Saturday, August 22, 2026

Srikrishna Balaramulu Chaanuura Mustikulanu Vadhinchuta - శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులను వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులను వధించుట

ఈ విధంగా మాట్లాడుతూ పురప్రజలు రామకృష్ణులను చూస్తున్నారు. అప్పుడు చాణూరుడు రామకృష్ణులతో ఇలా అన్నాడు.

అడవి దారుల్లో గొల్ల బుడుతలతో కలసి దూడలు మేపుతూ జెట్టిపోరులో మిక్కిలి నెర్పు గడించారని ఈ పుడమిలోని జనులు చెప్పుకుంటూ ఉండగా విని, మా మహారాజు మల్లయుద్ధ క్రీడకు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాడు. ఇప్పుడు ఇక్కడి మల్లరంగంలోని సభాసదులు చూస్తుండగా మనం మన పరాక్రమాలు కొంత ప్రదర్శించడం సముచితం.

వేగం, బలమూ బాగా ఉన్నాయా? సాములో నేర్పుందా? శరీరానికి రక్షణ కలదా? రాజుకు చెప్పి పాలు ఇప్పించాలా? పాళీలు మీకు ఇష్టమేనా? ఒరే! గొల్ల కుర్రవాడా నీవేం వజ్రాయుధానివా? యమదండానివా? ముక్కంటి కంటిమంటవా? నా పిడికిలి - మెక్కడానికి వెన్నముద్దలు కావుసుమా?

కృష్ణా! జనులు విద్యలు నేర్వడం ప్రభువుల మెప్పుకోసమే గదా! రాజూ, ఈ ప్రజలూ మెచ్చుకునేటట్లు మనం మల్ల యుద్ధంతో కొంత కాలక్షేపం చేద్దామా?

చాణూరుడి మాటలువిని శ్రీకృష్ణుడిలా అన్నాడు.

మాకు సాములు తెలియవు. మేము పిన్నవాళ్ళం. సత్తువ ఉందని చెప్పలేము. మీరో మల్లయుద్ధంలో నిష్ణాతులు. వజ్రాయుధం మాదిరి కరకైన శరీరాలు గలవారు. ఇట్టి మీతో మేమెట్లా తలపడగలం? మీ రాజుగారికి వేడుకను కలిగించే వాళ్ళమూ కాము. అయినా వినోదంకోసం మీరు పోరాటకు ఆహ్వానిస్తే కాదని ఎలా అంటాము?

నీతో నేనూ, ముష్టికుడితో మా అన్న బలరాముడూ ఉత్సాహంతో పెనుగులాడుతాం. భయంకర మల్లయుద్ధంలో ఈ భూమండలానికి ప్రభువైన కంసుడికి ప్రీతి కల్గిస్తాం.

శ్రీకృష్ణుని మాటలు విని చాణూరుడు ఇలా పలికాడు.

అవురా! ఓ గొల్లకుర్రా! నాతో పెనగులాడటానికి నీ వెంత వాడివి? నీవు నాకు సమానుడివా? నేను లోక ప్రసిద్దుణ్ణి శుద్ధమైన కులంలో పుట్టినవాణి. మంచిగుణాలు గలవాణ్ణి; సత్కర్మలాచరించే స్వభావం కలవాణ్ణి; నీకు, నా కుండే బలసంపదలున్నాయా? ఈ రాచవీటిలో పోరాటమంటే గొల్లల ముందు కుప్పిగంతులు వేయడం కాదుసుమా! బాగా ఆలోచించుకో!

ఈ చాణూరుడు ఈశ్వరుణ్ణి మెచ్చుకోడు. బ్రహ్మదేవుణ్ణి లెక్కచేయడు. విష్వక్సేనుణ్ణి గేలిచేస్తాడు. తనకు సాటిరాడని వాయుదేవుణ్ణి సైతం రణరంగానికి రమ్మని పిలవడు. మిక్కుటమైన భుజబలాతిరేకం తరగనివాడు. యుద్దానికి రేపు మాపు అనడు. చిత్రవిచిత్రంగా అలవోకగా కదనం చెస్తాడు. ఇట్టి జగజెట్టి చాణూరుడు ఒక గొల్లకుర్రని పనిపట్టడానికి చాలక పోతాడా?

