అంతట సభాసదుల కోలాహలాన్ని నివారించి, కంసుడు తన మంత్రులను చూచి ఈ విధంగా అన్నాడు.
ఈ గోపబాలకుల్ని పట్టణద్వారం దాటి వెళ్ళేటట్లు తోసివేయండి. ఈ గొల్లలను ముట్టడించండి. క్రూరుడైన నందుణ్ణి బంధించండి. లోకానికి వెల్లడి అయ్యేటట్లు ఇప్పుడే వసుదేవుణ్ణి చంపివేయండి. ఉగ్రసేనుణ్ణి రక్షించవద్దు. వీడు నాకు తండ్రి కాడు. ఎల్లవిధాలా నా విరోధులకు ఇష్టుడు.
అని కంసుడు మాట్లాడే వేళలో...
పిక్కబలంతో కొండ శిఖరాన తిరిగే ఏనుగును సంహరించడానికి కుప్పించి దుమికే సింహకిశోరంలాగా శ్రీకృష్ణుడు కంసుణ్ణి చంపదలచి గురిచూచి మంచెమీదికి రణోత్సాహంతో దుమికాడు. కొలువులో ఉన్న పురప్రజలంతా తల్లడిల్లారు.
కంసుడు కూర్చొన్న మంచెమీదికి దుమికిన యదుశ్రేష్ఠులలో లెక్కించదగిన శ్రీకృష్ణుణ్ణి జూచి, కంసమహారాజు కత్తిని చేబూని ఎదిరించాడు. అప్పుడు కంసునిపక్షంలోని వారంతా కంసుడు మహాశూరకోటిలో అగ్రగణ్యుడని శ్లాఘించారు.
శ్రీకృష్ణుడు పక్షులకు రాజైన గరుత్మంతుడు పామును ఒడిసి పట్టుకొన్న విధంగా, కంసుడి జుట్టు ముడిని సభలోని జనులంతా కలవరపడుతుండగా పట్టుకున్నాడు. ప్రళయకాలంలో నీలాకాశంనుంచి చుక్కలు నేల రాలినట్లు ఆ కంసుడి సిగ ముడినుంచి రత్నాలు నేలరాలగా కంసుడి యుద్ధసన్నాహాన్ని అణచివేసి, మల్లరంగ ప్రదేశంలో పడేటట్లు త్రోసివేశాడు.
కంసుడు మంచెమీదినుంచి మల్ల క్రీడారంగమధ్యంలోపడి ఎట్టి కదలికా లేక కట్టెలాగా బిగుసుకొని పోయాడు. అక్కడి జనులు అబ్బురపడుతూ చూస్తుండగా ఆ దుర్మతి అక్కడి కక్కడే మరణించాడు. పద్మపత్రాక్షుడైన శ్రీకృష్ణుడు భుజబలవిజ్బంభణంతో సింహం ఏనుగును ఈడ్చిన విధంగా అతణ్ణి ఈడ్చాడు.
ఓ పరీక్షిన్మహారాజా! కంసుడు రోషంలో, సంతోషంలో, నిద్రలో, సంభాషణ సమయాల్లో, భోజన వేళలో, నీళ్లుతాగే పట్టులో, చక్రాయుధుడైన శ్రీకృష్ణుణ్ణి దోషబుద్ధితోనే చూచాడు. అయినప్పటికీ అతడు భగవంతుణ్ణే పొందాడు. ఉత్తమగతిని అందుకొన్నాడు.
(కంసుడెంత పాపాత్ముడయినా నిరంతరం విరోధంచేతనైనా శ్రీకృష్ణుడిమీదనే ఆతని ధ్యానం. అందువల్లనే ఆతనిచేత కొట్టబడి ఆ స్వామినే పొందాడు.)
ఒక్క గొల్లపిల్లవాడు ప్రభువును సంహరించాడు. ఔరా! ఎంత ఆశ్చర్యం! వీణ్ణి పొడిచి చంపండి. ఇంకా ఆలస్యం ఎందుకు? అంటూ పరితాపంతో అగ్గలమైన కోపంతో పొగరుబోతులై
కంసుడి తోబుట్టువులు న్యగ్రోధుడు, కహ్వుడు మొదలయినవారు అనేకవిధాలైన యుద్ధపరికరాలతో కృష్ణుడి మీదికి విజ్బంభీంచారు. అప్పుడు మహాబలుడైన బలభద్రుడు రౌద్రమూర్తియై పరిఘ అనే ఆయుధం ధరించి మత్త మాతంగంలాగా ఒక్కొక్కరిని చెండాడి యముని సన్నిధికి పంపాడు.
(కంసుని తోబుట్టువులు ఎనమండుగురు. వారు : 1) న్యగ్రోధుడు 2) కహ్వుడు ౩) సునామకుడు 4)కంకుడు 5) సుభుడు 6) రాష్ట్రపాలుడు 7) విసృష్టుడు 8) తుష్టిమానుడు.)
చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి వీడగా; నారద మహర్షి ఆనందంతో ఆకాశంలో కృష్ణా అంటూ పాటలు పాడుతూ నాట్యం చేశాడు.
పరీక్షిన్మహారాజా! బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన వేల్పులు కొల్లలు కొల్లలుగా పూలజల్లులు కురిపిస్తూ, శ్రీకృష్ణుణ్ణి స్తోత్రం చేశారు. దేవదుందుభులు మోగాయి. దేవతాంగనలు అనేక విధాలుగా ఆకాశంలో నాట్యం చేశారు.
అంతట కంసుడు మొదలైనవారి పత్నులు భర్తల మృతివల్ల శోకాక్రాంతలై చేతులతో తలలు బాదుకొంటూ, కన్నీటి ధారలతో తడిసిన ముఖాలతో తమతమ మందిరాలనుంచి వచ్చారు. వచ్చి వీరశయ్యలందు దీర్ఘనిద్ర చెందిన తమ భర్తలను ఆలింగనం చేసుకుని గద్గదకంఠస్వరాలతో విలపించారు. వారిలో కంసుని భార్యలు ఇట్లన్నారు.
జీవితేశ్వరా! గోపాలుడనే సింహం కోపంతో వెడలివచ్చి గజేంద్రునివంటి నిన్ను హతమార్చింది. నాథా! యదునాథుడనే మారుతం దారుణవేగంతో వృక్షంలా నిన్ను నేలమీద వ్రాల్చింది. మహానుభావా! వాసుదేవుడనే సముద్రజలం చెలియలికట్టను దాటి, దీవిలా నిన్ను ఇప్పుడు ముంచివేసింది. మహారాజా! దేవకీ పుత్రుడనే దేవేంద్రుడు దేవతలు సంతోషించే విధంగా కొండవంటి నిన్ను చెండివేశాడు. అయ్యో! నీవిలా చనిపోయినప్పటికీ మేము బ్రతికి ఉన్నాము. అక్కటా! మావలె కఠిన హృదయం కలవారు భూమిమీద ఎక్కడైనా ఉన్నారా? (లేరని భావం)
ప్రాణులకు నీవు కీడు చేయగా - ఆ ప్రాణులే నీకు కీడు చేశాయి. ప్రాణులకు ద్రోహం చేసినవానికి మేలుకల్గదు. బ్రతుకంతా వ్యర్థమవుతుంది.
(సర్వత్ర సమభావం లేనందుకే కంసుడు దుర్గతి పాలయ్యాడు.)
మహారాజా! గోపాలకృష్ణుణ్ణి ఎదిరించి, ప్రాణాలు కోల్పోయినవారినిగురించి పూర్వం నీ సమక్షంలో పండితులు చెప్పలేదా? క్రోధమూ, జడత్వమూ విడిచి గోవిందుణ్ణి సేవిస్తే ఎంత బాగుండేది!
ఈ మాదిరిగా ఏడుస్తున్న రాచ ఇల్లాండ్రను ఓదార్చి లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు కంసుడు మొదలైనవారికి పారలౌకిక క్రియలు సల్పేందుకు ఆదేశించాడు. దేవకీవసుదేవులను చెర విడిపించి బలరాముడితో కూడి వారికి నమస్కారాలు చేశాడు.
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment