Saturday, August 29, 2026

Sri Krishnudu Sakutumbamuga Grahana Snaanamunaku Bovuta - శ్రీ కృష్ణుడు సకుటుంబముగా గ్రహణ స్నానమునకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీ కృష్ణుడు సకుటుంబముగా గ్రహణ స్నానమునకు బోవుట

అవతారిక: దీనికి ముందు జరిగిన కథలో తన బాల్యసఖుడైన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు చిన్ననాటి చెలిమితో ఆదరించి చక్కగా ఉజ్జీవింపజేసిన కథ వినిపించినాడు. విన్నశ్రోత పరీక్షిత్తు. వక్త శుకమహర్షి అందుకే, భాగవతగాథ అంతా “వేదకల్పవృక్షవిగళితమై శుకముఖసుధాద్రవం”లో తడిసిందని చెప్పబడింది. భక్తిరసార్ద్రత భాగవతజీవధాతువు.

పాపులను శిక్షించి, వారి దుష్టకార్యాలను ముందు తరాలలో ఎవ్వరూ చేయకుండా కట్టడిచేసి, వారిచే బాధితులైన మంచివారికి రక్షణనిచ్చే మహాకార్యాలు చేసే లక్ష్యంతో శ్రీకృష్ణభగవానుడుగా అవతారమెత్తిన విష్ణుకథను విపులంగా చెప్పవయ్యా! అని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగినాడు.

శుకమహర్షి పరీక్షిత్తు అడిగినదానికి జవాబుగా ఇలా అన్నాడు.

కుచేలు
ణ్ణి సత్కరించిన ఘట్టం తరువాత - కొంతకాలం గడిచింది. బలరామకృష్ణులు సుఖంగా కాలం గడుపుతున్నారు. జగత్ప్రళయకాలంలో వలె కన్నులు భరించలేనంత దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యబింబానికి గ్రహణంపడుతోందని తెలిసి, ప్రజలు పూర్వం జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు మహాక్రోధంతో తన తండ్రిమృతికి కారణమైన రాజలోకాన్ని తన పదునైనగండ్రగొడ్డలి అంచుతో ఇరవై ఒక్కసార్లు తలలు నరికి, వారిరక్తధారల ప్రవాహాలతో (నిండిన ఐదు మడుగుల శ్యమంతకమనే పవిత్ర సరోవరాలున్న చోటికి కదలివెళ్లారు. )

(సూర్యగ్రహణాన్ని సూర్యోపరాగమనీ, చంద్రగ్రహణాన్ని చంద్రోపరాగమనీ అంటారు. ఉపరాగమంటే గ్రహణం.)

పరశురాముడు ఇరువదొక్కమార్లు చంపిన రాజుల రక్తధారలతో శ్యమంతక పంచకమనే పేర ఐదుచెరువులను సృష్టించినాడు. అక్కడికి ద్వారకా ప్రజలు, ఆపై బలరామకృష్ణులుకూడా స్నాన, దానాదికాలకోసం సూర్యగ్రహణ సమయానికి అక్కడికి బయల్దేరినారు.

కర్మలను ఆచరించవలసిన అవసరంలేనప్పటికీ, లోకాచారాన్ని అనుసరించి, గ్రహణవేళస్నానాదిధర్మకర్మలను ఆచరించదలచి, ద్వారకా నగర రక్షణకు ప్రద్యుమ్నాదియువకులైన యోధులను నియమించి, వృద్ధులైన వసుదేవాదులతో, మిగిలిన పరివారంతో, స్త్రీజనంతో గంధమాల్యాభరణాదులు ధరించి, అందమైన అలంకరణలతో, పుష్పకాలవంటి రాతల్ని, మేఘాలవంటి ఏనుగుల్ని శ్రేష్ఠమైన గుఱ్ఱాల్ని ఎక్కి సేవకజనం వెంటరాగా, సూర్యగ్రహణవేళ పవిత్రమైన సరోవరాల్లో స్నానంచేసి, ఉపవాస దీక్షతో ఉండినారు. ఆ తరువాత

(1. పుణ్యకార్యాచరణం సంస్కారబలాన్ని పెంచి, మనస్సును పాప సంకల్పాలనుంచి దూరం చేస్తుంది. అవతారపురుషులైన బలరామ, శ్రీకృష్ణులకు సామాన్య మానవులకువలె పుణ్యకర్మలు ఆచరించవలసిన పనిలేదు కనుక వారు నిష్కర్ములని సూచించబడింది. కాని, వారు ఇపుడు సాధారణప్రభువులవలెనే ఉన్నారు కనుక లోకాచారాలైన ధర్మాచరణం చేయవలసి ఉంది. “యథా రాజా తథా ప్రజాః" అన్నట్లుగా రాజులు ప్రజలందరికీ ఆదర్శప్రాయులు. కనుక, సామాన్య ప్రజలకు
ఈ పుణ్యకార్యాల పట్ల ఆసక్తి కలిగించడానికి, ప్రేరణగా బలరామకృష్ణులు ఆచరించారని భావించవచ్చు. అందుకే, సూర్యగ్రహణపవిత్రసమయంలో స్నానదానాదిధర్మకర్మాచరణానికై పవిత్ర తీర్ధస్నానాలకు వెళ్లడం.

2.  ఒక జాతిలోని సంఘటిత శక్తిని ప్రచోదనం చేయడానికి ఇలాంటి సత్కార్యాచరణాలు, సదాచారాలు దోహదం చేస్తాయి. ఈ సామాజిక ప్రయోజనాన్ని కూడా రాజులు భావించి ప్రోత్సహించారు.

3. ప్రవాహవేగం గల నది / తరంగాలలో స్నానంచేయడం ఆరోగ్యానికి దోహదం చేస్తుందని ఆయుర్వేదం తెలియజేస్తుంది.

4. ప్రభువులు రాజధాని విడిచివెళ్లుతున్నారు కాబట్టి, ద్వారకారక్షణానికై యోధులను, యువకులను నియోగించినారు. వృద్దులకు ధర్మాచరణం ఆవశ్యకం కనుక వసుదేవుడు, ఉగ్రసేనుడు మొ॥ వారు వెంబడి వచ్చినారు. ధర్మకార్యాచరణానికి పత్నీసమేతంగా వెళ్లాలి కనుక, స్త్రీ జనాన్ని తీసుకొనిపోయారు.

సాటిలేని దుస్తులు, ఆభరణాలు, గోవులు, బంగారు, రత్నాలు, భూమి మున్నగు విలువైన వస్తువులను యోగ్యులైన బ్రాహ్మణులకు దానముచేసి, వారిచే సంతోషపెట్టబడినవాళ్లై

(దానంవల్ల అహంకార, మమకారాలు లేని మానసిక స్థితి ఏర్పడుతుందని, ప్రజల్లో త్యాగగుణం పెంపొందుతుందని పెద్దలు చెప్పారు.)

గ్రహణం విడిచాక మోక్షణస్నానాలు ఉత్సాహంగా చేసి, అంతవరకు ఉపవసించినారుకనుక భోజనాదులు, బంధువులందరితో ఆత్మీయతలు వికసించేలా పరస్పరప్రేమలతో గావించి, ఆ ప్రదేశంలో చక్కగా

(సూర్యచంద్ర గ్రహణాలకు కొన్నిగంటలముందే ఉపవాసదీక్ష గ్రహణవేళ స్నానం మోక్షణవేళవరకు దాన, జప, తపాదులతో గడిపి, మోక్షణ స్నానానంతరం వంటలు ప్రారంభం - ఇది శాస్త్రసమ్మతవిధి. ఈ విధిని రామకృష్ణులు ఆచరించారు.)

