Saturday, August 22, 2026

Sri Krishnamurthy Madhuraa Nagara Pravesamu Seyuta - శ్రీ కృష్ణమూర్తి మథురా నగర ప్రవేశము సేయుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీ కృష్ణమూర్తి మథురా నగర ప్రవేశము సేయుట

పుణ్యాత్ముడివైన అక్రూరా! యాదవవంశానికి శత్రువై గర్వంతో సంచరిస్తున్న కంసుణ్ణి సంహరించిన తర్వాత ఇల్లు చూడడానికి వస్తాను. ఇప్పుడు నీవు ఈ రథాన్ని తీసుకొని నగరానికి వెళ్ళుము.

అని ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా అక్రూరుడు నగరంలోనికి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడికి తెల్పి తన ఇంటికి వెళ్ళాడు. కృష్ణుడు అపరాహ్ణకాలంలో బలరామునితో, గోపకులతో కూడినవాడై మథురానగరం ప్రవేశించాడు.

శ్రీకృష్ణు డల్లంతలో అగడ్తలు, కోటలు, బురుజులు, టెక్కెములు, రాజభవనాలు, వీథులు, గుర్రాలు, రథాలు, గజాలు, మేడలు, శూరభటులు, యువతులు, ధాన్యాలు, ధనాలు, గొప్పఉద్యానవనాలు, నడబావులు, మొదలైనవాటివల్ల అత్యద్భుతమైన శోభతో విరాజిల్లే మధురానగరాన్ని వీక్షించాడు

శ్రీకృష్ణుడు మధురాపురిలో ప్రవేశించి వచ్చేవేళలో

ఓ రమణులారా! నందుని తపస్సుకు ఫలమైనవాడు, మేల్మిగుణాలరాశి, గొల్లవనితల నోములపంట, ఇందిరా సుందరిడెందానికి ఆనందం కలిగించేవాడు, కరుణకు సముద్రుడు, యోగిసమూహాలు తమమనసుల్లో కోరుకొనే అపురూపమైన పెన్నిధీ అయిన అచ్యుతుడు వస్తున్నాడు. కన్నుల కోర్కే తీరేటట్లు వెళ్ళి దర్శిద్దాం, రండి.

అంటూ పట్టణంలోని అందగత్తెలు గోవిందుణ్ణి సందర్శించడానికి ఉబలాటపడి ఒకరి నొకరు పిలుచుకున్నారు. వారు అన్నం తింటున్నప్పటికీ పాత్రలను అవతలికి నెట్టివేశారు. పరుండి ఉన్నప్పటికీ పడకలనుంచి లేచారు. తలంటుకొంటున్నప్పటికీ స్నానం చేయలేదు. పెద్దలచే దండింపబడుతున్నప్పటికీ జంకినవారు కారు మగలతో క్రీడిస్తున్నప్పటికీ క్రీడించడం చాలించారు. పసిపాపలను పట్టుకొన్నవారైనప్పటికీ దింపివేశారు. అలంకరించుకుంటున్న వారయినప్పటికీ పరస్పరం చీరలు, నగలు, పూలదండలు, మైపూతలు తారుమారుగా ధరించి వెళ్ళీ

పట్టణంలో ఉండే స్త్రీలంతా రత్నాలు తాపిన ఎత్తయిన బంగారు మేడలపై గుంపులు గూడి విశాలమైన వక్షస్థ్సలం కలవాడూ, తామరరేకులవంటి కన్నులుగలవాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి చూశారు.

పూతన అనే రాక్షసి అసువులు వీడేటట్లు స్తన్యపానం చేసిన అసాధ్యుడైన అర్భకుడు వీడేనంట! నందుని ఇల్లాలు యశోదకు, తన నోట విశ్వమంతా చూపించిన ముద్దుబిడ్డడు వీడేనట! గర్వించి మందలోని వెన్నలు దొంగిలించి భక్షించిన దొంగ వీడేనట! మనసులు కరిగించి గొల్లకన్నెల మానాన్ని కొల్లగొట్టిన భువనైక సుందరుడు వీడేనట! ఇతడు లేనిపట్టణం అరణ్యప్రదేశం. ఇతణ్ణి కలియని జన్మ నిరుపయోగం. ఇతణ్ణి పలుకరించని పలుకు పక్షిపలుకు. ఇతణ్ణి దర్శించని చూపులు నిజంగా వ్యర్థాలు.

ఓ చెలీ! పడుచువారిలో మిన్నయైన ఈ కృష్ణుణ్ణి గోపికాస్త్రీలు చేతిలో ఉసిరిక కాయమాదిరి క్రీడకు తెచ్చి ధ్యానిస్తూ, కీర్తిస్తూ సంభాషిస్తూ స్పృశిస్తూ, నవ్వుతూ, లాగుతూ, లాలిస్తూ నిత్యం ఆనందిస్తున్నారు. వారు ఇలాంటిఆదరాన్ని పొందడానికి గడచిన పుట్టుకల్లో ఏ అడవుల్లో ఎటువంటి నోములు నోచారోగదా!

ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధంగా ఆ పట్టణంలోని అతివలు అదేపనిగా తమ నేత్రాలతో హరిరూపాన్ని ఆస్వాదిస్తూ హృదయాలలో నిల్పుకున్నారు. సంతోషంతో పూలజల్లులు చల్లారు.

అనంతరం మథురానగరంలోని బ్రాహ్మణులు పలురకాల చందన ద్రవ్యాలనూ, పూలు, పండ్లు మొదలైనవాటినీ, శుభకరాలైన పచ్చని అక్షతలనూ కానుకలుగా ఇస్తూ ఉత్తములైన ఆ వసుదేవకుమారులను ఉత్సాహంతో పూజించారు.

ఆ సమయంలో నగరంవాకిటినుంచి వస్తున్న బట్టలు ఉదికి రంగులు వెసే ఒక చాకివాణ్ణి చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

శ్రీకృష్ణుండు రజకుని జంపి వాయకసుదాము లొసంగు పూజల నంగీకరించి మేలొసంగుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...