Saturday, August 8, 2026

Numerology - Number 1 - న్యూమరాలజీ - 1వ సంఖ్య

న్యూమరాలజీ - 1వ సంఖ్య

1. గ్రహము : సూర్యుడు
జన్మదినం తేది సంఖ్య - 1, 10, 19, 28

1వ సంఖ్య క్రిందకు వచ్చేవారు:
ప్రాచ్య పాశ్చాత్య రేఖా శాస్త్రజ్ఞులు, సంఖ్యా శాస్త్రజ్ఞులు వీరందరూ ఇంగ్లీషు నెలలు, తేదీలు ఆధారంగా చేసుకొని జీవిత ఫలితాలు చెబుతుండడం వల్ల సంఖ్యాశాస్త్రంలో ఇంగ్లీషు తేదీలు, నెలలు వ్యవహారంలో ఉన్నాయి.

జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలోనైనాసరే 1, 10, 19, 28 ఈ తేదీలలో పుట్టినవారిని అంటే జనన సంఖ్య 1 సంఖ్య గల వారని పిలువబడతారు.

ఇచ్చట చెప్పిన 1, 10, 19, 28 తేదీలలో
1వ తేది 1 సంఖ్యకు చెందిందనే విషయం స్పష్టముగానే తెలియుచున్నది.

10వ తేదీలో సున్నకు ప్రత్యేకంగా విలువ లేదు. అంచేత సున్న తీసివేస్తే ఒకటి మాత్రమే మిగులుతుంది.

19వ సంఖ్యను 1 + 9 అని కూడితే 10 వస్తుంది. ఆ 10 లో ఉన్న సున్న తీసివేస్తే 1 మిగులుతుంది.

అలాగే, 28 అనేదాన్ని 2 + 8 = 10 సున్న తీసేస్తే మిగిలేది 1 మాత్రమే.

అందుచేత, 1, 10, 19, 28 ఈ నాలుగు తేదీలలో పుట్టినవారు ఎవరైనా సరే, వారందరూ ఒకటి సంఖ్య వారని తెలుసుకోవాలి.

దీనితో పాటు 1వ నెంబరు అదృష్ట సంఖ్య లేదా ఫేట్ సంఖ్యగా లేదా డెస్టినీ సంఖ్యగా కలవారు కూడా ఈ 1వ నెంబరు క్రిందకు వస్తారు.

దీనితో పాటు ఒకరి పేరులోని అక్షరాలకున్న విలువల సమష్టి సంఖ్య 1గా కలవారు కూడా ఈ 1వ నెంబరు క్రిందకు వస్తారు.

(1) పుట్టిన తేదీ సంఖ్య.
(2) పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటి సమష్టి సంఖ్య.
(3) ఒకరి పేరులోని అక్షరాలకున్న విలువల సమష్టి సంఖ్య.
ఈ మూడింటిలో 1వ నెంబరు కలవారు ఈ సంఖ్య క్రిందకు వస్తారు.
పైన చెప్పిన మూడు విధానాలలో సమష్టి సంఖ్య సాధించవలసిన విధానాన్ని ముందు విభాగంలో చెప్పడం జరిగింది.

1వ సంఖ్యకు అధిపతి సూర్యుడు.
1వ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సమస్త గ్రహాలకు అధిపతి సూర్యుడు. సమస్త సృష్టికి ప్రాణికోటికి మూలకారకుడు, ఆధార భూతుడైన సూర్యుడు 1వ సంఖ్యకు అధిపతి. వీరి మీద సూర్యగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే వీరిని సూర్య జాతకులు అని పిలుస్తున్నాము.

సూర్య జాతకులకు ఆత్మాభిమానం, పట్టుదల కార్యదీక్ష చాల ఎక్కువ. వీరు వారి ఆత్మ విశ్వాసాన్ని, పనినే నమ్ముకుంటారు. వీరిది ప్రాక్టికల్ లైఫ్. అందువల్ల వీరు శ్రమనే నమ్ముకొంటారు. వీరు శ్రమచేస్తే సూర్యుని వలె వెలుగుతారు.

వీరు మంచి బుద్ధికుశలత, మంచి తెలివితేటలు, మంచిసృజనాత్మకత, గొప్ప ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఉపయోగకరమైన జ్ఞానం, సమాచారాన్నే ఇష్టపడతారు. ప్రకాశవంతమైన జీవితం గల వీరు నిజాయితీ పరులుగా, గంభీరంగా, హుందాగా జీవించుటకే ఇష్టపడతారు. వీరి వేషభాషలు, నడవడిక ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

వీరు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. సునిశిత బుద్ధిగల వీరు ఏ పనిలో చొరబడినా ఏకాగ్రతతో ఆ పనిని పూర్తి చేస్తారు. కనుక వీరి ప్రయత్నములు నిరాటంకంగా విజయం సాధిస్తాయి. వీరు శారీరక శ్రమ కంటే మానసికంగా కష్టించి శ్రమ చేయడానికే ఇష్టపడతారు. వీరు ఏ పనిలో చేసిన బాగా ఆలోచించిన తరువాతే చేస్తారు. అలాగే మొదలుపెట్టిన కార్యం నుండి సగంలో వెనుదిరుగుట అన్నది వీరి విషయంలో జరుగదు. ఎలాంటి ఆటంకాలకు అయినా వీరు భయపడరు. వాటిని ఇంకా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు.

సర్వ శ్రేఘ్టులు
సూర్యాధిక్య ఉన్నందున ఇల్లు, వాహనం, వృత్తి వంటివి అన్నీ శ్రేష్టముగా ఉంటాయి. కొత్త విషయాలను కనుగొనే సామర్థ్యం వీరికి ఉంటుంది. జీవిత సుఖాలనన్నిటిని అనుభవిస్తారు. విద్యా జ్ఞానము కంటే లోకజ్ఞానం, అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంటాయి.

నిజాయితీ, క్రమశిక్షణ:
దృఢమైన మనోనిశ్చయం, కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు ఉద్యోగ జీవితంలో నిజాయితీ మరియు క్రమశిక్షణ కలిగి ఉంటారు.

కపటం, నయవంచన, రహస్యాలకు వీరు ఎంతో దూరంగా ఉంటారు. మనస్సులో తోచినవి అరిమరికలు లేకుండా బయటకు చెప్పి విరోధం కూడా తెచ్చుకుంటారు.

వీరి స్నేహాలు, విరోధాలు ఎల్లప్పుడూ బట్టబయలే. వీరు తమంతట తాముగా స్నేహితులను వెదకుట జరుగదు. వీరిలోని స్నేహగుణం, ఇతర సద్గుణాలు ఇతరులను వీరి వద్దకు ఆకర్షిస్తాయి. అలా ఎందరో వీరి స్నేహాన్ని, సహాయాన్ని కోరుతూ వీరి దగ్గరకు రావటం జరుగుతుంది.

లక్ష్యసాధనలో ముందుంటారు. అందుకే జీవితంలో ముందుకుపోయే కొలది వీరికి అదృష్టం పెరుగుతుంది. విజయాలను సాధిస్తారు.

మానసిక శక్తి ఎక్కువ:
ఈ అంకె అధిక్యత గల స్త్రీ పురుషులు సువాసన గల ద్రవ్యాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. ఎటువంటి గొడవల నైనా సద్దుమణిగేట్టు చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు వెళ్ళే చోట కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తమకంటూ ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉంటారు. హీనమైన కార్యాలను ద్వేషిస్తారు. తమ భావాలను అణచు కొగలిగిన మానసిక శక్తి వీరికి ఉంటుంది.

ఎవరికీ లొంగరు:
నాయకత్వ లక్షణాలు ఉండుటచే తాము చేపట్టే ఏ కార్యక్రమాల లోనైన, చొరవ, ధైర్యం చూపి ముందుకు దూసుకుపోయే గుణం కలిగి ఉంటారు.

పెద్ద పెద్ద వ్యాపారాలు, భారీ పరిశ్రమలు నడపకలిగే శక్తి, సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు ఇంట, బయట అందరి మీద పెత్తనం చెలాయిస్తారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఆత్మాభిమానం ఎక్కువ.

వీరు ఎవరికీ లొంగటానికి సిద్ధం కారు. తమదే పైచేయిగా ఉండాలనుకుంటారు. చేసే ఉద్యోగంలో కూడా పై అధికారి ఏ మాత్రం కించపరిచినా తట్టుకోలేరు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయటానికి కూడా సంసిద్ధులవుతారు.

వీరికి ముఖస్తుతి అంటే ఏమిటో తెలియదు. ప్రతి విషయంలో వీరు నిర్మొహమాటంగా వ్యవహరించటం సర్వసాధారణం.


వినయ విధేయతలు:
వీరు మేధావులుగా, నాయకులుగా, మార్గదర్శకులుగా ఎదుగుతారు. మంచి నిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి ఉంటారు.

వీరు నిజాయితీని గౌరవిస్తారు. మోసాన్ని కపటాన్ని, నటనను ఇష్టపడరు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి విజ్ఞులుగా వ్యవహరించటం మనం గుర్తించగలం. కాబట్టి వీరు అనేక విషయము లను ఎంతో సులభముగా గ్రహించగలరు.

వీరు ఎదుటివారి మాటలను బట్టి మనుష్యులను అంచనా వేయగలరు. కొద్ది ప్రయత్నంతోనే గొప్ప వక్తలుగా, గొప్ప రచయితలుగా పేరు పొందగలరు. వీరిలో కొందరు అన్నీ తెలిసినా, ఏదీ తెలియనట్లు ఎంతో వినయంగా ఉంటారు. వీరు గొప్ప పేరు గడించాలనో లేక ధనాశతోనో ఏ పనిచేయరు. వీరు వంశపారంపర్యంగా వ్యాపారులైనా సరే, ఎంతో న్యాయంగా వ్యాపారం చేస్తారే తప్ప అన్యాయంగా అధిక లాభాలు ఆర్జించాలని అనుకోరు.

సంపాదన: వీరు అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. వీరి సంపాదన అంతంత మాత్రంగా ఉంటుంది. డబ్బుల కొరత వీరిని ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. అవసరానికి సరిపోయే ధనం వీరికి ఉండదు.

వీరికి సుమారు 40 సంవత్సరములు దాటిన తరువాతనే వృత్తి వ్యాపారాలలో స్థిరత్వము ఏర్పడి ఆర్థికంగా కొంత పుంజుకొంటారు. అప్పటి వరకు ఆర్థికంగా నిలకడ లేని పరిస్థితి కొనసాగుతుంది.

వీరికి ధనం దానంతట అదే రావాలి. అంతేగాని వీరు దానిని వెదకి సంపాదించలేరు. వీరు పేరు ప్రతిష్ఠలు వచ్చేవరకు విసుగు, విరామం లేకుండా శ్రమిస్తారు. సామాన్యంగా వీరిలో సోమరులు ఉండరు.

తాత్విక దృక్పథం కలిగి ఉంటారు:
వీరికి తాత్విక దృక్పదం ఉంటుంది. వీరు చేయాలనుకున్న పనులను అదృష్ట దినాలలోని సూర్యోదయంలో కానీ, సూర్యాస్తమయ సమయం లో కాని ప్రారంభించడం లేదా చేయడం జరిగితే వాటిలో సంపూర్ణ విజయం సాధించగలరు. కళల పట్ల మిక్కిలి ఆసక్తి ఉంటుంది.

పరుల సొమ్ముకు ఆశపడరు:
వీరికి ఎంతో మందితో పరిచయం ఉంటుంది. అయినా కొద్దిమంది మాత్రమే వీరికి స్నేహితులుగా ఉంటారు. అలా ఆలోచించి ఎంచుకున్న స్నేహితులకు వీరు ఎంతైనా మేలు చేస్తారు. వీరు ఎన్నడూ పరుల సొమ్ముకు ఆశపడరు.

రాజకీయాల్లో తిరుగు ఉండదు:
రాజకీయాలంటే ఆసక్తి. వీరిని మహా అదృష్టవంతులుగా మార్చేది రాజకీయ రంగమే. వీరిని రాజ్యాంగచక్ర 'దత్తపుత్రులు' అని అంటే అతిశయం కాదు. సూర్యుడు వీరికి పరిపాలించే అధికారం ఇస్తున్నాడు. ఉన్నత రాజ్యాంగ పదవులలో వీరు స్థిరంగా ఉంటారు.

వేదాంత విషయాల ఆలోచన:
ఒంటరిగా ఉన్నప్పుడు వేదాంత, ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. లోకాతీత విషయాలను గ్రహించడానికి ప్రయత్నిస్తారు. విశ్వాసమే వీరి ఆయుధం. నూతన విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు.

వినోదయాత్రలపై ఆసక్తి:
వీరు ఇంటిని విలాస వస్తువులతో అలంకరిస్తారు. ఎల్లప్పుడూ వీరు పరిశుభ్రమైన తెల్లని వస్త్రములను ధరిస్తారు. వీరు ప్రకృతి ఆరాధకులు కాబట్టి అందమైన కొండ ప్రదేశాలంటే వీరికి ఎక్కువ ఇష్టం. అంతేగాక, వీరికి ప్రపంచం చుట్టివచ్చే వినోద యాత్రలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటికి వీరు ఎంత ఖర్చు చేయవలసివచ్చినా ఎంత మాత్రం వెనుకాడరు. కొండలు, అడవులు, సెలయేళ్ళు వంటి ప్రకృతి దృశ్యాలను చూడటం అంటే ఎంతో ఆసక్తి.


సూర్యాధిక్యతలో జన్మించిన వీరు ప్రతిరోజూ ఉదయం కొన్ని నిమిషాల పాటు సూర్య కాంతిలో గడపటం వల్ల సూర్య ఆకర్షణ శక్తి శరీరంలో వృద్ది చెంది మనోబలం పెరుగుతుంది. రోగాలను పోగొడుతుంది. మెదడులో రసాయన మార్పులు జరిగి బుద్ధి కుశలత పెరిగి మేధావులవుతారు.

తగిన వృత్తి
వీరు దీర్ఘకాలంపాటు ఒకే రకమైన వృత్తి చేయడానికి ఇష్టపడరు. వృత్తిలో మార్పును కొత్తదనాన్ని కోరుకుంటారు. వీరికి విద్యుత్, కంప్యూటర్ రంగాలు అనుకూలంగా ఉంటాయి. అగ్ని సంబంధమైన పరిశ్రమలు, సూర్యుని ఆధారంగా సాగే పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి. ఎగుమతి, దిగుమతి సంబంధమైన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ప్రమోటర్లుగాను, సర్వేయర్లుగాను, ఫోటోగ్రాఫర్లగను, కమీషన్ ఏజంట్లు గాను రాణిస్తారు. రత్నాలు, ఆభరణాలు, పరిశోధన (రీసెర్చ్) ప్రధానంగా సాగేవృత్తులలోను రాణిస్తారు. టీచర్స్, రైటర్స్, మ్యూజికల్, సైన్స్, లైబ్రరి యన్ వృత్తులలో బాగా రాణిస్తారు.

అస్ట్రోలజర్స్, వాస్తు, న్యూమరాలజిస్ట్స్ రంగాలలోనూ బాగా రాణిస్తారు. పొలిటికల్ లీడర్స్, టి.వి. మరియు సినిమా ఇండస్ట్రీ, రంగాలు బాగా రాణిస్తాయి. ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, డిజైనర్స్, జ్యూయలరి మొదలైన రంగాలు బాగా రాణిస్తాయి.


అన్ని ప్రభుత్వ రంగాలలోని వారికి జయకరంగా ఉంటుంది. కరుణ, దయ, చక్కగా మాట్లాడుటలో సమర్థులగుటచే మత సంబంధ కార్యాలలో ఆసక్తి ఉంటుంది. అర్హత, శ్రమ, నిజాయితీకి విలువనిస్తే వీరు అన్ని రంగాలలో పైకి వస్తారు. సూక్ష్మగ్రాహులు కావటం చేత వీరు చూపులతోనే వ్యాధులను పసికట్టగలరు. కాబట్టి వైద్యవృత్తి వీరికి తగినది.

హార్ట్, 'ఐ' స్పెషలిస్ట్గా ప్రత్యేకంగా రాణించగలరు. పుట్టినతేది, నెల, సంవత్సరం కలిపితే వచ్చే సంఖ్య 9 అయితే వీరు శస్త్ర చికిత్సా నిపుణులు కాగలరు. సివిల్ సర్వీసెస్ రంగాలలో కూడా బాగా రాణిస్తారు.

వీరు ప్రకృతి ఆరాధకులు కాబట్టి భావుకులు అయి ఉండటం చేత కవులుగా కూడా కావచ్చు. వీరు నిజాయితీపరులు కనుక అన్నిటికీ తలవంచిపోలేరు. కష్టనష్టాలకు కలవరం చెందుతారు.

వ్యాపారంలో సందర్భానుసారం ప్రణాళికలను మార్చవలసి వస్తుంది. అది వీరికి చేతకాదు. కాబట్టి వ్యాపారం వీరికి పనికిరాదు. రచయితలుగా పేరు పొందగలరు. వీరు నచ్చిన శిల్ప, చిత్ర, సంగీత, జ్యోతిష, యోగ కళలో దేనినైనా వృత్తిగా చేపట్టవచ్చు.

సహకరించే వ్యక్తులు:
1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారికి అదే సంఖ్యవారు సామాన్యంగా సహాయం చేస్తారు. 4 సంఖ్య వారు జీవితాన్ని సంస్కరించే సహాయాలు మరియు 8 సంఖ్యవారు చాలాకాలం కొనసాగే నిరంతర సమాయం చేస్తారు. 2/7 సంఖ్యలవారు తాత్కాలిక సహాయం చేస్తారు. అయితే వీరి సహాయం హఠాత్తుగా ఆగిపోవచ్చు.

కుటుంబ జీవితం :
వీరు సాధారణంగా అందం వైపు ఆకర్షింపబడుటచే అందమైన వారినే వివాహం చేసుకుంటారు. వీరిలో 19వ తేదీన జన్మించినవారిలో పలువురు అందరమైన వారిని ప్రేమించి, ఎందరు అడ్డు చెప్పినా వినక, వివాహం చేసికొని సుఖంగా జీవిస్తారు.

28వ తేదివారు ప్రేమించినా వీరిలో మనోబలం తక్కువగా ఉండటం వలన, ఇతరులు వీరి ప్రేమకు అడ్డు తగులుతారు. ఇన్ని ఆశలు ఉన్నా 1వ సంఖ్య గల వీరికి అందమైన తృప్తికరమయిన జీవిత భాగస్వాములు దొరకుట కష్టమే. చాలా మందికి సంసార జీవితంలో చిక్కులు ఏర్పడ తాయి.

గ్రహప్రభావం బాగుంటే వీరి మనసుకు నచ్చినట్లే సర్దుకుపోయే గుణాలున్నవారే వీరితో జీవితం పంచుకుంటారు. పట్టుదల తగ్గించుకుంటే వీరికి వివాహ జీవితం సుఖమయంగా ఉంటుంది.


వివాహ సంబంధాలు:
1వ సంఖ్య వారు ఒకరికి అణగి ఉండే స్వభావంవారు కారు. కాబట్టి వీరు 1వ సంఖ్యలో పుట్టినవారిని వివాహమాడరాదు. పట్టుదలలు వీరి జీవితాన్ని ఎంతో మనస్తాపాన్ని గురిచేస్తాయి. వీరు 2,4,5 తేదీలలో పుట్టినవారిని వివాహమాడవచ్చు. 8 తేదీలవారిని కూడా వివాహం చేసుకోవచ్చు. 8వ తేదీన పుట్టినవారిని వివాహం ఆడితే సుఖసౌఖ్యాలు కలుగుతాయి.

ఎందుకంటే 8 సంఖ్యవారు 1 సంఖ్యవారిని మనస్ఫూర్తిగా ప్రేమించి ఆరాధిస్తారు. వారు చెప్పినదంతా చేస్తూ వారిని తృప్తిపరచటమే వీరి లక్ష్యం. 1 సంఖ్యవారు 8 సంఖ్యవారిని ఆదరంగా చూసుకుంటారు. చెట్టుని అల్లుకొనే తీగవలె 8 వారు 1 వారితో సుఖ జీవితం కొనసాగిస్తారు.

సామాన్యంగా 1 సూర్యుని సంఖ్య కావటంచేత వీరి వివాహ జీవితంలో సమస్యలు సహజమే.
ముహూర్తబలం అధికంగా ఉంటే చక్కని దాంపత్యముంటుంది.

