Thursday, August 20, 2026

Jalakridaabhivarnanamu - జలక్రీడాభివర్ణనము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - జలక్రీడాభివర్ణనము

ఇలా నందనందనుడు రాసక్రీడ చాలించి వడగండ్లతో ఒప్పేమెరుపుతీగవలె చెమటబిందువులతో కూడిన ఆ గోప యువతులతో కూడి జలక్రీడలాడాలనే ఉత్సాహంతో యమునాజలాలలో ప్రవేశించాడు.

అతనికన్నా ముందే గోపికలు కాళిందిలో ప్రవేశించి ఇక్కడ అడుగులోతు, ఇక్కడ మోకాలులోతు, ఇక్కడ నడుంలోతు, ఇక్కడ రొమ్ములలోతు అంటూ ఆ నదినీటిలోనికి దిగారు.

ఆ రమణుల స్తనాలు చక్రవాకాలతోను, కండ్లు చేపలతోను, బొడ్డు సుడులతోను, తలవెండ్రుకలు నాచుతోను పోలి ఉండడంవల్ల వారుకూడా తనవంటివారే అని భావించి కౌగిలించుకోడానికి యమునానది చేతులు చాచినట్లుగా, అలలు ఎదురుగా వచ్చి వారిని స్పృశించాయి.

వారు ఉలికిపడ్డారు. నదిలోని బెగ్గురుపక్షులను పట్టాలని చూశారు. హంసలను తోలారు. అందాలుచిందే ఆ సుదతుల కుచాలకు సాటిరాగలం అని నీటిలో తపం చేస్తున్నాయా అన్నట్లు అక్కడ సంచరించే జక్కవపక్షులను వారు తరిమేశారు. 

ఆ యువతుల చేతుల్లో చలిస్తూ ఉన్న జలాలలో ప్రతిఫలించిన చంద్రుడు అధికమైన ప్రకాశానికి ఉనికిపట్టులుగానున్న వారి వదనాలకు ఓడిపోయి సిగ్గుతో వెలవెలబోతూ, పట్టుదల విడిచి నీటిలో పడి వణకుతున్నాడా అన్నట్లున్నాడు. అలాంటి చంద్రున్నీ చూచి మెచ్చుకుంటూ గోపికలు పరవశించారు.

మకరందం తాగి మదించినతుమ్మెదల రెక్కలగాలికి రేగుతున్న కలువలు మొదలైన పూలయొక్క పుప్పొడి వారు నీటమునిగినపుడు పైకి చెదిరిన నీటి తుంపరలవల్ల అణిగి పోయింది. 

తమవదనపద్మ సౌరభానికి మూగి జుంజుమ్మనే తుమ్మెదలను చూచి వారు భీతి చెందారు. అవి పైకెగిరి పోయేటట్లు అరచేతులతో నీళ్లను చరిచారు. నీలిమేఘాలనుండి రాలిన నీటిధారలవలన తడిసిపోయే అందమైన పూలతీగలవలె ఆ గోపయువతులు శ్రీకృష్ణుడు దోసిటితో చల్లే నీటితుంపరలవల్ల సంపూర్ణంగా తడిసిపోయారు.

గుంపుగుంపుగా చేరి తొక్కిసలాడారు. మాలిన్యం పోయిన మన్మథుని పుష్పబాణాల్లాగా తళతళ మెరుస్తూ ఉన్న దేహాలతో గోపికాస్త్రీలు నీట మునగడానికి ఉత్సహించారు. వారు సరససల్లాపాలతో తుళ్లింతలాడుతూ, చేతుల నిండా నీరు ముంచుకొని తొట్రుపడుతూ గోవిందుని మీద చల్లారు. 

ఒకరికంటె ఒకరు ముందడుగువెేసి శ్రీకృష్ణుడు తమని దాటి పోకుండా అడ్డపడి వినోదించారు. ఆడఏనుగులు తొండాలతో చిమ్మిన నీటి తుంపరలతో తడిసిన మదపుటేనుగువలె శ్రీకృష్ణుడు గోపసుందరులు పైకి చిమ్మిన జలధారలతో తడిసి ముద్దయ్యాడు.

రేపల్లె యువతులు తమ చేతులతో హరిమీదికి ఎర్రకలువలను, తెల్లకలువలను విరజిమ్మారు. ఆ పూలపుప్పాడి ఆయన శరీరానికి అంటుకొని విభూతి ధరించిన పరమశివునివలె భాసించాడు.

ఆ సుందరులు చిగుళ్లవంటి తమ హస్తాలతో తామరపూలరేకులను తమప్రాణనాథుని మీదికి వెదజల్లారు. అప్పుడు కృష్ణుడు వేయికన్నుల దేవేంద్రుడుగా ప్రకాశించాడు.

ఆ రమణులు కుంకుమ అలదిన కుంభాలవంటి స్తనాలతో కృష్ణుణ్ణి కాగిలించుకోగా, అతడు బాలభాస్కరునివలె ప్రకాశించాడు. ఆ కాంతలు తమ కడగంటిచూపులను నాథునిమీద ప్రసరింపజేయగా, అతడు తుమ్మెదగుంపులు ముసిరిన పచ్చగంధపుచెట్టువలె విరాజిల్లాడు. 

ఆ పూబోండ్లు తమ చిరునవ్వులసిరులను తమ ప్రియునిపై పడేటట్లుచేయగా కృష్ణుడు వెన్నెలవెలుగులతో విలసిల్లే అంజనాద్రివలె విలసిల్లాడు తరువాత

అప్పుడు శ్రీకృష్ణుడు సుఖోన్నతుడైై, గోపయువతులతో పాటు యమునానదినీటినుండి వెలికివచ్చాడు. ఆభరణాలు ధరించి, మంచి గంధం అలదుకొని, పీతాంబరాలు ధరించి అలంకరించుకొన్నాడు. గజరాజు ఆడఏనుగులతో క్రీడించిన విధంగా పొదరిండ్లలో, చిక్కనిచెట్ల నీడలలో, పూలశయ్యలమీద వారితో క్రీడించి సంతోషపెట్టాడు.

ఈ విధంగా గోవిందుడు శరత్కాలంలో గోపికలతో వీర్యస్ఖలనం చేయకుండా రమించాడు అని చెప్పగా విని, శుకయోగీంద్రునితో పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

మహాత్మా పరమేశ్వరుడు ధర్మానికి కర్త. ధర్మానికి భర్త. ధర్మమే స్వరూపంగా కలవాడు. మంచిషనులు చేసేవాడు. ఆయన అధర్మాన్ని శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి భూమండలంలో జన్మించినవాడు గదా! అలాంటప్పుడు, ఆ భగవంతుడే ఎలాంటి ధర్మమని పరసతులను కూడాడో దయచేసి నాకు చెప్పండి.

ఇలా పరీక్షిన్మహారాజు అడుగగా, శుకమహర్షి ఇలా అన్నాడు.

సర్వభక్షకుడైన అగ్నిదేవుడు విశ్వంలోని సమస్తవస్తువులను భక్షించికూడా దోషి కాడు. అలాగే తేజోవంతులైన చంద్రఇంద్రాదులు దోషంచేసి కూడా దోషస్థానాన్ని పొందరు.

(సర్వప్రాణులను హింసించి కాల్చి చంపడం అగ్నిచేసే పాపం. ఇది తినదగింది ఇది తినదగనిది అని కూడా చూడకుండా అన్నీ భక్షించడం దోషం.

గురుపత్నీగమనం చంద్రునిదోషం. చంద్రుడు తనగురువైన బృహస్పతి భార్యతో సంగమించి ఆ పాపం చేశాడు. పరపత్నీగమనం దేవేంద్రుని దోషం. అహల్యను కామించి ఆమెభర్తరూపంలో వచ్చి అనుభవించిన దోషం అతనిది.)

నరేంద్రా! ఈశ్వరుడు కానివాడు పరకాంతను తలచి ఎలా జీవించగలడు? గౌరీశ్వరుడు తప్ప ఇతరుడు లోకభయంకరమైన విషం తాగి జీవించగలడా?

(సర్వాత్మకుడైన దేవునికి ఏదిచేసినా చెల్లుతుంది. ఇతరులకు అది చెల్లదు. ఈశ్వరుడు శాస్త్రవశ్యుడుకాడు. శాస్త్రోక్త ధర్మాలను ఉల్లంఘించినా వారికి అది దోషం కాదు. శాస్త్రవశ్యుడు, కర్మవశ్యుడు అయిన సామాన్య మానవుడు దోషంచేస్తే అనుభవించవలసిందే!)

ఈశ్వరుల మాటలు ఒకటే సత్యం. అదే ప్రమాణం. వారు చెప్పిన మార్గాన్నే పెద్దలు నిత్యం అనుసరిస్తారు. ఒకొక్కప్పుడు ఈశ్వరుల నడవడి వారిమాటలకు విరుద్ధంగా ఉంటుంది. ఒకప్పుడు సత్యంగాను, మరొకసారి అసత్యంగాను ఉంటుంది. వారి నడవడి అంతా సత్యమని భావించి అనుసరించరాదు.

నరేంద్రా! మునులు ఏ దేవునియొక్క పాదపద్మాల పుప్పొడిని, ధ్యానించడంవల్ల పొందిన యోగనిరూఢత్వంచేత అధికులై యజ్ఞాదిమహాకర్మలు చేయకుండా, సంసారబంధాలు వదిలించుకొని అతిశయిస్తూ ఉంటారో- అలాంటి నిత్యశుభస్వరూపుడైన భగవంతుడు ఎలా నడచుకొంటే నేం? ఏమి చేసినా అతనికి ఎలాంటి బంధాలు ఉండవు.

గోపాలకులలో, గోపికలలో, సర్వప్రాణులలో అంతర్యామియై సంచరించే సర్వమయుడైన పరమాత్మకు పరాంగనలు ఎవరు? అన్నీ తానే కాబట్టి అలా క్రీడించాడు.

అని చెప్పి శుకమునీంద్రుడు మళ్లీ పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు. వెళ్లడం ఇష్టంలేకున్నా తెల్లవారు జామున గోపికలు తమ ఇండ్లకు వెళ్లారు. కృష్ణమాయామోహితులైన గోపాలురు గోపికలపై కోపం చూపలేకపోయారు.

(బ్రాహ్మీముహూర్తము= అరుణోదయానికి ముందు నలబై ఎన్నిది నిముషాలకాలం. (రెండు గడియలకాలం))

గోపాలకృష్ణుడూ, గోపకాంతలూ సలిపిన రాస క్రీడను ఏ నరుడు వర్ణిస్తాడో, ఏ నరుడు దర్శించి నిశ్చయించుకొంటాడో అతడు ఆ ప్రసంగంవల్ల సమస్త హృదయతాపాలనుండి విముక్తుడౌతాడు.

సర్పరూపియగు సుదర్శనుండను గంధర్వుని శాపవిమోచనము


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Srikrishnudu Kuberabhatundagu Shankhachuudundanu Guhyakuni Samharinchuta - శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట మరొక వెన్నెలరాత్రి బలరామకృష్ణులు ప్రకా...