Sunday, August 23, 2026

Srikrishnudu Nirayudhundai Kalayavanudu Ventananta Baruvetthuta - శ్రీకృష్ణుడు నిరాయుధుండై కాలయవనుడు వెంటనంట బరువెత్తుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుడు నిరాయుధుండై కాలయవనుడు వెంటనంట బరువెత్తుట

ఏనుగుల గుంపులు లేవు; గుఱ్ఱాల సమూహాలు చుట్టూ లేవు. రథాలు వెంట రావు. వీరసైనికులు వెంట లేరు. ధనుస్సు, బాణం, కత్తి మున్నగు ఆయుధాలను ధరించడు. ఇంద్రధనుస్సుతో కూడిన మేఘంవలె, మెడలో వైజయంతీ మాలను ధరించి, ఒక్కడే అదిగో! నగరద్వారంనుండి బయటికి వస్తున్నాడు చూశారా?

'ఈ నగరం పైకి దండెత్తి వచ్చి ఎన్నిదినాలైందో! ఇంతకు ముందెవ్వడూ ఈ నగరంపైకి దండయాత్రకు రాలేదు. వీడెవడో ఒకడు - చేతిలో ఆయుధాలు లేకుండానే వస్తున్నాడు. నన్ను గెలవడానికి వస్తున్నాడా? లేక ప్రియంగా మాట్లాడిపోవడానికా? లేదా సంపదలను పొందడానికా? అటు చూడండి' అంటూ తనవాళ్లతో కాలయవనుడు ఇలా చర్చించగా-

పరిక్షీన్మహరాజా, ఈ రేడులోకాల నేలే బ్రహ్మ మొదలైన వారికికూడా ఎదురుగా నడవని మంచిగుణాలకు నిధి శ్రీకృష్ణుడు. ఆయన ఆ సమయంలో శ్రేష్ఠమైన ఏనుగునడకవంటి నడకతో అందంగా, నెమ్మదిగా; కాలయవనునికి ఎదురు నడిచాడు.

ఆ సమయంలో యాదవ శ్రేష్ఠుడైన ఆ శ్రీకృష్ణుడిని కాలయవనుడు ఎగా దిగా పరిశీలనగా చూచి (ఇలా అనుకున్నాడు)

పద్మాలవంటి అందమైనకండ్లు కలవాడు, సింహం నడుమువంటి సన్నని నడుమున్నవాడు, లక్ష్మీదేవికి నెలవైన వక్షాన్ని కలిగినవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలిగినవాడు, వానమబ్బువంటి వన్నె కలిగిన దేహమున్నవాడు, చందమామవంటి ముఖమున్న వాడు, అందంగా ఉన్న పొడవైన చేతులున్నవాడు, మెడలో చక్కని వనమాలను ధరించినవాడు, భుజకీర్తులు, హారాలు, కంకణాలు, వెలిగిపోతున్న కుండలాలు కలిగిన ఇతడే నారదముని సూచించిన వీరుడు అయి ఉండవచ్చునని అనుకొంటూ - మూఢుడైన ఆ కాలయవనుడు చాలా పొగరుతో

ఓ పరీక్షిన్మహరాజా! బ్రహ్మవంటి మహామహులకే దొరకనివాడు శ్రీకృష్ణుడు. అలాంటివాడిని కాలయవనుడు పట్టుకోడానికి వచ్చాడు. ఆ యవనుడు చలిస్తున్నతోకతో భయంకరుడైనరాహువువలె కర్కశమైనజడలు ఊగుతూ ఉన్నాయి. ప్రళయకాలంలో అగ్నిజ్వాలవలె బీరుసైన అతనిగడ్డం, మీసం వేలాడుతున్నాయి. మేఘాలు కప్పిన మేరుపర్వతంవలె కవచంతో వాడిశరీరం కప్పబడి ఉంది. పుట్టలో నిద్రిస్తున్న భీకరసర్పంవలె ఒరలో కత్తి ఉంది. అలాంటి కాలయవనుడు గట్టిగా అరస్తూ, విజృంభించి గుర్రాన్ని పరిగెత్తిస్తూ, ఎవరికీ దొరకని శ్రీకృష్ణుణ్ణి తాను పట్టుకుంటానని దగ్గరకు వచ్చాడు.

ఇలా కాలయవనుడు పట్టుకోడానికి వెంట బడేసరికి, శ్రీకృష్ణుడు పట్టుబడకుండా మెరుపు వేగంతో దిక్కుల చివరలు అదిరే విధంగా పరువెత్తాడు. కాలయవనుడు వెంటబడుతూనే ఉన్నాడు.

అప్పుడు కాలయవనుడు ఇలా అన్నాడు.

యదువంశోత్తమా! కృష్ణా! పారిపోకు పారిపోకు. నాతో యుద్ధం చేయడమే తగిన పని. కంసుడు మొదలైనవాళ్లను నీవు రణభూమిలో గెలిచావని తలంచి, నీతో యుద్ధం చేయాలని చాలా ఆశతో వచ్చాను. ఇంతవరకు పొందిన పేరుప్రతిష్ఠలు చెడిపోయేట్లుగా నీవంటి రాజులు శత్రువుకు వెన్ను చూపి పారిపోవచ్చునా? నీవేమైన సామాన్య రాజువా? గుణహీనుడవనే అపకీర్తి నీకు వస్తుంది సుమా!

మాధవా! నీవు ఎక్కడ ఉన్నా నిన్ను పట్టుకుంటాను. నీళ్లలో ప్రవేశించవచ్చు, భూమిక్రిందకు పోయి దాక్కోవచ్చు, కొండపై నెక్కవచ్చు, బలవంతుడెవడిదగ్గరైనా ఆశ్రయం పొందవచ్చు, వికృతరూపాన్ని పొందవచ్చు, సముద్రాన్ని దాటవచ్చు, బ్రాహ్మణునిలా ఉండవచ్చు, నాగలితో పొలాలు దున్నుతుండవచ్చు, గుర్రమెక్కి తిరిగే వాడిఆకారంలో ఉండవచ్చు. నీ వెక్కడ ఉన్నా ఎలా ఉన్నా నిన్ను నేడు లోకమంతా నా కీర్తి చెప్పుకునేలా పట్టితీరుతాను.

(శత్రువులు కృష్ణుణ్ణి నిందించే సమయాల్లోకూడా - అంతర్గతంగా దశావతారాల విశేషాలు స్ఫురించేటుగా చెప్పడం పోతన ప్రత్యేకత. ఇక్కడ తొమ్మిది అవతారాలు వచ్చాయి, కృష్ణుణ్ణి ఎత్తిపొడుపుగా ఉంటున్నందున - 9+1=10.)

అంతేగాకుండా, ఇంకా

కృష్ణా! నీ ఒంటిపై నా బాణాలు వెయ్యనే లేదు; నా అల్లెతాటి శబ్దాలు నీకు వినపడనే లేదు. గుర్రాల డెక్కల నుంచి దుమ్మురేగి నిన్ను కప్పేయడం లేదు. అయినా అయ్యో! నగుబాటు పాలవుతూ పారిపోతున్నావే! ఇలాంటి నీవు ఇంతకు మునుపు అఘాసురుడితో, కాళీయుడితో, కేశితో, కువలయాపీడంతో, మల్లురతో, జరాసంధునితో, కంసుడితో ఎలా పోరాడావో ఏమో! అశ్చర్యంగా ఉంది మరి!

