Monday, August 24, 2026

Sahodaruni Bhangamunaku Khinnayagu Rukminidevini Balabhadrum Duraarchuta - సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుం డూరార్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుం డూరార్చుట

ఈ విధంగా బలరాముడు ముందు వెనుకలు ఆలోచించి రుక్మిణీదేవిని గమనిస్తూ ఇలా అన్నాడు.

అమ్మా! రు
క్మిణీ! నీ తోడబుట్టినవానికి అవమానం జరిగిందని దిగులు పడకు. మా తమ్ముడైన శ్రీకృష్ణుణ్ణి తప్పు పట్టబోకు. ఇవన్నీ కర్మకు సంబంధించిన విషయాలు. కడచిన జన్మలో చేసిన కర్మనుబట్టి ఈ జన్మలో జీవికి మంచీ, చెడూ అనేవి కలుగుతూ ఉంటాయి. 

శిక్షించడానికీ, రక్షించడానికీ ఎవడూ కర్త అంటూ లేడు. నీ అన్నకూడా ఈ రోజు ఇక్కడ ఈ అవమానం పొందాడంటే, అదంతా అతడు చేసిన కర్మఫలమే తప్ప మరొకటి కాదు.

బంధువులు ఏదైనా తప్పుచేస్తే అది చంపవలసినంతటి తప్పైనా వాళ్లను చంపకూడదు. క్షమించి విడిచిపెట్టాలి. అది పద్ధతి. అలా కాకుండా చంపామనుకో, పాపం అనేది తప్పకుండా అంటుకుంటుంది. పైగా ముందే చచ్చినవాడిని మళ్లీ చంపవలసిన అవసరం కూడా లేదు.

సృష్టికర్త అయిన బ్రహ్మ రాజులకు ఈ ధర్మాన్ని సృష్టించాడు. రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనే ఆశతో తన తోబుట్టువును తోడబుట్టినవాడే క్రూరహృదయుడై చంపుతుంటాడు.

రాజ్యంకోసం, ధనంకోసం, ధాన్యంకోసం, స్త్రీలకోసం, పరువుప్రతిష్ఠలకోసం, వైభవాలకోసం మానధనులైనవాళ్లు ఆరాటపడతారు. సంపద ఉందనే పొగరుతో ఇతరులను కూడా రెచ్చగొట్టి పోరాటాలకు దింపుతారు.

రుక్మిణీ! విను. లోకంలోని మానవులకు వీడు తనవాడు, వీడు పగవాడు, వీడు తటస్థుడు అనే దృష్టిభేదం దేహాభిమానంవల్ల కలుగుతుంది. ఆ దేహాభిమానం దైవమాయవల్ల కలుగుతుంది. చంద్రుడు, సూర్యుడు వంటివి నీళ్లలో, అద్దాలలో కనిపించి అనేకం ఉన్నాయనిపిస్తుంది. 

కుండలువంటి వాటిలో ఆకాశం కూడా అనేక ఆకాశాలుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆత్మ ఒక్కటే అయినా, ఎన్నో శరీరాలలో ఉండి అనేకంగా అనిపింపజేస్తుంది. ఈ శరీరం చావుపుట్టుకలతో కూడింది. ఇది పంచభూతాలతో, పంచప్రాణాలతో, త్రిగుణాలతో కూడింది.

ఈ శరీరం ఆత్మలో అజ్ఞానంచేత కల్పింపబడి జీవుడిని సంసారంలో తిప్పుతుంటుంది. సూర్యుడు దేనితోనూ సంబంధంలేక ఉదాసీనుడుగా ఉండగా దృష్టి, రూపం అనే వానివలె ఆత్మ ఉదాసీనంగా ఉండగా శరీరం, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ప్రకాశమానమవుతాయి.

ఆత్మ అనేదానికి మరొకదానితో కలయికగానీ, ఎడబాటుగానీ లేవు. పెరగడం, తరగడం అనేవి చంద్రకళలకే గానీ చంద్రునికి ఉండవు. అదేవిధంగా చావుపుట్టుకలు శరీరానికే గానీ, ఆత్మకు కాదు. నిద్రపోయినవాడు కలలో విషయాలవలన కలిగే సుఖదుఃఖాల్ని ఆత్మకు అనుభవింపచేస్తాడు. 

జ్ఞానహీనుడు అసత్యమైన విషయాలలో అనుభవాన్ని పొందుతుంటాడు. నిజానికి సుఖదుఃఖాలనేవి ఆత్మకు అంటవు.

పద్మంలాంటి ముఖం కలిగిన రు
క్మిణీ! దుఃఖమనేది తెలియనితనంవల్ల వస్తుంది. జ్ఞానమనే దృష్టితో ఆ దుఃఖాన్ని విడిచిపెట్టు. విశిష్టమైన జ్ఞానమున్నదానివైన నీవుకూడా అజ్ఞానులవలె శోకింపదగదు.

ఇలా బలరాముడు ప్రబోధించగా రు
క్మిణి దిగులు మానింది. అటుచూస్తే, రుక్మి పరిస్థితి భిన్నంగా ఉంది. శ్రీకృష్ణుడు అతణ్ణి కేవలం ప్రాణాలతో వదలిపెట్టాడు. కృష్ణుని వల్ల తనకు వికార రూపం రావడంతో దానికి రుక్మి చాలా దుఃఖించాడు. ఇంత అవమానం చేసిన శ్రీకృష్ణుని గెలిచి కాని తిరిగి తన పట్టణమైన కుండిన పురానికి పోనని ప్రతిజ్ఞ చేసి పట్టణ సమీపంలోనే ఉండిపోయాడు.

ఇలా పద్మాలవంటి నేత్రాలుకల శ్రీకృష్ణుడు రాజసంతో రాజలోకాలను గెలిచి వెలిగాడు. వెలుగులీనుతున్న తన నగరానికి చంద్రబింబంవంటి ముఖంగల రుక్మిణిని తెచ్చాడు అంటూ బంధువులందరూ శ్రీకృష్ణుని పొగడ్తలతో ముంచెత్తారు.

శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని బెండ్లి యాడుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Srikrishnudu Keligrhamunandu Rukminidevitho Virasocktu Laduta - శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట ఈ వచనంలో కవి రుక్మిణీదేవి సౌధంలోపలి మంది...