Monday, August 17, 2026

Uttarabhadra Nakshatra - ఉత్తరాభాద్ర నక్షత్రము

ఉత్తరాభాద్ర నక్షత్రము

నక్షత్రం - ఉత్తరాభాద్ర
అధిపతి - శని
గణము - మానవ
జాతి - స్త్రీ
వృక్షం - వేప
జంతువు - గోవు
నాడి - మధ్య
పక్షి - మయూరము
అధిదేవత - అహిర్పద్రువ్యుడు
రాశి - మీనం
ధు/శ్చం/చా/ధా

ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో ఉత్తరాభాద్ర నక్షత్రము 26వ నక్షత్రము. ఈ నక్షత్రానికి శాంతి లేదు. కానీ, గ్రహాణాది దోషములలో శాంతి చేయవలెను. ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యాధిపతి గురువు, మానవ గణం, జంతువు ఆవు.

ఈ నక్షత్ర జాతకులు వినయవిధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది.

చక్కటి వ్యూహరచనతో పొదుపుగా జీవితాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు.

కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు.

ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. జీవితం సాఫీగా జరిగిపోతుంది. ముప్ఫై నుండి నలభై సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే, వీరి ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. వీరు, విజ్ఞానవంతులు, తెలివైనవారు మరియు సున్నిత మనస్కులు.

ఎవరి పట్లా ప్రవర్తనలో మార్పు ఉండదు, ప్రతి ఒక్కరిని ఒకేవిధంగా చూస్తారు. వీరు ఎవరికి నొప్పిని కలిగించడానికి ఇష్టపడరు, అదేవిధంగా ఎవరైనా సమస్యల్లో ఉండటాన్ని వీరు చూడలేరు. వీరి కోపం ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకొంటారు. అయితే వీరికి ఎప్పుడు కోపం వచ్చినా కూడా స్వల్పకాలంలో తగ్గిపోతుంది. వీరు ఎంతో కోమలమైనవారు మరియు వీరి హృదయం ఎంతో శుద్ధిగా ఉంటుంది.

వీరి స్వరం మధురంగా ఉంటుంది మరియు చక్కటి ప్రసంగాలు చేస్తారు. వీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఒకేసారి అనేక విషయాల్లో నైపుణ్యం సాధించే లక్షణం వీరికి ఉంటుంది. వీరు పెద్దగా చదువుకోకపోయినా, తెలివితేటలు సమర్థత కలిగినవారికి తెలివి తేటలతో సమానంగా ఉంటాయి.

కళల రంగంలో ఆసక్తి ఉంటుంది మరియు వివిధ రకాల పుస్తకాలు వీరు రాయగలుగుతారు. అసాధారణ సామర్థ్యాలు మరియు తెలివితేటల వల్ల, అన్ని రంగాల్లో వీరు నైపుణ్యం సాధించవచ్చు. వీరి జీవితంలో బద్దకానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వీరు దానిని చేస్తారు.

ఏదైనా వైఫ్యలాల వల్ల వీరు నిరుత్సాహపడరు. వర్తమానాన్ని మరియు జీవితంలో సత్యాన్ని వీరు విశ్వసిస్తారు, గాలిలో మేడలు కట్టడానికి ఇష్టపడరు. వ్యక్తిత్వం పరంగా వీరు బలంగా ఉంటారు.

చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటారు మరియు చెప్పింది చేస్తారు. దయార్థ భావన వీరిలో నిండి ఉంటుంది, ఒక బలహీనమైన వ్యక్తి మీ వద్దకు వచ్చినట్లయితే, వీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వీరు దానిలో విజయాన్ని సాధిస్తారు. కష్టపడి పనిచేయడం వల్లనే వీరు విజయం సాధిస్తారు.

కష్టపడి పనిచేయడం ద్వారా, వీరు విజయం అంచుల్ని తాకుతారు. వీరికి సైన్స్, తత్వశాస్త్రం, మరియు రహస్యమైన విషయాల్లో లోతైన ఆసక్తి ఉంటుంది. సామాజిక సంస్థలతో అనుబంధం ఉన్నప్పటికీ, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు.

త్యాగ పూర్వక స్వభావాలుంటాయి మరియు దానాలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిత్వం కారణంగా మీరు సమాజంలో అపరిమితమైన గౌరవమర్యాదలు పొందుతారు.


ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదము
ఉత్తరాభద్ర నక్షత్ర మొదటి పాదము సింహరాశిలో ఉంటుంది. సింహరాశి అధిపతి సూర్యుడు. ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని. ఈ జాతకుల మీద సూర్య శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ నక్షత్రం.

సూర్యుని ప్రభావం కారణంగా వీరికి సహజంగానే నాయకత్వ గుణం ఉంటుంది. ఏ రంగంలోనైనా ముందుండి నడిపించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. శ్రమించి పనిచేయగలరు. సోమరితనం లేకుండా తమ లక్ష్య సాధన కోసం ఎంతో కష్టపడతారు. వీరికి తండ్రితో వ్యతిరేకత ఏర్పడవచ్చు.

విపరీతమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వీసమెత్తు కూడా తగ్గదు. వీరు తమ జ్ఞానం, పనితీరుతో సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని, మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. ఆచరణాత్మక ఆలోచనలు (Practicality) కలిగి ఉంటారు. కొన్నిసార్లు పట్టుదల, కోపం కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది

వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. పరిశ్రమలు, కర్మాగారాలు ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు ఉంటుంది. ఇక ఈ జాతకులకు సాంకేతిక విద్యలు, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 17 సంవత్సరాల పాటు శని దశ ఉంటుంది. శని దశ కాలంలోవిద్య కాస్త మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అనుకూలత ఏర్పడి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది.

34 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, విదేశీ ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి.

41 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగానే సాగుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రం రెండవ పాదము
ఉత్తరాభాద్ర నక్షత్ర రెండవ పాదము జాతకుల మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ నక్షత్రము. ఈ జాతకులకు సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది.

వీరికి వ్యాపారం అంటే ఆసక్తి. వ్యాపారం అనుకులిస్తుంది కూడా. వీరికి విద్యా సంబంధిత, పరిశ్రమల సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి. వీరు బుద్ధి కుశలత కలిగి ఉంటారు.

ఈ జాతకులకు 13 సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సక్రమంగా సాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది.

30 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసివస్తాయి.

37 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో మంచి ఫలితాలు కలుగుతాయి. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగా గడిచిపోతుంది.

ఉత్తరభద్ర నక్షత్రము మూడవ పాదము
వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం  ఉంటుంది. వీరు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు. వీరికి నౌకలలో ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక  విద్యలు, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు తొమ్మిది సంవత్సరాలు శని దశ  ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 

26 సంవత్సరాల తరువాత వచ్చే 7  సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడిఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 

33 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

ఉత్తరాభద్ర నక్షత్రము నాలుగవ పాదము
వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం ఉంటుంది. వీరికి ధైర్యం, ఆవేశం ఉంటాయి. భావోధ్వేగాల విషయంలో తమ మీద తమకు నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం వృత్తులు వ్యాపారం ఉద్యోగం అనుకూలిస్తాయి. సాంకేతిక విద్యలు, వృత్తి విద్యలు కూడా అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు ఐదు సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 14 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 

22 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 

29 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. 

72 సంవత్సరాల వచ్చే18 సంవత్సరాల రాహు దశ కాలంలో కాస్త ఒడిదుడికులు ఎదుర్కొంటారు.


ఉత్తరాభద్రా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలుఫలం

జన్మ తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర శరీరశ్రమ

సంపత్తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి ధన లాభం

విపత్తార అశ్విని, మఖ, మూల కార్యహాని 

సంపత్తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ క్షేమం

ప్రత్యక్ తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ ప్రయత్న భంగం

సాధన తార రోహిణి, హస్త, శ్రవణం కార్య సిద్ధి, శుభం

నైత్య తార మృగశిర, చిత్త, ధనిష్ట బంధనం

మిత్ర తార ఆరుద్ర, స్వాతి, శతభిష సుఖం

అతిమిత్ర తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర సుఖం, లాభం

అంశ గుణాలు :
1) తీక్షణాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం రవిది. ఈ జాతకులు జ్ఞానవంతులు, సౌమ్యమైన గుణం కలవారు.

2) అభయాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం బుధుడిది. ఈ జాతకులు జ్యోతిష శాస్త్ర పండితులుగా గాని, పంచాంగ కర్తలుగా గాని ఉంటారు.

3) అభయాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర తృతీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు తెలివితేటలు కలవారు, శాస్త్రవేత్తలు, ధనవంతులు అవుతారు.

4) దీనాంశ : ఉత్తరాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం కుజుడిది. ఈ జాతకులు ధనం సంపాదించువారు అవుతారు.

నక్షత్ర శాంతి: 
కోవాను ప్రత్యేకంగా తయారు చేయించి 8 మంది వృద్ధ బ్రాహ్మణులకు శివాలయంలో దానం ఇవ్వండి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
అహిర్బుద్ధ్నియః ప్రథ’మా న ఏతి ।
శ్రేష్టో' దేవానా'ముత మాను'షాణామ్ ।
తం బ్రా”హ్మణాస్సో' మపాస్సోమ్యాసః' ।
ప్రోష్ఠపదాసో' అభిర’క్షంతిసర్వే” ।
చత్వార ఏక'మభి కర్మ' దేవాః ।
ప్రోష్ఠపదా స ఇతి యాన్, వదంతి ।
తే బుధ్నియం' పరిషద్యగ్గ్' స్తువంతః' ।
అహిగ్మ్' రక్షంతినమ’సోపసద్య' ॥

నక్షత్ర గాయత్రి
ఓం అహిరబుధ్నాయ విద్మహే 
ప్రతిష్ఠాపనాయ ధీమహి 
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం - డంగేరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీసోమేశ్వర స్వామి.
రెండవ పాదం - కుడుపూరులో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.
మూడవ పాదం - గుడిగళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి.
నాలుగవ పాదం -శివలలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి.

No comments:

Post a Comment

Shatkona Padmam - షట్కోణ పద్మం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - షట్కోణ పద్మం ముక్తాప్రాకారం దాటాక మరకతప్రాకారం. ఈ సాలమూ దశయోజనోన్నతమే. నానా సౌభాగ్యసంయుక్తం. నానాభోగసమన్వి...