హనుమంతుని మాటలు విని రావణుని క్రోధం అంచులు దాటింది.
ఈ వానరునికి శిరశ్ఛేదం చేయండి, అన్నాడు.
అది విని విభీషణుడు:
రాక్షసేశ్వరా! ఆవేశాన్ని విడిచి క్షమా హృదయంతో ఈ విషయం పరిశీలించాలి. విచక్షణకల ప్రభువులు దూతకు శిరశ్ఛేదం చెయ్యరు. అది రాజనీతి విరుద్ధం. లోకం దానిని గర్హిస్తుంది.
నువ్వు ధర్మవిదుడవు. ముఖ్యంగా రాజనీతి నీకు కరతలామలకం. మంచి చెడ్డలు ఒకరు నీకు చెప్పనవసరము లేదు. నీ అంతటి వాడే రోషావేశాలకు లోబడితే ఇక విద్యా ప్రయోజనం ఏమిటి? సర్వశత్రు సంహార సమర్ధుడవైన నువ్వు దూతను తగు రీతిని దండించాలే కాని ఇలా శిక్షించరాదు;
అని చెపుతూంటే రావణుడు:
విభీషణా! పాపులను వధించడం పాపం కాదు. వీడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం శిరశ్ఛేదమే అన్నాడు.
లంకేశ్వరా! ధర్మార్థ యుక్తంగా చెపుతూన్న నా మాటను ప్రశాంత చిత్తంతో ఆలకించు. యుద్దాలలో కూడా దూతను వధించరాదని పెద్దలు చెప్పారు. వీడు బాగా విర్రవీగుతున్న శత్రువని నేనూ అంగీకరిస్తాను. వీడు మనకు చాలా నష్టం కలిగించి, ఎంతో అపకారం చేశాడు. అయినా వీడు దూత.
కొరడాతో కొట్టడం.
బుర్ర గొరిగించడం.
కాలో, చెయ్యో విరిచేయడం - ఇవీ దూతకు విధించే శిక్షలు, అంతే తప్ప దూతను వధించినట్టు మనం వినలేదు, ఎప్పుడూ.
యుక్తా యుక్తా లెరిగి, వినీతుడవుగా ప్రఖ్యాతి పొందిన నువ్వే ఆవేశానికి లొంగితే ఏం కావాలి. నిగ్రహం వివేక లక్షణం. ధర్మనిర్ణయంలో నిన్ను మించినవారులేరు. శాస్త్ర జ్ఞానంతో లోక వ్యవహారం ఎరిగిన ధీమంతుడవు.
నీ పరాక్రమం దేవాసురుల తల వంచింది.
ఇంకొక్కమాట-
ఈ వానరుని చంపి మనం సాధించగలిగింది లేదు. వీడి ప్రభువును పట్టి చంపాలి. ఇప్పుడు వీనిని చంపితే ఈ విశాల సముద్రం దాటి మరొక చారుడు వచ్చే అవకాశం కనపడదు.
విడు తిరిగి వెడితే తప్ప ఆ మానవ వానర ప్రభువులు లంకకు యుద్దానికి రాలేరు.
పరాక్రమం, ఉత్సాహం, ధైర్యం కల నీకు యుద్ధ ప్రీతులయిన అనుచరులు కోట్ల సంఖ్యలో వున్నారు. వారిలో కొందరుపోయి ఆ మానవుడికి నీ శక్తి ఏమిటో వివరిస్తారు. మిగిలిన వ్యవహారం అప్పుడు తేలుతుంది. అందుచేత ఈ వానరుని సంహరించకుండా విడిచిపెట్టాలి, అన్నాడు.
విన్నాడు రావణుడు.
దేశ కాల యుక్తంగా కనపడింది, విభీషణుని మాట.
నువ్వు చెప్పినట్లు దూతవధ నింద్యమే. వీడికి శిక్ష వెయ్యాలి. వానరులకు తోక చాలా యిష్టమయినది, అది తగులబెట్టండి. అప్పుడు వీడి వికారాకృతి చూసి వీడి బంధుమిత్రులు ఆనందిస్తారు. తోక అంటించి శృంగాటకాలలో నిలబెట్టండి, అని ఆజ్ఞాపించాడు.
అది విన్న క్షణంలో రాక్షసులు తమ తమ గృహాలలోని పాతగుడ్డలు తెచ్చి హనుమంతుని వాలానికి చుట్టడం ఆరంభించారు. హనుమంతుడు శరీరాన్ని పెంచుతున్నాడు. వారు తాము చుట్టిన గుడ్డలు నూనెతో తడిపి నిప్పు అంటించారు.
లంకలోని ఆబాల గోపాలం హనుమంతుని చూడడానికి వచ్చి సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. తోక మండుతోంది. హనుమంతుడు ఆలోచించాడు.
ఈ లంకలో రాత్రి తిరగడంవల్ల వీరి దుర్గ రక్షణ విధానం తెలియలేదు. ఈ శిక్షతో వీరు నగరం అంతా తిప్పి నాకు మేలుచేస్తారు, అని సంతోషించాడు.
శంఖ, భేరీ ధ్వానాలతో నగరమంతా హనుమంతుని త్రిప్పుతున్నారు.
"వీడు గూఢచారి" అని అరుస్తున్నారు. వీధులన్నీ వేడుకగా హనుమంతుని చూచే రాక్షస స్త్రీలతో నిండాయి.
ఈ వార్త సీతాదేవికి చెప్పి సంతోషించారు, మరికొందరు స్త్రీలు. వింటూనే సీతాదేవి మనసా అగ్నిహోత్రుని ప్రార్థించింది.
యద్యస్తి సతి శుశ్రూషా
యద్యస్తి చరితం తపః ।
యదివా స్త్యేక పత్నీత్వం
శీతో భవ హనూమతః॥
పతిశుశ్రూషలో, తపస్సులో నేను సాధించిన ఫలం, ఆయన ఏకపత్నీ వ్రతఫలం, హనుమంతునికి చల్లదనం కలిగించాలి. అగ్ని బాధించరాదు. ధీమంతుడైన రామునికి నామీద దయ ఉంటే, నా అదృష్టలేశం ఏమయినా మిగిలితే, నా మనస్సు సత్వరం రామ సమాగమకాంక్షతో ఉన్నదని ఆయన గ్రహిస్తే సుగ్రీవుడు సత్య ప్రతిజ్ఞుడై నన్ను ఉద్ధరించే సంకల్పంతో ఉంటే అగ్నిజ్వాలలు హనుమంతునికి మలయ పవనాలు కావాలి, అని అనుకుంటున్నది.
ఆ ప్రార్థన ఆలకించి అగ్నిహోత్రుడు మంగళప్రదంగా ప్రదక్షిణం చేశాడు. వాయువు సైతం చల్లగా కదలి సీతాదేవికి సంతోషం కలిగించాడు.
కణకణలాడుతూ శిఖలు లేచే అగ్ని చల్లగా సోకుతూ మారుతికి ఆశ్చర్యం కలిగించింది.
వాలాగ్రం మీద మరీ చల్లగా ఉన్నది.
నిన్న సముద్రం దాటుతూంటే మైనాకుడు సాయపడటానికి వచ్చాడు, వాడే అలా వచ్చినపుడు రామకార్యార్థినైన నాయందు అగ్ని అనుగ్రహం చూపకుండా ఉంటాడా!
రాముని తేజస్సు, సీతాదేవి సౌశీల్యం, నా తండ్రి వాయువుతో ఉన్న సఖ్యం - ఈ కారణాలచేత అగ్నిహోత్రుడు నన్ను అనుగ్రహించి ఉండాలి, అని భావించి సింహగర్జన చేసి ఒక్క గంతులో నగరద్వారానికి ఎగిరాడు.
దేహాన్ని సంకుచితం చేశాడు.
అంతతో ఆయనకు కట్టిన త్రాళ్ళన్నీ జారిపోయాయి. మళ్ళీ పర్వత మంత పెంచాడు దేహాన్ని, ద్వారానికున్న దూలంలాగి ద్వారపాలకులను నేలకూల్చాడు.
ఒక్కసారి లంకానగరం అంతా కలయచూశాడు.
అంతతో ఆయనకు కట్టిన త్రాళ్ళన్నీ జారిపోయాయి. మళ్ళీ పర్వత మంత పెంచాడు దేహాన్ని, ద్వారానికున్న దూలంలాగి ద్వారపాలకులను నేలకూల్చాడు.
ఒక్కసారి లంకానగరం అంతా కలయచూశాడు.
No comments:
Post a Comment