, నీకు మ్రొక్కుతున్నాము. నీ రెండుపాదాలే మాకు దిక్కు
జనన మరణాలు లేని ఓ శ్రీకృష్ణా! దుష్టులైన బలవంతుల్ని శిక్షించడానికి సాధువులైన బలహీనుల్ని రక్షించడానికి ఈ భూమిపై నీ లీలావిలాసాలకు తగిన రీతిలో యుగయుగంలో అవతరిస్తుంటావు కదా!
సర్వరక్షకుడవై ఈశ్వరా! భక్తజనులపాలిటికల్పవృక్షమా! ముల్లోకాలను రక్షించే కృష్ణా! నీ మనస్సుకు తోచని విషయం ఈ భూమిపై ఉందా? నీవన్నీ తెలిసినవాడివి. దీనుల్ని రక్షించవయ్యా!
లక్ష్మీనాథుడవైన ఓ శ్రీకృష్ణా! నీవు చెప్పిన పనిని చేయక పోవడం బ్రహ్మాదిదేవతలకైనా శక్యంకాదు. కాబట్టి, నిన్ను శరణు జొచ్చినవారిని చేపట్టి, వారిని నిర్భంధంనుండి విముక్తుల్ని చేసి, కాపాడవయ్యా!
అందరి దుఃఖములను పోగొట్టేవాడివైన శ్రీకృష్ణా! నీవు పుట్టుక లేనివాడవైనా భూమిపై పుట్టడం కేవలం ఒక వేడుక కోసం మాత్రమే. నిజానికి ఇది పుట్టడం కాదు. కాబట్టి, బ్రహ్మాది దేవతా ప్రభువులందరికీ రాజువైన నీవు భయాత్ములమైన మమ్మల్ని కాచి రక్షించాలి. మా భయం తొలగించి తీరాలి! ఎందుకంటే నీవు ఆర్తిహరుడివి కదా!
ఇంతకుముందు జరాసంధుడు యుద్ధంలో నిన్ను నిలువరించలేక తన పరాక్రమం తగ్గిపోగా నీ భుజబలానికి తట్టుకోలేక రాజులందరు నవ్వుతుండగా భయంతో పారిపోలేదా?
తాను పొందిన అవమానాన్ని గుర్తుంచుకోక, జరాసంధుడు మదించిన ఏనుగుల్ని నిర్బంధించి హింసించే సింహంలాగా మమ్మల్ని చెరసాలలో పెట్టి బాధిస్తున్నాడు. ఈ పాపాత్ముణ్ణి సంహరించడానికి నీవు తప్ప వేరెవరూ రక్షకులు లేని మమ్మల్ని రక్షించి, మా పుత్రులతో, భార్యలతో, మిత్రులతో మమ్ము చేర్చవలసిందని ఆ రాజులు మనవి చేసుకొన్నారని వారు పంపగా వచ్చిన బ్రాహ్మణుడు చెప్పుచుండగా
No comments:
Post a Comment