Thursday, August 13, 2026

Anuchitam - అనుచితం

రామాయణం సుందరకాండ 35వ సర్గ- అనుచితం

భర్తృ భక్తిం పురస్కృత్య
రామా దన్యస్య వానర
న స్ఫృశామి శరీరం తు
పుంసో వానర పుంగవ॥

వాయునందనా! రాముడు శోకసాగరమగ్నుడై ఇతర విషయాల గురించి ఆలోచన చెయ్యడం లేదని నువ్వు చెపుతూన్న మాటలు విషంచుక్క పడిన అమృతంలా ఉన్నాయి.

అఖండ సంపదలు వచ్చిపడినా, దారుణక్లేశాలు నెత్తిమీద వున్నా, కాలపాశం ఎప్పుడూ 
మన కంఠానికి తగిలించి లాగుతూనే ఉంటాడు యముడు. విధిని తప్పించుకోవడం ఎవరితరమూ కాదు. రామలక్ష్మణులూ నేనూ క్లేశాలలో మునిగి వున్నాము.

సాగర
మధ్యంలో విరిగిపోయిన నావనుండి నీటిలో పడి యీధుతూ అలసిన వానిదశలో వున్న రాముడు ఎప్పటికి ఒడ్డు చేరుతాడో! రాక్షసులందరిని, రావణునీ సంహరించి ఎప్పటికి నా దగ్గరకు రాగలడో! ఈ రెండు మాసాలలోపలే ఆయన రావాలి. అది దాటితే ఈ క్రూరుడు నన్ను విడువడు.

ఆ రాక్షసుని సోదరుడయిన విభీషణుడు నన్ను విడిచిపెట్టమని చెపుతూనే వున్నా, రావణుని చెవి కెక్కడంలేదనీ, వానిని మృత్యువు వెన్నంటి తరుముతున్నదనీ విభీషణుని పెద్దకూతురు అనల వచ్చి చెప్పింది, ఆ పిల్లను స్వయంగా ఆమె తల్లి పంపిందట.

రావణుని అనుచరులలో వృద్ధుడు, ధర్మపరుడు, ధీశాలి, విద్వాంసుడు అయిన అవింద్యుడనే ఆయన కూడా రామునివల్ల రాక్షస నాశనం తప్పదని హెచ్చరించినా వాడు వినడం లేదట.

మారుతీ!

అన్నింటి కంటె నా అంతరాత్మ పరిశుద్దంగా ఉంది. నా భర్త సర్వసద్గుణరాశి. ఉత్సాహం, పరాక్రమం, మృదుహృదయం, సాహసం, సామర్ధ్యం అన్నీ వున్నవాడాయన.

అలనాడు-

జనస్థానంలో మా లక్ష్మణుని అవసరం లేకుండా ఆయన ఒంటరిగా నిలబడి పదునాలుగువేల మంది రాక్షసులను నేల కూల్చినవాడు. ఇంక అయనకు ఎదురు నిలిచేవాడెవడు?

ఇంద్రుని ప్రతాప ప్రభావం శవీదేవికే తెలిసినట్లు మా వారి శక్తి నేనే ఎరుగుదును, అందరికంటె ఎక్కువగా.

ఈ రాక్షస శత్రుజలాన్ని రాముడనే సూర్యుడు తన బాణ కిరణాలతో ఎండబెట్టగలడు, అన్నది జానకి.

అమ్మా! సందేహం లేదు. నేను వెళ్ళి నీ వార్త చెప్పగానే ఆయన వానర భల్లూక సేనలతో వస్తాడు.

అంతవరుకూ ఎందుకమ్మా! నా వీపు మీద కూర్చుంటే యిప్పుడే నిన్ను తీసుకువెళ్ళి ఆయన ముందుంచుతాను. నిన్నేకాదు; రావణసమేతం ఈ లంకానగరాన్ని కదలించి తీసుకుపోగలను. హోమ ద్రవ్యాలను అగ్ని హోత్రుడు యింద్రుని ముందుంచేటట్లు నిన్ను నేను రాముని కర్పిస్తాను.

రావణవధోద్యుక్తులయిన రా
మలక్ష్మణులను నువ్వు యిప్పుడే చూడవచ్చు. మరే ఆలోచనా లేకుండా రావమ్మా చంద్రుని సరసన రోహిణి వలె రాముని ప్రక్క నువ్వు అలరారుతావు. ఈ లంక అంతా కలిసి వచ్చినా నన్ను ఆపలేరు. ఇక్కడకు వచ్చినంత అనాయాసంగా నిన్ను అక్కడకు తీసుకువెళ్ళగలను.

జానకి: హనుమా! చాలా సంతోషంగా వుంది నీ మాటలు వింటుంటే. కాని అంత దూరం నన్నెలా తీసుకుపోగలవు?

