Tuesday, August 25, 2026

Bhudevi Srikrishnuni Stuthinchuta - భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
భూదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

“అంభోజనాభున కంభోజనేత్రున కంభోజమాలాసమన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసుదేవునకును దేవదేవునకును
భక్తులు గోరినభంగి నే రూపైనఁ బొందువానికి నాదిపురుషునకును
నఖిలనిదానమై యాపూర్ణవిజ్ఞానుండైనవానికిఁ బరమాత్మునకును

ధాతఁ గన్న మేటితండ్రికి నజునికి, నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప, రాపరాత్మమహిత! యమితచరిత!

అఖిలజీవస్వరూపా! నిరుపమానా! ఈశ్వరా! పరాపర ప్రకృతి దయరూపా! నిరవధికచరితా! శ్రీకృష్ణా! నీవు పద్మం నాభియందు కలవాడివి. కమలాలవంటి కన్నులు గలవాడివి. పద్మహారం కలవాడివి. పద్మాలవంటి చరణాలు కలవాడివి. అనంతశక్తి సంపన్నుడివి. 

వసుదేవునికుమారుడివి. దేవతలకే దేవుడివి. భక్తులు కోరిన ఏ రూపమైనా ధరించేవాడివి. సృష్టికి పూర్వమే ఉండే పురుషుడివి. సర్వానికీ మూలకారణమైనవాడివి. పరిపూర్ణ విజ్ఞానివి. పరమాత్ముడివి. బ్రహ్మను కనిన గొప్పతండ్రివి. జననం లేనివాడివి. ఇట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను.

దేవా! నీవు రజోగుణంతో కూడి బ్రహ్మవై లోకాలను సృష్టిస్తావు. సత్త్వగుణం కలిగి విష్ణువువై వాటిల్ని రక్షిస్తావు. తమోగుణాన్ని ధరించి వాటిల్ని నశింపజేస్తావు. నీవే కాలస్వరూపుడవు.

పరమాత్మవు; ప్రకృతి, పురుషుడు, మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలూ, కర్మేంద్రియాలూ, శబ్దరూపరసాదులూ - అనే పంచవింశతితత్వాలూ (25), ఇంద్రియాల అధిదేవతలూ, స్థావరజంగమాలతో కూడిన యావద్విశ్వమూ సాటిలేని నీయందే పుడుతున్నాము.

భక్తుల్ని చల్లని చూపులతో చూచేవాడా! జాలిగొలుపే వారిని కాపాడేవాడా! దయతో ఈ వైపు చూడవయ్యా!. వీడు నరకాసురుని కుమారుడు. నిన్ను చూచి భయపడుతున్నాడు. వీడు పసిబిడ్డ. దిక్కులేనివాడు. దుఃఖిస్తున్నాడు. ఏ ఆశ్రయం లేనివాడు. తండ్రిమాదిరిగా పరాక్రమంతో ఎదురు తిరుగడం తెలియనివాడు. నీ కాళ్ల దగ్గరకు చేరాడు.

ఈ విధంగా భూదేవి భక్తితో శ్రీకృష్ణునికి నమస్కరించి, మాటల పూలతో పూజచేసింది. భక్తానురాగం కలిగిన శ్రీకృష్ణుడు నరకాసురుని కుమారుడయిన భగదత్తునికి అభయప్రదానం చేసి, సర్వభాగ్యాలూ ప్రసాదించాడు. తర్వాత నరకునిభవనం ప్రవేశించి, దానిలో


శ్రీకృష్ణుడు పదాఱువేల కన్నియల వరించి దేవలోకమునకు బోయి పారిజాతము దెచ్చుట





No comments:

Post a Comment

Rugvedam & Yajurveda Upaakarma - ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ

ఋగ్వేదం & యజుర్వేద ఉపాకర్మ ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం రోజున ఉపాకర్మ నిర్వహిస్తారు. ఉపనయనం తరువాత,  ఉపాకర్మ  మొదటి రోజ...