నదీ తీరంలో బంధుమిత్రులతో సూర్యగ్రహణ మోక్షణ స్నానానంతరం వంటలు వండుకొని సామూహికంగా భోజనాదులు చేయడంలో అనురాగం వెల్లి విరిసిందని పోతన వివరించాడు. ప్రజలలో సామరస్యం, సంఘటితభావం పెంపొందటానికి ఇలాంటి విధానాలు సహకరిస్తాయి.

పొన్నచెట్లు బాగా కొమ్మలు, రెమ్మలతో విస్తరించుటచేత సూర్యకిరణాలు చొరలేనంత దట్టమైన ఆ అటవీ భూములలో విశ్రమించిన శ్రీకృష్ణుడు, అతని పరివారం

చిగురాకుల ఆసనాలపై సద్గోష్ఠులతో మనసులు ఆనందం పొందుతుండగ, ఆ శమంతక సరోవరాలలో మరికొన్నిసార్లు స్నానంచేయడానికి ఆసక్తికలవారై

(రాజులైనా, ప్రస్తుతం ప్రకృతి ఒడిలో ఉన్నారు కనుక చిగురుటాకులసెజ్జలే! సత్పురుషులు చుట్టూ ఉన్నారు గనుక సద్గోష్ఠులే! రాచకార్వాలు, మంత్రాంగాలకు దూరమైనచోటు. స్థలం, సమయం ఆధ్యాత్మిక వాతావరణం కనుక మనసు గోష్టిలో ఉల్లాసం పొందుతున్నది. జలాశయ పంచకం అతిశ్రేష్ఠమైందికనుక కేవల గ్రహణ స్నానంచేసి, తిరుగు ప్రయాణానికి బదులు 'తీర్ధసేవారతి' అనగా మరింత సేవించే అభిలాష. పుణ్యనదీజలాలకు తీర్చాలని, పుణ్యప్రదేశాలకు క్షేత్రాలని స్థూలవ్యవహారం. జలస్థలాలన్న అర్థాలుగల ఈ పదాలకు అర్థవిశేషత స్థిరమైనది. గోవులుండే ప్రదేశం గోష్ఠం. పవిత్రమైనచోటు. సత్పురుషులుండునది అలాంటిదే. వారుచేసే చర్యలవల్ల ఆ స్థలం(గోష్ఠము) 'గోష్ఠి' అన్న అర్థం పొందింది. గొడవలుపడే చోటులు గోష్ఠులు కాజాలవు.)

ద్వారకనుండి శ్రీకృష్ణాదులు వచ్చినట్టే, వివిధ దేశాలనుండి రాజులు వచ్చినారు. ధర్మరాజు, ఆయనతో తక్కిన పాండవులు, ఆయనను అనుసరించి వచ్చిన భీష్మ ద్రోణ, ధృతరాష్ట్రులు, గాంధారి, కుంతి, కురు-దేశాల రాజులూ, వారి వారి భార్యలు సంజయుడు మొదలైన ధృతరాష్ట్రానుచరులు, బంధువులైన కుంతిభోజ, విరాట, భీష్మకాదిరాజులు వచ్చారు. యాదవ వంశంలోని వృద్ధులైన ఉగ్రసేనాదులను పూజించి గౌరవించారు. ఉభయులు సంతుష్టులైనారు. అప్పుడు

(వచ్చినవారంతా వృద్ధులు, స్త్రీలు, ఏకాగ్రమైన పట్టుదలతో పుణ్యకార్యాలు చేసేవాళ్లు, శారీరక శ్రమకోర్చి సుదూర శ్యమంతక తీర్థానికి వచ్చారు. ఉత్తములు కనుక వృద్దులకు పూజలు చేశారు. ఇందరు రాజులు వచ్చినా, దుర్యోధనాదులు, వారిని అనుసరించి వచ్చినవారు లేరు. వారికి పుణ్యమైన పనులను కలిసివచ్చెట్లు చేయడంగాని, ధర్మంపట్ల ఆసక్తిగాని లేదు. అందుకే వారి ప్రస్తావన లేదు. పై వచనంలో స్త్రీజనాన్ని మాటిమాటికి చెప్పటంచేత పుణ్యకార్యాలందు వారికి అభిరుచి అతిశయమని, ఇది నాటికి నేటికి ఒకే తీరుగా ఉన్నదని గమనించాలి. పురుషులకన్న స్త్రీలకు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి తొలినాళ్లనుండి అధికమే! సహజమే!)

వచ్చిన రాజులంతా భార్యాసమేతులై ధైర్యవంతుడు, దానవసంహారి, గోపీజనవల్లభుడు, పరివారసహితుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసికొన్నారు.

(పూర్ణపురుషుడు, అవతారమూర్తి, రాక్షససంహారకుడైన శ్రీకృష్ణభగవానునిదర్శనం భార్యాసమేతులై వచ్చి దర్శించుకొన్న రాజులకు సూర్యగ్రహణ పవిత్ర సమయాన మరింత పుణ్యప్రదం. కానీ కేవలం ద్వారకకురాజుగా ఇతర రాజులు సందర్శించినట్టుగాక, భార్యాసమేతులై ఒక పుణ్యకార్యంగా దర్శించుకొన్నారని సూచన.)

ఆ శ్రేష్ఠులైన రాజులు బలరామకృష్ణులచే ఉచితమైన గౌరవాలు పొంది, శ్రీకృష్ణుని సన్నిధివల్ల తృప్తులై, వారి దయచేత సంపదలు, వైభవాలు పొందిన ఉగ్రసేనాదులతో కృష్ణుడు వింటుండగా ఇలా అన్నారు.

మన శాస్త్రాలు నిరూపించిన ఆచరణ విధులు, ఏ లక్ష్మీవల్లభుని పాదప్రక్షాళిత జలం మనవల్ల త్రికరణాలు పావనమవుతాయో, ఏ మహాత్ముని పాదాలు సోకిన మాత్రాన ఆ ప్రాంతం ముక్తిప్రదం అవుతుందో ఆ పుణ్యపురుషుడు ఈ కృష్ణుడే సుమా!

(1. సమకాలీనులైన రాజన్యులంతా శ్రీకృష్ణుని పరమాత్మగా భావించినారు. భగవంతుడు గోకులంలో పుట్టి, పెరిగి, తమలో ఒకడుగా జీవించడంవలన ఆత్మీయుడుగా భావిస్తున్న వారికి, ఈ మాటలు కృష్ణుణ్ణి మహిమాన్వితునిగా వివరిస్తున్నాయి. తమవాడని భావించడంవల్ల శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని గుర్తించలేకపోయిన వీరికి ఉద్ధవాదుల బోధలు అవసరమయ్యాయి.)

సనకసనందనాది గొప్ప మునులే యోగదృష్టితో భగవంతుణ్ణి దర్శించలేక సకలఆత్మలందు వెతికి, దొరకక ప్రయత్నిస్తున్నారు కదా! ఈ గోపకులు ఏమి తపస్సు చేశారో కాని, యోగమక్కరలేక, భౌతిక శరీరాలతో, చర్మ చక్షువులతో హరిని నిరంతరం చూడగలిగే భాగ్యవంతులయ్యారే! వీరి తపస్సు ఎంత గొప్పదో కదా!

ఉగ్రసేనుడు మొదలుగాగల శ్రీకృష్ణుని బంధుకోటిలోని యదుపుంగవులకు, తాము చేసే పనులతో అనగా పాప, పుణ్యకర్మలతో సంబంధంలేకుండా, వాటిని వదిలివేసి, మోక్షస్వరూపుడైన ఆ భగవంతుడే తమ పక్కన ఉండుటచే ఆతనితో సాధారణ మానవునివలె, చూడడం, మాట్లాడించడం, శరీరాన్ని తాకడం, పాటలు పాడడం, కలిసి తిరగడం, ఆయనతోబాటే ఆసనాలు, పరుపులు, శయ్యలవంటివానిపై కూర్చోవడం, పడుకోవడం, ఆయనతో బంధుత్వస్నేహాలను పాటిస్తున్న ఈ అదృష్టం ఎలా దక్కిందో!

రాజులంతా, కృష్ణుని దయవల్ల తీరిన సకలమైన కోర్కెలుగల్గి హాయిగా జీవిస్తున్న వైనాన్ని పలుమార్లు ప్రశంసించి, చివరకు వీడ్కోలు తీసికొన్నారు

కృష్ణుడు అవతారపురుషుడని పొగడి రాజులు వెళ్లిన పిదప, కుంతీదేవి, దుర్యోధనాదులవల్ల తన కుమారులైన పాండవులకు కల్గుచున్న ఇక్కట్లను మనసులో స్మరించి, బాధపడుతూ, పుణ్యాత్ముడు, కల్మషాలులేని తన అన్న వసుదేవునితో ఇలా అన్నది.

నీకు అల్లుళ్ళైన పాండురాజకుమారులు ధర్మజాదులు క్రూరమృగాల మధ్య అరణ్యాలలో కష్టాలు పడుతుంటే మీరు దయార్ద హృదయంతో వారి బాధలను పట్టించుకోరా?

పైవిధంగా చెప్పి, అనేకవిధాలుగా బాధపడుతూ, కుంతి అన్నగారైన వసుదేవునితో ఇలా అంది.

విధియే బలవత్తరమై వ్యతిరేకంగా ఉంటే బంధువులుఉండి మాత్రం ఏమి చెయ్యగలరని కన్నీరు ఒలుకగా దుఃఖించే చెల్లెలు కుంతిని చూచి వసుదేవుడు ఇలా అన్నాడు.

అమ్మా! ఎందుకు తపించిపోతావు? ఆలోచించకుండా విధినెందుకు నిందిస్తావు? అన్నిటికి కర్త ఈశ్వరుడు. మాయ అనేది ఒక తెర. దానికి వెనుక ఉండి, బొమ్మలనాడించే సూత్రధారి ఈశ్వరుడు. అతనిచేతిలో ఉండి నటించే కీలు బొమ్మలవంటివారు మానవులు. దేవతలైనా, విధిని తప్పి ప్రవర్తించలేరు. మేము అలా దుర్మార్గుడైన కంసుని చేతిలో చాలా బాధలుపడి, తాళలేక అడవులు పట్టినాము. దయానిధియైన ఈ కృష్ణుని అనుగ్రహంవల్ల మా కష్టాలు తొలగి తిరిగి స్థిరనివాసులమైనాము.

ద్వారకాధిపతి శ్రీకృష్ణుడు శ్యమంతక ప్రదేశానికి రాగా, వ్రేపల్లెలో ఉన్న శ్రీకృష్ణుని బాల్య బంధుగణం, తల్లిదండ్రులైన నందుడు, యశోదలతోపాటు గోపగోపికాగణం కృష్ణుణ్ణి చూచే సంబరంతో కలిసివచ్చారు.

ఈ విధంగా కృష్ణునివద్దకు వచ్చి

చాలాకాలం తరువాత వచ్చిన నందుణ్ణి చూచి వృష్టి యాదవ, భోజవంశీకుల గుంపులు ఎదురేగి ఒకరి తరువాత ఒకరు ఆలింగనాలు చేసుకొన్నారు.

యశోదానందులకు వసుదేవుడు సంతోషంగా ఆతిథ్యమిచ్చాడు. తల్లిదండ్రులకు బలరాముడు, కృష్ణుడు వినయంగా నమస్కరించారు.

