రామాయణం సుందరకాండ 48, 49 సర్గలు - బ్రహ్మాస్త్రం
హనూమతో వేద న రాక్షసోన్తరం
న మారుతి స్తస్య మహాత్మ నోన్తరమ్ ।
పరస్పరం నిర్విషహౌ బభూవతుః
సమేత్య తౌ దేవ సమాన నిశ్రమౌ ॥
అక్షకుమరుని మరణవార్త విన్న అనంతరం దేవేంద్ర సమ పరాక్రముడయిన ఇంద్రజిత్తును చూస్తూ రావణుడు:
నాయనా! నువ్వు శస్త్రవేత్తలలో, అస్త్ర విద్యావిదులలో శ్రేష్ఠుడవు. నీ వీరత్వాన్ని దేవతలూ, దేవనాయకులూ చవిచూశారు. చతుర్ముఖ ప్రజాపతిని ఆరాధించి బ్రహ్మాస్త్రం సాధించావు.
రణరంగంలో దేవ దానవకోటులు నీ పాదాక్రాంతం కాక తప్పదు. భుజబలం, తపోబలం కల నీ ధీశక్తి దేశకాలాలను పరిశీలించి సాగుతుంది.
నీ ఆలోచనకు ముల్లోకాలూ తలవంచాలి.
తపస్సులో పరాక్రమంలో నాతో సమానుడవు. నువ్వు రణభూమికి వెడితే నేను నిశ్చింతగా వుంటాను.
ఆ వానరుని చేతులలో కింకరగణం నేల కూలింది. మన జంబుమాలి పడిపోయాడు. చతురంగబలాలతో సేనాపతులు తిరిగి రాలేదు. అంతకు ముందే మన సచివతనయులు కన్నుమూశారు.
ఇంతకుముందే నీ సోదరుడు అక్షకుమారుడు అంతిమ శ్వాసవిడిచాడు. వీరందరూ నీ అంత బలపరాక్రమ సంపన్నులుకారు. నువ్వు బాగా యోచించి ఆ వానరుని పరాక్రమం పరిశీలించి కార్యరంగంలో ప్రవేశించాలి. నిన్ను చూస్తుండగానే ఆ వానరుడు నిర్విణ్ణుడు కావాలి. వాడికి సేనాబలం లేదు, వజ్రధారి కాదు, అగ్నిహోత్రుడు కాడు. వాయుసుతుడు మాత్రమే. ఇవన్నీ తెలిశాక ఏం చెయ్యాలో నువ్వెరుగుదువు.
నిజానికి నిన్ను పంపడం ఉచితంకాదు, కాని రాజధర్మానుసారం ఇప్పుడు నువ్వే వెళ్ళాలి. యుద్ధభూమిలో ఆయుధబలం మాత్రమేచాలదు, అవసరానుకూలమయిన వివేచన కావాలి, అది విజయసాధనకు సహకరించాలి, అన్నాడు.
విన్నాడు ఇంద్రజిత్తు.
తండ్రికి ప్రదక్షిణం చేశాడు.
పొంగుతూన్న సముద్రంలా బయలుదేరాడు.
రథాన్ని అధిరోహించాడు.
ఆ సమయంలో మృగరోదనాలు బయలుదేరాయి.
వస్తున్న రథధ్వని, ధనుష్టంకారం విన్న హనుమంతునికి సంతోషం కలిగింది.
ఆ యుద్ధం చూడడానికి నాగ యక్ష సిద్ధులు గగన వీధిలో నిలిచారు. హనుమంతుడు తన దేహాన్ని పెంచుతూ సింహనాదం చేశాడు. వారుభయులూ సురాసుర ప్రభు తేజంతో వెలుగుతున్నారు. ఇంద్రజిత్తు వాడి మొనలుగల బంగారు రెక్కల బాణాలు వదులుతున్నాడు. హనుమంతుడు అవలీలగా తప్పించుకున్నాడు.
లక్ష్యశుద్ధిగల ఇంద్రజిత్తు విడిచే నిశితశరాలను అనాయాసంగా దూరం చేస్తున్నాడు మారుతి. కొంతసేపు గడిచింది.
హనుమంతుని శక్తి ఎంతటిదో అంతుచిక్కలేదు, ఇంద్రజిత్తుకు.
రాక్షసపుత్రుని సామర్థ్యం ఈయనకూ అందలేదు.
ఒకరికొకరు దుస్సహంగా వున్నారు.
ఏనాడూ గురి తప్పని తన విలువిద్య వ్యర్థం కావడంతో ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు. ఆలోచించి ఆలోచించి, వీడు శస్త్రాస్త్రాలతో కడతేరడు అని నిశ్చయించి బ్రహ్మాస్త్రం సంధించి విడిచాడు.
హనుమంతుడు చైతన్య హీనుడై నేలమీదపడి క్షణంలో తెలివిరాగా;
ఈ రాక్షసుడు నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించాడు. పితామహుని వరప్రభావంవల్ల ఏ అస్త్రమూ నన్ను వధించదు: ఈ అస్త్రబంధాన్ని విడిపించుకునే శక్తీలేదు. ఇంద్ర, వాయు, బ్రహ్మలు రక్షిస్తున్నారు, కనక భీతిలేదు, అనుకున్నాడు.
