Friday, August 28, 2026

Srikrishna Bheemaarjunulu Jarasandhuni Vadhimpa Bovuta - శ్రీకృష్ణ భీమార్జునులు జరాసంధుని వధింప బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
శ్రీకృష్ణ భీమార్జునులు జరాసంధుని వధింప బోవుట

జరాసంధుడు యుద్ధభిక్షను సమర్పించినప్పుడు మేము పూనికతో భీమునిచేత జరాసంధుణ్ణి చంపించగలం అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు ఈ ఆలోచన బాగుంది అన్నాడు. ఆ తర్వాత, శుద్ధయశోవంతులైన శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణవేషాలు వేసుకొని, జరాసంధుని నగరానికి వెళ్లారు.

శ్రీకృష్ణభీమార్జునులు బ్రాహ్మణవేషాలు ధరించి, ముగ్గురిశరీరాలు తేజోవంతాలై మూడగ్నులవలె ప్రకాశిస్తూ ఉండగా అతివేగంగా గిరివ్రజ పట్టణానికి వెళ్లి ఆ పట్టణంలో చాల శ్రద్ధతో అతిథులను పూజిస్తూన్న జరాసంధుణ్ణి చూచి ఇట్లన్నారు.

(త్రేతాగ్నులు - 1. గార్హపత్యం 2. ఆహవనీయం 3. దక్షిణాగ్ని.)

ఓ రాజా! సదాచార సంపన్నా! నీవు అతిథి పూజలు అతి నిష్ఠతో చేసేవాడివని దశదిశలలో నిన్ను గూర్చి జనులు చెప్పగా విని మేము వచ్చాం. మా మనస్సులోని కోర్కెను మన్నించి కాదనక ఇవ్వాలి అన్నారు.

ఓ పుణ్యాత్ముడా! ఎల్లకాలం అతిథుల్ని తగిన రీతిలో భక్తిగౌరవాలతో సన్నానించేవారు, పూజించేవారు అయిన ఉత్తములు ఈ భూమిపై శాశ్వతమైన కీర్తిని పొందుతారు.

మహావివేకంగల జరాసంధుడా! చక్కగా పరిశీలించి చూడగా ఈ శరీరం స్థిరమైంది కాదని తెలిసి, శాశ్వతమైన కీర్తిని పొందడానికి ప్రయత్నం చేయని మానవుడు బ్రతికీ చచ్చినవాడే అవుతాడు.

లోకంలో దాతలకు ఇది ఇవ్వదగిందీ కాదు, ఇది అనే వస్తువు ఒక్కటికూడా లేదు. ఏది కోరినా ఇస్తారు. దధీచి అనే మహర్షి దేవతలు కోరగా తన శరీరంలోని ఎముకలను అతి ధైర్యంతో సమర్పించిన విషయం విన్నాం కదా!

(దధీచి ఇచ్చిన వెన్నెముకతోనే ఇంద్రునివజ్రాయుధం చేయబడింది.)

ఓ పుణ్యపురుషా! పూర్వం ఈ భూమిపై ఒక పావురం తనను యాచించిన బోయవాని కోరికను కాదనక అతని ఆకలి తీర్చుటకు దేహాన్నే ఆహారంగా అర్పించి శాశ్వతమైన కీర్తిని పొందిందనే కథను విన్నాం కదా!

పూర్వకాలంలో శిబి చక్రవర్తి తనను పరీక్షించడానికై ఇంద్రుడు డేగగా, అగ్ని కాకిగా రూపాలు ధరించి వచ్చి మాంసాన్ని కోరగా శిబి ధీయుతుడై తన శరీరాన్ని తెగువతో కోసి యిచ్చిన విషయం మనం విని ఉన్నాం కదా!

మానసిక ధైర్యంగల రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బలి అనే చక్రవర్తులు, బిచ్చమెత్తుకొని జీవించే ఒక బ్రాహ్మణుడు పూర్వకాలంలో చేసిన దానవిశేషాలు మనం విని ఉన్నాం కదా! సన్నుతచరితులైన ఆ మహాత్ములు చనిపోయినప్పటికీ జీవించియున్నవారివలెనే నేటికినీ ప్రజలు చెప్పుకొంటున్నారు. (యశఃకాయులై జీవించి ఉన్నారు అని తాత్పర్యం.)

అనగా విని వారి ఆకారాల్నీ మబ్బు ఉఱిమినట్లు గంభీరంగా ఉండే వారిమాటల్నీ, వింటినారిఒరపిడిచే కాయలు కాచిన వారిచేతుల్నీ, వారి తేజస్సునూ చూచి మనస్సులో 'వీరు బ్రాహ్మణ వేషధారులైన రాజోత్తములై ఉంటారు. ఇట్టి వీరు అడిగిన వస్తువులే కాదు నా ప్రాణాలనైనా ఇస్తాను. అదీగాక పూర్వం బలిచక్రవర్తి బ్రాహ్మణవటువురూపంలో ఆ విష్ణువే వచ్చి యాచింపగా, తన పదవి పోతుందని తెలిసికూడా సంకోచించక ముల్లోకాల్నీ దానమిచ్చి కీర్తిదేహుదైనాడు. క్షత్రబంధుడనేవాడు బ్రాహ్మణునికొరకు తన ప్రాణాలు విడిచి, కీర్తిని పొందాడు. కాబట్టి, ఈ అశాశ్వతమైన శరీరాన్నిగూర్చి విచారించడం మాని, కీర్తిని పొందడం మేలు అని తలచి కృష్ణభీమార్జునులను చూచి ఇలా చెప్పాడు.

గొప్ప గుణవంతులైన సత్పురుషులారా! మీ కోరిక ఏమో తెలియచెప్పండి. మీరు ఏమి కోరినప్పటికీ తప్పక ధైర్యంతో ఇస్తాను. అంతేకాదు, కావాలంటే నా తలను తెగగొట్టియైనా మీకు సమర్పిస్తాను.

అనగా, ఆ శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి చూచి “ఓ రాజోత్తమా! నీవు సత్యవాక్యపాలనంలో శ్రద్ధగలవాడవై ఉండటం మాకు స్పష్టంగా తెలియవచ్చింది. మాకు నీవు యుద్దాన్ని భీక్షగా ఇవ్వాలి. నేను కృష్ణుణ్ణి. ఇతడు అర్జునుడు. ఈతడు పవనపుత్రుడైన భీముడు. మా ముగ్గురిలో ఎవరితోనైనా ఒక్కరితో, ఒక్కడవే యుద్ధం చేయడం మాకు కావాలి” అన్నాడు.

అని కృష్ణుడు చెప్పగా జరాసంధుడు నవ్వుతూ “ఔరా! ఓ కృష్ణా! ఈనాడు నీ నోటి నుండి కొత్త కొత్త మాటలు విన్పిస్తున్నాయి. మునుపు నీవు యుద్ధంలో నాతో పోరాడలేక అనేకపర్యాయాలు పారిపోలేదా? కపటమార్గంలో మధురా పట్టణాన్ని విడిచి, సముద్రమధ్యంలో దాక్కొనలేదా? నీ శౌర్యం, పరాక్రమం నేనెఱుగనివా?అని పరిహాసం చేశాడు.

నందునికొడుకువైన ఓ గోపాల బాలుడా! నీతో ఇన్ని మాటలెందుకు? నీ వెన్ని కపటవేషాలు వేసినా నిన్ను విడిచిపెట్టేది లేదు. బలాఢ్యుడై ఈ మగధరాజుయుద్ధరంగంలో ఎంతటి వీరుడో! నీవు ఇది వరలో చూచి అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నదే కదా!

అనేక పర్యాయాలు నీవు నాతో పోరాడజాలక ఓడిపోయినవాడివి - కనుక నీకు నన్నెదిరించడం కష్టసాధ్యం కాబట్టి నువ్వు తప్పుకో. అర్జునుడు భుజబలంలో అధికుడే అయినప్పటికి పసివాడు. ఈ వాయుతనయుడైన భీముడు నాకు సరియైన యోధుడుగా నా బలాన్ని సహింపగలవాడుగా కన్పిస్తున్నాడు. కాబట్టి, ఈ భీముణ్ణే ఎదిరిస్తానని భయంకర రూపుడై జరాసంధుడు భీముణ్ణి యుద్దానికి రమ్మని చేయి విసరి పిలిచాడు.

అప్పుడు జరాసంధుడు ఒక భయంకరమైన గదను భీమునికి ఇప్పించి, తానూ ఒక గదను పూని, కృష్ణార్జునులను వెంటబెట్టుకొని నలుగురు నగరము బయటికి పోయి అచట ఎత్తుపల్లములు లేని చదునుగా గల ప్రదేశంలో

శ్రీకృష్ణ సహాయుం డగు భీముడు జరాసంధునితో యుద్ధము సేయుట







No comments:

Post a Comment

Sri Krishnudu Danthavaktruni Vadhinchuta - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కపటియైన సాల్వుణ్ణీ, ఆతనిసౌభకవిమానాన్నీ...