ఓ గొల్లడా! ప్రగల్భాలెందుకు? నేను మహాబలవంతుణ్ణి. లోకంలో ప్రసిద్ధిచెందినవాణ్ణి. భూమండలంలో ఎక్కడగాని, ఓడిపోయి; నా చల్లాడం (గుడిగి) కింద దూరని జెట్టీలే లేరు సుమా!

కృష్ణా! మచ్చరంతో నన్ను సమీపించిన తరువాత నీవు సాగరంలో ప్రవేశించడానికి సాధ్యంకాదు (మత్స్యావతారం). పర్వతం చెంత నిక్కి నిలవడానికి శక్యం గాదు (కూర్మావతారం). అలక్ష్యంతో భూమికిందికి దూరడానికి వీలులేదు (వరాహావతారం). సింహంవంటి పురుషుణ్ణి అని పొగరుగా తిరగడానికి కుదరదు (నరసింహావతారం). దగ్గరకు వస్తే పడదోస్తాను. 

కనుక చెయ్యి సాచడానికి సందు దొరకదు (వామనావతారం). పెనగి నా ఎదుట పెచ్చు పెరగటం అలవిగాని పని (త్రివిక్రమస్ఫురణ). నన్నుదాటి రాజును హింసించడం నీకు శక్యంకాదు. (పరశురామావతారం). గాలిస్తాను కనుక అరణ్యాలలో ప్రవేశించడానికి అవకాశం లేదు (శ్రీరామావతారం,). ప్రబలమైన ఆకారం కలవాడనని విర్రవీగడానికి వీలుండదు (బలరామావతారం). పుడమిలో నేను ప్రబుద్ధుణ్ణి అని భావించకు (బుద్ధావతారం); కల్కితనంతో (తెలివి తేటలతో) గర్వింపరాదు సుమా! (కల్క్యవతారం). నాతో యుద్ధం చెయ్యడం నీ తరంగాదు. తొలగిపో!
(కృష్ణా! నీవు దశావతారాలెత్తి నన్ను సాధింపదలచినా అది నీ తరం గాదు. కనుక దూరంగా తొలగుమని చాణూరుడు మాధవుణ్ణి హెచ్చరించడం, ఇక్కడ విషయం. ఇక్కడ నారాయణుని దశావతార చర్యలు వర్ణితం.)

అంతేగాక నేను శ్రీమన్నారాయణుణ్ణి అని అంటావా? అలాగయితే విను.

మహిమలు ప్రదర్శిస్తూ ఉండటానికి - ఇది వైకుంఠనగరంకాదు, కంసుడు పరిపాలించే మథురానగరం సుమా! గర్వంతో విర్రవీగుతూ ఉండటానికి - ఇది సంసార వాసన లేని నిత్యులుండే సభాభవనంగాదు; కంసుడియొక్క కొలువుకూటం సుమా! వీనులవిందుగా వినడానికి - ఇది నారద మహర్షియొక్క మహతి అనే వీణానాదంగాదు; చాణూరుని భుజాస్ఫాలన శబ్దం సుమా! 

నేరుపు మాటలాడటానికి ఇది లక్ష్మీదేవితోడి ప్రణయకలహంగాదు; జెట్టీలతోడి పోటు మాటలు సుమా! పేరు పెంపులు వహించి విహరించడానికి - ఇది వేదాంతవీథిగాదు; మథురానగరపు రాజవీథి సుమా! దాగి తప్పించుకొనడానికి ఇది మునీశ్వరుల మనసులలోని మూలస్థానం కాదు; మల్లయుద్ధరంగం సుమా! నీవు నిర్భయంగా చరించడానికి నీ భక్తుల కాలిజాడకాదు; భయంకరమైన జెట్టీలజాడసుమా! కృష్ణా! నా పాలబడిన నీవు తప్పించుకొని మరెక్కడికి వెళ్ళగలవు? (వెళ్లలేవని భావం)

