Tuesday, August 25, 2026

Srikrishnudu Kalindi Mitravinda Nagnajiti Bhadra Lakshana Yanu Varala Barinayamaaduta - శ్రీకృష్ణుడు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారల బరిణయమాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారల బరిణయమాడుట

తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు మున్నగువారిని వీడ్కొని, సాత్యకి మొదలైన అనుచరులతో పాటు ద్వారకకు వచ్చి బంధువులను మిత్రులను ఆనందింపజేస్తూ ఒక మంచిరోజు సుముహూర్తంలో కాళిందిని వివాహమాడాడు.

రాజాధిదేవి శ్రీకృష్ణుని మేనత్త. విందుడు, అనువిందుడు ఆమె కుమారులు. అవంతిదేశాధిపతులు. దుర్యోధనునికి అధీనులు. వారు తమ చెల్లెలికి(మిత్రవిందకు) పెండ్లి చేయాలని నిశ్చయించి స్వయంవరం చాటింపగా

రాజులు చూస్తుండగా శ్రీకృష్ణుడు శూరత్వంతో మిత్రవిందను పెండ్లిచేసికొన్నాడు. మిత్రవింద ఎప్పుడూ సజ్జనులను సంతోషపెడుతుంది. ఆమె నల్లని తలవెండ్రుకలు కాంతితో నల్లని తుమ్మెదలను జయించాయి. మిత్రవింద శిరోజాలు తుమ్మెదల నల్లదనాన్ని మించిన నలుపురంగు కలవని భావం.

పరీక్షిన్మహారాజా! కోసలదేశాన్ని పరిపాలించే నగ్నజిత్తు అనేరాజు ఒక డున్నాడు. అతడు మంచి మనస్సు కలవాడు. ధర్మాన్ని పాటించేవాడు. అతని కొక కూతురుంది. ఆమెపేరు నాగ్నజితి.

సద్గుణవతి అయిన ఆమెను వివాహమాడటానికి రాజులు రాగా నగ్నజిత్తు వారితో "వాడి కొమ్ములు కలవీ, వీరుల వాసన తగిలితే చాలు ఎదుర్కొనేవీ, మదించినవీ అయిన ఏడు ఆబోతులను పట్టి బంధించినవాడే నా కొమార్తెకు భర్త అవుతా" డని ప్రకటించాడు.

వచ్చినవారు ఆబోతులను పట్టుకొని కట్టివేయలేక భయంతో ఇంటిమొగం పట్టేవారు.

ఆబోతులను గెలిచినవాడే నాగ్నజితికి భర్త అవుతాడని, విన్న శ్రీకృష్ణుడు కోసలదేశరాజధానికి సేనతో కూడి వెళ్లాడు. కోసలరాజు నగ్నజిత్తు శ్రీకృష్ణునికి ఎదురువచ్చి శాస్త్రోక్త ప్రకారంగా పూజించాడు. ఆసనం సమర్పించాడు. తర్వాత శ్రీకృష్ణుడు కూడా నగ్నజిత్తును కొనియాడాడు.

పరీక్షిన్మహారాజు! నాగ్నజితి కమలాలవంటి కన్నులు కలవాడూ, మోహం పుట్టించు స్వరూపం కలవాడూ, మూడు లోకాల వారిచేత ఆరాధింపబడినవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి తనకు పూజ్యుడగు భర్తగా కోరింది.

మరియూ ఆ ఉత్తమకన్య తనమదిలో

విశ్వవ్యాపకుడూ, నాశరహితుడూ భర్త కావలెనని నేను పూర్వజన్మంలో చేసిన వ్రతం ఫలిస్తే కనుక శత్రుసంహారకుడు, చక్రధారి అయిన శ్రీకృష్ణుడు తప్పక నన్ను పెండ్లిచేసుకుంటాడు.

లక్షి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు ఎవని పాదధూళిని శిరస్సులపై ధరిస్తారో, ఎవడు భూభారాన్ని తొలగించుటకై వినోదంకొరకు అవతారాలెత్తుతాడో అలాంటి శ్రీకృష్ణుడు నాపట్ల ఏ విధంగా నడచుకొంటాడో?

ఈ విధంగా నాగ్నజితి ఆలోచిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు నగ్నజిత్తును చూచి మేఘగంభీర స్వరంతో ఈ రీతిగా అన్నాడు.

