Tuesday, August 25, 2026

Sathadhanvudu Satrajittuni Jampi Mani Napaharinchuta - శతధన్వుడు సత్రాజిత్తుని జంపి మణి నపహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శతధన్వుడు సత్రాజిత్తుని జంపి మణి నపహరించుట

మహారాజా! అక్రూరుడూ, కృతవర్మా శతధన్వుని దగ్గరకు వచ్చి హితం చెప్పేవారివలె "సత్రాజిత్తు తన కొమార్తెను ముందు మన కిస్తానని చెప్పి, తర్వాత శ్రీకృష్ణుని కిచ్చి పెండ్లిచేసి నీతి తప్పాడు. నీవు నీ అభిప్రాయం వెల్లడించి ఏ రీతిగానైనా సరే స్యమంతకమణిని తీసుకో!” అని అతణ్ణి రెచ్చగొట్టారు.

ఒకనాడు ఆ శతధన్వుడు సత్రాజిత్తు నిద్రిస్తుండగా అతణ్ణి కసాయివాడు మేకను చంపినట్టు చంపాడు. అతనిభార్య లందరూ మొర పెట్టుకుంటుండగా స్యమంతకమణిని తీసుకొని వెళ్లిపోయాడు.

సత్యభామ సత్రాజిత్తు చనిపోయిన తీరు తెలిసికొని దుఃఖించి, అతణ్ణి నూనెతొట్టిలో పెట్టించి, హస్తినాపురానికి వెళ్లి, సర్వజ్ఞుడయిన హరికి కన్నతండ్రిచావుకబురు చెప్పింది. ఆ మరణవార్త విని బలరామకృష్ణులు సర్వనియామకులయినప్పటికీ సామాన్య మానవులమాదిరిగా దుఃఖించారు. 

తర్వాత శ్రీకృష్ణుడు బలరామునితో, సత్యభామతో కలసి ద్వారకకు వచ్చి, శతధన్వుణ్ణి చంపాలని నిశ్చయించాడు. శ్రీకృష్ణునినిశ్చయం తెలిసికొన్న శతధన్వుడు తనకు చావుమూడిందని భయపడి, కృతవర్మ ఇంటికి వెళ్లి, సహాయం చేయుమని అర్ధించాడు. అప్పుడు కృతవర్మ ఈ విధంగా అన్నాడు.

అయ్యో! ఎంత తెలివి తక్కువ వాడివయ్యావు? బలరాముడూ; శ్రీకృష్ణుడూ సామాన్యులా? వారు మహాత్ములు. ఎవడు వారికి కీడు చేయగలుగుతాడు? నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. విను. ఇంతకు ముందు బలరామకృష్ణుల్ని ఎదిరించి, కంసుడు చుట్టపక్కాలతోపాటు సర్వనాశం గాలేదా? జరాసంధుడు దండెత్తి, పదిహేడుసారులు సైన్యాలతో కూడా దిక్కులు పట్టిపోలేదా? ఆ అన్నదమ్ములశక్తి మనకు కొత్తదా?

కృతవర్మ చెప్పినమాట విని శతధన్వుడు అక్రూరునియింంటికి వెళ్లి, శ్రీకృష్ణునిపై పగబట్టటానికి తోడు రమ్మన్నాడు. అక్రూరుడు శ్రీకృష్ణుని బలపరాక్రమాదులు ప్రకటించి, ఇంకా ఇట్లా అన్నాడు.

శ్రీకృష్ణుడు సామాన్యుడు గాడు. త్రిమూర్తులవలె వినోదార్థం ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నాశం చేస్తాడు. బ్రహ్మాదులు సైతం అతని నడతను అర్ధంచేసుకోలేరు. అతని మాయ లోకాన్ని భ్రమపెడుతుంది. అతడు ఏడేళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆవుల్ని రక్షించటానికి ఒకచేతితో కొండను పైకెత్తాడు.

శ్రీకృష్ణభగవానుడు నిర్వికారుడు. జగన్నియామకుడు. అద్భుత కార్యనిర్వాహకుడు. సర్వక్రియాసాక్షి - అటువంటి మహానుభావునికి మేము చేయెత్తి మొక్కుతాము. ఆయనతో విరోధం పెట్టుకోటానికి భయపడతాం. అంగీకరించం. నీవు వేరేదారిని పో! నీ పొత్తువల్ల చాలా నష్టం కలిగింది. అది చాలు.

ఈ విధంగా అక్రూరుడు సమాధానం చెప్పిన తర్వాత శతధన్వుడు అతని దగ్గర స్యమంతమణిని దాచి, భయంతో గుర్రమెక్కి నూరామడలదూరం వెళ్లాడు. 

బలరాముడూ, కృష్ణుడూ గరుడధ్వజంతో అలంకరించిన రథమెక్కి అతని వెనుక వెళ్లారు. చివరకు శతధ్వనుడు మిథిలానగరం చేరి, దాని సమీపంలో గుర్రం దిగి, భయపడుతూ కాలినడకతోనే పరుగెత్తాడు. 

శ్రీకృష్ణుడు వెళ్లకు మని వారిస్తూ అతనిని కలిసికొన్నాడు. తర్వాత శతధన్వునితల తెగిపడేటట్లుగా - రాక్షసగణాలను సంహరించిందీ, తన కాంతిపుంజంచేత ఇంద్రాది దేవతలను సంతోషపెట్టేదీ అయిన చక్రాయుధాన్ని ప్రయోగించాడు.

శ్రీకృష్ణుడు శతధన్వుని చంపి, మణికోసం అతని దుస్తులలో వెదికాడు. కానీ, మణి ఎక్కడా కనబడలేదు. అప్పుడు హరి బలరామునికడకు వచ్చి "శతధన్వుణ్ణి వ్యర్థంగా చంపాను. అతనిదగ్గర మణి లేదు" అని చెప్పాడు. ఈ మాటలు విని బలరాముడు ఈ కింది విధంగా అన్నాడు.

"శతధన్వుడు స్యమంతకమణిని నిజంగానే, దొంగిలించాడు. వాడు దాచిపెట్టుమని ఎవరిచేతికయినా ఇచ్చాడేమో? వెంటనే నీవు ద్వారకకు వెళ్లి వెదకు. నాకు జనకుణ్ణి చూడాలనే కోరిక కలిగింది. నేను వెళ్లివస్తాను. నీవూ వెళ్లు” అని బలరాముడు చెప్పి, 

శ్రీకృష్ణుణ్ణి వీడ్కొలిపి తర్వాత మిథిలకు వెళ్లాడు. అతనిరాక తెలిసి జనకుడు ఎదురువచ్చి అతణ్ణి పూజించి, కోరినవెల్లా ఇచ్చి, మిథిలలో ఉండండని అర్ధించాడు. బలరాముడు కొన్నేళ్లు ఆ నగరంలోనే నివసించాడు.

తర్వాత దుర్యోధనుడు మిథిలానగరానికి వచ్చి, జనకునిచేత సకలగౌరవాలూ పొంది

ఆశ్రితులకు కల్పవృక్షమయినవాడూ, మూడులోకాలలోని మహావీరుల పూజలు పొందేవాడూ అయిన బలరామునినుండి దుర్యోధనుడు పట్టుదలతో తన ఆశయానుగుణమైన గదాయుద్ధ నైపుణ్యం ఆర్జించాడు.

("త్రైలోక్య వీరభటగణబలిచేన్‌ = మూడు లోకాలలోని వీరభటుల సమూహాలను మృత్యుదేవతకు బలిపశువులుగా సమర్పించేవానిచేత" అనికూడా అర్ధం చెప్పవచ్చు.)

శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లి శతధన్వుడు చనిపోవటం, స్యమంతకమణి కనబడకుండటం సత్యభామకు చెప్పాడు. సత్యభామకు ప్రీతికలిగించేవాడు కనుక సత్రాజిత్తుకు ఉత్తరకర్మలు చేయించాడు. 

శతధన్వునిచావు తెలిసిన అక్రూరుడూ, కృతవర్మా ద్వారక వదలి సుదూర ప్రాంతానికి వెల్లిపోయారు. అక్రూరుడు లేకపోవటంవల్ల ద్వారకానివాసులకు రకరకాల ఉపద్రవాలు కలిగాయి. అప్పుడు ఆ పట్టణంలోని వృద్దులు శ్రీకృష్ణునికి ఇలా చెప్పారు.

