Friday, August 28, 2026

Dharmaraju Srikrishnu Nanumathambuna Bhimaadula Digvijayamunaku Bamputa - ధర్మరాజు శ్రీకృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్విజయమునకు బంపుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
ధర్మరాజు శ్రీకృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్విజయమునకు బంపుట

గొప్ప నడవడిగల ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు ధర్మరాజు నిర్మలమైన తన సభామండపంలో ఆప్తులు, పురోహితులు, చుట్టాలు, మంత్రులు, మునులు, కవీశ్వరులూ, పండితోత్తములు వచ్చి ఉండగా - కమలనాభుడు, అద్భుతచరిత్రుడు, మురారి, యదువంశ్రేష్ఠుడు, నీతిమంతుడు, సామదానభేద దండోపాయాలను ప్రయోగించటంలో నేర్పరి అయిన కృష్ణుడు కొలువుదీని ఉన్నాడు. అపుడు తమకు అత్యంత ఆప్తుడైన శ్రీకృష్ణుణ్ణి చూచి ఇలా పలికాడు.

పుణ్యచరిత్రుడవైన ఓ కృష్ణా! నాకు రాజసూయయాగం చేయాలనే కోరిక మనస్సులో కలిగింది కనుక, యాగం నెఱవేర్చుటకు నీవు కాక నాకు కావలసినచుట్టాలు మరెవరు లేరుకదా! నీవే దాన్ని నడిపించాలి.

శ్రీకృష్ణా! ఏ జనులు నీ పాదకమలసేవ నిత్యమూ చేస్తుంటారో, ఏ మానవులు నిన్ను సదా పొగడుతుంటారో; అట్టి నిర్మలమనస్కులు అధికమైన శుభాలూ, సుఖాలూ కొరత లేకుండ పొందుతారు. నిన్ను గూర్చి తెలిసి, నిన్ను అర్చించేవారికి ఫలాలు లభించకుండా ఆ అర్చన వృథాగా పోతుందా? (పోదని భావం)

ధర్మరాజు ఆ విధంగా చెప్పగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు.

మేలైన నీతిశాస్త్ర విషయాలు తెలిసిన, గుణవంతుడవైన, కురుశ్రేష్ఠుడవైన, పాండురాజు తనయుడవైన ఓ ధర్మరాజా! నీవు తలపెట్టిన ఈ యజ్ఞం మునులకు, దేవతలకు, పితృదేవతలకు మంచి కార్యక్రమమై, భయంకరమైన శత్రువులకు నాశకారకమై, బంధువులకు ప్రీతికరమై, పుణ్యవంతమై, జయకరమై, నీకు యశస్కరమై నట్టిది కనుక ఈ కార్యాన్ని వెంటనే ప్రారంభించవలసింది.

ఓ ధర్మరాజా! నీ తమ్ములు సాటిలేని దివ్యమైన అస్త్రవిద్యలు తెలిసినవారు. యుద్ధభూమిలో ఎదిరించిన శత్రురాజుల్ని తమ శౌర్యంతో అనాయాసంగా సంహరించి నీకు విజయాన్ని చేకూర్చగల సమర్థులు.

ఓ ధర్మరాజా! నీవు నీ శత్రురాజుల నందరిని జయించి, దేవతలు ప్రశంసించే విధంగా నిర్మలమైన కీర్తి లోకమంతటా వ్యాపింపజేసి, ఈ భూమండలం అంతటా నీ ఆజ్ఞ చెల్లుబడి అయ్యేటట్లుగా స్థిరపరచు.

ఓ ధర్మరాజా! నీవు చెప్పిన పనిని ఇతరులకు చెప్పక నేనే స్వయంగా చేస్తుండగా, లోకంలోని రాజులలో ఎవ్వరు నిన్ను ఏ విషయంలోనైనా వేలెత్తి చూపగలరా? నీకు చేయశక్యంగాని పని ఏముంది గనుక?

నిర్మలమైన మనస్సుతో ఈ గొప్ప యజ్ఞాన్ని చేయడానికి కావలసిన అనేక వస్తుసంభారాలను తెప్పించు. నీ తమ్ముళ్లను లోకంలోని శత్రురాజులందరినీ(దర్పంతో) జయించి రమ్మని పంపు.

శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని ధర్మరాజు ఆనందంతో ఉప్పాంగి, కృష్ణుణ్ణి పొగడి, సంతోషితస్వాంతుడై మిక్కిలి శూరులైన తన తమ్ములవైపు చూచి ఇలా పలికాడు.

సృంజయ దేశపురాజులు తగిన చతురంగ బలాలతో నిన్ను సేవిస్తుండగా, నీవు దక్షిణ దిక్కును జయించి రమ్మని ధర్మరాజు తన చిన్న తమ్ముడైన సహదేవుణ్ణి పంపించాడు.

ఓ పరీక్షిన్మహారాజు! ధర్మరాజు ఏనుగులు, రథాలు, గుఱ్ఱాలు, కాలిబంట్లు అనే నాల్గు విధాలైన సేనలతో శత్రువులనందరినీ నఱికివేయగలవాడైన నకులుణ్ణి శూరత్వం మెఱిసేటట్లుగా పడమటి దిక్కును గెలువమని పంపాడు.

ఓ రాజా! దుష్టులను భంగపెట్టేవాడు, తన శౌర్యంతో ఆర్జించిన విజయపరంపరలు గలవాడు, యుద్ధవిద్యయందు నేర్పరి. స్వచ్చమైన గొప్పకీర్తి గలవాడు అయిన అర్జునుణ్ణి ఉత్తరదిక్కు జయించడానికి పంపాడు.

గొప్ప శౌర్యోపేతులైన మత్స్య, కేకయ, మద్రదేశపు రాజులయొక్క సేనలను కూడుకొని, తన శౌర్య వీర్య ప్రతాపాలకు తగినట్లుగా - అనేక వీరులను చంపి, వారి తేజస్సు హరించిన భీమసేనుణ్ణి తూర్పుదిక్కులోని రాజులను జయించడానికి పంపాడు.

అట్లు పంపగా ధర్మజుని తమ్ములైన భీమార్జున నకులసహదేవులు తమ తమ భుజబలాల్నీ ప్రతాపాన్నీ ప్రకాశింపజేసి, ఎంతో శూరులైన నాల్గుదిక్కుల్లోని రాజుల్ని గెలిచి వారినుండి ధనం, రత్నాలు, గుఱ్ఱాలు మొదలైన ప్రముఖవస్తువుల నన్నింటినీ కప్పములుగా స్వీకరించి, గాంభీర్యంతో కూడిన మనస్సు గలవారై వచ్చి, ధర్మరాజుకు నమస్కరించారు.

నాల్గుదిక్కులకు వెళ్లినవారు తాము ఆయా ప్రాంతాలకు వెళ్లి, రాజుల్ని జయించి వచ్చిన విశేషాలు వరుసగా చెప్పారు. జరాసంధుడు ఓటమిని అంగీకరించినప్పటికీ కప్పం కట్టలేదనే విషయాన్ని అర్జునుడు అహంకారాన్ని తగ్గించుకొని మనవి చేశాడు. ఆ విషయాన్ని విని, ధర్మరాజు ఏమి చేయడానికీ తోచకుండా ఊరికే ఉండిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు

ధర్మరాజును చూచి శ్రీకృష్ణుడు కుతూహలంతో ఓ రాజా! జరాసంధుణ్ణి చంపడానికి ఉపాయం ఒకటి ఉంది. అది నాకు ఉద్ధవుడు చెప్పింది. నీకు వివరంగా చెప్తాను - వినుము.

రాజా! జరాసంధుడు ఎల్లప్పుడు బ్రాహ్మణులయందు భక్తిగలవాడు. అణకువగలవాడు. బ్రాహ్మణులు ఏది కోరినా కాదనక ఇచ్చేవాడు. కనుక, అర్జునుడూ, భీముడూ, నేనునూ బ్రాహ్మణవేషధారులమై వెళ్లి, యుద్దాన్నే భిక్షగా కోర్తాము. బ్రాహ్మణుల పట్లగల గౌరవంతో మాకు అనుకూలుడై మేము కోరిన కోరికను మన్నించి తప్పక రణభిక్షను ఇస్తాడు.

శ్రీకృష్ణ భీమార్జునులు జరాసంధుని వధింప బోవుట







No comments:

Post a Comment

Sri Krishnudu Danthavaktruni Vadhinchuta - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కపటియైన సాల్వుణ్ణీ, ఆతనిసౌభకవిమానాన్నీ...