రాజా! క్షత్రియపుత్రులు ఇతరులను ఏమియూ అడుగరు. మంచితనంతో వచ్చాను. నీ కొమార్తెను కోరుచున్నాను. నాకిచ్చి పెండ్లి చేయవయ్యా! కాకపోతే మేము కన్యాశుల్కం ఇచ్చేవాళ్లం కాము సుమా!

(ఇందులో ఆనాటి కన్యాశుల్క సంప్రదాయమూ శ్రీకృష్ణుని వ్యక్తిత్వం వ్యక్తమౌతున్నాయి.)

అని శ్రీకృష్ణుడు పలుకగా నగ్నజిత్తు ఇట్లన్నాడు.

ఈ పదునాల్గు లోకాలలో నాకొమార్తెను వివాహమాడుటకు నీకంటె గొప్పవాడు ఇంకొకడు ఎవడున్నాడు? నీ కల్యాణ గుణాలకు ఆశ్చర్యపడి లక్ష్మి ఇతర ప్రయత్నాలకు స్వస్తి చెప్పి, నీయందే ఆసక్తి కలిగి, నీ వక్షఃస్థలంలో అనపాయినియై(విడువనిదై) కృతార్జురాలైనది గదా!

ఎవడు పొగరు కలిగిన ఆబోతులు ఏడింటివిజ్బంభణాన్ని ఓర్చుకొని, వాటిల్ని గెలుస్తాడో, ఆ శూరునికి నా పుత్రికను ఇస్తానని నేను బలగర్వులయిన రాజకుమారులను రప్పించాను. వారు ఆ ఆబోతుల కాళ్లతన్నులకూ, కొమ్ములపోటులకూ కొంచెంసేపయినా పోరాటంలో నిలబడలేక దెబ్బతిన్న శరీరాలతో వైదొలగిపోతారు.

శ్రీకృష్ణా! సూర్యుడు చీకట్లను పారదోలినట్లు నీవు భయంకరమయిన యుద్ధంలో శత్రువుల్ని తరిమివేశావు. అసామాన్యమయిన రణచాతుర్యం కలవాడివి. ఇప్పుడు ఏడు ఆబోతులను పోరాటంలో జయించి ప్రకాశిస్తున్నవాడివై మా పుత్రికను పెండ్లిచేసుకో!

అని నగ్నజిత్తు తన కూతురు పెండ్లికి విధించిన కట్టుబాటు చెప్పగా విని

అఘాసురునికి శత్రువూ, వత్సబకాసురులనూ, కంసుణ్ణీ సంహరించినవాడూ; దుష్టులను దండించినవాడూ, అయిన శ్రీకృష్ణుడు ఆబోతులను చూచాడు. ఆ ఆబోతులు పాపకార్యాలు చేసేవి. అవి ఇంతింతనరాని పరాక్రమం కలిగినవి. వాడియైన కొమ్ములతో పరాక్రమవంతుల ముఖాలమీది కండలను పీకివేసేవి. మారణకార్యాలు స్వభావంగా చెలరేగేవి. మహాక్రూరా లైనవి.

శ్రీకృష్ణుడు నడుముకు వస్త్రం బిగించి కట్టుకొని, ఏడురూపాలు ధరించి, బాలకుడు ఏడుచెక్కబొమ్మలను పట్టుకొన్నట్లుగా, కొండలవంటి ఆబోతులను పట్టుకొని, గ్రుద్ది నేలమీద పడేటట్లు త్రోచి రాజులు మెచ్చగా ఈడ్చాడు.

ఈ విధంగా ఆబోతులను పట్టి కట్టి ఈడ్చిన శ్రీకృష్ణునికి నగ్నజిత్తు తన కొమార్తెను నాగ్నజితిని ఇచ్చి పెండ్లిచేశాడు. శ్రీకృష్ణుడు అల్లుడయినందులకు రాణులు సంతోషించారు. ఆ సమయంలో బ్రాహ్మణులదీవనలూ, వివిధవాద్యాల ధ్వనులూ అతిశయించాయి. 

