Sunday, August 23, 2026

Vishwakarma Krishnaniyogambuna Samudramulo Dwaraka Nagaramunu Nirminchuta - విశ్వకర్మ కృష్ణనియోగంబున సముద్రములో ద్వారకా నగరమును నిర్మించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
విశ్వకర్మ కృష్ణనియోగంబున సముద్రములో ద్వారకా నగరమును నిర్మించుట

కాలయవనుడు మధురపై దాడిచేసి ఆక్రమించాడు. ఇక ఈ రోజో, రేపో ఎల్లుండో జరాసంధుడు కూడా దాడి చేస్తాడు. ఈ ఇద్దరూ చాలా భయంకరులు, క్రూరులు. మనకు గొప్ప శత్రువులు. ఒకడితో మనం పోరాడుతూ ఉంటే, మరొకడు మరోవైపు నుంచి దాడి చేస్తాడు. మన బంధువులనందరినీ చంపేస్తారు. లేదా చెఱపడ్తారు. జరాసంధుడు చాలా క్రూరుడు అంచేత, ఇలాంటి గొప్ప శత్రువులకు దాడి చేయడానికి వీలుకాని ఒక క్లిష్ట ప్రదేశంలో ఒక దుర్గాన్ని కట్టాలి. అందులో మన బంధువుల నుంచాలి.

ఈ విధంగా శ్రీకృష్ణుడు ముందు వెనుకలు ఆలోచించాడు. శత్రువులకు ప్రవేశించడానికి, సమీపించడానికి వీలుకాని ఒక దుర్గం కట్టించాలనుకున్నాడు. దానికోసం సముద్రంమధ్యంలో పన్నెండు ఆమడల పొడవు, అంతే వెడల్పు ఉన్న స్థలాన్ని, సముద్రుడి నడిగి సంపాదించాడు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఒక నగరాన్ని నిర్మించమని విశ్వకర్మను కోరాడు.

వరుణదేవుని పురాన్ని ఇంద్రునినగరాన్ని కుబేరునినగరాన్ని యముడిపట్టణాన్ని, బ్రహ్మనగరాన్ని మించి పోయేలా, గొప్పగా ప్రకాశించే ఒకనగరాన్ని విశ్వకర్మ రూపొందించాడు.

ఆ కోటగోడ ఎంత ఎత్తుందంటే, అది ఆకాశానికి తోడబుట్టిందా అన్నట్లు ఉంది. దానికి ఉన్న కందకాలు పాతాళం కంటె లోతుగా ఉన్నాయి. ఆ లోతు ఎంతో ఎవరికీ అంతు చిక్కదు.

ఆ నగరంకోట ఎత్తెనది. అది ఆకాశంతో పోటీ పడుతుంది. కోట, ఆకాశం రెండూ తమలో తాము కలహించుకుంటున్నాయి. ఎవరు ఎత్తైన వాళ్లో తేల్చుకోవాలను కుంటున్నాయి. ఆ ఊళ్లో ఆ రెంటిమధ్య జరుగుతున్న గొడవను అడ్డుకోవడానికి మధ్యలో నిలబడ్డ వాచాటుల గుంపువలె, కోట ప్రాకారాల చివర నక్షత్రాల గుంపులు ఆవేళలో అందంగా ప్రకాశిస్తూ ఉంటాయి.

ఆ నగరంలో అందమైన ప్రవేశ ద్వారాలున్నాయి. తలుపులు, గోడలు, ఇంటి చూరులు, స్తంభాలు, గడియలు, దారులు, అరుగులు, కిటికీలు, ముంగిళ్లు, సమావేశస్థలాలు, ఇళ్లు, చావళ్లు, చలివేంద్రాలు, భవనాలు, మిద్దెలు, కోటలు, రాచభవనాలు, రచ్చబండలు, మిద్దెమెట్టు, నాల్గువీథులకూడళ్లు అన్నీ ఎంతోవైభవంతో, బంగారుతో, మణులతో కూడి నున్నగా తళతళలాడుతున్నాయి.