శ్రీకృష్ణపురమాత్మా! ఒకప్పుడు కాశీరాజు రాజ్యంలో వానలు పడలేదు. అనావృష్టి బెడద తొలగించుకొనటానికి అతడు శ్వఫల్కుణి తీసుకొనిపోయి, తన కొమార్తె అయిన కాందిని నిచ్చి పెండ్లిచేసి సత్కరించాడు.

అప్పుడు ఆ రాజ్యంలో వానలు కురిశాయి. శ్వఫల్కుణి కుమారుడు అక్రూరుడుకూడా తండ్రియంత గొప్పవాడే. అతడు ద్వారకకు తిరిగివస్తేనే వర్షాలు కురిసి ఆపదలు తొలగిపోతాయి. నీవు అక్రూరుని తప్పు క్షమించు. ఇక్కడకు అతణ్ణి రప్పించు. ప్రజలబాధలు తొలగిపోవటం ముఖ్యం.

పెద్దల మాటలు విని శ్రీకృష్ణుడు దూతలను పంపి అక్రూరుణ్ణి రప్పించి, పూజించాడు. అతనికి ప్రీతి కలిగించే కథలు కొన్ని చెప్పాడు. సర్వజనుల స్వభావాలు తెలిసినవాడు కాబట్టి మెత్తగా, తియ్యగా అక్రూరునితో ఇలా మాటాడాడు.

అక్రూరా! శతధన్వుడు పోయేటప్పుడు మీయింటిలో మణిని దాచినమాట నిజం. అది నాకు తెలుసు. సత్రాజిత్తుకు కొడుకులు లేరు. కొమార్తెలే అతనికి చేయదగిన పనులన్నీ చేసి ఆస్తినీ, అప్పునూ పంచుకొంటారు. సత్రాజిత్తు వైరుల మూలంగా రాజుల కుచితంగాని మరణం పొందాడు.

ఇక ముందు అతనికొరకు ఉత్తమకర్మలు చేయాలి. నీవే స్యమంతకమణిని ఉంచుకో! నేను మణికై వెంపరలాడుతున్నా నని బలరాముడు నన్ను శంకిస్తాడు. అనురాగంతో చుట్టాలందరికీ మణిని ఒకసారి చూపు. ఈ ఉదారబుద్ధివల్ల నీవు పుణ్యాత్ముడవై బంగారు తిన్నెలమీద కూర్చుండి యజ్ఞాలు చేసేంతటి గొప్పవాడి వవుతావు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు నచ్చజెప్పగా అక్రూరుడు గుడ్డతో కప్పిన స్యమంతకమణిని తీసుకొనివచ్చి అతనికివ్వగా

శ్రీకృష్ణుడు - మంటికీ మింటికీ నడుమను చీకట్లను పారదోలే వెలుగులుకలదీ, బారువులకొలది బంగారాన్ని తెంపులేకుండా ఇస్తూ - దేవతలనూ, మానవులనూ ఆశ్చర్యపరచేదీ, దిగంతాల దాకా వ్యాపించిన పేరు కలిగిందీ అయిన స్యమంతకమణిని చుట్టపక్కాలందరికీ చూపాడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు స్పష్టంగా తనసౌమ్యతను అందరకూ తెలిపి, దయతో అక్రూరునకు తిరిగి మణిని ఇచ్చాడు.

సర్వోన్నతుడూ, భగవానుడూ, పరమాత్మా, పుణ్యశాలీ అయిన శ్రీకృష్ణుడు మణిని తెచ్చిఇచ్చిన కథను విన్నాా చదివినా, జ్ఞప్తికి తెచ్చుకొన్నా మానవులకు చెడ్డపేరూ, పాపసమూహమూ నశించిపోతాయి.

శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ పురంబున కరుగుదెంచుట





No comments:

Post a Comment

Srikrishnudu Keligrhamunandu Rukminidevitho Virasocktu Laduta - శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట ఈ వచనంలో కవి రుక్మిణీదేవి సౌధంలోపలి మంది...