నగ్నజిత్తు నూతనదంపతులను రథమెక్కించి సాగనంపాడు. అతడు పదివేల ఆవులనూ, విచిత్రమయిన వస్త్రాభరణాలు ధరించిన మూడువేలమంది యువతులనూ, తొమ్మిదివేల ఏనుగులనూ, వాటికంటె నూరురెట్లు ఎక్కువయిన రథాలనూ, రథాలకంటె నూరు రెట్లు అధికమయిన గుర్రాలనూ, గుర్రాలకంటె నూరురెట్లు మించిన వీరభటులనూ కట్నంగా సమర్పించాడు. శ్రీకృష్ణుడు నాగ్నజితితో కూడి ద్వారకకు వెళ్లేటప్పుడు

ఇంతకు ముందు నాగ్నజితిని వివాహం చేసికోవాలని వచ్చి, ఆబోతులచేత ఓడిపోయి, వెళ్లినరాజులందరూ శ్రీకృష్ణు డామెను పెండ్లాడె నని గూఢచారులద్వారా విని, దారిలో శత్రువులపొగరు అణచివేసే అతణ్ణి ఎదుర్కొన్నారు.

శత్రువులయిన రాజులందరూ ప్రతాపంతో శ్రీకృష్ణుణ్ణి ఎదిరించారు. అప్పుడు అర్జునుడు అడ్డుపడి రణరంగంలో గాండీవంనుండి వదలిన బాణాలతో సింహం కుందేళ్లను చంపేటట్లు బంధువులందరూ స్తుతింపగా శత్రువులనందరినీ సంహరించాడు.

శ్రీకృష్ణుడు ఈ విధంగా నాగ్నజాతిని వివాహమాడి కట్నాలూ, కానుకలూ తీసుకొని ద్వారకకు వచ్చి సత్యభామతో వినోదిస్తున్నాడు. ఆ పిమ్మట

శ్రీకృష్ణుడు వైరులు భీతిచెందగా భద్రను పెండ్లిచేసికొన్నాడు. భద్ర శ్రీకృష్ణుని మేనత్త అయిన శ్రుతకీర్తికీ, కేకయరాజుకూ కూతురు. సందర్శన రాజు మున్నగువారి సోదరి. 

ఆమె జనులు స్తుతింపదగింది. తల్లిచేత సంతోషపెట్టబడేది. యౌవనవతి. నిర్మలాలై చలించే కంటికొనలు కలదీ, నీతిపట్ల జాగ్రత్త కలదీ, అపారమైన సద్గుణాలు కలదీ అయిన ఉత్తమురాలు.

తరువాత

శ్రీకృష్ణుడు, దేవతలను తరిమి పాములపాలిటి యముడయిన గరుత్మంతుడు అమృతం తెచ్చినట్లుగా, పొగరెక్కి మిన్నూ మన్నూ కానని రాజులను జయించి, మద్రరాజకుమారిని లక్షణను పరిగ్రహించి తెచ్చాడు. లక్షణ మదించిన లేడి కన్నులవంటి కన్నులు కలది. నీతి వివేకం కలది. శుభప్రదమైన లక్షణాలు కలది.

ఈ విధంగా రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ లనే వారు శ్రీకృష్ణునికి అష్టమహిషులయ్యారు. తరువాత నరకాసురుణ్ణి చంపి, అతడు చెరసాలలో పెట్టిన పదారువేలమంది కన్యలనూ, రోహిణి మొదలగువారినీ; శ్రీకృష్ణుడు స్వీకరించాడు - అని చెప్పగా విని

శ్రీకృష్ణుడు భూదేవికి గారాబుబిడ్డ అయిన నరకాసురుణ్ణి ఏ కారణంచేత సంహరించాడు? నరకాసురుడు సౌందర్యవతులయిన ఆ యువతులను ఏ కారణంగా చెరసాలలో పెట్టాడు?

శుకమహాముని పరీక్షిత్తుతో ఇట్లా అన్నాడు. అదితి నరకాసురుని మూలంగా చెవికమ్మలూ, వరుణునిగొడుగూ, మేరుపర్వతభాగమయిన మణిపర్వతమూ కోల్పోగా - ఇంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి విజ్ఞప్తిచేశాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ణి ఎక్కి నరకాసురుణ్ణి సంహరించటానికి బయలుదేరాడు. అప్పుడు సత్యభామ అతనితో ఈ విధంగా పలికింది.

శ్రీకృష్ణుడు సత్యభామతో గూడ నరిగి నరకాసురుని వధించుట





No comments:

Post a Comment

Srikrishnudu Kalindi Mitravinda Nagnajiti Bhadra Lakshana Yanu Varala Barinayamaaduta - శ్రీకృష్ణుడు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారల బరిణయమాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీకృష్ణుడు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారల బరిణయమాడుట తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరా...