Monday, August 10, 2026

Lankini - లంకిణి

రామాయణం సుందరకాండ ద్వితీయ సర్గ - లంకిణి

తాం రత్న వసనోపేతాం
గోష్ఠాగారావతంసికాం 
యంత్రాగార స్తనీ మృద్దాం
ప్రమదా మివ భూషితాం

మేఘం వలె వ్రేలాడుతూన్న శిఖరాలుకల లంబ పర్వతంమీదుగా లంకా నగరంలో అడుగుపెడుతున్నాడు ధీమంతుడయిన హనుమంతుడు.

అందమైన ఉద్యానవనాలు, స్వాదు జలపూరితా లయిన సరోవరాలు, శరత్కాల మేఘాల వలె భవనాలు. సముద్రపు చల్లనిగాలి. చక్కని ద్వారతోరణాలు. ప్రాంగణాలలో మత్తేభాలు. సర్పరక్షితమయిన పాతాళలోక రాజధాని బోగవతిలా ఉంది లంకానగరం.

విద్యుల్లతలు నిండిన మేఘాలతో కాంతివంతమై, చండమారుతంతో అలరారే అమరావతిలా ఉంది.

మయూరాలు, రాజహంసలు, క్రౌంచమిథునాలు - వీటి కలస్వనాలకు తొడుగా నగర నర నారీ జనుల ఆభరణాల ధ్వనులు, భేరీ భాంకారాలు.

నగరం నలుమూలలా ఆయుధ ధారులయిన రాక్షస యోధుల పహరా!

చూస్తున్న హనుమంతుడు: ఈ నగరంలో సామాన్యు డెవడూ అడుగు పెట్టలేడు. అంగద, సుషేణ,
కుముద, మైంద, ద్వివిదులూ వీరితోపాటు కేతుమాల భల్లూకపతి, కుశపర్వ వానరయూధపతి, మా  ప్రభువు సుగ్రీవుడు, తప్ప మారెవరూ యిటు చూడలేరు, అనుకున్నాడు.

అ సమయంలో రామ లక్ష్మణుల పరాక్రమం స్మృతికి వచ్చి హనుమంతునికి ఆనందం కలిగింది.

చూస్తున్నాడు హనుమంతుడు.

రత్నకాంతులే ఆచ్చాదన వస్త్రంగా, గోశాలలే భూూషణాలుగా, యంత్రాగారాలే ఉన్నత వక్షోజాలుగా అలంకరించుకున్నట్లుంది లంకానగర నారీరత్నం.

నగర గృహాలలోని దీపకాంతులవల్ల లంకలో చీకటి అనేది లేకుండా పోయింది.

అప్పటికి లంకానగరాధిదేవత వికృతాకారంతో హనుమంతుని ఎదుట నిలిచి గర్జించి: ఇక్కడి కెందుకు వచ్చావు? నీ పేరేమిటి? లంకలో అడుగుపెట్టడం నీ తరం కాదు. ముందు నీ ప్రాణాలు పోయేలోగా నీ వ్యవహారం ఎమిటో చెప్పు, అంది.

హనుమ: ఈ వికృత నేత్రాలతో పురద్వారంలోనే ఉన్న నువ్వెవరవు? ఎందుకింత అట్టహాసం చేసి భయపెడుతున్నావు! నీ కథేమిటి?

లంకిణి : మహాత్ము డయిన ఈ రాక్షసేశ్వరుని ఆజ్ఞానుసారం లంకానగర రక్షణ చేస్తున్నాను. నన్ను కన్ను గప్పి లంకలో అడుగుపెట్టడం ఎవరితరం కాదు. సిద్ధంగా ఉండు, నీ ప్రాణాలు హరిస్తున్నాను.

హనుమ: ఈ విశాల ప్రాకార, తోరణాలతో అలరారే లంకానగరాన్ని చూడాలనే కుతూహలంతో వచ్బాను. ఈ ఉద్యానవనాలు, చిన్ని చిన్ని అడవులు, పెద్ద పెద్ద భవనాలు చూచి పోవాలనివించింది.

లంకిణి : ఓరి దుర్భుద్ధి! వానరాధమా! నా అనుమతి లేకుండా ఈ నగరం చూడగలవా!

హనుమ: అమ్మాయీ, నగరం చూస్తాను. చూసీ, వచ్చిన దారినే వెడతాను.

ఆ ధోరణి లంకిణికి నచ్చలేదు. తన అరచెయ్యి విప్పి గుండె మీద చరిచింది. ఆ పిడుగుదెబ్బకు హనుమంతుడు ఒక్క అరుపు అరిచాడు.

ఉత్తరక్షణంలోనే ఎడమ పిడికిలి బిగించి ఒక్కపోటు పొడిచాడు. ఆ పోటుకే లంకిణి అవయవాలు పట్లు తప్పి, కళ్ళు తేలవైచి నేలమీద వాలింది. ఆయనకు జాలి కలిగింది.

అంతలోనే లంకిణి గద్గద స్వరంతో: ఓ మహాపరాక్రమ సంపన్నుడా! రక్షించు, రక్షించు. బలధైర్యాలు కలవారు నియమవ్రత పరాయణులని ఎరుగుదును. నేనీ లంకా నగరాధి దేవతను. నన్ను నువ్వు ఓడించావు. నీ కింక తిరుగులేదు. ఇది బ్రహ్మ వాక్కు.

ఒకానొక వానరుడు నిన్ను జయిస్తాడు. నాటితో లంకానగర వాసులకు భద్రం లేదని గుర్తుంచుకో, అన్నా డొకప్పుడు స్వయంభూ బ్రహ్మ, అది నిజం.

సీతాదేవి కారణంగా ఈ రాక్షస వంశానికి నాశనకాలం సమీపించింది. నువ్వు నిశ్చింతగా ఈ నగరంలో ప్రవేశించి కర్తవ్యం నిర్వర్తించుకు వెళ్ళు. స్వేచ్చగా సీతాన్వేషణం కొనసాగించు, అంది.

No comments:

Post a Comment

Lankini - లంకిణి

రామాయణం సుందరకాండ ద్వితీయ సర్గ - లంకిణి తాం రత్న వసనోపేతాం గోష్ఠాగారావతంసికాం  యంత్రాగార స్తనీ మృద్దాం ప్రమదా మివ భూషితాం మేఘం వలె వ్రేలాడుత...