ఇలాగ కాలయవనుడు అంటూ, వెంటపడగా; శ్రీకృష్ణుడు వాడిని ఏమాత్రం లక్ష్య పెట్టక చిరునవ్వు నవ్వుతున్నాడు. పద్మంవంటి ఆయన ముఖానికి ఆ నవ్వు మరింత అందాన్ని ఇస్తూ ఉంది. అలా నవ్వుతూ, కాలయవనుడితో 'తొందరపడకు, నా వెంట రావయ్యా రా, రా' అని పిలుస్తూ

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుణ్ణి పట్టుకోవాలని కాలయవనుడు రకరకాలుగా ప్రయత్నం చేశాడు. శ్రీకృష్ణుడు దొరకలేదు. వాణ్ణి ముప్పు తిప్పలు పెట్టాడు. 'ఇదిగో ఇదిగో దొరికి పోయాడు' అని యవనుడు పట్టుకోడానికి వస్తాడు. శ్రీకృష్ణుడు అందకుండా ఒక్కసారి ఎగిరి దూకి దూరంగా పోతాడు. 

'ఇతడితో పాటు పరిగెత్తలేను. వీడివేగం అందుకోలేను. ఇక నేను పట్టుకోలేను' అని యవనుడు మనసులో అనుకగానే కృష్ణుడు దగ్గరగా వచ్చి నిలుస్తాడు. ఏదో ప్రయత్నం చేసి పక్కనుంచి యవనుడు అడ్డు వచ్చి నిలిస్తే వెనకకు అటూ ఇటూ వెళ్లి ఏమార్చి పారిపోతాడు. పుట్టలు, చెట్లు, సరస్సులు అడ్డం వస్తే కుడిఎడమలుగా తిరుగుతూ వెళ్తాడు. 

తగ్గు ప్రదేశాల్లో దాక్కొని. ఎత్తు ప్రదేశాల్లో కనపడతాడు. నీడల్లోకి వెళతాడు. మరుగుప్రదేశాలలో తిరుగుతాడు. 'నన్ను పట్టుకోగలిగితే నీవు సరిఅయిన మగవాడివి', అంటూ కవ్విస్తాడు. అనేక లోకాలనూ కాపాడే శ్రీకృష్ణుడు కాలయవనుణ్ణి ఇలా ముప్పుతిప్పలు పెట్టాడు.

('నన్ను పట్టుకోగలిగితే నీవు మానవుడివి' అని చేసిన హెచ్చరికలో వీరత్వమూ ఉంది, ఆధ్యాత్మికతా ఉంది. 'పట్టుకో చూద్దాం. పట్టుకుంటే నీవు మగాడివే అని ఒప్పుకుంటాను' అనే కవ్వింపు పైపైన ఉంది. 'నన్ను భక్తితో వశం చేసుకో గలిగితే నీవు మానవుడుగా పూర్ణత్వం పొందుతావు' అనే సూచన ఉంది.)

ఆ తర్వాత

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు కాలస్వరూపుడు. అన్నికాలాలూ ఆయనరూపమే. అయినప్పటికీ, కాలాన్ని చూచి, నోటమాట రాని వానిలా కనబడతాడు. భయం లేకుండా పారిపోతాడు. అన్ని ప్రాణులకు తానే ఆవాస స్థానమైనప్పటికీ, అడవులు, కొండలు దాటిపోతాడు. లోకంలో అన్నిటికంటే ఉన్నతుడు, లోకాలకు కన్నువంటివాడు అయినప్పటికీ, పదే పదే మెడ ఎత్తి వెనక్కి తిరిగి నిక్కిచూస్తాడు. 

తనవారు, పగవారు అనే సంబంధాలేవీ లేనప్పటికీ, శత్రువు తన వెంట పడితే పారిపోతాడు. గెలుపు, ఓటమి అనే భావాలు లేకున్నాకూడా, తాను ఓటమి పొందినట్లు అగుపిస్తాడు. భయపడక పోవడం, భయపడడం అనేవి ఏవీ లేకపోయినా కూడా భయపడ్డవాడువలె కనిపిస్తాడు - అంటే ద్వంద్వాతీతుడు.

శత్రువులభవనాలను చీల్చినవాడు, అంతులేని వేగంతో గాలినే ఓడించినవాడు అయిన కాలయవనుణ్ణి పైవిధంగా కృష్ణుడు దూరంగా తీసుకునిపోయి. భయం గొలిపే ఒక కొండగుహలోకి గబుక్కున ప్రవేశించాడు.

