Tuesday, August 11, 2026

Ravanapravesam - రావణప్రవేశం

రామాయణం సుందరకాండ పద్దెనిమిదవ సర్గ - రావణప్రవేశం

తెల తెల వార నున్నది. ఆ సముయంలో

యజ్ఞకార్య నిర్వహణ సమర్ధులయిన వేదవేత్తల వేదపఠనం వినిపించింది. దానిని అనుసరిస్తూ మంగళవాద్య ధ్వనులు వస్తున్నాయి. అప్పుడు నిద్రలేచిన దశకంఠుడు సీతాదేవి మీద కాంక్షతో శయ్య దిగాడు. జారిన ఆభరణాలూ, వస్త్రాలూ విడిచి, నూతనవస్త్రాభరణాలంకృతుడై
అశోకవనానికి బయలుదేరాడు.

మణిఖచిత సువర్ణ తోరణాలతో అలరారే ఉద్యానవన వీధులను దాటి వస్తున్నాడు.

దేవేంద్రుని వెన్నంటివచ్చే అప్పరసల వలె నూరుగురు గంధర్వ భామినులు ఆయన వెనుక బయలుదేరారు.

కొందరి చేతులలో బంగారు కాగడాలు, కొందరి హస్తాలలో తెల్టని వింజామరలు, మరికొందరి కరాలలో తాళవృంతాలు. బంగారు కుండలలో పవిత్ర జలాలతో కొందరు, మరికొందరు రత్నపీఠాలతో, ఖడ్గపాణులై కొందరు.

రత్నమయ పాత్రలో ఆసవం నింపి ఒకతె.
చంద్రకాంతు లీనే వెండిగొడుగుతో మరొకతె.
అందరూ నిద్రమత్తుతో అలసిన కనులవారే.

వారందరూ మేఘాన్ని అనుసరించే మెరుపులవలె ఉన్నారు. చెదరిన కేశపాశాలు, అస్తవ్యస్తమయిన హారనూపురాలు, జారిన మంచి గంధపు పూతలు, చిరుచెమటలు నిండిన వదనాలు.

అందరూ రావణ ప్రియభామలే; ఎంతో గౌరవంతో, కామంతో సేవించేవారే.

ఆయన మాత్రం సీతనే వాంఛిస్తున్నాడు. నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు,

వస్తూన్న వనితామణుల అందెల రవళులు, వడ్డాణపు గంటల ధ్వనులు హనుమంతుని చెవిని పడ్డాయి.

సువాసనభరితమయిన తైలంతో తడిపిన వస్త్రాలు చుట్టిన కాగడాల కాంతులలో వన ప్రవేశద్వారం చేరాడు రావణుడు. మదనోద్దీప మదంతో ఎరుపెక్కిన విశాలనయనుడైన రావణుడు ఇక్షుశరాసనం చేతిలో లేని మన్మథుని వలె ఉన్నాడు.

అమృతమథన సమయంలో పుట్టిన నురుగువలె ఉన్న ఉత్తరీయం ఆయన భుజకీర్తులలో చిక్కుకుంటుంటే దాన్ని విలాసంగా సవరిస్తున్నాడు.

ఆయన ముందుకు వస్తూంటే హనుమంతుడు ఆకుల గుబురులలో చేరాడు.

రావణ ప్రియకాంతలు కనిపించారు.

అలంకార శోభితుడై, శంకుకర్ణకాంతితో అలరారే విశ్రవస నందనుడైన రావణుని చూచాడు, హనుమంతుడు.

నక్షత్ర మధ్యంలో చంద్రునివలె ఉన్నాడు, రావణుడు.

బాగా పరిశీలించి-

ఓహో! అంతఃపురంలో హంసతూలికా తల్పంమీద నిద్రిస్తున్న దీయనేనా! అనుకున్నాడు.

ఆ తేజస్సును చూచి ఒక్కమారు ఎగిరి గంతువేశాడు. మళ్ళీ గుబురులలో దాగి చూస్తున్నాడు.

పరమ సుందరాంగి అయిన జానకిని సమీపిస్తున్నాడు రావణుడు.


జానకీదేవి

రామాయణం సుందరకాండ

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Trnaprayum - తృణప్రాయుం

రామాయణం సుందరకాండ ఇరువది ఒకటవ సర్గ -  తృణప్రాయుం రావణుని ప్రలోభపూరిత మయిన కామప్రసంగం విన్న సీత, ఎదురుగా వున్న గడ్డిపరకతీసి రావణుని ముందుంచి,...