నేను రావణుని దగ్గరకుపోయి మాట్లాడే అవకాశం ఈ విధంగా కలిగింది. అని కదలకుండా వున్న ఆ వానరవీరుని చేరిన రాక్షసులు నారచీరలతో, చెట్లనారలతో గట్టిగా బంధించారు. అయినా కదలలేదు.
చూశాడు రావణి.
ఎంత మూర్ఖంగా చరించారు మా వీరులు.
ఒక అస్త్రం బంధించి వున్నప్పుడు మరో బంధనంచేస్తే ఆ అస్త్రబంధం విడిపోతుందని ఎరుగని వారయారు వీరు, అనుకుంటూ నడుస్తున్నాడు.
రాక్షసులు హనుమంతుని లాక్కుని వెడుతున్నారు.
బ్రహ్మాస్త్ర బంధం వదిలినట్టు తెలియ లేదాయనకు. ఉభయులూ లంకేశ్వరుని కొలువులో ప్రవేశించారు. బంధిత మత్తేభంలా ఉన్నాడు హనుమ.
అసలు వీడెవడు?
ఇక్కడ ఏం పని వీడికి?
ఎవరి బలం చూసుకుని వచ్చా డిక్కడికి?
అని రాక్షస ప్రముఖులు ఒకరితో ఒకరు గుసగుస లాడుకుంటున్నారు. నరకండి, నిప్పులో మండించండి, హాయిగా విరుచుకు తినేయండి, అంటున్నారు మరికొందరు.
రత్న సింహాసనం మీది రావణుడు హనుమంతుని చూశాడు. తేజః పరాక్రమాలతో సూర్యకాంతితో ఉన్న రావణుని హనుమంతుడు తిలకించాడు.
రావణుని కన్నులు ఎర్రబడ్డాయి.
హనుమంతుని నేత్రాలలో చింతనిప్పులు పుడుతున్నాయి.
స్వర్ణ నిర్మితమూ ముక్తా జాలావృతమూ అయిన కిరీట శోభిత శీర్షంతో వజ్ర, మాణిక్య భూషణాలతో చీని చీనాంబరాలంకృతుడై, రక్త చందన లేపంతో అరుణారుణనయనుడై వెలుగుతున్నాడు. నీలగిరి సన్నిభదేహంతో తారహారాలంకృత వక్షంతో, బలాక పక్షులతో నిండిన మేఘంలా ఉన్నాడు. ఆ బాహువులు అయిదు పడగల పాముల్లా ఉన్నాయి.
రత్న, స్ఫటిక ఖచితమయిన ఆస్తరణం పరచిన సింహాసనం మీద వున్న చక్రవర్తికి ఇరుపార్శ్వాల వింజామరలతో అందగత్తెలున్నారు.
మంత్రాంగ కుశలులయిన మహాపార్శ్వ, దుర్ధర, ప్రహస్త నికుంభులు ఆయన కిరువంకలా ఆసీనులయారు. మిగిలిన సచివమండలి అటూ యిటూ వున్నారు. వారి మధ్య రావణుడు దేవతా పరివృతుడైన ఇంద్రుని వలె ఉన్నాడు.
స్వర్ణ సింహాసనం మీది రావణుడు మేరుగిరిపై నీలమేఘంలా వున్నాడు.
ఆ రాక్షసేశ్వరుని తిలకించే హనుమంతునికి ఆశ్చర్యం కలిగి:
అహో రూప మహో ధైర్యం
అహో సత్వ మహో ధృతిః।
అహో రాక్షస రాజస్య
సర్వలక్షణ యుక్తతా॥
య ద్యధర్మో న బలవాన్
స్యాదయం రాక్షసేశ్వరః।
స్యాదయం సురలోకస్య
స శక్రస్యాఫై రక్షితా ॥
ఈ రాక్షసేశ్వరుని సొందర్యం, ధైర్యం, శక్తి, బలం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సర్వలక్షణ లక్షితుడైన ఈ ప్రభువు అధర్మానికి ఒడిగట్టకపోతే దేవలోకంతో పాటు దేవేంద్రుడు కూడా ఈయనకు పాదాక్రాంతుడు కావాలి.
ఈయన చేసే క్రూర, ఘాతుకాలు కారణంగా దేవ దానవ గణాలు వీనికి భయపడుతున్నాయి.
ఈ రావణుడు తలచుకుంటే లోకాన్ని జలప్రళయంలో ముంచెత్తగలడు, అని ఊహిస్తున్నాడు, హనుమంతుడు.
Subscribe to:
Post Comments (Atom)
Brahmastra - బ్రహ్మాస్త్రం
రామాయణం సుందరకాండ 48, 49 సర్గలు - బ్రహ్మాస్త్రం హనూమతో వేద న రాక్షసోన్తరం న మారుతి స్తస్య మహాత్మ నోన్తరమ్ । పరస్పరం నిర్విషహౌ బభూవతుః సమే...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment