అందరూ మహేంద్రగిరి శిఖరం నుండి గగన వీధికి ఎగిరారు.
మత్తేభాలవలె, మహాగిరులవలె వారు ఆకాశమంతా క్రమ్ముకున్నారు. వారందరూ సాగి సాగి నందన వనంలా ఉండే మధువనంలో ప్రవేశించారు. వివిధ తరు లతా శోభతో అది సుగ్రీవ రక్షితమై సర్వమనోహరంగా వుంది. ఆ వనంలో ఎవరూ అడుగు పెట్టడానికి వీలులేదు.
సుగ్రీవుని మేనమామ దధిముఖుడు ఆ వనపాలకుడు. ఆయన అప్రమత్తంగా రక్షించే వనంలో ప్రవేశిస్తూనే వానరులందరూ అంగదుని ఛేరి మధుపాన కాంక్ష వెలిబుచ్చగా, ఆ యువరాజు జాంబవంతాది వృద్దులతో సంప్రదించి వానరులకు అనుమతి యిచ్చాడు.
అంతతో పట్టరాని సంతోషం కలిగిన ఆ వానరులు.
గాయన్తి కేచిత్ ప్రణమంతి కేచిత్
నృత్యన్తి కేచిత్ ప్రహసన్తి కేచిత్ ।
పతన్తి కేచిత్ విచరన్తి కేచిత్
ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్‌ః ॥
కొందరు పాటలు మొదలుపెట్టారు. కొందరు ప్రణామాలు, నాట్యాలు, నవ్వులు, తిరుగుళ్ళు, దూకుళ్ళు, అతి ప్రసంగాలు అలా సాగిస్తున్నారు.
ఒక చెట్టుమీది నుండి మరొక చెట్టుకు దూకుతూ, చివరి కొమ్మనుండి నేలకు దుముకుతూ, నేలనుండి వృక్షాగ్రాలకు ఎగురుతూ గడిపారు. ఒకడు పాడుతూంటే ఒకడు నవ్వుతున్నాడు, నవ్వే వానిని చూచి ఏడిచే వాడొకడు, అరిచే వాడొకడు, వాడికి ప్రోత్సాహం ఒకడు:
మధుపానమత్తులై వారు మతులుపోయి చరిస్తున్నారు.
పాన మత్తతలో వారు కొమ్మలు విరిచారు, చెట్లు ధ్వంసం చేస్తున్నారు. చూశాడు దధిముఖుడు, వనపాలుడు.
క్రోధంతో వచ్చి వారించబోయోడు. కొందరిని మందలించాడు, దూషించాడు, దెబ్బలు వేశాడు. వారందరూ ఆ మత్తులో దధిముఖుని దండించడం ఆరంభించారు.
గోళ్ళతో రక్కి, పళ్ళతో పీకి, కాళ్ళతో తన్ని నానా హింసలూ పెట్టారు.
అది చూసి హనుమంతుడు మీరందరూ మధుపానం సాగించండి. వీరి విషయం నేను చూస్తాను, అనవిని అంగదుడు కార్యసాధకుడైన హనుమంతుడు చెపితే అకార్యం అయినా చెయ్యవలసిందే, అనగా వారందరూ అంగదుని కొనియాడి మధువనంలో మిగిలిన వృక్షాలవైపు సాగి ఫలాలు భక్షిస్తూ, మధువు త్రాగుతూ అడ్డు వచ్చిన వారిని చావగొడుతున్నారు.
దోసెళ్ళతో కొందరు త్రాగుతూంటే మధుభాండాలు చంకలలో పట్టుకుపోతున్నారు కొందరు, త్రాగి కొట్టుకోవడం మొదలు పెట్టారు, కొందరు చెట్టు మొదట నిలిచారు. కొందరు ఎండుటాకుల మీద దొర్లుతున్నారు. తూలే వారు కొందరు, త్రోసుకునేవారు కొందరు.
కూతలు కూసేవారు, నిద్రపోయేవారు, సింహనాదాలు చేసేవారు, అట్టహాసాలు, తాడనాలు అలా మత్తులో ఉన్నారు వారు.
వారి చేత దెబ్బలు తిన్న వన పాలకులు పిక్కబలం చూపారు.
తన సేవకుల పరాభవం విని దధిముఖుడు వారందరినీ తీసుకుని మహావృక్షాలు పెరికి వానరయోధులను వారించరాగా హనుమదాదులు ఎదురు వచ్చారు,
పానమత్తుడై వున్న యువరాజు అంగదుడు ఒళ్ళు తెలియని దశలో దధిముఖుని నేలమీద పడగొట్టి చితకబొడిచాడు.
ఆ యువకుడి దెబ్బలకు మూర్చపోయాడు దధిముఖుడు. కొంత సేపటికి తేరుకొని తన అనుచరులను వెంటబెట్టుకుని సుగ్రీవుని చేరి మధువనంలో జరుగుతున్న విషయం వివరించి తలవంచి దోసిలి ఒగ్గి, యింత అకార్యానికీ కారకుడు అంగదుడు, అంటూ పాదాలమీద పడ్డాడు.
సుగ్రీవుడు వానిని లేవనెత్తి:
నీకు అభయమిస్తున్నాను. విషయం వివరంగా చెప్పు, అన్నాడు.
వానరేశ్వరా! నీ తండ్రి ఋక్షరజసుడుగానీ, మీ అన్న వాలిగానీ మధువనంలో అడుగుపెట్టలేదు. నువ్వు కూడా ఎప్పుడూ ఆ వనంలో దిగలేదు. అటువంటి వనాన్ని ధ్వంసం చేసి మధువంతా పానం చేశారు అంగదాదులు. మేమందరం వారించబోగా బాగా మాకు పాదతాడనాలు లభించాయి. చక్రవర్తివి నువ్వుండగా మాకు వారే శిక్ష వేశారు, అని దుఃఖిస్తూంటే, చూచి లక్ష్మణస్వామి:
వానరేశ్వరా! ఎందు కీయన దుఃఖిస్తున్నాడు, అని ప్రశ్నించాడు.
లక్ష్మణా! అంగదాదులు మధువనంలో ప్రవేశించి యధేచ్భగా త్రాగుతూ తిరుగుతున్నారని చెపుతున్నాడు.
వారందరూ దక్షిణదిశకు అన్వేషణకు వెళ్ళినవారు. ఆ వనంలో వారు స్వేచ్చగా చరిస్తున్నారంటే కార్యసాధకులై వచ్చారన్నమాట. కాకపోతే ఆ సాహసం వారికి రాదు. నిస్సందేహంగా వారు సీతను చూశారు.
హనుమంతుడే ఆ కార్యం సాధించి ఉంటాడు. కార్యసాధనకు యోగ్యమయిన ఆలోచనా శక్తి అతనికే ఉంది. వివేకవంతుడయిన పరాక్రమ సంపన్నుడు మా హనుమ. అదీకాక-
జాంబవా న్యత్ర నేతాస్యాత్
అంగదశ్చ బలేశ్వరః
హనుమాం శ్చాప్యధిష్ఠాతా
న తస్య గతి రన్యధా
నాయకుడు జాంబవంతుడు.
బలాధిపతి అంగదుడు.
అధిష్ఠాత హనుమంతుడు. ఇక కార్యసాధనకు అడ్డేమిటి!
వీరందరూ మధుపానానికి ఉపక్రమించారంటే సీతాదేవిని చూసి వచ్చారన్నమాటే.
కాకపోతే బ్రహ్మదత్తమయిన మధువనంలో కాలు పెట్టడానికి అంగదాధులకు ఎన్ని గుండెలు కావాలి. వారు సీతను చూశారు, అనడంతో రామ లక్ష్మణులు పరమానందం పొందారు:
అప్పుడు సుగ్రీవుడు:
కార్యసాధకులయి వచ్చిన అంగదాదులు ఏం చేసినా క్షమించాలి. సింహసదృశులయిన హనుమదాదులందరినీ మేము చూడగోరుతున్నాం. సీతాన్వేషణ విశేషాలు వినగోరుతున్నాం, అన్నాడు.
ఆ మాట విని దధిముఖుడు సుగ్రీవ రామ లక్ష్మణులకు నమస్కరించి తన అనుచరులతో మధువనం చేరాడు.
అప్పటికి మత్తు వదులుతూన్న వానరవీరులను సమీపించి, చేతులు జోడించి, అంగదుని సమీపించి:
యువరాజా! మా అపరాధం మన్నించండి. ఈ వనం మీద మీకూ అధికారముంది. ఒకనాడు వాలి వానరేశ్వరుడు, అదే రీతిగా సుగ్రీవుడు, ఆ తరువాయి నువ్వు. అందువల్ల క్షమాభిక్ష కోరుతున్నాను.
ఇప్పుడు మేము సుగ్రీవునికి ఈ వార్త నివేదించగా ఆయన సంతోషంతో అందరినీ రమ్మన్నాడు. త్వరగా మిమ్మల్ని చూడగోరుతున్నాడు అనగా,
అంగదుడు: వానర వీరులారా! రామచంద్రుని కీ విషయం తెలిసివుంటుంది. అందువల్ల మనం త్వరగా వెళ్ళాలి. మధుపానముత్తులై హాయిగా నిద్రించే వానరవీరులను తీసుకుని సుగ్రీవ సన్నిధానానికి వెళ్ళాలి. పెద్దలు ఎలా చెపితే అలా నడుచుకుంటాను, నేను యువరాజునయినా కార్యసాధకులను అజ్ఞాపించడం ఉచితం కాదు, అన్నాడు.
ప్రభువయినవాడెవ్వడూ యింత వినయంగా మాట్లాడడం మేమెరగం. ప్రభుత్వమదం వినయాన్ని దరిజేరనివ్వదు. అహంకారం దాని లక్షణం. ఇది నీ భావిశ్రేయస్సుకు మంచిది.
నీ మాట మీద మే మందరం సుగ్రీవ సన్నిధానానికి రావడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నారు వారు.
అయితే నడవండి, అని అంగదుడు ఎగిరాడు.
ఒక్కమారుగా యంత్ర ఉక్షిప్తమయిన పర్వతాలవలె వానరయోథులు ఎగిరారు.
వాయు విచలితములయిన మేఘసముదాయంలా గర్జిస్తూ వస్తూంటే సుగ్రీవుడు:
రామభద్రా! నువ్వు నిశ్చింతగా వుండు. మనవారు సీతను చూసే వస్తున్నారు. ఎలా అంటావా! నేను పెట్టిన గడువు దాటిన తరువాయి నా ఎదుటపడగల వానరుడు లేడు. గడువుదాటి వస్తున్నారంటే పనిచేసుకు వచ్చారన్నమాట, ఆలా కాకపోతే మా అంగదుడు నా ముందుకు రానే రాడు. పయిగా వారు మహోత్సాహంలో వున్నారని విన్నాంకదా! దాని అర్థం కార్యం సాధించారనే. అదీకాక మా తాత తండ్రులు ప్రాణప్రదంగా రక్షించే మధువనం ధ్వంసం చేశారంటే ఎంత ఉత్సాహంతో వున్నారో యోచించు.
నిస్సందేహంగా సీత కనిపించి వుంటుంది, హనుమంతుడే చూచి వుంటాడు. మా హనుమ ధీశాలి, కార్యసాధకుడు.
హనూమతిహి సిద్ధిశ్చ
మతిశ్చ మతి సత్తమ-
జాంబవంతుడు నాయకుడు, అంగదుడు బలేశ్వరుడు, హనుమంతుడు సాధకుడు. అటువంటప్పుడు మరోలా జరగడానికి వీలులేదు. నువ్వు నిశ్చింతగా వుండు, అంటూండగా కిలకిల ధ్వానం చేరింది.
ఆ ఉత్సాహధ్వానం వినే సుగ్రీవుని వాలం పెరిగింది; మనసు సంతోషంతో పొంగింది.
వానరు లందరూ రామదర్శన లాలసులై అంగదునీ, హనుమంతునీ ముందుంచుకుని క్రిందికి దిగారు.
హనుమంతుడు చేతులు జోడించి, రాముని ముందు నిలిచి:
స్వామీ! సీతాదేవి క్షేమంగా వుంది, అన్నాడు.
సుగ్రీవునికి తన ఊహ నిజమయినందుకు ఆనందం కలిగింది. లక్ష్మణుడు ఆదరనయనాలతో హనుమంతుని చూశాడు. రామభద్రుడు సంతోష వదనంతో చూశాడు.
చూడామణి

No comments:
Post a Comment