'అదిగో దొరికి పోయాడు, ఇదిగో దొరికిపోయాడు అదిగో పట్టుకుంటాను. ఇదిగో పట్టుకుంటాను' అంటూ ఆశకు లోబడిన కాలయవనుడు యాదవసింహమైన శ్రీకృష్ణునికాలిగుర్తులను అనుసరించి వెళుతూ వాడు కూడా కొండగుహలో ప్రవేశించాడు.

ఇలా గబుక్కున గుహలోకి దూరి కాలయవనుడు - మూర్ఖునిమనస్సువలె చీకటితో(అజ్ఞానంతో) నిండి ఉన్న ఆ గుహలో పెద్దపరుపుమీద నిద్రలో మునిగి గురకపెడుతున్న ఒక మహాపురుషుణ్ణి చూచి, అతడే శ్రీకృష్ణుడని తలచాడు. ఆయన్ను చూచి

పురుషాధమా! నాతో యుద్ధంలో పోరాడలేక, పారిపోతూ ముళ్లచెట్లతో, పెనుశిలలతో, భయం గొలిపే ఏనుగులతో, ఖడ్గమృగాలతో, సింహాలతో, పెద్దపులులతో, సివంగులతో నిండిన చొరరానిమార్గంలో పరుగెత్తి వచ్చి, ఈ కొండగుహలో నిద్రిస్తున్నవాడివలె కాళ్లు చాచుకొని నటిస్తున్న నిన్ను పోనిస్తానా? (పోనివ్వనని భావం)

నీవు ఎక్కడా దొరకవనీ, ఎవరికీ చిక్కవనీ నారదుడు అన్నాడు. మరి నాకు దొరికావు. ఎక్కడికని పోగలవు? నీవు నిద్ర నటిస్తున్న నిన్ను నిజంగా ఇక్కడే - ఈ కొండలోనే నిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చుతాను.

(నారదుడు చెప్పినమాట ఆధ్యాత్మికం. యవనుడు గ్రహించిన అర్ధం లౌకికం. 'ఎవరికీ దొరకడు' అంటే మహా యోగులకే అందనిపరతత్త్వం ఆ కృష్ణుడు అని నారదుని ఉద్దేశం

ఇలా అంటూ యవనుడు వికటంగా శబ్దంచేస్తూ - నవ్వి, వేగంగా పరుగెత్తుతూ వచ్చి, వజ్రాయుధంవంటి కర్కశమైన తన కాలితో - నిద్రిస్తున్న ఆ వ్యక్తిని ఎగసి తన్నాడు, ఆ కాలిదెబ్బతో గుహ ప్రతిధ్వనించింది.

అలా తన్నగానే ఆ మహాపురుషుడు నిద్ర లేచాడు. ఒళ్లు విరుచుకున్నాడు. పద్మాలవంటి రెండుకళ్లనూ మెల్లగా తెరిచాడు. లోలోపల కోపం చెలరేగింది. ఆ కోపం పెరుగుతూ వచ్చింది. కండ్లలో అగ్నిజ్వాలలు రేగాయి. శత్రువుల తలలను నరికిన యవనుణ్ణి ఆ మహాపురుషుడు క్షణాల్లో దగ్గం చేసి, బూడిదకుప్పగా మార్చాడు.

ఇలా కేవలం ఒక్క క్షణంలోనే కాలయవనుడు బూడిద అయిపోయాడు - అని చెప్పగా విని పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

ముచుకుందుని పూర్వ కథాభివర్ణనము


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

rukmini kalyana katha praarambhamu - రుక్మిణీ కల్యాణ కథా ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  రుక్మిణీ కల్యాణ కథాప్రారంభము ఓ పరీక్షిన్మహారాజా! మునుపు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడం వల్ల రైవతుడనే రా...