Friday, August 21, 2026

sri krishnundu kesivyomasurula samharinchuta - శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట

అని చెప్పి రథమెక్కి అక్రూరుడు వెల్లిపోయాడు. కంసుడుకూడా సభాసదుల్ని వీడ్కొల్పి, తన అంతఃపురానికి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కంసప్రేరితుడై ఇంధ్రవరుణులను మించినవాడూ, పరాక్రమానికి సముద్రంవంటివాడూ అయిన కేశి అనే రాక్షసుడు కంసుని ప్రోత్సాహంతో గుర్రమై వాయువేగంతో నందుని మందలోకి ప్రవేశించి సంకటం కలిగించాడు. 

ఆ కేశిదానవుని దిట్టమైన గిట్టల తాకిడికి సంచలించిన భూమండలం నాగరాజైన ఆదిశేషునిపడగలకు బరువయింది. అతనిభయంకరమైన సకిలింతలకు మిక్కిలి భీతిచెంది ఆకాశంలో దేవతలు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు.

ఆ రాక్షసుడు తన జూలు అటూ ఇటూ ఆడించడంవల్ల జనించిన గాలికి మేఘాలు ఎగిరిపోయి దేవతలవిమానాలను కమ్ముకొన్నాయి. అతని బిలంవంటి నోరు తెరచినపుడు నోటిలోని పెద్దపండ్లు ప్రళయకాలంలోని అగ్నిజ్వాలలవలె ప్రకాశించాయి. అతనితోక యమపాశంవలె కనిపించింది.

దారుణమైన గుర్రం రూపంలో ఉన్నఆ కేశిరాక్షసునిసకిలింత వినేసరికి అక్కడి ఆవులు, దూడలు, గోపికలు, గోపాలకులు, పిల్లలు - అందరి హృదయాలూ దద్దరిల్లాయి. కృష్ణుడు చూస్తుండగానే మంద దీనంగా మొరపెట్టే పెద్దధ్వనిగా మారిపోయింది. ఆ సమయంలో

"శక్తిహీనులైన మందలోని గోపాలకులను భయపెట్టడం నీవంటి వీరునికి ధర్మం కాదు. ఈ గోకులంలో దానవనాశకుడైన కృష్ణుడెక్కడ?” అంటూ తనను వెదకుతున్న కేశిదానవుణ్ణి కృష్ణుడు చూశాడు. 

గోపాలురకు అడ్డం వచ్చి కృష్ణుడు "ఓరీ రాక్షసుడా! ఇక పోలేవు" అంటూ సింహంవలె గర్జించి వాణ్ణి యుద్దానికి పిలిచాడు. ఆ రాక్షసుడు కూడా గోవిందుణ్ణి ఎదిరించాడు.

అశ్వరూపంలోని కేశిదానవుడు భయంకరంగా, కర్కశంగా సింహనాదంచేస్తూ ఆకాశాన్ని మింగే విధంగా నోరు పెద్దదిగా తెరిచి, కృష్ణుణ్ణి కరవబోయాడు. వాని కాటును కృష్ణుడు తప్పించుకున్నాడు. దానవుడు కృష్ణుణ్ణి ఎగిరి తన్నినాడు.

జాగ్రత్తగా ఆ తన్ను తప్పించుకొని రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుడు రణోత్సాహం పొందాడు. కండ్లలో ఎరుపుదనం అతిశయించగా ఆ అశ్వదానవునిగర్వం తరిగేటట్లు అతనికాళ్లు పట్టుకొని గరుత్మంతుడు పాముపిల్లను పట్టుకొని విసిరి పారవేసినట్లు నూరువిండ్ల దూరంలో విసిరి పారవేశాడు.

అలా కృష్ణుడు విసరిపడవేయగా, కేశిదానవుడు నేలపై పడి వెంటనే పైకి లేచి అహంకారంతో హుంకరిస్తూ, సంకోచం లేకుండా కృష్ణునిపైన పడ్డాడు. భయంకర సర్పాన్ని గుహలోనికి చొప్పించిన విధంగా కృష్ణుడు దిగ్గజం తొండంవలె బలిష్ఠమైన తన బాహుదండాన్ని కేశిదానవుని నోటిలోనికి చొప్పించాడు.

ఓ రాజశ్రేష్ఠుడవైన పరీక్షిన్మహారాజా! అఘాసురసంహారి అయిన శ్రీకృష్ణుడు వజ్రాయుధంవలె కఠినమై పైకి చాచబడిన స్తంభంవంటి తన ఎడమచేతిని రాక్షసుని దంతాలు చూర్ణమై రాలిపోయేటట్లు వాని కడుపులోనికి చొప్పించాడు. అలా చొప్పించిన చేతిని ఉత్సాహంతో పెంచుతూ ఆ దానవుని ప్రాణవాయువును నిరోధించాడు.

ఇలా కృష్ణుడు చేసినందువల్ల, పొట్టలోని గాలి వెలుపలికి వెడలక నిలిచిపోయింది. రాక్షసునిదేహం పై చెమటలుపట్టాయి. కనుగుడ్లు బైటికి వచ్చాయి. తన మాయలు చెడిపోయి, తన్నుకొంటూ, రొప్పుకుంటూ కేశి నేలపైన కూలిపోయాడు.

ఓ రాజా! ఇలా అశ్వాసురుని కడుపులో కృష్ణుని బాహువు పెరిగి పెరిగి పట్టక పోవడంతో, వాని కడుపు దోసపండువలె రెండుముక్కలుగా పగిలిపోయింది.

పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు వీరావేశీ, మాంసాశనుడూ, ఆనాటి లోకంలో నూతనశక్తిరాశిగా ఉన్నావాడూ, ఇంద్రవరుణులను ఓడించినవాడూ అయిన కేశిరాక్షసుణ్ణి అలవోకగా సంహరించాడు

ఆ ఆనందసమయంలో దేవతలు పూలవానలు కురిపించారు. శ్రీకృష్ణునిమహిమలను కొనియాడారు. అప్పుడు విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి, కృష్ణునిదర్భనం చేసుకొని, రహస్యంగా ఇలా అన్నాడు.

కృష్ణా! జగదీశ్వరా! అచింత్య ప్రభావంగల యోగీశ్వరా! అఖిల ప్రాణులకు ఆధారమైనవాడా! అంతటా నిండిన మహానుభావా! సర్వనియామకుడా! కట్టెలో నిక్షిప్తమై ఉన్న అగ్నివలె, సమస్తప్రాణులలో ప్రవేశించి ఎలాంటి వికారాలు లేక ఏకరూపుడవై విరాజిల్లుతున్నావు. 

ప్రాణుల హృదయగుహల్లో గూఢంగా ఉన్నావు. జీవులు చేసే పనులకు సాక్షిభూతుడవై ఉన్నావు. నీవు సర్వస్వతంత్రుడవు. నీకు అధీనమైన మాయాశక్తితోకూడి సత్త్వరజస్తమోగుణాలను కల్పిస్తున్నావు. ఈ త్రిగుణాల చేత బ్రహ్మ, విష్ణు, రుద్రరూపుడవై జగత్తును సృష్టిస్తున్నావు, రక్షిస్తున్నావు, సంహరిస్తున్నావు.

ఇలాంటి నీవు నేడు రాజుల ఆకారాలు ధరించి ఉండే రాక్షసులను సంహరించి, ఈ భూమండలాన్ని కాపాడడానికి అవతరించావు.

దేవా! ఇంకా నీచేత చాణూరుడు, ముప్టికుడు, గజాసురుడు, కంసుడు, శంఖుడు, యవనుడు, మురాసురుడు, నరకాసురుడు, పౌండ్రకవాసుదేవుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు మొదలైనవారు సంహరించబడతారు.

దేవలోకంనుండి పారిజాతవ్బక్షాన్ని పెకలించి భూలోకానికి తెస్తావు. నీవల్ల నృగునికి శాపవిమోచనం కలుగుతుంది. శమంతకమణిని స్వీకరిస్తావు. మృతులైన బ్రాహ్మణకుమారులను తిరిగితెచ్చి ఇస్తావు. అర్జునునికి రథసారథివై కురుక్షేత్ర యుద్ధంలో పదునెనిమిదిఅక్షౌహిణుల సైన్యాన్ని సంహరిస్తావు. ఇంకా -

కృష్ణా! వర్ధనశీలుడైన విధాతకూడా నీవు చేసే ఘనకార్యాలను లెక్కించ లేడు. నీ వల్లనే సత్త్వరజస్తమోగుణాలు మూడూ పుడతాయి, వృద్ధి పొందుతాయి, నశిస్తాయి. నీరూపం మేరలేనిది. సర్వవ్యాపివీ, జయశీలివీ, సహనశీలివీ, పరమేశ్వరుడివీ, ప్రమాణరహితుడివీ, ప్రపంచనియామకుడివీ అయిన నీకు ప్రణమిల్లుతున్నాను.

ఇలా దేవదేవుణ్ణి ప్రస్తుతించి సెలవుతీసుకొని నారదుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఒకనాడు గోపబాలకులు కృష్ణునితో కలసి పశువులను తోలుకొని అడవికి వెళ్లారు. అక్కడ పసులను మేపుకుంటూ దాగుడు మూతల్లాంటి - దొంగ - రక్షకుడు అనే ఆట ఆడడం ప్రారంభించారు.

గోపబాలురు తమలో కొందరు గొర్రెలుగా, కొందరు కాపరులుగా, మరికొందరు దుస్స్వభావంగల దొంగలుగా ఏర్పడి కనుమూసి గంతలాటను(దాగుడుమూతల్లాంటి) ఆడడానికి ఆరంభించారు.

అంతలో మయుడనే రాక్షసుని పెద్దకొడుకు వ్యోమాసురుడు గోపాలరూపం ధరించాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొఱ్ఱెలుగా నటిస్తున్న గొల్లపిల్లలలో నలుగురైదుగురిని తప్ప మిగతా బాలురనందరినీ మెల్లమెల్లగా ఆ కొండ గుహలోనికి తీసుకొని వెళ్లాడు.

ఇలా ఆ వ్యోమాసురుడు గోపబాలకులను మెల్లమెల్లగా కొండగుహలోనికి చేర్చి, ఒక పెద్దరాతితో ఆ గుహద్వారాన్ని మూసివేశాడు. అలా చేసిన తర్వాత ముందులాగా ఆ రాక్షసుడు రాగా

సర్వజ్ఞుడూ, రాక్షసాంతకుడూ, మహావీరుడూ అయిన శ్రీకృష్ణుడు నవ్వుతూ "ఓరీ! రాక్షసా! నీదొంగతనం గుట్టు బట్టబయలైంది. బలే దొంగవులే! యాదవ బాలకులందరినీ కొండగుహలో బంధించావు. మిగిలిన వారిని కూడా పట్టు కొందువుగాని రా! రారా! అంటూ సింహం తోడేలును పట్టుకున్నట్లు వాణ్ణి ఒడిసి పట్టుకొన్నాడు.

పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు ఇలా ఒడిసిపట్టగా అతడు గోపాలకునిరూపం వదిలి కొండలాంటిరాక్షసరూపంతో ఉప్పొంగి మిడిసిపడ్డాడు. కానీ విడిపించుకోవడానికి బలంచాలక, తన శక్తిమీద సందేహం గలిగి, ఎంతగానో గుంజులాడాడు. అపుడు ఆకాశంలో దేవతలు 'ఓహో' అని జయజయధ్వానాలు చేస్తుండగా కృష్ణుడు ఆ వ్యోమాసురుణ్ణి సంకోచం లేకుండా సంహరించాడు.

బలవంతుడైన శ్రీకృష్ణుడు ఆ భయంకరరాక్షసుణ్ణి సంహరించి, కొండగుహద్వారంలో అడ్డంగా ఉంచిన రాతిని పగిలిపోయేలా తన్నాడు. గుహలోపల చిక్కుబడిపోయి, తిరుగుతూ ఉన్న గోపబాలకులను కొండ గుహనుండి వెలుపలికి తీసుకొని వచ్చి గోకులానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు.

ఆ తర్వాత, అక్రూరుడు ఆ రాత్రి మథురానగరంలో బసచేసి, నియమంలో ఉదయమే లేచి, నిత్యకర్మానుష్ఠానాలు తీర్చుకొని, రథమెక్కి కదలి నందునిగోకులానికి ప్రయాణిస్తూ, దారిలో తనలో తాను ఇలా అనుకున్నాడు.

కంసుని పంపున నక్రూరుండు బృందావనంబునకు జనుదెంచుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

sri krishnundu kesivyomasurula samharinchuta - శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సంహరించుట అని చెప్పి రథమెక్కి అక్రూరుడు వెల్లిపోయాడు. కంసుడుకూడా స...