శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
నారదుడు శ్రీకృష్ణునితో ధర్మరాజు రాజసూయము నెరవేర్పుమని చెప్పుట
వివేకవిశారదుడగు నారదుడు - శరత్కాలపువెన్నెలలో వెలుగే జింకలాగా ప్రకాశించే ఎర్రని జడముడితోను, శరత్కాలమేఘాలచే ఆవరింపబడిన మెరుపుతీగయా అన్నట్లున్న బంగారుమొలతాడుతోను, మనోహరమైన నిండు చంద్రునిలోని మృగచిహ్నమా అన్నట్లున్న జింకతోలు ప్రకాశించగా, కల్పవృక్షపు చిటారుకొమ్మన పూచి వేలాడుతూ ఉన్న పూలగుత్తివలె ఒప్పుతున్న జపమాల చేతిలో ధరించి, ఒక చేతిలో పుణ్యనదుల్లోని జలాలు నింపిన కమండలువు ఒప్పుతూ ఉండగా శ్రీకృష్ణుని సభామండపానికి వచ్చాడు.
ఆ విధంగా నారదమహాముని “సూర్యుడే విచ్చేసినాడా!” అన్నట్లు జనులు భ్రాంతిపడే విధంగా తన దేహకాంతులచే దిక్కులన్నింటిని ప్రకాశింపజేస్తూ రాగా - ఆ సభామండపంలో ఉన్న యాదవులు, శ్రీకృష్ణుడు గౌరవంతో తమ తమ ఆసనాలనుండి లేచి ఆనందంతో
శ్రీకృష్ణుడు, యాదవజనులు మిక్కిలి వినయంతో నారదునికి నమస్కరించి, బంగారు ఆసనంపై కూర్చుండబెట్టి ఆ మహాముని గౌరవానికి తగిన రీతిలో అనేక విధాలైన అర్చనలు చేసి, తృప్తి పరిచాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు అణకువతో నారదమహామునితో ఇలా అన్నాడు.
ఓ మహార్షీ! ఇప్పుడు మీరు ఎక్కడ నుండి ఇక్కడకు వచ్చారు? మీరు అన్నిలోకాలలో సంచరించేవారు - కాబట్టి ఈ ప్రపంచంలో మీకు తెలియని సంగతులు ఏవీ ఉండవని పెద్దలంటారు. కాబట్టి, మిమ్మల్ని ఒక విషయం అడగాలి.
పాండవులు ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉన్నారో తెలియజేయవలసిందిగా శ్రీకృష్ణుడు అడుగగా నారదుడు సద్భక్తితో చేతులు జోడించి నమస్కరించి పుండరీకాక్షునితో ఉత్సాహంగా ఇలా చెప్పసాగాడు.
దేవా! నీవు సృష్టికర్తవు. మాయాస్వరూపుడివి. కార్యములను పుట్టించువాడివి. కలిలో దాగిన అగ్నివలె కనబడకుండ ప్రకాశించువాడివి. సర్వమాయాస్వరూపుడవైన నీ మాయాకలాపాలు ఎన్నోసార్లు చూశాను. ఇది నాకు కొత్త కాదు. వింతకాదు. నీ సంకల్పంచేత పుట్టింది. నీ అధీనంలో ఉంది. నీకు ప్రియమైన వస్తువు ఇట్టిదని తెలియగల సమర్థు దెవరు?
ఏ పదార్థం వేదశాస్త్రప్రమాణంగా తోస్తుందో అది సర్వలోకాల్లో సమర్థుడవైన నీ రూపమే! అదిగాక ముక్తిమార్గం తెలియక సంసారసాగరంలో బడి కొట్టుమిట్టాడే జీవుల అజ్ఞానమనే చీకటిని పోగొట్టగల సమర్థుడివి. నానావిధాలైన లీలలను చూపునట్టి నీ అవతారాలలో నీకు గలిగిన యశస్సు అనే దీపాన్ని వెలిగించి అనుగ్రహించినట్టి నీకు మ్రొక్కెదను. ఈ సర్వసృష్టియందు నీకు తెలియని విషయం ఒకటి మిగిలి ఉందని నేను చెప్పగలవాడనా? అని నారదుడు శ్రీకృష్ణ స్వామితత్త్వాన్ని ప్రశంసించి - ఇంకను ఇలా చెప్పసాగాడు.
నీకు సర్వం తెలిసియున్నప్పటికీ నన్ను అడిగావు కాబట్టి చెబుతాను విను. పాండురాజు కొడుకైన ధర్మరాజు యజ్ఞం చేసి బ్రహ్మలోకాన్ని పొందాలనే కోరికతో రాజసూయ మహాయాగాన్ని చేయబోతున్నాడు. అట్లు ఆ యజ్ఞం చేయతలపెట్టడం లోకంలో ప్రసిద్ధి పొందడానికే గాని, సద్గతిని పొందడానికి నిన్ను సేవిస్తే చాలుగదా? నీవు దగ్గఱ చుట్టానివి, భక్తవత్సలుడవు, పరమపురుషుడవు, యజ్ఞరక్షకుడవు, యజ్ఞంలోని హవిస్సును స్వీకరించే కర్తవు కావున, నీ మేనత్తకొడుకగు ధర్మరాజు చేసే యజ్ఞానికి సర్వవైభవంతో నీవు తప్పక రావాలి సుమా!
ఓ శ్రీకృష్ణా! లోకాన్ని ప్రకాశింపజేసేవాడా! పద్మాలవంటి కన్నులుగలవాడా! నీ పేరు విన్నను, నీరూపానికన్నను పాపాలన్ని పటాపంచలైపోతాయి. నిన్ను భక్తితో కొలిచేవారికి ఈ భూలోకంలో పరలోకంలో సుఖాలు అధికంగా లభింపవా? (లభిస్తుంది!)
ఓ శ్రీకృష్ణా! నీ నిర్మలమైన కీర్తి దశదిశలలో ప్రకాశించేటట్లుగా నీ పాదాలయందు పుట్టిన నీళ్లు మిక్కిలి నిర్మలత్వంతో పాతాళలోకంలో భోగవతి అనే పేరుతో, భూలోకంలో గంగానది అనే పేరుతో, స్వర్గలోకంలో మందాకిని అనే పేరుతో - ముల్లోకాల్లో ప్రకాశిస్తున్నాయి కదా?
జరుగబోయే రాజసూయయజ్ఞంలో ఈ భూమిమీది గొప్పరాజులు, మునుల సమూహం నీ గొప్ప మహిమను చూచి, ఉత్తమస్థితి పొందగలరు.
అని నారదుడు పలుకగా శ్రీకృష్ణుడు ఆనందించి, చిరునవ్వు ముఖానికి కొత్త అందాన్ని చేకూర్చగా, నారదుని మాట మన్నించి ఉద్ధవునితో ఇలా చెప్పాడు.
Subscribe to:
Post Comments (Atom)
kuchelopakyanamu - కుచేలోపాఖ్యానము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - కుచేలోపాఖ్యానము అని శుకమహర్షి పల్కగా, పరీక్షిత్తు ఇలాగ అంటున్నాడు : 'కమలదళాక్షుని అంతులేని పరా...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment