Saturday, August 1, 2026

Bhasma Snanam (Ritual bath with sacred ash) - భస్మస్నానం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మస్నానం

ర్ధ్రస్నానం కన్నా భస్మస్నానమే ఉత్తమోత్తమం. ఎందుకంటే ఆర్ధ్రత ఆరిపోతుంది. అదీగాక ఆర్ధ్రస్నానం ప్రకృతిసిద్ధం. ప్రకృతి అంటే బంధనమేనని పెద్దలంటారు. కనక ప్రకృతిబంధ విమోచనంకోసం భస్మస్నానం చెయ్యాలి. సారాంశమేమంటే - ఆగ్నేయస్నానానికి సాటివచ్చేది ఈ ముల్లోకాలలోనూ మరొకటి లేదు. అందుచేతనే సకలదేవతలూ రక్షణకోరి పవిత్రతకోరి మంగళంకోరి ఈ విభూతిని ఆదిపరాశక్తికి ప్రేమతో కానుకగా అందించారు. అంతటి పవిత్రమైన ఈ ఆగ్నేయస్నానం అశీతివాత రోగాలనూ చతుష్టష్టిపిత్తరోగాలనూ సప్తత్రిపంచక శ్లేష్మరోగాలనూ వ్యాఘ్ర చోర దుష్టగ్రహ భయాలనూ తక్షణం తొలగిస్తుంది. సందేహం లేదు. సింహం చేతిలో ఏనుగుల్లాగా ఇవి మడిసిపోతాయి.

శీతలోదకాలతో స్నానంచేసి విభూతిని నెన్నొసట త్రిరేఖలుగా ధరించినవాడు పరబ్రహ్మను చేరుకుంటాడనడంలో సందేహం లేదు. భస్మస్నానంకూడా చేస్తే బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండిపోతాడు అనడంలో అంతకన్నా సందేహం లేదు. లలాటలిఖితమైన బ్రహ్మరాతలలో పనికి రానివాటినీ హానికరమైనవాటినీ తుడిచివేసే శక్తి త్రిపుండ్రాలకుమాత్రమే ఉంది. ఆ బ్రహ్మకు కూడా లేని శక్తి ఇది. ఏ ఆవయవాన విభూతి పెట్టుకుంటే ఆ అవయవం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. గుండెలపై దాలిస్తే మనస్సు చేసే పాపాలు బొడ్డున ధరిస్తే మర్మాంగం చేసిన పాపాలూ అంతరిస్తాయి. కుడియెడమ పార్శ్వభాగాలలో ధరిస్తే పరకాంతాలింగనాది దోషాలు నశిస్తాయి. అందుచేత శరీరంలో ఎక్కడ దాల్చినా శ్రేయస్కరమే. మూడురేఖలుగా ధరిస్తే త్రిమూర్తులనూ ధరించినట్టే. త్రిగుణాలనూ ధరించినట్టే, త్రిలోకాలనూ ధరించినట్టే. ఒళ్ళంతా బూడిద పులుము కున్నవాడు సర్వపాపవిముక్తుడై సరాసరి మోక్షం పొందుతాడు. ఇతడినే ఆత్మనిష్ఠుడంటారు. భస్మదిగ్ధసర్వాంగుడూ భస్మదీప్త త్రిపుండ్రకుడూ భస్మశాయి అయిన పురుషుణ్ణి భస్మనిష్ఠుడు అంటారు. భూత ప్రేత పిశాచోరగాదులూ దుస్సహరోగాలూ భస్మనిష్ఠుణ్ణి చూస్తే పదిఆమడల దూరం పారిపోతాయి.

భాసిస్తుందికనక భసితమనీ, కల్మషాలను భక్షిస్తుంది కనక భస్మమనీ, విభూతిని(ఐశ్వర్యం) కలిగిస్తుంది కనక భూతి అనీ, రక్షిస్తుంది కనక రక్ష అనీ దీనికి పేర్లు ఏర్పడ్డాయి.

రుద్రుణ్ణి స్మరిస్తే పాపాలు నశించినట్టే త్రిపుండ్రాలను చూస్తే చాలు భూత ప్రేత పిశాచాలు పలాయనం చిత్తగిస్తాయి. ఆంతరిస్తాయి. అకృత్యాలు వెయ్యి చేసినా భస్మస్నానం చేస్తే అవన్నీ అగ్నిలో అడవిలా మాడిపోతాయి. కనీసం ప్రాణావసానదశలో అగ్నిస్నానం చేసినా పాపాలు తొలగి పుణ్యలోకాలు చేరుకుంటాడు. నిత్యమూ చేసేవాడు జితక్రోధుడై జితేంద్రియుడై శివసన్నిధికి వెడతాడు. అతడికింక పునర్జన్మ ఉండదు. పున్నమినాడు భస్మోద్దూళితశరీరుడై శంకరార్చన చేసినా చూసినా ముక్తీ పాపవిముక్తీ తప్పవు. ఆయుర్దాయం కావాలన్నా విద్య కావలన్నా కడకు మోక్షమే కావాలన్నా భస్మధారణమొక్కటే శరణ్యం.

కేవలజలస్నానం శరీరం పైని ఉండే మలినాన్ని ప్రక్షాళన చేస్తుంది. విభూతిస్నానమో బాహ్యాభ్య న్తరమలినాలను తొలగిస్తుంది. అంతశ్శుద్ధీ బహిశ్శు
ద్ధీ రెండూ సిద్ధిస్తాయి. కనక జలస్నానం చెయ్యకపోయినా ఫరవాలేదుగానీ భస్మస్నానం చేసితీరాలి. ఇది లేనిదే పవిత్రత లేదు. కాబట్టి వైదికకర్మలకన్నింటికీ ముందు విధిగా ఇది చేసితీరాలి. మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు శౌచవిధులన్నీ నిర్వర్తించాక భస్మస్నానం చేస్తేనే పరిపూర్ణశౌచం లభిస్తుంది. అపానవాయువు విడిచినప్పుడూ ఆవులించినప్పుడూ దగ్గినప్పుడూ తుమ్మినప్పుడూ శ్లేష్మాన్ని ఉమ్మినప్పుడు శుద్దికోసం భస్మస్నానం చెయ్యాలి.

నారదా! భస్మస్నానమాహాత్మ్యం గురించి ఇప్పటికి ఒకవంతు మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉంది. విను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనం ఉంది కనక వీరినే ద్విజులు అంటారు.
ద్విజులందరూ తప్పకుండా శ్రౌతపద్దతిలో విభూతి త్రిపుండ్రధారణ చెయ్యాలి. ఇది లేకుండా. గాయత్రీమంత్రాన్ని ఉపదేశించడానికిగానీ స్వీకరించడానికిగానీ వీలులేదు. అధికారం లేదు. కనక మరిచిపోకుండా విభూతిపెట్టుకునే గాయత్రీజపం చెయ్యాలి. విభూతి రేఖలే ద్విజత్వానికి చిహ్నాలు. రత్నాలూ మణులూ అలంకరించుకోవడంమీద ఎంత ప్రీతి సహజంగా ఉంటుందో, విభూతిని పెట్టుకోవడం మీదకూడా అంత ఆదరమూ అంత సహజంగానూ ఉండాలి. నొసట విభూతిలేకుండా ఏది తిన్నానరకానికి పోతారు. ఇక శూన్య లలాటంతో శివపూజ చేసినా వ్యర్థం. అతడు శివద్వేషితో సమానం. నరకానికి పోవడం ఖాయం. విభూతి పెట్టుకోకుండా శివుడికి బంగారు తులాభారం చేసినా నిష్ఫలం. నరకం తప్పదు. విభూతి లేని సంధ్యావందనం యజ్ఞోపవీతమే లేని సంధ్యావందనంతో సమానం. నిరర్ధకం. యజ్ఞోపవీతం పోతే ప్రత్యామ్నాయాలున్నాయి. జపాలూ ఉపవాసాలూ ఏవో ప్రాయశ్సిత్తాలున్నాయి. కానీ విభూతి ధారణను మరిచిపోతే ఏ ప్రత్యామ్నాయమూ లేదు. ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. సరాసరి నరకలోకానికి పోవడమే.

అందుచేత ద్విజుడు తప్పనిసరిగా శ్రౌతభస్మను సంపాదించి పెట్టుకోవాలి. అది దొరక్కపోతే స్మార్తమూ అదీ దొరకకపోతే లౌకికమూ - ఏదో ఒక భస్మం ధరించితీరాలి. అది పవిత్ర భస్మమైతే చాలు. కుడిచేతి మధ్యాంగుళిత్రయంతో (బొటనవేలూ చిటికెనవేలూ కాక) నుదుట కనీసం ఆరంగుళాల పొడవు ఉండేట్టు ఈ కంటి కొసనుంచి ఆ కంటి కొసదాకా ఉండేట్టు త్రిరేఖలుగా విభూతి పెట్టుకోవాలి. వీటిలో ఆనామికను(చిటికెనవేలుకి ప్రక్కనున్నది) అకారమనీ, మధ్యమాంగుళిని (నడిమివేలు) ఉకారమనీ, తర్జనిని(చూపుడువేలు) మకారమనీ అంటారు. ఈ మూడింటి సంయోజనతో ఏర్పడిన త్రిపుండ్రం త్రిగుణాత్మకం, ప్రణవాత్మకం, (అ + ఉ + మ్‌ = ఓమ్‌). అట్టడుగు అనామికారేఖ బ్రహ్మతత్త్వం. కనక రజోగుణం. నట్టనడిమి మధ్యమాంగుళీరేఖ విష్ణుతత్వం. కనక సత్వగుణం. తుట్టతుది తర్జనీరేఖ శివతత్త్వం. కనక తమోగుణం. ఇలా త్రిపుండ్రం త్రిగుణాత్మకం, త్రిమూర్తి స్వరూపం.

త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ




No comments:

Post a Comment

Tripundra Vibhuti Mahima - Durvasudi Katha - The Glory of Tripundra Vibhuti – The Story of Durvasa - త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ

త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ నారదా! ఇక్కడొక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడు శరీరంనిండా విభూతి ఆలంకరించుకుని రుద్రాక్షమా...