Saturday, August 22, 2026

Sri Krishnudu Kuvalayapida Manu Gajambunu Vadhinchuta - శ్రీ కృష్ణుడు కువలయాపీడ మను గజంబును వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీ కృష్ణుడు కువలయాపీడ మను గజంబును వధించుట

ఓరీ మావటీ! మా వైపు ఈ మత్త మాతంగాన్ని తోలవలసిన పనిలేదు. దీన్ని వెనుకకు మరలించు. డీ కొలిపినావా పోరాటంలో నీ మదపుటేనుగుతోపాటు నిన్నూ గంభీరమైన, దారుణమైన, పిడుగు పాటులవంటి నా పిడిగ్రుద్దులతో పొడిచి చంపుతాను. యముడిపాలికి ఇపుడే పంపుతాను. ఇది నిజం.

అందమైన జుట్టుముడిని చక్క చేసుకుని, మెల్లగా పీతాంబరాన్ని దట్టిగా బిగించి కట్టుకుని, నుదుట వ్రేలాడే ముంగురులను పైకి తోసుకుంటూ, యుద్ధకార్య నైపుణ్యంతో బాలుడైన శ్రీకృష్ణుడు చూచేవారు సెబాసని తన్ను మెచ్చుకుంటుండగా తొండంతో కొండలను పిండిచేసే ఆ మత్త వేదండాన్ని సమీపించాడు.

ఓ రాజోత్తమా! మావటివాడు - బాలుడని కూడా సందేహించక, కరుణమాలి కంసుడిఆజ్ఞానుసారం గోపకుల శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడిమీదికి ఏనుగును డీ కొలిపాడు.

ఇంకా పలువురు మావంతులు ఆ కువలయా పీడాన్ని పురికొలిపారు. పెనుగాలి గుంపుచేత పైకెగసిన ప్రళయకాలంలోని అగ్నిజ్వాలవిధంగా, ఆ మదపుటేనుగు త్రుళ్ళిపడుతూ మృత్యుదేవతమాదిరీ, కాలపురుషునికైవడీ, యముడితీరునా కృష్ణుణ్ణి ఎదుర్కొనింది. తన మదజలంమీది ఆశతో చుట్టూ తిరుగాడే తుమ్మెదలనే గాయకుల ఝంకారంవల్ల ఆ గజం అహంకరించింది. 

అది కులపర్వత గుహలనే కుంభాలను తన ఘీంకారంతో పూరించింది. ఆగ్రహోదగ్రుడైన ఆదిశేషుడి పడగవలె భయం కలిగించే తన తొండంతో నిర్లక్ష్యంగా శౌరిని పట్టుకుంది. అసాధ్యుడైన హరి అంతట అటూ ఇటూ పెనగి రాహువుముఖగహ్వరం నుంచి తప్పించుకొని వెలికురికే సూర్యుని మాదిరి చెంగున ఎగిరి, దానికాళ్ళసందున దూరి దాక్కొన్నాడు. 

గోవిందుడు కనిపించకపోయేసరికి కువలయాపీడానికి క్రోధం పెల్లుబికింది. మహాసాగరమధ్యంలో పరిభ్రమించే మందరగిరిలాగా అది గిరగిర తిరుగాడింది. గాలివల్ల వాసన పసికట్టి కృష్ణుడున్నచోటు తెలుసుకొని ఉప్పొంగి పోయింది. ప్రళయ కాలంలోని యమదండంలాగా ప్రచండమైన తన తొండాన్ని క్రిందికి వంచి అది పద్మలోచనుణ్ణి వంచించి చుట్టిపట్టుకుని పడమొత్తడానికి ప్రయత్నించింది. 

మాధవుడు చలించక తెంపుతో దాని వెనుకవైపునకు ఉరికాడు. రాహువుతోకను పట్టిలాగే జగజెట్టి గరుడుని చందంగా శ్రీకృష్ణుడు ఒక్కఎగురు ఎగిరి, ఆ ఏనుగువాలాన్ని చేతితో ఒడిసిపట్టుకున్నాడు. పరాక్రమంతో వందమూరలదూరానికి దాన్ని గిరగిర త్రిప్పి విసరివేశాడు.

ఆ మదేభం అడ్డుకొనరానిదై, అవక్రపరాక్రమంతో పోరాటానికి వెనుదీయక కుడిఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడిమీదికి ఉరికింది. అప్పుడు కృష్ణుడు కుంజరం కుడిప్రక్కకు తిరిగినప్పుడు తాను ఎడమప్రక్కకూ, అది ఎడమవైపునకు తిరిగినప్పుడు తాను కుడివైపునకూ తిరుగుతూ దానికి బాగా రొప్పు తెప్పించాడు.

శ్రీకృష్ణుడు కాఠిన్యం వహించి దానిపైకి చెంగలించాడు. ప్రళయకాల మేఘాలనుంచి పడిన కఠోరమైన పిడుగులాంటి తన పిడికిలి బిగించి ఈడ్చి ఆ గజకుంభస్థలాన్ని గుద్దాడు. ఎత్తయిన అంజనగిరిశిఖరంలాంటి దానికుంభస్థలం పగిలి ముక్కలుచెక్కలై ఎగిరిపడింది.

ఆ ఏనుగు కుంభస్థలంనుంచి నెత్తుటితో తడిసి చెదరి నేలరాలిన ముత్యాలు సంజకెంజాయలో ఎర్రటి నక్షత్రాలతో కప్పబడిన మింటిసొగసును ధరణికి సంతరించాయి. ఆ శుండాలం అంతటితో ఆగక మ్రొగ్గి మోకరిల్లి సంబాళించుకుని వెంటనే లేచింది. అటూ, ఇటూ చూచింది. ముందుకు ఉరవడించింది. 

ప్రళయవేళలో సముద్రాల సముత్తుంగతరంగాలచే కొట్టబడిన కులపర్వతం మాదిరి అది మళ్ళీ భుజబలసమేతుడైన శ్రీకృష్ణునిచే కొట్టబడింది. మిక్కుటమైన కోపంతో కువలయా పీడం గోవిందుణ్ణి ఒక్కుమ్మడిగా తన దంతాలతో చిమ్మింది. నందసుతుడు హస్తలాఘవం హెచ్చగా బాహాబాహియుద్ధంలో మిక్కిలి విజృంభించి దాన్ని తల్లడిల్ల జేశాడు.

అప్పుడు ఆ మదగజం మొక్కవోని ముక్కంటి బల్లెంతో భగ్నమైన త్రిపురాసురుల పురంలాగా, సముద్రంలో తీవ్రమైన ఝంఝామారుతంవల్ల పాడైన ఓడలాగా శక్తి గోల్పోయింది. బక్కచిక్కి స్రుక్కింది. దానోదకధారలులేని పిసినారి చెయ్యివిధంగా అది చెక్కిటి మదజలధారలు లేనిదయింది. 

ఎడతెగని మదనుడి పోరుగల వియోగి హృదయంలాగా ఎడతెగక మదిలో జనించిన విరోధం కలది అయింది. పరాధీనుడైన ప్రభాకరుడుగల గ్రహణవేళమాదిరి ఎండినతొండం గలది అయింది. పూచిన తామరలుగల సూర్యోదయంలాగా తొండపు కొనగలది అయింది. ప్రకాశించని పద్మాలుగల చంద్రప్రకాశం తీరున వెలవెలపోయిన ముఖమందలి బిందువులు గలది అయింది.

గోపాలశేఖరుడూ, వీరశిరోరత్నమూ అయిన శ్రీకృష్ణుడు పర్వతరాజంతో సమానమైంది, ప్రాణాలమీద ఆశగలదీ, అయిన ఆ మదపుటేనుగును మహాసింహంమాదిరి సవిలాసంగా నవ్వుతూ, కాలితో త్రొక్కి చేతితో భయంకరమైన దాని దంతాలు పెరికి బక్కచిక్కేటట్లు బాది ప్రాణాలు తీశాడు.

శ్రీకృష్ణుడు కువలయా పీడమనే ఏనుగుయొక్క దంతాలను ఊడబెరికి, వాటితోనే కొట్టి మావటివాళ్ళను అందరినీ చంపి ఆ ప్రదేశం నుంచి బయలుదేరి

కదనరంగంలో కాలు గదపక పోరాడే ఆ రామకృష్ణులు ఏనుగుదంతాలు తమ భుజాలపై మెరుస్తుండగా స్వేదబిందువులు ముఖాల్లో నిండగా, గోపాలకులు తమరి పరివేష్టించగా బయలుదేరి వచ్చి, మల్లభూమిని చూచారు. అది దేవమానవాదుల హృదయాలను మహాభయంకరమైన ఆడంబరంతో కలవరపెడుతూ ఉంది.