ఆ విధంగా బలరామకృష్ణులు నమస్కారాలుచేసి కౌగిలించుకొని తామరలవంటి కన్నులలో సంతోషంతో ఉబికిన కన్నీళ్లు కారగా, సంపూర్ణమైన మమకారాలు మనసులలో వ్యాపించగా ఏమీ మాట్లాడలేక ఉండిపోయారు. అప్పుడా యశోదమ్మ బలరామకృష్ణులను తన ఒడిలో ఉంచుకొని, తన వక్షస్థ్సలానికి దగ్గరగా లాగుకొని చెంపలకు ముద్దుపెట్టి, తన ముఖాన్ని వారిశిరస్సులకు ఆనించి చిబుకాన్ని నిమురుచు మరల మరల కౌగిట్లోకి తీసుకుంటూ ఎంతో సంతోషాన్ని పొందుతుండగా, ఆ తర్వాత

రోహిణీ, దేవకీ సతులిద్దరు యశోదాదేవిని నిండైన మనసుతో కౌగిలించుకొని, బలరామకృష్ణులను పెంచడంలో ఆమె పాటించిన అన్ని విధాల సత్కార్యాలను తలచుకొంటూ అమ్మా! యశోదా! మీ దంపతులిద్దరు బంధుప్రీతితో మాకు చేసిన మేలు (కార్యాలు) మరచిపోగలమే! అని అన్నారు.

పుట్టినప్పటినుండి మీరే ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసినందువల్ల రామకృష్ణులిద్దరూ ఈనాటికీ నీ బిడ్డలమనే భావిస్తున్నారు. మమ్మల్ని తల్లిదండ్రులుగా అనుకోవటం లేదు.

(కన్న ప్రేమ కన్న పెంచిన ప్రేమ విశేషమైనదని ఈ సన్నివేశం వల్ల తెలుస్తోంది.)

మీరు వీరిని ఎంతోప్రేమగా కంటికి రెప్పల్లా కాపాడుతూ పెంచి పెద్దచేశారు. మాకంటే మీరే ఎక్కువగా ప్రేమించారు. కనుక వారు మీ ఇండ్లల్లోనే  ఇంతకాలం ఉన్నారు.

రోహిణి, దేవకీదేవులు మాట్లాడుతుండగా గోపికాస్త్రీలు, తమ హృదయేశ్వరుడైన శ్రీకృష్ణుడు చాలాకాలం తరువాత రావడంచేత, ఆయనను చూడటానికి కోర్కెలు హృదయాలలో పొంగుతుండగా వచ్చారు.

సుందర రూపుడైన ఆ శ్రీకృష్ణుణ్ణి చూడగానే ఆ గోపికలు కన్నులు రెప్పలు వాల్చక చూచినారు. మనసులలోనే ఆయన దేహసౌందర్యానికి మోహించి కౌగిళ్లు ఇచ్చినారు. బ్రహ్మమును ఆరాధించే యోగులు ధ్యానంలో పరవశించినట్టు, శరీరాలలో పులకలు కలుగగా గోపికలు భౌతిక ప్రపంచాన్ని మరచారు.

(గోపీకృష్ణుల పరస్పర ప్రేమ జీవాత్మ పరమాత్మల బాంధవ్యంవంటిదని భాగవతవ్యాఖ్యాతలు చెప్పారు.)

గోపికలయొక్క ప్రేమను శ్రీకృష్ణుడు పసిగట్టాడు. ఆ గోపికల మనోభావాలను గమనించిన శ్రీకృష్ణుడు ఏకాంత ప్రదేశానికి తీసుకొనిపోయి, ప్రేమతో కౌగిలింతలుఇచ్చి ఎడతెగని భక్తిభావంతో నిండిన వారితో చిరునవ్వులు చిందిస్తూ (ఇలా) పలికాడు.

ఓ వనితలారా! మిమ్మల్ని విడిచిపోవడానికి కారణం ఉంది. బలవంతులైన శత్రువులను అణచి వేయడానికి విజయయాత్ర చేసినందువల్ల ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యమైంది. దీనికి మీరు కోపించవద్దు. గాలికెగుర గొట్టబడే దూది వలె, గడ్డిపోచలవలె విధి చరాచర ప్రపంచంలో జీవులను ఒక్కోసారి కలుపుతుంది. ఒక్కోసారి విడగొడుతుంది. (కలియుట విడిపోవుట ప్రాణులకు సహజమైనదని భావం.)

గోపికల్లారా! నా యందలి భక్తివల్ల ప్రాణులకు మోక్షానందం సిద్ధిస్తుంది. భక్తిలేకుండా కేవలం జపతపాదులవల్ల, మోక్షం కలుగదు. శివుడు, బ్రహ్మ సనకాది మునులు తమ మనస్సుల్లో నిలిపిన నిర్మలభక్తి మీలో పుట్టింది. మీ పూర్వజన్మ సంచిత పుణ్యం ఫలవంతమైంది. నా సంబంధమైన (భగవత్ సంబంధమైన) జ్ఞానంచేత ఇంక మీకు నరకాదులు, జననాదులు, పాపపుణ్యకర్మలు ఏవీ ఉండవు, అతీతమైన మోక్షం లభిస్తుంది. ఇది అసత్యం కాదు.

(కర్మాది అనుభవాలవల్ల స్వర్గనరకాదులు, సంచిత కర్మఫలాలవల్ల పునర్జన్మాదులు, తిరిగి పాపపుణ్యకర్మాచరణం ఇది ఒక చక్రభ్రమణం. దీనినుండి తప్పించుకొనడం మోక్షస్థితి. దీనికై జపతపాదులు మాత్రమేగాక, భగవంతునియందు గాఢభక్తి అవసరం. బ్రహ్మేశ్వరాదులకుమాత్రమే అనుభవంలోనికి వచ్చిన ఈ మానసికస్థితి ప్రస్తుతం కృష్ణునివల్ల గోపికలకు అనుభవమైంది. గోపికల అనన్యభక్తి, జప, తప, దాన, ధర్మాది కర్మాచరణంకంటె శ్రేష్ఠమైందని భాగవత సందేశం.)

సర్వభూతాల్లో(సమస్త ప్రాణికోటిలో) జన్మ, జీవన, మృత్యువులు నేనే! లోపల, బయట నేనే వ్యాపించి ఉన్నాను. ఘటపటాది వస్తుజన్యతకు(సకలప్రాణి కార్యాలకు) ఉపాదానకారణాలైన పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు (భూమి, నీరు, అగ్ని/తేజస్సు, వాయువు, ఆకాశం) వీటి ఐక్యకార్యఘటనకు నేనే కారణం. సకల లోకాల్లోని పంచీకరణ వ్యవస్థతో నడుపబడే ప్రాణులకు కారణమైన గగనాదిపంచభూతాలకు (పంచప్రాకృతికశక్తులకు) వాటి మధ్యగల కార్యకారణసంబంధం నేనే. ఆధారమూ నేనే. సర్వానికీ నేనే కర్తను. నాకు స్వపరభేధాలు లేవు. అంతా సమానమే! ఓ పడతులారా! ఇంతకన్న ఇంక ఎక్కువ చెప్పడమెందుకు?

మోహపరవశులైన ఆ గోపికలు శ్రీకృష్ణుని సర్వవ్యాప్త ఈశ్వరతత్త్వాన్ని భగవంతునినోటనే విని, వివేకాన్ని పొంది, తమ దేహాభిమానాల్ని విడిచారు. విష్ణుస్వరూపా! జగత్తులు నీలో నిల్పుకొన్నవాడా! భక్తుల కోర్కెలు తీర్చే పారిజాతమా! అని ప్రార్షించి

ఘోరమైన సంసారసముద్రాన్ని దాటించేవీ, జ్ఞానయోగులైనవారి హృదయాల్లో ప్రతిష్టితమై ధ్యానింప తగిందై ప్రకాశించే నీ చరణ కమలాల్ని మా మనస్సుల్లో నిరంతరం ధ్యానించేలా వరమివ్వమని వేడినారు.

(దేహికి ముందు దేహాభిమానం, ఆపై జ్ఞానసంపాదనం, ఆపై భగవద్భక్తి, ఆపై భగవల్లీనం - కాగల్గే  ధ్యానయోగం - ఈ వరుసలో గోపికల పరిణతి ప్రదర్శించబడింది. కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగాలు భగవత్సన్నిధికి సోపానక్రమం అని భాగవత సందేశం.)

