Friday, August 14, 2026

Sena Naasanam - సేనా నాశనం

రామాయణం సుందరకాండ 42వ సర్గ - సేనా నాశనం

మహావృక్షాలు నేలకూలే ధ్వనులూ, పక్షుల ఆర్తనాదాలూ వింటూ లంకానగర వాసులు భయభీతులై లేచారు. వారికెన్నో అపశకునాలు గోచరించాయి.

రాక్షస స్త్రీలు తమ చుట్టూ వనం ధ్వంసం కావడం చూశారు. ఎదురుగా పర్వతాకారంతో మహావానరం కనిపించింది. వారందరికీ విపరీత
యిన భయం కలిగింది.

కొంతసేపటికి తేరుకుని సీతాదేవిని సమీపించి:

ఈ వానరు డెవడు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు? వాడితో మాట్లాడావా? నిజం చెప్పు. వాడితో ఏం మాట్లాడావు? అని అడిగారు.

జానకి : వాడెవడో ఎందుకు వచ్చాడో నాకేం తెలుసు. మీ రాక్షస మాయలు మీకే తెలియాలి. పామునడక పాముకే తెలిసేది. అ రూపం నాకూ భయంగానే ఉంది. కా
రూపంతో రాక్షసుడెవడో వచ్చినట్టున్నాడు.

ఆ మాటలు వింటూ భయంతో కొందరు కొయ్యబారిపోగా, 
రి కొందరు పరుగులు తీయగా, కొందరు ఈ వార్త చెప్పడానికి రావణుని దగ్గరకుపోయి:

ప్రభూ! అశోకవనంలోకి ఒక భయంకరమయిన కోతి వచ్చి సీతతో ఏదో మాట్లాడింది. దానికి చాలా బలం ఉన్నట్లుంది. ఆ కోతిని గురించి ఎంత అడిగినా సీత సమాధానం యివ్వడంలేదు.

దేవేంద్రుడో, కుబేరుడో, కాక రాముడో పంపిన దూతకావచ్చు ననుకుంటున్నాం. ఆ మహావానరం అశోకవనాన్ని ధ్వంసం చేసింది. సీత ఉన్న ప్రాంతం తప్ప మిగిలిన వన ప్రదేశమంతా నాశనం అయింది. చూస్తేవాడు జానకీ రక్షణార్దమే ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టాడనుకోవాలి.

ఆ వానరానికి తగిన శిక్ష వేసితీరాలి. నీకత్యంత ప్రీతి పాత్రురాలయిన సీతతో మాట్లాడిన వానికి మరణమే శరణ్యం, అని వారంటూంటే రావణుని వదనం అగ్నిగుండం అయింది. ఆ వేడికి రెండు కన్నీటి బిందువులు రాలాయి. అవి మండుతున్న దీపం నుండి జారే నేతిబొట్లలా వున్నాయి,

తక్షణం తనతో సమానబలంగల కింకరగణాన్ని పంపించాడు.

వారు ఇనుప బరిసెలు, ముధ్గరాలు తీసుకుని బయలుదేరారు. కోరలపళ్ళు, మహోదరాలు భయంకరంగా ఉన్నారు. అందరూ మిడతల దండులా హనుమంతుని చుట్టుముట్టారు. చేతులలోని ఆయుధాలతో మీదికి వచ్చే ఆ కింకరగణాన్ని చూసీ, సింహగర్జనచేసి, తన దీర్ఘవాలాన్ని వేలమీద తాడించాడు. ఒక్కసారి జబ్బచరిచాడు. ఆ ధ్వని కొండగుహలలో ప్రతి ధ్వనించింది. ఆ చప్పుడుకు భయపడి పక్షలు నేలరాలాయి. వారిని చూస్తూ గొంతెత్తి,

జయ త్యతిబలో రామో
లక్ష్మణశ్చ మహాబలః।
రాజా జయతి సుగ్రీవో
రాఘవే ణాభిపాలితః॥

దాసో
హం కోసలేంద్రస్య
రామ స్యాక్లిష్ట కర్మణః।
హనుమాన్‌ శత్రు సైన్యానాం
నిహాంతా మారుతాత్మజః 


న రావణ సహస్రం మే
యుద్ధే ప్రతిబలం భవేత్‌ 

శిలాభిస్తు ప్రహరతః
పాదపైశ్చ సహస్రశః॥

అర్ధయితాః పురీం లంకాం
అభివాద్య చ మైథిలీమ్‌

సమృద్ధార్థో గమిష్యామి
మిషతాం సర్వ రాక్షసామ్‌


అతిబల మహాబలులయిన రామ లక్ష్మణులకూ, వారి రక్షణలో ఉన్న మా ప్రభువు సుగ్రీవునకూ స్వస్తి.

అనాయాసంగా అద్భుత కార్యాలు సాధించే కోసల ప్రభువుల దాసుడనైన నేను శత్రుసేనా సమూహాలను చీల్చి చెండాడతాను. నేను వాయునందనుడను, హనుమంతుడను.

మహా వృక్షాలతో గండశిలలతో యుద్దం సాగించే నా ముందు వేలమంది రావణులాగరు.

ఈ లంకానగరాన్ని విధ్వంసం చేసి, జానకీ దేవికి అభివాదాలర్పించి, కార్యసాఫల్యంతో మీ అందరూ అలా చూస్తూండగా హాయిగా తిరిగి వెడతాను, అని నినాదం చేశాడు.

ఆ కంఠధ్వనికి రాక్షసయోధులు కంపించారు.

సంధ్యాకాల మేఘ సదృశంగా ఉన్నాడు హనుమంతుడు.

అయినా ప్రభువు ఆజ్ఞ వారిని ముందుకు దూకించింది.

ఒక్కసారి అందరూ చుట్టుముట్టడంతో, తాను కూర్చున్న ద్వార తోరణంలోని ఇనుప దూలం లాగి వారిని తాడించడం మొదలుపెట్టాడు.

గరుత్మంతుని గోళ్ళలో చిక్కిన మహాసర్పంలా ఆడుతోంది ఆ దూలం.

దాని తాకిడికి రాక్షసులందరూ నేలకూలారు. హతశేషులు పరుగు పరుగున రావణునికి నివేదించారు.

కింకరగణం పరాభూతం అయిందని విన్న రావణుని కన్నులు గిరగిర తిరిగాయి. పరాజయం ఎరుగని జంబుమాలిని పంపించాడు. వీడు రావణ మంత్రి ప్రహస్తుని కుమారుడు.

జంబుమాలివధ

No comments:

Post a Comment

Madhuvanam - మధువనం

రామాయణం సుందరకాండ 61వ సర్గ - మధువనం అందరూ మహేంద్రగిరి శిఖరం నుండి గగన వీధికి ఎగిరారు. మత్తేభాలవలె, మహాగిరులవలె వారు ఆకాశమంతా క్రమ్ముకున్నారు...