1 సంఖ్యవారికి సంతానభాగ్యం ఉంటుంది. వీరు అన్నివిధాల సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు.

దుస్తులు మరియు రంగులు:
1 సంఖ్యవారికి మంగళకరమైనది, పసుపురంగే శ్రేష్ఠమైనది. పీతాంబరాలు అంటే పసుపు రంగు దుస్తులు ధరిస్తే అందం రెట్టింపవుతుంది. ఈ రంగు వీరికి జయం కలిగిస్తుంది. తెలుపు కలిసిన లేత పసుపుపచ్చ రంగు నుండి, ముదురు పసుపురంగు వరకు అన్నీ వీరికి అదృష్టకరమైన రంగులే.

లేత ఎరుపు, లేత నీలం కూడా మంచివే అయితే నలుపు, వక్కరంగు దురదృష్టకరమైన రంగులని వీరు గుర్తించాలి. తాము ధరించే వస్త్రాల అంచులకు కూడ ఈ రంగు వాడకుండా జాగ్రత్త తీసుకోవటం మంచిది.

సూర్యుని ప్రభావం తక్కువ ఉన్న వ్యక్తుల లక్షణాలు:
ఎవరిలోనైనా పైన పేర్కొన్న గుణములు ఉంటే వారిపై సూర్యుని ఆధిక్యత ఎక్కువగా ఉందని మనం గ్రహించవచ్చు. ఎవరిపైనైనా సూర్యుని ప్రభావం తక్కువగా ఉంటే, వారిలో క్రింద పేర్కొన్న స్వభావం కనిపిస్తుంది.

ఇతరుల మెప్పుకోసం ప్రయత్నం:
ఇతరులు చెప్పింది, వినకపోవడం, స్వార్థ బుద్ధి, మొండి వాదన, కిందివారిపై అనవసరపు పెత్తనం చెలాయించడం, సహనం లేకపోవడం. నిరంకుశత్వం, అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించడం. మూర్ఖపు పట్టుదల, అహంభావం. తమ ఉన్నతి కోసం ఇతరుల వినా శానికి కూడా ప్రయత్నించడం, నేనే నంబర్ 1 అనే అహంభావం కలిగి ఉంటారు.

ఇలాంటివారు ఇతరుల మెప్పు కోసం అనవసరపు ఖర్చులు పెడతారు. అంతేకాక, కొంచెం కూడా అణకువ లేకుండా, ప్రపంచంలో అన్నీ తమకే తెలిసినట్లు ఉంటారు. తాము చేయని పనులను కూడా తామే చేసామని చెప్పుకుంటారు. ఇలాంటివారు జీవితంలో అనేక చిక్కులు ఎదుక్కోవటం మాత్రమే కాక, తమ ప్రయత్నాలలో తరచుగా అపజయాలు పొందుతూ ఉంటారు.


అపఖ్యాతికి జంకుతారు:
వీరిలో ఎంతగా సూర్యబలం తగ్గినా, ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచన వీరికి రాదు. వీరు అపఖ్యాతికి జంకుతారు. ఆత్మబలం లోపిస్తే ఆ పరిస్థితులలో వీరు ఇతరుల మాటకు కట్టుబడి జీవిస్తారు. ఇటువంటి వారిని మనం గుమాస్తా ఉద్యోగాలలో చూడవచ్చు.

శారీరక లక్షణాలు:
సూర్యుడు హృదయం, వీపు, వెన్నెముకకు అధిపతి. గంభీరంగా కనపడే వీరు చాలామటుకు సామాన్యమైన ఎత్తుగలవారే అయి ఉంటారు. వెడల్పాటి నుదురు, విశాలమైన కండ్లు కలిగిన వీరు చూపు విషయంలో పసివారిలా అమాయకంగా ఉంటారు. వీరి శరీరం రాటుదేలి ఉంటుంది. మెడ బలిష్ఠంగా ఉంటుంది. వీరిలో స్త్రీలు సాధారణంగా బాగా బలిష్టంగా ఉంటారు.

ఆరోగ్య సమస్యలు:
ఈ సంఖ్యల కలవారు కళ్ళజోడు ధరించటం సహజం. ముఖ్యంగా 10వ తేదీన పుట్టినవారిలో 100 మందిలో 99 మంది కళ్ళజోళ్ళతోనే కనిపిస్తారు. వీరు అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కనుక తరచుగా కళ్ళ అద్దాల ఫ్రేములు మారుస్తూ ఉంటారు.

వీరిలో చాలామందికి చిన్నప్పుడే కంటిచూపుకు సంబంధించిన అనా రోగ్యాలు ఉంటాయి. ఎండను భరించలేరు. వీరిలో 40 ఏళ్లకు పైబడిన వారిలో రక్తప్రసరణకు సంబంధించిన వ్యాధులు కనిపిస్తాయి.


ప్రకృతి వైద్యాన్నే ఇష్టపడతారు:
వీరు భోజన ప్రియులైనా మితంగానే భుజిస్తారు. అంతేకాక, భోజన పదార్థాలను గురించి కూడా పరిశోధిస్తారు. వీరిలో పైత్య రసం తక్కువగా ఉండుట చేత ఆకలి లేకుండా భోజనం తీసుకుంటే సరిగా జీర్ణం కాదు.

వీరు ఆహారంలో, స్నాన తైలంలో పొన్నగంటికూర చేర్చుకోవటం మంచిది. వీరు సామాస్యంగా ప్రకృతి వైద్యమునే నమ్ముతారు. డాక్టర్ల వద్దకు వెళ్ళుటకు ఇష్టపడరు.

అదృష్టం కలిగించే సంవత్సరాలు:
1వ నంబర్ వారికి 22 లేక 34 సంవత్సరాలలో అదృష్టం కలుగుతుంది. వీరికి అంతకు ముందు కష్టాలు ఎదురుకావొచ్చు. అలాగే చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది.

కానీ 22 ఏటలోకి అడుగుపెట్టగానే అదృష్టం కలిసి వస్తుంది. ఒకవేళ అప్పుడు రాకుంటే 34 ఏళ్లప్పుడు అదృష్టం వీరికి కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులు జరుగుతాయి.


అదృష్ట తేదీలు:
వీరికి ప్రతినెలలో 1, 4, 10, 19, 22, 28, 31 తేదీలు అదృష్ట సంఖ్యలు. ఈ తేదీలలో సంతోషాన్ని కలిగించే జరుగుతాయి. వశీకరణశక్తి పెరుగు తుంది. దీనితో వీరు తమ పనులను నిర్విఘ్నంగా సాధించుకోగలరు.

పైన చెప్పిన తేదీలలో ముఖ్యమైన పనులు చేయుట అలవాటు చేసుకుంటే, అపూర్వ ఫలితాలు శీఘ్రంగా పొందగలుగుతారు. వీటిలో 28 మాత్రం దీర్ఘకాలం నిలిచే ఫలితాలు ఇవ్వలేదు.

లక్కీ వారాలు : ఆది, సోమవారాలు.

లక్కీ కలర్స్ : పసుపు, కాషాయం, గులాబి, ఆరెంజ్, లేత నీలిరంగు, తెలుపు, పర్పుల్.

నప్పని నెంబర్స్: 8, 6, 17, 26.

నప్పని రంగు : నలుపు,

పూజించవలసిన దేవతలు: శివుడు, నారాయణుడు.

పఠించవలసిన మంత్రం: సూర్యదేవునికి అనుకూలంగా ఆదివార వ్రతము చేయటం, ఆదిత్య హృదయం ప్రతీరోజు పఠించడం మంచిది.

దానం చేయవలసినవి: గోధుమలు, ఎర్రని వస్త్రములు, ఎర్రని పువ్వులు, చందనం.

10వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు:
వీరు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి, ఓర్పు, శాంతి స్వభావం కలిగి ఉంటారు. స్వతంత్రేచ్చ కలిగి ఉంటారు. మంచి ప్రవర్తన, ప్రేమాభిమానాల వలన స్నేహితులు ఎక్కువగానే ఉంటారు.

చురుకైన బుద్ధి, సహకార గుణం వలన శత్రువులు మిత్రులుగా మారతారు. ఏ పనినైన ఒక ప్రణాళికా బద్ధంగా చేసి విజయం సాధిస్తారు. మనసులోని భావాలను బయటకు తెలియనీయరు. వినూత్నంగా ఏదైనా చేయాలని చూస్తారు.

వీరితో వచ్చిన ఇబ్బందల్లా తాము పట్టిన కుందేటికి మూడు కాళ్ళు అంటారు. వీరి జీవితంలో వడిదుడుకులు ఉంటాయి. కనుక స్పెక్యులేషన్ వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. వీరికి కళ్ళకు సంబంధించిన సమస్యలు వలన కళ్ళకోడు ఉండే అవకాశం ఎక్కువ.

వీరు రాజకీయాలు, రచనలు, కళలు, టి.వి.సినిమా, పరిశ్రమల రంగాలలో బాగా రాణిస్తారు. వీరు ప్రేమ వ్యవహారాలలో చిక్కుకునే అవకాశం ఎక్కువ. ప్రేమ వ్యవహారాలలో కొంతమందికి చేదు. అనుభవాలు ఎదురుకాగలవు.


19వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు:
19వ తేదీన జన్మించిన వారు దృఢ నిశ్చయం కలిగి, లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. వీరికి అధికారం, అదృష్టం, ప్రజాదరణ లభిస్తుంది. వీరికి ధైర్యం, మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి.

వీరికి ఎవరికి లోబడి పనిచేయడం ఇష్టం ఉండదు. ఉన్నతమైన భావాలు కలిగి, ఇతరులకు సమాయం చేసే గుణం కలిగి ఉంటారు. తను బ్రతుకు ఇతరులను బ్రతకనివ్వు అనే గుణం కలిగి ఉంటారు.

ఆత్మ విశ్వాసం ఎక్కువ. సాధారణంగా వీరు దేనికీ రాజీ (కాంప్రమైజ్) పదరు. ఇతరుల సంక్షేమ కొరకు పాటుపడతారు. వీరికి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలుంటాయి. మంచి పరిపాలనా దక్షత కలిగి ఉంటారు. వీరు చాలా మొండివారు. అనుకున్నది సాధించే వరకు విశ్రాంతి తీసుకోరు.

వీరు డబ్బుకంటే పేరు ప్రఖ్యాతలకు విలువనిస్తారు. వీరు స్వేచ్ఛను, సుఖభోగాలను కోరుకుంటారు. వీరు ఎక్కువగా ప్రేమ వివాహాలు కోరుకుంటారు. వీరు రాజకీయాలు, సినీ ఫీల్డ్, మిలటరీ, పోలీస్ లాంటి రంగాలలో బాగా రాణిస్తారు.

28వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు:
28వ తేదీన జన్మించిన వారు గొప్ప వాక్ చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, దృఢమైన శరీరం కలిగి ఉంటారు. మంచి విశ్లేషణాత్మక, తార్కిక బుద్ధి, దైవభక్తి కలిగి ఉంటారు. వీరు ఎవరిని అంత తొందరగా నమ్మరు. నమ్మితే ప్రాణం ఇస్తారు.

వీరి చూపులో ఆకర్షణ శక్తి కలిగి, వీరి మనసులోని ప్రేమాభిమానాలను బయటకు తెలియజేస్తారు. చిన్నపిల్లలవలే ఇట్టే కరిగిపోతారు. వీరు మంచి పరిపాలన దక్షత, మంచి గుణం, అవిరళ కృషి, అంకితభావం కలిగి ఉంటారు.

వీరు ఎవరి చెంత పనిచేయదానికి ఇష్టపడరు. పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటారు. అలా కాకుంటే స్వతంత్ర వృత్తిని ఎన్నుకుంటారు. వీరు జీవితంలో చేసిన ప్రయత్నాలే మళ్ళీ, మళ్ళీ చేయవలసి వస్తుంది.

అలానే జరిగిన సంటనే పునరావృతం కావడం జరుగుతూఉంటాయి. వీరు ముందు వెనక ఆలోచన లేకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుని సమస్యలు తెచ్చుకుంటారులేదా అవమానాలు పొందుతారు.

సాధారణంగా వీరు తమ స్నేహితులు లేదా బంధువుల, నమ్మినవారి చేతిలో మోసానికి గురి అవుతారు. కష్టపడి సంపాదించినవి అనుకోని విధంగా పొగొట్టుకుంటారు.

న్యూమరాలజీ

No comments:

Post a Comment

Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును  భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్...