గోపికల ప్రార్ధనవిని, మునులచే నమస్కారాలు పొందేవాడు, కరుణాసముద్రుడు, భక్తులంటే అపారంగా వాత్సల్యంచూపే ఆ శ్రీకృష్ణుడు గోపికలు కోరినట్లుగా నిరంతరపదధ్యానాసక్తిని ప్రసాదించాడు.

అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడు ధర్మరాజును చూచి, పాదాలకు నమస్కరించి, కపటంలేని భక్తితో సపర్యలుచేసి, “నీవూ, తమ్ములూ, బంధువులూ. సత్కర్మలు చేస్తూ సుఖంగా ఉన్నారా?” అని కుశలం అడుగగా, ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా బదులిచ్చాడు.

పద్మనాభుడా! మురారీ! నీవంటి భక్తపారిజాతాన్ని ఆశ్రయించిన భక్తజనులు నిత్యసంతుష్టులై ఉంటారుగదా! అని ధర్మరాజు జవాబు ఇచ్చాడు.

ఇంకా

కృష్ణా! జాగ్రదాదిఅవస్థాత్రయానికి నీవు అతీతుడివి. సర్వత్ర వ్యాపించినవాడివి. విశ్వంలో నీవు, నీలో విశ్వం ఉన్నాయి. విశ్వాన్ని నిలిపి ఉంచేది నీవే. సర్వభువనాలు నీలోపుట్టి; నీలో స్థితికల్గి, నీలోనే నశిస్తాయి. అఖండ జ్ఞానస్వరూపుడివి. యోగమాయను నీలో ధరించినవాడివి. పుణ్యాత్ములు, నిత్యముక్తులైన యోగులైనవారికిసైతం లభించేవాడివి. నీరజాక్షుడివి, నిఖిలలోకేశ్వరుడివి, దయాసముద్రుడివి, సమస్త వికారాలూ దూరంచేసే ఓ జగద్రక్షకా! నీకు నమస్కరిస్తున్నాను అని ధర్మజుడు స్తుతించాడు.

(భాగవతం దశమస్మంధం అంతా కృష్ణావతారగాథ, భగవత్తత్త్వం, భగవంతుణ్ణి చేరే జీవన విధానం, విశ్వమూలాలు - వీటిమీదే విషయం కేంద్రీకృతమౌతుంది. సందర్భోచితంగా ఆయాపాత్రల రూపంలో భగవన్నుతి సువ్యక్తమౌతుంది. తనకు పాదాభివందనంచేసి నమస్కరించిన శ్రీకృష్ణుణి ధర్మజుడు స్తుతించిన ఈ విధానంలో ధర్మజుడు నిమిత్తంగా వ్యాసమహర్షి సర్వలోకులకూ భగవత్తత్త్వం సువ్యక్తం చేస్తున్న సందర్భమిది.)

ఈ విధంగా ధర్మరాజు శ్రీకృష్ణు
ణ్ణి స్తుతించగా అక్కడ ఉన్న రాజులు, బంధువులు, మిత్రులు, గోపాలకులు, తదితరులు నిండైన మనసుతో సంతోషంతో విన్నారు.

అటువంటి చక్కని సందర్భంలో స్నేహంతోకూడి, ఒకేచోట గుమిగూడి, కృష్ణుని భార్యలు, ద్రౌపది ఆనందంగా సరసల్లాపాల్లో మునిగి ఉండగా

లక్షణ యను శ్రీ కృష్ణుని యష్టమభార్య ద్రౌపదీ దేవికి దన వివాహ వృత్తాంతంబు దెలుపుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Bhrugumaharshi Trimurtula Prasasyambu Sodhinchutaku Bovuta - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట సమస్త సంభారాలతో అనేకాలైన చక్కటి యాగాలు సరస్వతీ ...