నీ వానరత్వం అలా పలికించింది, లేకుంటే ఇంత అల్ప శరీరంతో వున్న నువ్వు!

అని సీతాదేవి పరిహసించగా హనుమంతుడు పరాభవ దుఃఖాన్ని అణచుకుని తన దేహాన్ని సువిశాలం చేసి, మేరుగిరిలా నిలిచాడు ఆయన కన్నులు అగ్నిగోళాలవలె వెలుగుతున్నాయి. గోళ్ళు వజ్రకాంతులతో వున్నాయి.

హనుమ : 
తల్లీ ఇప్పుడు చూశావా నా శక్తి! యీ లంకానగరాన్ని, వన, భవన, ప్రాకార, పర్యత సమేతం దీని రాజయిన రావణునితో కలిపి తీసుకుసోగలను. నన్ను గురించి అనుమానం అనవసరం. నిన్ను తీసుకువెళ్ళి రామ లక్ష్మణులను దఃఖసాగరం నుండి ఉద్దరించడమే నా కర్తవ్యం.

జానకి: నీ శక్తి సామర్ఢ్య బల గమనాలు నాకు తెలుసునయ్యా! నువ్వు అగ్ని వంటి తేజస్సు కలవాడవనీ ఎరుగుదును. అంతటి శక్తిలేని వాడెవడయినా యీ అంతులేని సముద్రాన్ని దాటి రాగలడా?

నువ్వు నన్ను తీసుకుపోగలవు. కాని నీ గమనవేగ తీవ్రతను నేను సహించలేక సృహతప్పి సముద్రంలో పడితే జల జంతువులు నన్ను ఆహారంగా గ్రహిస్తాయి. అందుచేత నేను రాను.

అదీకాక, ఈ వార్త విని రావణుడు 
మహాకాయులయిన రాక్షసులను వదులుతాడు. వారు శూల, ముద్గరాది ఆయుధాలతో నిన్ను ఎదుర్కోవడం తప్పదు. నిరాయుధుడవై నువ్వు వారితో యుద్ధం ఎలా చేస్తావు, ఒకవేళ నువ్వు చేసినా ఆ సమయంలో నేను భయంతో జారిపోవచ్చు. ఆ రాక్షసులు నన్ను తీసుకుపోయినా తీసుకుపోతారు. లేదంటే నరికిపారేయగలరు, లేదా లంకలో బహురహస్య ప్రదేశంలో దాచగలరు.

మరొక మాట -

నీ శక్తితో నువ్వు సర్వరాక్షస సంహారం చెయ్యవచ్చు, కాని, అది ప్రభువయిన రామునికి కీర్తికరం కాదే! అందుచేత నువ్వు ఆయనను తీసుకు రావడమే శ్రేయస్కరం.

నీ మాటవిని బయలుదేరితే, నేను చెప్పిన ప్రమాదం జరిగితే రా
మలక్ష్మణులతోపాటు మీ వానర భల్లూక పతులు కూడా ప్రాణాలు వదులుతారు.

అన్నిటికంటె ముఖ్యమయిన విషయం-

భర్తృభక్తిపరాయణురాలయిన నేను పరపురుషుని స్పర్శను కూడా సహించను.

మరి రావణుడు తెచ్చాడు కదా అనవచ్చు, నువ్వు.

అప్పుడు నా భర్త దూరంలో వున్నాడు. నా మనస్సు నా వశంలో లేదు. ఆ సమయంలో నేను చేయగల్గింది లేదు.

ఇకా ఈ దశకంఠుని బంధుసమేతం సంహరించి నన్ను స్వీకరించడం రామచంద్రునికి కీర్తికరం.

దేవ నాగ గంధర్వులను నిగ్రహించగల అయన ధనుష్పాణియై నిలబడితే-

జ్యలితాగ్ని సదృశంగా మా లక్ష్మణుడు తోడుంటే వారివైపు కన్నెత్తి చూడగలవాడుండడు. కనక - లక్ష్మణ సమేతం మీ వానర భల్లూక సేనానులందరూ రాముని వెంట యిక్కడకు రావాలి. అదే నాకు
సంతోషం కలిగించే పని. మరేదీ నాకు రుచించదు అంది.

కాకాసురుడు

No comments:

Post a Comment

Why worship Kubera when Goddess Lakshmi is present? - లక్ష్మీదేవి ఉండగా, కుబేరుడిని ఎందుకు పూజించాలి?

లక్ష్మీదేవి ఉండగా, కుబేరుడిని ఎందుకు పూజించాలి చాలామంది ఒక సందేహం అడుగుతారు. ధనానికి అధిపతి ఎవరు? లక్ష్మీదేవా... లేక కుబేరుడా? దీనికి సమాధాన...