Monday, August 24, 2026

Jarasandhudu Pravarsanagirini Dahinchuta - జరాసంధుడు ప్రవర్షణగిరిని దహించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -
జరాసంధుడు ప్రవర్షణగిరిని దహించుట

ఇలా మ్లేచ్చసైన్యాన్ని చంపి, మధురానగరంలో ఉండే ధనాన్ని ద్వారకకు పంపాడు - శ్రీకృష్ణుడు, ఆ ధనాన్ని తరలించడానికి కొందరు మనుష్యులను కూడా ఏర్పాటు చేశాడు. వాళ్లు ధనాన్ని తరలించే వేళలో -

జరాసంధుడు మథుర మీదికి దండెత్తి వచ్చాడు. ఇరవై మూడు అక్షౌహిణుల సేనతో అతడు కదిలాడు. ఆ సమయంలో గుర్రాల గిట్టల నుంచి పైకి లేస్తున్న దుమ్ము నల్లమబ్బులగుంపువలె ఉంది. పెద్ద పెద్ద ఏనుగుల చెక్కిళ్ల నుంచి మదజలం స్రవిస్తుంటే, అది నీటి ధారలవలె ఉంది. సాటిలేని రథచక్రాలు మహాధ్వని చేస్తుంటే, భయంకరమైన ఉరుములశబ్దంవలె ఉంది. పదునైనశస్త్రాస్త్రాల కాంతులు కోమలమైన మెరుపుతీగలవలె ఉన్నాయి. అతడి రాక శత్రురాజుల ప్రతాపం అనే అగ్నిని చల్లార్చడానికి వచ్చే వర్షాకాలంవలె ఉంది.

ఇలా జరాసంధుని సైన్యం మథురమీదికి దాడి చేసింది. శ్రీకృష్ణుడు చూచాడు. ఇపుడు యుద్ధం చేయడం మంచిది కాదనుకున్నాడు. ఒక మామూలు మనిషిలాగా, భయస్థుడివలె ప్రవర్తించాడు. తమ ధనాన్ని అంతా అక్కడ వదిలేసి మెత్తని తామరపూలవంటి పాదాలున్నవాళ్లు, కార్యశూరులు అయిన బలరామకృష్ణులు ఘోరమైన అడవులలోకి పారిపోయారు.

శ్రీకృష్ణుడు, బలరాముడు అలా పారిపోతుంటే జరాసంధుడు చూచి, వాళ్ల మహిమలు తెలియక ఎగతాళి చేస్తూ

“ఓ యాదవవీరులారా! తొక్కిడిపడుతూ అలా పారిపోకండి. అలా పారిపోతే మిమ్మల్ని విడిచి పెడతానని అనుకున్నారేమౌ - మీరు భూమిలో దాక్కున్నా ఆకాశానికి ఎగిరినా, సముద్రంలోకి దూరినా వెంటాడి చంపుతాను అంటూ సకలసైన్యంతో భుజబలసంపన్నుడైన జరాసంధుడు విడవకుండా వెంటబడి వచ్చాడు.

ఇలా పారిపోతున్న బలరామకృష్ణులు పెకామడలదూరం వెళ్లి, అలసిపోయారు. సేద తీర్చుకోవడానికి, తాము దాక్కోడానికి తగిన చోటని తలచి, ఇంద్రుడు విస్తారంగా వానలు కురిపించిన ఒక కొండను ఎక్కారు. ఎక్కువ వర్షం దానిపై కురిపించడంవల్ల దానికి ప్రవర్షణగిరి అని పేరు ఏర్పడింది. అది పదకొండు ఆమడల పొడవూ, అంతే వెడల్పూ కలిగి ఉంది. అంతలో

మగధదేశాధీశుడైన జరాసంధుడు కోపవివశుడై ఆ పర్వతరాజం చుట్టూ దండు విడిశాడు. అక్కడ రామకృష్ణులను కనుగొనలేక పోయాడు. వారి వినాశం కోరి అ కొండగుహల్లో, చరియల్లో, శిఖరాల్లో కట్టెల గుంపులు పేర్చి, దహించివేయడం డని రౌద్రంతో సేవకులను ఆజ్ఞాపించాడు.

ఇలా జరాసంధునిసేవకులచే రగిలించబడిన మహాగ్ని అంటుకుని ఆ పర్వతాన్ని కాల్చివేసింది. ఆ మంటల్లో

ముందుగా పొగలు వచ్చి పైకి లేచాయి. ఆ పొగల చివర పైభాగంలో నిప్పు రవ్వలు అల్లుకున్నాయి. ఆ నిప్పురవ్వల గుంపుతో బ్రహ్మాండమంతా నిండిపోయింది. అలా నిండగా, భయం గొలుపుతూ భగభగ మంటూ మంటలు పైకి లేచాయి.

తరువాత ఆ మహాజ్వాల కొండగుహల్లోనూ, చరియల్లోనూ, శిఖరాల్లోనూ, చెట్లలోనూ, తీగల్లోనూ, పొదరిండ్ల గుంపుల్లోనూ అల్లుకుంది. అది ఒక పెద్ద మంటల మహావృక్షంగా ఆకాశాన్ని తాకినట్టుగా ఉంది. జ్వాలలు చిగుళ్ల లాగా ఉన్నాయి. నిప్పురవ్వలు ఆ చెట్టుపువ్వులవలె ఉన్నాయి. 

పైకి ఎగసి లేస్తున్న దట్టమైనపొగలు చెట్టుకాండంవలె, కొమ్మలవలె ఉన్నాయి. ప్రచండమైన గాలివల్ల పొడవుగా నిలిచి కొరవుల్లా మండుతున్న కర్రలచేత ఆకాశంలో దేవతా విమానాలు కనిపించకుండా పోతున్నాయి.

పొగలేకుండా నిప్పుకణికలు కణకణలాడుతూంటే పై నుంచి చూచిన దేవతలు ఇవి కొత్తనక్షత్రాలేమో అని బ్రమపడ్డారు. సరస్సులలో నీళ్లన్నీ మరగిపోయాయి. మంటలు అల్లుకోవడంచేత తక్కోలం, చందనం, అగరు, కర్పూరంవంటి చెట్లు తగలబడిపోతున్నాయి. 

ఆ చెట్లనుండి పరిమళాలు ఎగసి ఆకాశాన్ని నింపుతున్నాయి. వెదురుపొదలు దగ్ధమవుతూండగా 'చిటపట' అనే భయంకరమైన ధ్వని పుట్టి, దిక్కుల నడిమిప్రదేశాన్ని నింపింది. భయంకరమైన చెట్లకొమ్మలుపడి రాళ్లు పగిలిపోతున్నాయి.

ఆ శబ్దం ఘోరంగా ఉండి, జీవలోకం సొమ్మసిల్లిపోతున్నది. చెట్లకొమ్మలలో పక్షిపిల్లలున్న గూళ్లున్నాయి. ఆ గూళ్లు కాలిపోతున్నాయి. తమపిల్లలవియోగంతో పక్షులు వేదనతో కలతపడిపోతున్నాయి. 

ఎగసినమంటలకు శబరకాంతల మొలనూళ్లకు కట్టబడి ఉన్న నెమలిఈకలకు మంటలు అంటుకున్నాయి. కలశాలవంటి రెండువక్షోజాలబరువుతో వాళ్లు నెమ్మదిగా నడుస్తూ నీటివాగులను చేరుకుంటున్నారు. జంతువుల జంటలు ఎన్నో ఆ అగ్నికి ఆహుతై పోయాయి.

ఆ కొండ కొమ్ము పదకొండు యోజనాల ఎత్తుంది. చుట్టూ జరాసంధుని సైన్యం ఉంది. వాళ్లెవరికీ కనిపించకుండా, అంత ఎత్తున్న కొండకొమ్మునుండి బలరామ కృష్ణులిద్దరూ ఆటల్లో దూకినంత సులువుగా ఆ శత్రుబలాలకు అవతలి వైపున కుప్పించి దూకారు.

ఇలా బలరామకృష్ణులు శత్రువులను మోసగించారు. సముద్రమే కందకంగా ఉన్న ద్వారకానగరానికి చేరుకున్నారు. ఆ ఇద్దరూ అగ్నిలో దగ్ధమై పోయారని జరాసంధుడు అనుకున్నాడు. తాను తన సైన్యంతో పాటు తిరిగి మగధకు వెళ్లాడు. ఆ తరువాత,

రుక్మిణీ కల్యాణ కథాప్రారంభము


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

rukmini kalyana katha praarambhamu - రుక్మిణీ కల్యాణ కథా ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  రుక్మిణీ కల్యాణ కథాప్రారంభము ఓ పరీక్షిన్మహారాజా! మునుపు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడం వల్ల రైవతుడనే రా...