హనుమంతుడు ఇంకా చెపుతున్నాడు:
రామకార్యం, సుగ్రీవయత్నం సఫలమయినట్లే. సీతాదేవిని చూసిన అనంతరం ఆ శీలవతి పట్ల నా మనస్సు నిర్మల భక్తి భావంతో వుంది. ఇక రావణుడు, వాని తపశ్శక్తి ఎంతటి దంటే ఈ సర్వలోకాలనూ రక్షించనూ గలడు, దహింపజెయ్యనూ గలడు. అంత శక్తిమంతుడు. ఆ తపశ్శక్తి కారణంగానే వాడు సీతను తాకినా నశించలేదు. ఆవిడ నిజంగా ఆగ్రహిస్తే అగ్నికంటె తీక్షణ మయింది. వాని తపోஉగ్ని ఎంత!
సరే. ఇప్పుడింక మనం రామ లక్ష్మణులను తీసుకుని సీతాదేవిని దర్శించాలి.
లంకా నగరాన్ని ధ్వంసంచేసి, మూలబలంతో రావణుని కడతేర్చే శక్తి నాకు లేకపోలేదు. మీ వంటి మహాయోధులు కూడా కలిస్తే వేరే చెప్పవలసింది లేదు.
ఐంద్ర, రౌద్ర, వాయవ్య, బ్రహ్మాస్త్రాలు నన్నేమీ చెయ్యలేవు. మరి మీ ఆజ్ఞలేదు కనక కాని, అప్పుడే రావణ వంశ నాశనం, చేసేవాడిని.
మన మహానాయకుడు జాంబవంతుడు విజృంభిస్తే ఎదురేముంది.
అందాకా ఎందుకు! మన యువరాజు అంగదుడు చాలు. వీరులు పనస, నీలులు కదిలితే మందరగిరిని పిండిచేస్తారు. మైంద ద్వివిదులను ఎదుర్కొనే శక్తి దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస నాగజాతులలో ఎవరికుంది? వీరు బ్రహ్మ వర ప్రభావ సంపన్నులు. అమృతం అందుకున్నవారు. వీరిద్దరూ చాలు లంకను కూల్చడానికి, నేనే లంకానగరాన్ని బూడిదచేసి వచ్చాను. అక్కడ రామలక్ష్మణ సుగ్రీవ జయనాదాలు చేశాను; అన్నాడు.
No comments:
Post a Comment