శ్రీకృష్ణుడు బలరాముడితో మల్లరంగం మధ్య నవరసా లొలికిస్తూ, ప్రకాశించాడు. ఎలాగంటే అతడు జెట్టీలకు పిడుగై రౌద్రరసాన్నీ ప్రజలకు నాథుడై అద్భుత రసాన్ని పట్టణ స్త్రీలకు మన్మథుడై శృంగారరసాన్నీ కంసుడిపాలిటి మృత్యువై భయానకరసాన్నీ, వికటుడై మూఢులహృదయాలలో భీభత్సరసాన్నీ, వసుదేవుడికి పుత్రుడై అతడిహృదయంలో కరుణ రసాన్నీ ఖలులను దండించడంచేత వీరరసాన్నీ తనతోడి గోపకులకు స్వకులస్థుడు కావడంవల్ల హాస్యరసాన్నీ బంధువలైన యాదవుల్లో ప్రేమరసాన్నీ దేవుడై యోగులందు శాంతరసాన్నీ నింపాడు.

పరీక్షిన్మహారాజా! ఆ సమయంలో చచ్చిన కువలయాపీడాన్నీ, వచ్చిన రామకృష్ణుల్నీ క్రమంగా చూచి భోజవంశశ్రేష్ఠుడైన కంసుడు నొచ్చిన మనసుతో మిక్కిలి భయపడ్డాడు.

ధీరులూ, వస్త్రాలు, పూలదండలు, రత్నాలతో ప్రకాశించే నగలు ధరించినవారూ, నటుల వేషంలో ఉన్నవారూ, సకలజగాలకూ క్షేమం కల్గించేవారూ, మగవారియొక్క మగువలయొక్క మనసులు ఆకర్షించేవారూ, మల్లరంగంలో విహరిస్తున్నవారూ, మహావీరులూ అయిన ఆ గోపకుమారులను జనులందరూ చూచి చూచి తనివిదీరక...

అందమైన రామకృష్ణుల ముఖ చంద్రబీంబాలనుంచి ప్రసరించే అమృతరసాన్ని కన్నులతో త్రాగేవిధంగా చూస్తూ, నాలుకలతో చప్పరించి చవి చూచే విధంగా స్తుతిస్తూ, చేతులతో కౌగిలించే విధంగా మున్ముందుకు పొడవుగా చేతులు చాచుతూ, ఒకరితో ఒకరు గుజగుజలు పోయా

బలరామకృష్ణులు మహావిష్టుని తేజోవిలాసంతో భూమిని కాపాడటానికి వసుదేవుడిగృహంలో జన్మించారట! దేవతా శ్రేష్ఠులైన వీరిని పసిపాప లనడం ఏ మాత్రం యుక్తం కాదు.

తామరలవంటికండ్లు కలవాడూ, మంగళకరమైన అంగసౌష్ఠవం కలవాడూ, గొప్పతేజస్సు కలవాడూ, దిగ్గజేంద్రానికి దీటైనవాడూ, లక్ష్మికి పతి అయిన శ్రీకృష్ణుడు రక్కసియైన పూతనను పట్టి చంపాడు. సుడిగాలి అయిన తృణావర్తుణ్ణి హతమార్చాడు. మద్దిమాకుల్ని పడగూల్చాడు. 

బకాసురుణ్ణి సంహరించాడు. అఘుడనే రాక్షసుణ్జి అంతం చేశాడు. విజ్బంభించి వత్సాసురుణ్ణి వధించాడు. గోవర్ధన గిరిని పైకెత్తి దేవేంద్రుణ్ణి అవమానించాడు. కాళియుడనే నాగరాజును మర్దించాడు. కార్చిచ్చును తాగాడు. కేశి అనే దానవుణ్ణి యముడి చెంతకు పంపాడు.

మయుని కొడుకైన వ్యోమాసురుణ్ణి నిర్మూలించాడు. ఇంకా ఎందరో రాక్షస వీరుల్ని దునుమాడి గోపకులను కాపాడాడు. గొల్లచేడెల మనసులోని కోరికలను ఈడేర్పాడు. ఆలోచించగా ఇతడు సామాన్య మానవుడు కాడు.

శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులను వధించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...