వింటున్నావా మహారాజా! ఆ పట్టణంలో ఎత్తైన మేడలున్నాయి. ఆ మేడలచివరిఅంతస్థులపై రకరకాల గ్రహాలు తిరుగుతూ ఉండడం వల్ల, ఆ అంతస్థులలో తమ పురుషులతో రమించే స్త్రీలు సిగ్గుపడి సుఖించకుండా ఉన్నారు.

ఆ పురంలో వరుసగా ఉన్నట్టి వజ్రాలతో, నీలమణులతో, బంగారంతో మిద్దెలైన రాజభవనాలు ఉన్నాయి. అవి - ఆ భవనాల కిటికీల నుంచి అగరుపొగలు దట్టమైన నల్లని మేఘాలవలె వెలువడుతున్నాయి. వాటిని చూచి, ఎత్తైన చెట్ల కొమ్మలమీద చేరి, నెమళ్లు నాట్యం చేస్తున్నాయి.

ఆ ఊళ్లోని జనం పెద్ద భవనాలకు దగ్గరగా పోతున్నపుడు వాటిమేడలపై నున్న బంగారుకలశాలలో సూర్యుడు ప్రతిబింబించగా ఏదిబింబమో, ఏది ప్రతిబబింబమో నిర్దారణచేసుకోలేక పలువురు సూర్యులు ఉన్నారని ఆశ్చర్యపడుతూ ఉంటారు.

ఆ తోటలలో రకరకాల వృక్షాలున్నాయి. లతలు, మొగ్గలు, కసి మొగ్గలు, పూల గుత్తులు, అరవిరిసిన పూలు; పూలలోని తేనె ధారలు, ప్రకాశిస్తున్న తీగలతో, కాండాలతో, బోదెలతో, కొమ్మలతో, ఆకులతో, చిగుళ్లతో, పూలతీగలతో, ఊడలతో, పుప్పాడితో, వేళ్లతో నిండిన పెద్దమానులతో, రకరకాల తీగలతో ఉండి, మంగళశోభలతో, మనసును దోచుకునే పరిమళాలను విరజిమ్ముతున్నాయి.

ఆ నగరంలో కొలనులున్నాయి. అందులో కలువలు, తామరపూలు ఉన్నాయి. ఆ కొలనులు వైభవోపేతంగా ఉన్నాయి. చూచేవారికి మనోహరంగా ఉన్నాయి. నెమ్మదిగా వీస్తున్న గాలికి చెదరగొట్టబడిన విస్తారమైన నీళ్ల తుంపరలు ఎగసిపడుతున్నాయి. అక్కడ హంసలు, వాటితో పాటు నీటి పక్షులూ ఉన్నాయి.

ఆ నగరంలోని పౌరులమేడలలో గాలి కొత్తగా పూచిన పూలపరిమళాల బరువుతో వేగం తగ్గి నెమ్మదిగా వీస్తూ మదనకేళిలో అలసిన తనువుల మీది చెమటను పోగొడుతూ ఉద్యానవనాల నుండి వస్తున్న గాలి విహరిస్తూ ఉంటుంది.

బ్రహ్మత్వం చులకన అవుతుందని బ్రహ్మ తన సత్తా చాటుకోవడానికి రాడుగాని, ఒకవేళ వస్తే ఆ నగరంలోని బ్రాహ్మణులు బ్రహ్మవిద్యాది కళల్లో ప్రజ్ఞావంతులై చర్చలలో ఆ బ్రహ్మదేవుణ్ణి చిక్కులపాలు చేస్తారు.

ఆ నగరంలోని బ్రాహ్మణులు చేసిన యజ్ఞాలనుంచి లేచిన పొగవల్ల విశాలమైన ఆకాశం నల్లరంగుతో ఎంతో అందంగా ఉంది. లేకపోతే గ్రహాలు పట్టిందైనా గగనం అలా ఉంటుందా?

ఆ ఊళ్లోని రాజకుమారులు ఏదైనా మాట ఇస్తే దాన్ని వెనక్కి తీసుకోరు. మాటపై నిలబడతారు. సహాయం కోరి ఎవరైనా అడిగితే వాళ్ల నుండి తప్పించుకుని దాచిపెట్టుకోరు. సహాయం చేస్తారు. ఇతరుల స్త్రీలను ఆశించరు. యుద్ధంలో వెనకడుగు వేయరు.

సముద్రానికి 'రత్నాకరం' అని పేరు. రకరకాల రత్నాలకు అది నెలవు అని ప్రసిద్ధి. అలాంటి పేరున్నప్పటికీ అది రత్నాలను ఇవ్వలేదు. మరి అది ఎలాంటి రత్నాకరమో! ఈ ఆనగరంలో శ్రేష్ఠులైన వైశ్యులున్నారే, వాళ్లు రకరకాల రత్నాలను కొనగలరు, అమ్మగలరు. వాళ్లు రత్నాకరాన్నే జయించినవాళ్లు.

('రత్నాకరం' అంటే రత్నాలకు నెలవుగా ఉన్నది అని అర్థం. కవి ఈ మాటపై చమత్కారం సాధిస్తున్నాడు. అది రత్నాల నిచ్చేది కాదనీ, వట్టి నీటిమూట అనీ చెపుతున్నాడు. అందుకే 'జలనిధి' అని తేల్చి చెప్పాడు.

రత్నాలు తొమ్మిది. ముత్యం, పద్మరాగం, వజ్రం, పగడం(ప్రవాళం), మరకతం, నీలం, గోమేధికం, పుష్యరాగం, వైడూర్యం. ఇవి నవరత్నాలు. ఇవి సముద్రంలో ఉంటాయని అంటారు.)

ఆ ఊళ్లోని మదపుటేనుగులు చాలా ఎత్తైనవి. తొండాలతో పర్వత శిఖరాలను పడగొట్ట గలిగినంత బలమున్నవి. వాటి చెక్కిళ్లనుండి స్రవించే మదజలం కోసం తుమ్మెదలు సమ్మోహితమైపోతుంటాయి. ఆ ఏనుగుల శరీర సౌష్ఠవం ఎంతటి దంటే వాటిని మహాపర్వతంతో పోల్చి చెప్పవచ్చు

ఆ పట్టణంలోని గుర్రాలు అందరికీ ఇష్టాన్ని కలిగిస్తాయి. వేగంలో వాయువేగ, మనోవేగాలను మించిపోతాయి. ఉత్తమ జాతికి చెందినవి. వినయంగా, ఒద్దికగా ఉండేవి. భయ మెరుగనివి. శత్రు సమూహాలను గెలువ గలిగినవి.

ఆ పురంలో భటులున్నారు. వాళ్లు ఎలాంటివారంటే, పులులవలె, సింహాలవలె, శరభాలవలె, మదపుటేనుగులవలె గొప్ప దారుఢ్యం కలిగిన వాళ్లు. రకరకాలైన యుద్దాలలో ప్రవీణులు.

ఆ ఊళ్లో ఉండేవాళ్లకు ఆకలి, దప్పిక వంటివి లేవు. శ్రీకృష్ణుని దయావిశేషం వల్ల వాళ్లు ఈ భూమిమీద దేవతలతో సమానులై ప్రకాశిస్తూ ఉంటారు.

రాజా విను. ఆ నగరంలో ఉండే ప్రజలు శ్రీకృష్ణునిపాదాలను సేవించడంలోనే ఆసక్తి చూపుతారు. శ్రీకృష్ణునికి విరుద్ధమైన పనులను చేయడంలోనే వారికి భయం. శ్రీకృష్ణునిపట్ల భక్తిలోనే మైమరచిపోతారు. శ్రీకృష్ణునిపై స్తోత్రాలను చెప్పడంలోనే ఆనందబాష్పాలు కారుస్తారు. శ్రీకృష్ణుని భక్తులపైననే పక్షపాతం వహిస్తారు.

