Saturday, August 29, 2026

Sri Krishnudu Danthavaktruni Vadhinchuta - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కపటియైన సాల్వుణ్ణీ, ఆతనిసౌభకవిమానాన్నీ ధ్వంసంచేయటం తెలుసుకొన్నవాడై, దంతవక్త్రుడు ఆ వాసుదేవునిచే సంహరింపబడిన తన మిత్రుడగు పౌండ్రకవాసుదేవునికీ, తన అన్నయగు శిశుపాలునికీ, స్నేహితుడైన సాల్వునికీ వరుసగా పరలోకక్రియలు చక్కగా నిర్వర్తించాడు. అనంతరం అతిభీషణమైన ఆకారంతో శ్రీకృష్ణుని మీదికి యుద్ధసన్నద్దుడై వెళ్లాడు.

దంతవక్త్రుడు పండ్లు పటపట కొరుకుతూ, బిగ్గరగా అరుస్తూ కన్నులనుండి మిణుగురులు రాలుస్తూ, కాలితాపులచే నేల వణకేలాగున నడుస్తూ, గదను గిరగిర త్రిప్పుతూ, వేసవియందలి సూర్యబింబంలాగా తీవ్రంగా మండిపడుతూ శ్రీకృష్ణుని మీదికి విజ్బంభించాడు.

ఆ రీతిగా తనపైకి వస్తూ ఉన్న దంతదవ
క్త్రుణ్ణి చూచి, ఉల్లాసంతోగూడిన మనస్సుతో శ్రీకృష్ణుడుకూడా గదాహస్తుడై రథం దిగినాడు. విరోధికి ఎదురుగా నడిచాడు. మిగుల నీచస్వభావంగల ఆతడు కుడిచేత గదను త్రిప్పుతూ, అట్టహాసం ఉట్టిపడుతుండగా శ్రీహరితో ఇలా చెప్పాడు.

“కృష్ణా! నా భాగ్యవశాన నేడు నీవు నాకంటబడినావు. బంధురూపంలో ఉన్న శత్రుడివి నీవు. శరీరంలో ప్రవేశించిన భయంకరమైనవ్వాధిని శక్తిమంతమైన ఔషధంతో నివారింపజేసేవైద్యునివలె నా మిత్రద్రోహివైన నిన్ను - మేనమామ కుమారుడనే ఆదరభావం చూపక ఇంద్రుని వజ్రాయుధంలాంటి నా గదాదండపు పెట్టుచేత యముని లోకానికి పంపిస్తాను. ఆ విధంగా నీవు చంపిన నా మిత్రుల ఋణాన్ని తీర్చుకోగలను” - అంటూ దంతవక్త్రుడు పరిహాస పూర్వకమైన దుర్భాషలాడుతూ శ్రీకృష్ణుణ్ణి సమీపించాడు.

అలాగ దుర్భాషలాడుతూ దంతవక్త్రుడు తన గదాదండంతో శ్రీకృష్ణునితలపై మోదినాడు. అంకుశంపోటుచే ఆగ్రహించిన మదపుటేనుగులాగా కోపగించిన శ్రీకృష్ణుడు వజ్రాయుధంవంటి తనగదాయుధాన్ని వేగంగా గిరగిర త్రిప్పివేసి, దంతవక్త్రుని వక్షఃస్థలాన్ని పగులగొట్టాడు. ఆ దెబ్బకు వాడు కుప్పగూలి, రక్తం క్రక్కుతూ పడిపోయాడు.

ఆ క్షణంలోనే దంతవక్త్రుడు పర్వతంలాంటి శరీరంతో నేలపై బడి తన్నుకొంటూ ప్రాణాలు విడిచినాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న సమస్తప్రాణి సమూహం ఆశ్చర్యపడుతూవుండగా, ఒకానొక సూక్ష్మతేజస్సు ఆతని శరీరంలోనుండి బయలువెడలి శ్రీకృష్ణునిలో ప్రవేశించింది. ఆ సమయంలో దంతవక్త్రుని తమ్ముడైన విదూరథుడు మిగులకోపంతో ప్రళయాగ్ని జ్వాలలాగా అత్యంత భీకరమైయున్న ఖడ్గాన్నీ డాలునూ ధరించి, శ్రీకృష్ణునిమీదికి దూకినాడు.

శ్రీకృష్ణుడు తన సుదర్శనాయుధాన్ని నిపుణతతో ప్రయోగించి విదూరథుని శిరస్సును త్రుంచివేశాడు. బలవంతుడైన ఆ కమలలోచనుడు ఈ రీతిగా సౌభకాన్ని సాల్వుణ్ణి, శిశుపాలుని సోదరుడైన దంతవక్త్రుణ్ణి, వాని తమ్ముడైన విదూరథుణ్ణి, తనను ఎదిరించడానీకి వచ్చిన అతని సోదరులను, అలాగే ఆ వంశీయులు చాలమందినీ సంహరించాడు.

ఆ రీతిగా శ్రీకృష్ణుడు విదూరథుణ్ణి, వాని వంశంవారిని సంహరించిన సమయంలో

ఆ సమయంలో నరులూ, మునులూ, యోగులూ, దేవతలూ, రాక్షసులూ, గరుడులూ, నాగులూ, సిద్దులూ, సాధ్యులూ, గంధర్వులూ, తరచుగా ఆకాశంలో సంచరిస్తూ ఉండే కిన్నరులూ, కింపురుషులూ మొదలైనవారందరూ ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ శ్రీకృష్ణుని మహిమను ప్రస్తుతించారు.

అప్సరసలు నృత్యాలు చేస్తూ ఉండగా, దేవతలు పుష్పవర్షాలు కురిపిస్తూ ఉండగా, దేవదుందుభులు బ్రహ్మాండంగా మ్రోగుతూ ఉండగా, యదువృష్టి వీరవరులు అనుసరించి నడువగా, వందిమాగధులు తన విజయగాథల గీతాలను ఆలాపిస్తూ ఉండగా వాసుదేవుడు మహావైభవంతో శుభముహూర్తంలో చక్కగా అలంకరింపబడిన ద్వారకా నగరం ప్రవేశించాడు.

ఆ వేళలో ద్వారకపురమందలి పుణ్యస్త్రీలు ఎత్తెన మేడలమీది నుంచి తనపై మంగళాక్షతలను కురిపిస్తూవుండగా, శ్రీకృష్ణుడు శుభముహూర్తంలో ఆనందంతో అంతఃపురాన్ని ప్రవేశించాడు.

(అధిపతి శత్రువులను జయించి రాజధానిని ప్రవేశించినప్పుడు పుణ్యస్త్రీలు మేడలమీదనుండి ఆయనపై మంగళ కరంగా పూవులతో కూడిన అక్షతలను చల్లటం భారతదేశంలో ప్రాచీనకాలంనుండీ ఆచరింపబడుతూవున్న ఉత్తమమైన ఆచారం.)

ఆ రీతిగా యోగీశ్వరేశ్వరుడూ, షడ్గుణైశ్వర్యసంపన్నుడూ, సమస్తజగత్తుకు అధిపతీ అయిన శ్రీకృష్ణుడు ద్వారకానగరిలో సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత

పరీక్షిన్మహారాజా! బలరామదేవుడు కౌరవపాండవయుద్ధం త్వరలో ప్రారంభం కానున్నదని తెలుసుకొన్నవాడై ఇరు పక్షాలకూ సమానంగా కావలసినవాడు కాబట్టి, తీర్థయాత్రలు చెయ్యాలనే నెపంతో ద్వారకనుండి తరలివెళ్లాడు.


బలరాముడు తీర్థయాత్రకు జనుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Sri Krishnudu Danthavaktruni Vadhinchuta - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కపటియైన సాల్వుణ్ణీ, ఆతనిసౌభకవిమానాన్నీ...