Sunday, August 9, 2026

Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి

మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ
మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్యకాలం ఆరంభమైన తర్వాత శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన తరువాత వచ్చే మొదటి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. ఈ ఏకాదశి రోజు శ్రీహరిని ఆరాధించటం, తులసీ దళాలతో పూజ చేయటం, వెన్నను స్వామికి నైవేద్యంగా సమర్పించడం మన సంప్రదాయం. 

ఆషాఢ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు.

ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు అందునా కామికా ఏకాదశి ఇంకా ప్రీతికరం.
కోరిన కోరికలు తీర్చే ఈ ఏకాదశికి కామిక ఏకాదశి అని పేరు. మనం స్థితి కర్త అయిన  శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి అర్చించి కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పూర్వజన్మ పాపాలు తొలగి, మోక్షం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు దక్షిణాయన ప్రారంభంలో యోగనిద్రలోకి వెళ్లిన తరువాత వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు.

కామికా ఏకాదశి అశ్వమేధ యాగంతో సమానంగా పరిగణించబడుతుంది. కామిక ఏకాదశి రోజున తులసి దళాలతో ఆ శ్రీమహా విష్ణువును పూజిస్తే పితృ దోషం తొలగి ముక్తిని ప్రసాదిస్తుంది. కామికా ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తే సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.

పురాణకథనం:
పూర్వం ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు. ఒకసారి ఈ జమీందారు ఒక బ్రాహ్మణుడితో పోరాడి కోపంతో అనుకోకుండా అతన్ని చంపేశాడు. బ్రాహ్మణహత్య తీవ్ర మనోవేధనతో కనీసం ఆ బ్రాహ్మణుని దహన సంస్కారాలను నిర్వహించి అన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తలంపుతో దహన సంస్కారాలను చేయాలనీ తలచాడు. కాని గ్రామస్థులు అంగీకరించలేదు.

తీవ్ర మనోవేధనతో తిరుగుతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు ఒక సాధువును కలిసాడు. ఆ సాధువు అతని మనోవేదనకు కారణం తెలుసుకొని కామికా ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించమని అతనికి సలహా ఇచ్చాడు. 

జమీందారు సాధువు చెప్పిన విధంగానే ఉపవాసం ఉండేవాడు. అంతేకాక ఆ శ్రీమహావిష్ణువు సన్నిధిలోనే నిదురిస్తుండేవాడు. కొంతకాలానికి ఒక రాత్రి భూస్వామికి ఆ శ్రీమహా విష్ణువు అతని కలలో సాక్షాత్కరించి, ఆశీర్వదించి అతని దోషాలను తొలగించి పాపవిముక్తి కలిగించాడు.

ఎవరైతే అన్నీ ఏకాదశులతో పాటు ఈ కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భక్తితో ఆ శ్రీమహావిష్ణువును పూజించి కథా శ్రవణం చేసి తరిస్తారో వారి సమస్త పాపాలు తొలగి అంత్యకాలంలో వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది.

పూజా విధానం:
కామిక ఏకాదశి వ్రతం ఆచరించే వారు సూర్యోదయంతోనే నిద్రలేచి తలారా స్నానం చేసి ముందుగా సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం సమర్పించాలి. శ్రీలక్ష్మీనారాయణులను పంచామృతాలతో అభిషేకించి షోడశోపచారాలు చేయాలి. ఆవునేతితో దీపారాధన చేసి పసుపు రంగు పూలతో, తులసి దళాలతో స్వామిని అర్చించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. స్వామివారికి, అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించాలి. అనంతరం మంగళ హారతులు ఇచ్చి నమస్కరించుకోవాలి.

తదుపరి ఆలయదర్శనం చేసుకొని స్వామికి తులసిమాల సమర్పించాలి. అలాగే ఈ రోజు ఉపవాసంతో పాటు రాత్రి భగవన్నామ సంకీర్తనలతో జాగరణ చేయడం కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది.

దానాలు:
కామిక ఏకాదశి నాడు పాలు ఇచ్చే గోవును దూడతో సహా, గ్రాసం కలిపి దానం చేస్తే సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అలాగే కామిక ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణ దీక్షలతో విష్ణువును పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించి తులసి కోట వద్ద నేతి దీపాన్ని వెలిగించాలి.

ద్వాదశి పారణ
ఏకాదశి మరుసటి రోజైన ద్వాదశి రోజు ఉపవాసాన్ని విరమించే విధానాన్ని ద్వాదశి పారణ అంటారు. ఏకాదశి మరుసటి రోజు సూర్యోదయానికి పూర్వమే అభ్యంగన స్నానం చేసి మడిగా, శుచిగా షడ్రసోపేతమైన భోజనాన్ని తయారు చేసి శ్రీ మహావిష్ణువుకు నివేదించాలి. అనంతరం ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో సత్కరించి నమస్కరించుకోవాలి. అటు తరువాత ద్వాదశి ఘడియలు పూర్తికాకముందే భోజనం చేసి ఏకాదశి ఉపవాస దీక్షను విరమించాలి.

కామిక ఏకాదశి విశిష్టతను గురించి బ్రహ్మదేవుడు నారదునికి వివరించగా, నారదుని ద్వారా ఈ 
కథను శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి తెలియజేసి ఆయన చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసినట్లు పురాణకథనం. దీనికి పూర్వం ఈ కథను  వశిష్ఠ మహర్షి  దిలీప మహారాజుకు తెలియజేసాడు.  ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుని నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతముగా సూర్యలోకం లో నివసించే అర్హత కలిగి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కామిక ఏకాదశికి బ్రహ్మహత్యా పాతకాన్ని, భ్రూణ హత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది.

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పసిపిల్లలు, వృద్ధులు ఉపవాస జాగర నియమాలు పాటించక పోయినా ఈ రోజు మనసా వాచా కర్మణా భక్తితో శ్రీహరిని తులసి దళాలతో పూజించి అర్చించాలి.

కామిక ఏకాదశి రోజున ఉపవాస జాగారాలతో ఆ శ్రీహరిని పూజించి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో ఇష్టకామ్యాలు సిద్ధింపజేసుకుందాం.


జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును  భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్...