రామభద్రుడు:
ఓ వానర వీరులారా! సీతాదేవి ఏ స్థితిలో వుంది. నా యందు ఆవిడ ఏ దృష్టితో వుంది. అంతా వివరంగా చెప్పండి, అన్నాడు.
అప్పుడు వానరులందరూ సర్వవృత్తాంతం ఎరిగిన హనుమంతుని రాముని ముందుకు నడిపించారు.
హనుమంతుడు దక్షిణ దిశగా తిరిగి మనసా సీతాదేవికి నమస్కరించి రాముని చూచి:
రామభద్రా! అమ్మవారిని అన్వేషించడానికి దక్షిణ సముద్రం నూరు యోజనాలు దాటి లంకలో అడుగుపెట్టాను. అక్కడ సీతాదేవిని దర్శించాను.
ఆ పతివ్రతా శిరోమణి తన మనస్సు నీ మీదనే లగ్నంచేసి నీకోసమే జీవిస్తున్నది. రావణుని ఉద్యానవనంలో రాక్షసీ జనమధ్యంలో వారి పరుష భాషణలతో హింస పడుతున్నది. ఆమెకు వారే రక్షకులుగా వున్నారు.
దీనురాలై, ఏకవేణితో, భూమిమీదనే శయనిస్తూ, మంచుదెబ్బతిన్న పద్మంలా వుంది.
క్రూర రావణుని హీంసలు పడలేక ప్రాణత్యాగానికి సన్నద్ధమవుతూండగా నేను వారించి ఓదార్చడానికి ప్రాతిపదికగా ఇక్ష్వాకువంశ కీర్తనం ఆరంభించాను.
అప్పుడు నన్ను విశ్వసించి నాతో మాట్లాడింది. నేను విషయమంతా వివరించాను.
మీ మైత్రిమాట విని సంతోషించింది. మీకు గుర్తుగా చిత్రకూటం మీద వాయసం కథ చెప్పింది. ఆవిడ తిలకం జారినప్పుడు మణిశిలతో మీరు తిలకం దిద్దిన వృత్తాంతం గుర్తుచేసింది.
ఇదిగో ఈ చూడామణి ఆనవాలుగా యిచ్చింది. ఆ రాక్షసా వాసంలో మరొక్క మాసంకంటె జీవించనని చెప్పింది, అని విషయాలు విస్తరంగా చెప్పాడు.
రాముడు చూడామణిని అందుకుంటూనే గుండెలకు హత్తుకుని కన్నీరు విడుస్తూ సుగ్రీవుని వైపు తిరిగి:
లేగదూడ కోసం ఆవు ఎంత తపన పడుతుందో ఈ మణిని చూడడంతో నేను సీతకోసం అంత బాధ పడుతున్నాను. కల్యాణ వేదిక మీద ఆ జనక మహారాజు దీనిని ఆమెకు శిరోభూషణంగా అలంకరించాడు, ఈ మణి పవిత్ర జల సంభూత, దీనిని దేవేంద్రుడు కానుకగా యిచ్చాడు. దీన్ని చూస్తూంటే మా తండ్రిగారినీ, మా మామగారినీ చూసినట్లనిపిస్తున్నది. ఇది ఆమెకే అలంకారం, అని హనుమంతునివైపు తిరిగి:
మారుతీ! దాహపీడితుడికి స్వాదుజలంవలె నీ మాటలు నా బాధకు ఉపశమనం కలిగిస్తున్నాయి. నా జానకి యింకా ఏం చెప్పిందో వివరించు; జానకి లేని జీవితం క్షణం కూడా భరించలేను. నన్ను కూడా ఆమె దగ్గరకు తీసుకువెళ్ళు. ఆ రాక్షసుల మధ్య ఏం బాధలు పడుతున్నదో, మేఘాచ్చాదిత శరచ్చంద్రునివలె వుండి వుంటుంది. రోగికి ఔషధంలా నాకు నీ మాటలే, జీవనాధారం, ఆ ప్రియభాషిణి చెప్పిన మాటలన్నీ వినిపించు, అన్నాడు.
రామభద్రా! చిత్రకూటం మీద మీరుభయులూ విశ్రాంతి తీసుకునే వేళ నువ్వు నిద్రపోయేవేళ ఒక వాయసం వచ్చి జానకమ్మను హింసిస్తుండగా నువ్వు మేలుకాంచి దర్భను బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి విడిచావట, ఆ కాకికి ముల్లోకాలలోనూ అభయం దొరకక నిన్నే శరణువేడితే అప్పుడు అమోఘమయిన ఆ అస్త్రానికి లక్ష్యంగా కన్ను వదులుకున్నదట.
అలనాడు వాయసంమీద అస్త్రం ప్రయోగించిన రాముడు రాక్షసుల విషయంలో ఎందుకు ఉపేక్ష వహిస్తున్నాడు. లక్ష్మణుడయినా ఎందుకు రావడంలేదు.
బహుశ నేను చేసిన పాపకర్మలు పూర్తికాలేదేమో! లేకుంటే యింత కాలం ఆ మహావీరులు ఉదాసీనంగా ఎందుకుంటారు, అని కన్నీరు విడిస్తుంటే నేను:
తల్లీ! రాముడు నీ విరహవ్యధతో నిశ్చేష్టుడై వున్నాడు. లక్ష్మణుడు అన్నగారి దుఃఖం చూడలేక బాధపడుతున్నాడు.
ఇంతకాలం నీ జాడ తెలియలేదు. ఇప్పుడింక నువ్వు చింతించకు. వారుభయులూ హుటాహుటిని వచ్చి లంక దహించి, ఈ రావణుని బంధుకోటితో సహా కడతేర్చి తమతో తీసుకువెడతారు. ఆయనకు ఆనవాలుగా ఏదయినా ఇయ్యి, అని అడిగాను.
అప్పుడావిడ అటూ యిటూ చూసి, జుట్టు ముడిలోని ఈ మణి యిచ్చింది.
నేను తీరుగు ప్రయాణానికి బయలుదేరుతూంటే,
హనుమా! సింహసదృశ పరాక్రమ సంపన్నులయిన రామ లక్ష్మణులనూ వానరేశ్వరునీ అడిగానని చెపుతూ, రామలక్ష్మణులను దర్శించగలగడం నీ అదృష్టం, అని నన్ను అభినందించింది.
అప్పుడు నేను:
తల్లీ! నా వీపుమీద కూర్చో. ఈ క్షణంలో వారి దగ్గర దింపుతాను, అన్నాను.
అప్పుడావిడ!
హనుమా! ఈ మనస్సు నా స్వాధీనంలో వుండగా పరపురుష స్పర్శ సహించను. అలనాడు కాలం ఎదురు తిరగడంవల్ల, ఆ రాక్షసుడు నన్ను ముట్టగలిగాడు, ఇక రాముడు నన్నీ దుఃఖసాగరం నుండి ఎలా ఉద్దరించాలో అదంతా అయనతో నువ్వు ఆలోచించు. ఈ రాక్షసపీడ చూశావుగదా! అంతా ఆయనకు చెప్పు. నీకు శుభమగుగాక! అని క్షణం ఆగి:
పోనీ ఈ రోజు యిక్కడెక్కడయినా విశ్రాంతి తీసుకుని వెళ్ళరాదా! నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవరకూ నేను వుంటానో వుండనో! నా దుఃఖాలకు అంతు కనబడడంలేదు, మీ వానర, భల్లూక సేనలు ఈ అనంత విశాల సాగరాన్ని ఎలా దాటగలవయ్యా!
దాశరథులకు మాత్రం యిది సాధ్యమా!
వాయుదేవుడు, గరుత్మంతుడు, నువ్వూ తప్ప మరెవరూ ఈ సముద్రం దాటలేరు కదా.
మరి ఈ అసాధ్యాన్ని నువ్వు ఎలా సాధిస్తావో చూడాలి. అందుకు నువ్వే సమర్థుడవు. రాముడు స్వయంగా వచ్చి రాక్షస సంహారం చేసి నన్ను తీసికెళ్ళడం ఆయనకు యశస్కరం.
ఈ రాక్షసుడు రామునికి భయపడినందువల్లనే కపట మార్గాన నన్ను హరించాడు. రాముడు తన పరాక్రమం ప్రదర్శించాలి. అదంతా నువ్వు చెప్పాలి, అని అన్నది,
అప్పుడు నేను:
అమ్మా! వానరేశ్వరుడు సుగ్రీవుడు కృత నిశ్చయుడై వున్నాడీ విషయుంలో
వానర భల్లూక పతులందరూ ఆయన కను సన్నలలో నడుస్తారు. వారు సంకల్పించారంటే సాధించి తీరతారు. వారికి అవరోధం లేదు. వాయుమార్గాన భూ ప్రదక్షిణం చేయగల యోధులు వారందరూ.
అక్కడ నా కంటె మహామహులూ, నాతో సమానులూ వున్నారే తప్ప తక్కువ వారెవరూ లేరు. దూతగా నన్ను పంపారు. అంటే వారికంటె తక్కువ వాడీనే కదా, పెద్దలను దూతకృత్యానికి పంపరు కదా!
ఈ వానరయూధనాధులు ఒక్క ఊపులో లంకలో వ్రాలుతారు. ఇక ఆ రాజ సింహులు నా వీపుమీద వచ్చి యిక్కడ సూర్య చంద్రునివలె దిగుతారు.
సర్వశత్రు సంహార సమర్దుడు, సింహసమ పరాక్రమోపేతుడు, రామ భద్రుడు ధనుర్ధారియై లంకానగర ద్వారంలో నిలబడడం త్వరలోనే నువ్వు చూడగలవు,
వాడి గోళ్ళూ, నిశిత దంతాలూ, ఆయుధాలుగా మా వానర గణాధిపతులు సింహ శార్దూల బలసంపన్నులు. వారు మత్తగజ సన్నిభులై నీ ముందుంటారు.
వార్షుకాభ్రాలవలె, మహాపర్వతాలవలె వారు ఈ లంకానగర సమీప గిరి సానువులమీద సింహనాదాలు చేస్తూంటే వినే రోజు ఎంతో దూరంలో లేదు.
రామభద్రుడు శత్రుసంహారం చేసి వనవాసం ముగించి నిన్ను వెంట బెట్టుకుని అయోధ్యానగరం చేరి తీరతాడు, అని జానకీదేవిని ఓదార్చాను;
అని హనుమంతుడు పలకడంతో రామభద్రుడు సంతుష్ట చిత్తుడయాడు.
అరిఘ్నం సింహ సంకాశం
క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం
లక్ష్మణంచ ధను ష్పాణిం
లంకాద్వార ముపస్థితం
సుందరకాండ సమాప్తం
(అదికవి వాల్మీకి అనుగ్రహించిన శ్రీ మద్రామాయణంలో సుందరకాండకు ఇది ఉషశ్రీ స్వేచ్చానువాదం.)
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం సమత రాక్షసాంతకం.
(రామనామం వినిపించే ప్రతిప్రాంతంలో ఆనంద బాష్పాలతో తలవంచి నిలబడే మూరుతికి నమస్కారం. ఇది భక్తుల దృష్టిలో హనుమంతుని రూపం)
అంజనా నందనం - వీరం
జానకీ శోకనాశనం
కపీశం అక్ష హంతారం
వందే లంకా భయంకరం.
అదీ ఆయన రూపం.

No comments:
Post a Comment