శ్రీకృష్ణునికంటే భిన్నమైన ఇతరుల లీలలను ఆచరించడంలోనే వ్యతిరేకత చూపుతారు. శ్రీకృష్ణునిపూజను చేయడంలోనే శ్రమిస్తారు. అచ్యుతునిమార్గం కాక దుష్టులైన పరులు నడిచే త్రోవల్లోనే నడవడంలోనే వీరికి బంధం ఏర్పడుతుంది. శ్రీకృష్ణుణ్ణి ఎడబాసిన క్షణాలలోనే బాధ కలుగుతుంది. శ్రీకృష్ణుని సేవించే పద్ధతుల్లోనే ఒకరిపై ఒకరికి వీళ్లలో మాత్సర్యాలు - అంతే తప్ప ఇతర విషయాల్లో కాదు.

శ్రేష్ఠమగు ఆ పట్టణంలో నివసించే శ్రీహరికి పారిజాతవృక్షమునూ, 'సుధర్మ' అనే దేవసభనూ దేవేంద్రు డిచ్చాడు. ఒక చెవిమాత్రమే నలుపురంగు గలిగి తక్కిన ఒడలెల్ల తెల్లనై, మనోవేగం కలిగిన గుఱ్ఱాలను వరుణు డిచ్చాడు. మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్చపం, నీలం అనే పేర్లుగల ఎనిమిది నిధులను కుబేరు డొసగినాడు. తక్కిన లోకపాలకు లందరూ తమ తమ అధికారాల సిద్ధికోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహంవల్ల లభించిన సకలవిభూతులను మరల అచ్యుతునికే అతిభక్తితో సమర్పించారు.

భూదేవిని తన శుభలక్షణాలతో సంతృప్తిపరచినవాడు, భయంకరంగా చెలరేగుతున్న దుఃఖమనే వరదను దాటించే నావ వంటివాడు అయిన శ్రీకృష్ణునికి విశ్వకర్మ అనే దేవశిల్పి తన శిల్పకళాప్రావీణ్యంతో ఒక నగరాన్ని ఉత్సాహంతో నిర్మించి సమర్పించాడు.

ఇలా విశ్వకర్మ సృష్టించిన కొత్తనగరం ద్వారక. అందులో మథురానగరప్రజలను, శ్రీకృష్ణుడు తన యోగశక్తితో చేర్చాడు. ఆ విషయాన్ని తన అన్న అయిన బలరామునికి చెప్పాడు. ఆయన అనుమతి తీసుకుని మథురానగరం నుండి బయటికి వచ్చాడు. అలా వస్తూండే శ్రీకృష్ణుడు నందనవనంనుండి బయటికి వస్తున్న ఐరావతంవలె ఉన్నాడు. మేరు పర్వతగుహల నుండి వెలికి వస్తున్న సింహంవలె శోభిస్తున్నాడు. చీకట్లను చీల్చే సూర్యుడు తూర్పుదిశలో నుండి పొడుచుకుని వస్తున్నట్లున్నాడు. అలా బయటికి వస్తూ, ఏ ఆయుధాలూ లేని శ్రీకృష్ణుణ్ణి (కాలయవనుడు) చూశాడు. చూచి

శ్రీకృష్ణుడు నిరాయుధుండై కాలయవనుడు వెంటనంట బరువెత్తుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

rukmini kalyana katha praarambhamu - రుక్మిణీ కల్యాణ కథా ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  రుక్మిణీ కల్యాణ కథాప్రారంభము ఓ పరీక్షిన్మహారాజా! మునుపు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడం వల్ల రైవతుడనే రా...