Monday, August 24, 2026

Srikrishnudu Satruraajulu Chuchuchunda Rukminidevini Gonipovuta - శ్రీకృష్ణుడు శత్రురాజులు చూచుచుండ రుక్మిణీదేవిని గొనిపోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుడు శత్రురాజులు చూచుచుండ రు
క్మిణీదేవిని గొనిపోవుట

ఆ రుక్మిణి శ్రీకృష్ణుని అందమైన ఆకృతిని చూచింది. ఆయనవయసునూ, శరీరపుమిసిమినీ, వైభవాన్ని గంభీర స్వభావాన్నీ నేర్పరితనాన్నీ కాంతినీ మొదలైన విశేషాలను గమనించింది. సంతోషించింది. ఆమె మన్మథబాణాలకు గురి అయింది.

తన రథాన్ని ఎక్కాలని ఆశపడుతున్న రుక్మిణిని శ్రీకృష్ణుడు చూచి శత్రురాజసమూహం చూస్తూండగా నక్కల మధ్యఉన్న మాంసభాగాన్ని సింహం ఎలా తెచ్చుకుంటుందో, అలా శ్రీకృష్ణుడు రుక్మిణిని తెచ్చి, అక్కడున్న రాజలోకాన్ని లెక్క చేయకుండా తన రథంమీద ఎక్కించుకున్నాడు.

భూమ్యాకాశాలు నిండిపోయే విధంగా అతడు పాంచజన్య శంఖం పూరించాడు. వెంట బలరాముడు వస్తుండగా ద్వారకానగరంవైపు రథాన్ని మళ్లించాడు. ఆ సమయంలో జరాసంధుడికి లొంగిఉన్న రాజులందరూ శ్రీకృష్ణుని ప్రతాపాన్నిగురించి విని భరించలేక

గొప్పసింహాలకు చెందిన కీర్తిని పనికిరాని నీచమృగాలు దొంగిలించుకుని పోయినట్లు ఈ గోపాలురు మనకీర్తిని, కొల్లగొట్టి మన కన్యను ఎత్తుకుని, అదిగో కావరంతో వెళుతున్నారు. ఇప్పుడు కాకపోతే ప్రతాపాలు ఇక ఎప్పుడు చూపాలి? 

మీ దగ్గర ఉన్న శస్త్రాలూ, అస్త్రాలూ ఎందుకు? తగలబెట్టడానికా? ఆ రుక్మిణిని వాళ్లబారినుండి విడిపించలేకపోతే ప్రజలు ఏమనుకుంటారు? సందుల్లో, గొందుల్లో చేరి మనగురించి చెప్పుకుని నవ్వుకోరా? (తప్పకుండా నవ్వుకొంటారని భావం)

అని పలుకుతూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ రాజులు మనసుల్లో కోపావేశాల్ని నిలుపుకున్నారు. ఆటోపంతో, కవచాల్ని ధరించి, ధనుస్సు మొదలైన ఆయుధాలను వెంటతీసుకొని వెళ్లారు. ప్రతిజ్ఞలు చేస్తూ, తమతమ రథగజ తురగపదాలైన సైన్యాల్ని వెంట తీసుకుని జరాసంధుడువంటివాళ్లు యాదవవీరుల వెంటపడ్డారు. వాళ్లను చేరి 'నిలబడండి నిలబడండి' అని ఎదిరించి పలికారు. 

బలంతో చెలరేగిపోయారు. కొండలమీద వానచినుకులు కురిపించే మేఘాలవలె యాదవసేనమీద రాజులు బాణాలను కురిపించారు. యాదవసేనానాయకులు ధనుస్సులను ఎక్కుపెట్టి, అల్లెత్రాళ్లను మోగిస్తూ నిలబడ్డారు. అప్పుడు-

శత్రువులు శ్రీకృష్ణుని సేనలను బాణాలతో కప్పివేయడం చూచి ఎక్కువగా భయపడి సింహంనడుమువంటి నడుమున్న రుక్మిణీదేవి సిగ్గుతో బెదిరిన జింక చూపులవంటి చూపులతో శ్రీకృష్ణుడిని ముఖంవైపు చూచింది

ఇలా రుక్మిణీదేవి చూస్తుండగా

కలువవంటి కన్నులుగల రు
క్మిణీ! అదిగో యాదవవీరులు వచ్చేస్తున్నారు. శత్రు సైన్యాన్నంతటినీ ముక్కలు ముక్కలుగా విరిచిపడేస్తారు. ఈ రోజు శత్రువులు బాగా దెబ్బతింటారు. చెల్లాచెదరైపోతారు. చచ్చిపోతారుకూడా. చూస్తూ ఉండు.

అని చెపుతూ శ్రీకృష్ణుడు రు
క్మిణీదేవికి సాంత్వన వాక్యాలు పలికాడు. అంతలో బలరాముడు మొదలైన యాదవవీరులు ప్రళయకాలంలో ఆకాశంలో అల్లుకుని పిడుగులు కురిపించే నల్లమబ్బులవలె చెలరేగిపోయారు. 

శరవర్షం కురిపించారు. జరాసంధుడు మొదలైన శత్రురాజసమూహంమీద మొక్కవోని ప్రతాపంతో అగ్నిజ్వాలల్లాంటి పదునైన ఇనుపముక్కుల బాణాలను, బల్లెములు మొదలైన రకరకాల బాణాలను తెరిపి లేకుండా కురిపించారు. ఆ దెబ్బకు సైన్యం కకావికలైంది.

మదపుటేనుగులు నరకబడ్డాయి. గుర్రాలు ముక్కలు ముక్కలైపోయాయి. ఎక్కడ చూచినా రథాల పైకప్పులు కుప్పలుగా పడ్డాయి. కాల్బలం దెబ్బతిని పడిపోయింది. గుర్రాలను, ఏనుగులను, రథాలను ఎక్కివస్తున్న వీరుల తలలు తెగి నేలకూలాయి. 

ముక్కలైపోయిన వక్షాలతోనూ, నడుములతోనూ, చెవులతోనూ, మెడలతోనూ, చెక్కిళ్లతోనూ, చేతులతోనూ రణరంగం భయంకరంగా కనించింది. మరణించినవాళ్ల వెండ్రుకలు నేలపై పరచుకుని పడిఉన్నాయి. పాదాలు, మోకాళ్లు, పిక్కలు ముక్కలైపడ్డాయి. వీరులు ధరించిన మంజీరాలు, భుజకీర్తులు విడివిడిగా చెదరిపడ్డాయి. 

చెవికమ్మలు, కిరీటాలు, హారాలు భ్రష్టమై పడ్డాయి. వీరులప్రలాపాలు వినిపించడం లేదు. గదలు, ఈటెలు, చిల్లకోలలు, గండ్రగొడ్డళ్లు, పట్టాకత్తులు, బల్లెములు, కత్తులు, శూలాలు, చక్రాలు, ధనుస్సులు అన్నీ నడిమికి విరిగి ముక్కలయ్యాయి. రథంపై ఉండే పతాకలు, రాజగౌరవాన్ని చాటే చామరాలు, గొడుగులు నేలకూలాయి.

కవచాలు చీల్చబడిన పీలికలైనాయి. గుర్రాలగుంపులు చెల్లాచెదురై పోయాయి. వాటిడెక్కలు తగిలి? నేలనుంచి దుమ్ము రేగింది. అప్పటిదాకా ఉరుకులెత్తిన తేరులవేగం మందగించింది. 

సూతులు, వంది మాగధులు పొగడడం ఆగిపోయింది. తెరిపిలేకుండా గుర్రాలు సకిలిస్తున్నాయి. తప్పెటలు మోగుతున్నాయి. ఏనుగులగుంపులు 'ఘీ' అని అరుస్తున్నాయి. రథచక్రాలకమ్ములు ఫటఫట శబ్దం చేస్తున్నాయి. గుర్రాలబొద్దులకు పక్కవేలాడుతున్న గంటలు ఘణఘణ మోగుతున్నాయి. 

విజృంభించిన వీరభటుల 'హుం' కారాలు వినిపిస్తున్నాయి. యుద్ధం చేస్తున్న వారిఆభరణాలు ఘణఘణ శబ్దం చేస్తున్నాయి. భేరీ వాద్యాలు ధణధణ మోగుతున్నాయి. మణులతో కూడిన కాలిఅందెలు 'క్రేం' కారం చేస్తున్నాయి. మువ్వల కుప్పలు కిణకిణ మోగుతున్నాయి.

అల్లెత్రాళ్లు 'టం' అని శబ్దం చేస్తున్నాయి. వీరభటులు ఒకరినొకరు తిరస్కరించుకుంటూ ఎదిరించేధ్వనులు వినిపిస్తున్నాయి. రాజుల గుంపులు భేదింపబడుతున్నాయి. రక్తం కాలువలుగట్టి పారడం కనిపిస్తున్నది. భూతాలు, పిశాచాలు కలకలం సృష్టిస్తున్నాయి.

నక్కలు, కాకులు, రాబందులు మొదలైనవి చెలరేగిపోతున్నాయి. గుంపులుగా ఉన్నాయి. అక్కడక్కడ తలలు తెగిన మొండెములు ఇంకా కదులుతున్నాయి.

మాంసం వాసన కమ్ముకుంటున్నది. కొవ్వు మాంసం తింటూ, రక్తం తాగుతూ డాకినీ పిశాచాలు యుద్ధరంగంలో తిరుగుతూ ఆనందిస్తున్నాయి. అప్పుడు

జరాసంధుడు మొదలైనవాళ్లు శ్రీకృష్ణుని ప్రతాపానికి బెదిరి యుద్ధభూమినుండి వెనుదిరిగి పారిపోయారు. అలా పరిగెత్తుతూ అందరూ ఒకచోట చేరారు. ఎదురుగా శిశుపాలుడు భార్యను పోగొట్టుకున్నవానివలె వేడి నిట్టూర్చులు విడుస్తున్నాడు. 

అతనిముఖం వాడిపోయి ఉంది. అలా ఉన్న శిశుపాలుని చూచి, తక్కినరాజులు శత్రువులచేతిలో పడకుండా ప్రాణాలతో బతికే ఉన్నావు గదా అని ఓదార్చారు.

అని ఈ విధంగా చెప్పినతర్వాత మళ్లీ ఇలా

చేదిరాజా శిశుపాలా! శరీరంలో ప్రాణాలంటూ ఉంటే ఎలాగోలా బతకవచ్చు. బతుకు కలిగిందంటే భార్య ఎక్కడో ఒకచోట దొరకక పోదు. నీవు బతికావు. ఇక నీ భార్య ఎక్కడుందన్న విషయం దేవుడికి తెలుసు. నీవు చింతించడం వద్దు వద్దు.

శిశుపాలా! వినుమని జరాసంధుడు ఇలా చెప్పాడు. మానవుడు తన ఇష్టాలను తానే తీర్చుకోదగినవాడు కాడు. కీలుబొమ్మల్ని ఆడించే తన చేతిలోని బొమ్మను ఆడించినట్లు ఈశ్వరుడు జీవుణ్ణి ఆడిస్తుంటాడు. ఒకసారి సంతోషిస్తాడు. మరోసారి దుఃఖిస్తాడు. ఇదంతా దైవం ఆడించేఆట.

ఇదివరలో నేను మథురానగరంపై పదిహేడుసార్లు దాడిచేశాను. ఏమయింది? శ్రీకృష్ణుడిచక్రాయుధం దెబ్బకు నా సమస్త సైన్యం నేలకూలింది. బలరాముడికి దొరికిపోయాను. అలా పట్టుపడిన నన్ను దయదలచి ఈ కృష్ణుడు విడిపించాడు.

నేను మళ్లీ ఇరవైమూడు అక్షౌహిణులు సైన్యాన్ని సమకూర్చుకొని పద్దెనిమిదోసారి దండయాత్ర చేశాను. శత్రువులను తరిమి కొట్టాను. గెలుపు సాధించాను. గెలుపు వస్తే పొంగిపోలేదు. ఓడిపోతే కుంగిపోలేదు.

ఈ రోజు మన పరిస్థితిని చూస్తే ఎలా ఉందంటే మన రాజులందరూ మూడోకన్ను ఉన్న ఆ శివునితో కూడి ఎదిరించినా మనం ఓడిపోతాం. అంతేకాదు. కాలం అనేది దైవంచేతిలో ఉంది. కాలంచేత ఈ లోకాలన్నీ తిప్పబడుతుంటాయి. అంతేకాదు.

నేడు ఆ యాదవులకు కాలం అనుకూలంగా ఉంది కాబట్టి, ముల్లోకాల్లోనూ మహావీరులమని పేరుపొందిన మనలను ఈ కృష్ణునిభుజబలంతో గెలువ గలిగారు. ఒకవేళ కాలం మనకు అనుకూలంగా వచ్చిందంటే, సమయం కనిపెట్టి, యుద్ధంలో మనంకూడా శత్రువులను జయించగలం.

ఇది చాలా చిన్నవిషయం. ఈ మాత్రందానికి నీవు మనసులో ఏవేవో సందేహాలు పెట్టుకోడం దేనికి?

ఈ విధంగా జరాసంధుడు, అతని అనుచరులైన రాజులు శిశుపాలుని మనోవేదనను తొలగించి తిరిగి తమతమ దేశాలకు వెళ్లారు. శిశుపాలుడు కూడా తన సైనికులతోపాటు తన నగరానికి వెళ్లాడు. 

ఇంతలో రుక్మిణి అన్న అయిన రుక్మి రాక్షసవివాహపద్ధతిలో తన చెల్లెలైనరుక్మిణిని శ్రీకృష్ణుడు అలా తీసుకుపోవడం ఓర్చుకోలేక ఒక అక్షౌహిణీసైన్యాన్ని తీసుకుని యుద్ధప్రయత్నంతో శ్రీకృష్ణుణ్ణి వెంబడిస్తూ తన సారథితో ఇలా అన్నాడు.

నేను భీష్మకుడనే మహారాజుపుత్రుణ్ణి. మహాబలవంతుణ్ణి. అలాంటి నన్ను చిన్న పిల్లవానివలె చులకన చేసి, నా చెల్లెలైన రు
క్మిణిని తీసుకుని ఏదో పెద్ద అసహాయశూరునివలె ఈ గొల్లవాడు వెళుతున్నాడు. 

మన రథాన్ని అతని దగ్గరగా పోనివ్వు; పదునెక్కి మెరుస్తున్న ఈ బల్లెములను వరుసగా ప్రయోగించి వాడి పొగరు అణచివేస్తాను. నా ప్రతాపమేమిటో చూపిస్తాను.

శ్రీకృష్ణునిశక్తిని తెలుసుకోలేక రు
క్మి సారథిని గద్దించి శ్రీకృష్ణునికి దగ్గరగా తనరథాన్ని తోలింపజేసి 'ఓ గోవులను కాచుకునేవాడా! వెన్నను దొంగిలించేవాడా! ఒక్కనిమిషం పాటు ఆగాగు' అని నిర్లక్ష్యంగా పలికి బలమైన తన ధనుస్సుకున్న అల్లెత్రాటిని లాగి మూడు పదునైన బాణాలను ప్రయోగించి శ్రీకృష్ణుణ్ణి బాధిస్తూ ఇలా అన్నాడు.

మా చెల్లెలిని తీసుకు పోవడానికి నీవు మాతో తులతూగ గలిగిన వాడివా? నీ వెంతమాత్రపువాడివి? నీ వంశమేది? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? నీ నడవడిక ఎలాంటిదో? ఎవ్వరికీ తెలియదు. నీకు మాన మర్యాదలు లేవు. మోసం చేసిగాని ఎదుటపడవు. 

నీ శత్రువులమీదికి నీ అసలు రూపంతో వెళ్లవు. (అన్నీ మారువేషాలే అని అర్ధం). నీవు రాజువు కావు. వావివరుసలు లేవు. మా అమ్మాయిని తిరిగి ఇవ్వు. నీవు గణాలు లేనివాడవు. మా పాపను వదిలిపెట్టు. అలా వదలకపోతే ప్రళయకాలంలోని అగ్నిజ్వాలలతో సమానమైన వాడిబాణాలతో యుద్ధరంగంలో నీ గర్వాన్నంతటినీ హరించి వేస్తాను.

రుక్మి ఇలా మాట్లాడుతుండగానే గోవర్ధనగిరినెత్తిన శ్రీకృష్ణుడు నవ్వాడు. ఒకే ఒక్కబాణంతో అతని ధనుస్సును ముక్కలు చేశాడు. ఆరు బాణాలు వేసి, అతని శరీరంలోంచి దూసుకుపోయేలా చేశాడు. ఎనిమిదిబాణాలతో రథానికి కట్టిన గుర్రాలను కూల్చేశాడు. 

రెండు బాణాలు వేసి రథాన్ని నడిపేవాడిని చంపేశాడు. మూడు బాణాలు వేసి రథంపై ఉన్న పతాకను కూల్చాడు. రుక్మి ఇదంతా చూచి, మరో విల్లు అందుకున్నాడు. అలా అందుకోగానే శ్రీకృష్ణుడు దాన్ని ముక్కలు చేశాడు. రుక్మి మళ్లా ఇంకొక ధనుస్సును చేతపట్టాడు.

శ్రీకృష్ణుడు దాన్నికూడా విరిచేశాడు. ఇలా వరుసగా ఇనుపగద, అడ్డకత్తి, శూలం, డాలు, కత్తి, శక్తి, తోమరం వంటి ఆయుధాలను రుక్మి చేత పట్టుకున్నాడు. అతడు అలా పట్టుకోగానే శ్రీకృష్ణుడు వాటిల్ని ఛిన్నాభిన్నం చేశాడు. అప్పటికీ రుక్మి ఊరుకోలేదు. 

తన రథం దిగి, కత్తి చేతిలో పట్టుకుని శ్రీకృష్ణుని పైకి దూకాడు. పెద్ద పెద్ద జ్వాలలతో అడవి అడవంతా మంటలతో ఎగసి పడుతూంటే - ఆ మంటల మీదికి ఒక మిడుత దాడి చేస్తే ఎలా ఉంటుందో - రుక్మి శ్రీకృష్ణునిపై దూకడం అలా ఉండింది. 

అలా వస్తే - శ్రీకృష్ణుడు అతడి కత్తినీ, కవచాలనూ పొడిపొడి చేశాడు. తన కత్తి తళతళ మెరుస్తూండగా, సర్రున పైకి లాగి రుక్మి కళ్లముందు ఝళిపించాడు. అతడితలను నరుకుతా నని ముందుకు నడిచాడు. అలా నడుస్తూన్న శ్రీకృష్ణునికి రుక్మిణి అడ్డు వచ్చింది. 

శ్రీకృష్ణుని పాదారవిందాలను పట్టుకుని ఇలా ప్రాధేయపడింది.

గొప్పవాళ్ల చేత పొగడబడిన శాశ్వతమైన కీర్తివల్ల వెలుగొందుతున్నవాడా! లోకాలకన్నిటినీ బ్రోచేవాడా! ఏ దిక్కూలేనివారికి దిక్కయినవాడా! దయకు నెలవైనవాడా! సర్వాధికారివి, దేవతలకే దేవుడవు అయిన నిన్ను ఎంతటివాడివో నిశ్చయించుకోలేక నేడు మా అన్న రు
క్మి నీ పట్ల ఎంతో అపచారం చేశాడు. నన్ను దయతో మన్నించి మా అన్నను రక్షించు;

నాథా! సర్వశక్తిమంతుడా! రు
క్మి చేసినపనిలో తప్పులేదని నేను విన్నవించుకోవడం లేదు. ఇతడు దుర్మార్గుడే! కానీ, ఇతణ్ణి చంపితే, మా అమ్మానాన్నలకు కొడుకు పోయాడన్న దుఃఖం కలుగుతుంది. సర్వశక్తి సంపదలూ కలిగిన శ్రీమహావిష్ణువు అల్లుడు అయ్యాడన్న సంతోషంకంటె వారిని పుత్రశోకం కృశింప చేస్తుంది.

అని ఈ విధంగా బొంగురుపోతున్న గొంతుతో రు
క్మిణి ప్రార్థించింది. ఆమె కృష్ణునితో మాట్లాడ్డానికి గొప్పభయంతో ఉంది. ఒళ్లంతా గజగజ వణుకుతున్నది. తల వంచుకుంది. ముఖం వాడిపోయి ఉంది. మాటాడుతూంటే, చెవులమీదనుంచి జడపాయ జారుతున్నది. 

రెండుకళ్లలో కన్నీరు ఉబుకుతున్నది. ఇలాగ ఆ కన్యాతిలకమైనరుక్మిణి - శ్రీకృష్ణునికి నమస్కరించింది. అపుడు తేజోమూర్తి అయిన విష్ణువు ఆమె విన్నపాన్ని మన్నించి రుక్మిని చంపకుండా వెనుతిరిగాడు.

ఇలా రు
క్మిణి ప్రార్ధనను విని, శ్రీకృష్ణుడు రుక్మిని చంపకుండా వదిలేశాడు. 'బావా! ఇటు రా అని చిరునవ్వు నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు. అతణ్ణి పట్టుకుని బంధించాడు. ఒక పదునైన కత్తిలాంటి బాణాన్ని తీసుకున్నాడు. అతడి మీసాలు, గడ్డం, తలవెండ్రుకలను పాయలు పాయలుగా గొరిగి వికారరూపుణ్ణి చేశాడు. 

ఆ సమయంలో శత్రు సైన్యాన్ని తరిమేసిన యాదవవీరులు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చారు. అప్పుడు బలరాముడు జీవచ్చవమై బంధింపబడి ఉన్న రుక్మిని చూచి దయతో అతడికట్టుతాళ్లను విప్పించి శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.

మహాత్ముడైన శ్రీకృష్ణా! భీష్మకుని కొడుకైన ఈ రు
క్మిని 'తొలగిపో' అని చెప్పకుండా తలనూ, మూతినీ గొఱగడం ఏమైనా బాగుందా? బంధువైనవాడి తలనూ, మూతినీ గొరగడం తలనరకడం కంటె నీచాతినీచం కదా!

ఆదిమధ్యాంతరహితా! శ్రీకృష్ణా! నీకు అందరూ సమానులే. వీడు శత్రువని హాని కలిగించవు. మరొకడు మిత్రుడని మంచిని చేకూర్చవు. అంతటా సమదృష్టితోనే ఉంటావు. ఇది సత్యం. అలాంటి నీవు మరి ఈ రు
క్మి విషయంలో ఎందుకు భేదబుద్ధిని చూపావు?

సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుం డూరార్చుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Naraduni Valana Vruthanthamunu Vini Krishnudu Banasurunipai Dandetthuta - నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట శరత్కాలమేఘం పాదరసంవంటి స్వచ్చమైన శరీ...