మల్లుడైన చాణూరుడు గగనమండలం నిండేటట్లు భుజా
స్ఫాలనం చేశాడు. కోపమనే అగ్నినుంచి ప్రసరించే సన్నని పొగమాదిరిగా అతని తలపై పిలకజుట్టు ప్రకాశించింది. దిగ్గజాల తొండాలకు సమానమైన; పొడవైన చేతులు భీతిని కలిగిస్తున్నాయి. ప్రళజయకాలంలోని యమధర్మరాజు యొక్క పదునైన కోరల విధంగా పొడవైన కోరమీసాలు మెరుస్తున్నాయి. నల్లని నిడుపైన నడగొండలాగా భయంకరమైన నల్లటిదేహం పెల్లుబుకుతున్నది. అతని అడుగుల తాకిడికి భూమి దద్దరిల్లగా చాణూరమల్లుడు కృష్ణుడివైపు నడిచాడు. ఈ దృశ్యం పట్టణ ప్రజల హృదయాలకు బల్లెమయింది.

ఈ విధంగా మిక్కిలి పూనికతో సమీపించిన మల్లుణ్ణి గోపాలశేఖరుడు చూచాడు. మెల్లగా పరాక్రమాటోపం అతిశయిల్లగా, అతడుల్లాసంతో భుజమప్పళించాడు. ఆ నినాదం భూనభోంతరాళంలో నిండిపోయింది. అతడు జెట్టిపైకి ఉరికాడు. వారిద్దరూ మహావేగంతో హెచ్చు తగ్గైన స్థానాల్లో నిలిచి ఏనుగు ఏనుగుతో, సింహం సింహంతో, కొండ కొండతో డీకొన్నట్లు ఒకరితో ఒకరు తలపడ్డారు.

రెండు కార్చిచ్చులు తమతమ అగ్ని జ్వాలలతో పరస్పరం పీడించుకొన్నట్లుగానూ, రెండు మహామేఘాలు తమపై అన్యోన్యం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకొన్నట్లుగానూ, ప్రళయకాలంలోని రెండు సముద్రాలు ఒకదాని నొకటి సముత్తుంగ తరంగాలతో కొట్టుకున్నట్లుగానూ వారిద్దరూ రౌద్రంతో ఒకరినొకరు పిడికిళ్ళతో గుద్దుకున్నారు. తబ్బిబ్బుపడక ఇరువురూ దగ్గరకు చేరుకుని వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు.

అప్పుడు హరి విజృంభించాడు. బొబ్బరిస్తూ జెట్టిని పట్టిపడలాగాడు. కాళ్లు జోడించి, మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజ్బంభించటం వీక్షించి, గోవిందుడు మెచ్చుకున్నాడు. చపలుడైన చాణూరుడు బాధితుడైనప్పటికీ మెడనిక్కించి తొలగిపోక మురారిని పొరలాడేటట్లు తోశాడు. అంతట కృష్ణుడు శరీరం ఉప్పాంగగా తటాలున అర్జాంగకంలో ఉన్నవాడై మోకాళ్ళతో వాణ్ణి ఒత్తాడు. 

వేగంగా “కరవడ” మనే ఒకమల్లబంధం పట్టులో ఉండినాడు. అపుడు దుర్నీతిపరుడైన మల్లుడు “డింభకా! మేలుమే"లని పల్కుతూ అలవోకగా కాలుచొప్పించి, శ్రీకృష్ణుణి పడదోశాడు. అప్పుడు వెన్నుడు చెలరేగి వేల్పులు ప్రస్తుతించగా చాతుర్యంతో వెనుకకు వెళ్లి చాణూరుని వీపుపై ఎక్కి నిక్కాడు. 

కంసుని భృత్యుడైన చాణూరుడు మదజలధారలచారికలతో నిండిన మదగజంవలె మాధవుడిపాదాన్ని తన పాదంతో, చేతిని తనచేతితో పెనవేసి పట్టుకుని నేర్పుతో మల్లరంగ భూమిలో తిరుగుతూ అటూ ఇటూ అదిలించివేశాడు.

కమలాక్షుడు దిట్టతనంతో దిటవు కోల్పోక తొలగి చెలరేగి జెట్టిని సమతలంమీద పడదోసి పెద్దదైనవానికడుపుమీద మోదాడు. తనకాలితో వాడి కాలిని మెలివేసి డొక్కరమనే మల్లబంధవిశేషాన్ని ప్రదర్శించాడు.

మల్ల విద్యాభ్యాసం కల చాణూరుడు సభలోనివారంతా తన్ను పొగడుతుండగా కృష్ణుణ్ణి వెనుకకు మరలించి తటాలున తన కాలితో అడ్డగించి తన్ను కాపాడుకున్నాడు. రాక్షసవిరోధి అయిన కృష్ణుడు చాణూరుని దట్టి పట్టి ఎత్తి ఒత్తి రాగెబంధంవేసి సందుపెట్టి నవ్వాడు. పగతుడైన మల్లుడు తనకాలిని కృష్ణుడి కాలితో చేర్చి బాధించి నిరోధించాడు. వాసుదేవుడు విరోధినిరోధాన్ని తప్పించుకుని, పట్టిసమనే మల్లబంధం వేసి అదిలించాడు. చాణూరుడు వెంటనే చెలరేగి శ్రీహరి బాహువు పట్టుకుని హుమ్మని హుంకరించి ముఖాన కాలుపెట్టి అధికుడై నిలిచాడు.

లీలామానుష బాలుడైన కృష్ణుడు చాణూరుడి కాలిని తన కాలితో అడ్డగించి, అతడి విజ్బంభణం అణచి అడ్డుకోరాని బలిమితో విదిలించుకొని లేచాడు. పగవాడి పాదాన్ని తొక్కిపట్టి వజ్రాయుధంవంటి పిడికిలితో వాడి ఎదమీద పొడిచాడు. వాడు పోడిమి చెడక చెలరేగాడు. చిలికే సమయంలో సాగరమధ్యంలో తిరిగే మందరగిరి మాదిరి వాడు నేలమీద గిరగిర తిరుగుతూ కృష్ణుణ్ణి తన్నాడు. వెన్నుడు కుప్పించి గగనానికి ఎగిరి వాడిపై దుమికాడు. శ్రీహరిపాదాలతాకిడికి తన పాదాల సంధిబంధాలు సడలగా వాడు ఎగిరి పైకిలేచి విజ్బంభించాడు.

బలరాముడు, ముష్టికుడు తమ తమ శక్తులు వ్యక్తమయ్యేటట్లు చేతులు చేతులు కల్పి ప్రళయ సమయంలోని అగ్నుల వలె పలురీతులైన మల్లయుద్ధ నైపుణ్య ప్రదర్శనలు చేస్తూ పోట్టాడారు.

నిక్కిన చెక్కిళ్లుగలవారూ, దిగ్గజాల తొండాలను భేదించే తీగలవంటి చేతులు గలవారూ, శత్రువుల మనస్సులకు బల్లెములవంటివారూ, గోపకుల సమూహానికి భయంకల్గించేవారూ అయిన ఆ మల్లురతో గోపాల బాలకులు బలరామకృష్ణులు పోట్లాడారు.

బలరామకృష్ణులు మల్లులతో పెనగులాడే సమయంలో పట్టణస్త్రీలంతా గుంపులుగాచేరి, వేడి నిట్టూర్పులు విడుస్తూ, తమలో ఈ విధంగా ముచ్చటించుకొన్నారు.

ఔరా! పూలవలె మృదువైన శరీరాలుగల మంచి బాలురను రప్పించి, వజ్రసారులూ, పర్వతాలవలె కఠోరులూ అయిన వీరులతో మల్లయుద్ధం చేయిస్తూ రాజు వినోదం చూస్తున్నాడు. ఇందులో మంచి ఏ కొంచెంకూడా లేదు. పోరు మానండి అని పలుకడు. ఇలాంటి దుర్మార్గుణ్ణి మునుపు ఎన్నడైనా విన్నామా? కన్నామా?

సభాసదులు చూస్తున్నారే కాని ఈ పసిపిల్లలకూ, ఈ మల్లురకూ జోడు కుదరదని రాజుకు చెప్పలేకున్నారు ఇది అధర్మం. ఇది తమకు (తమ రాజుకు) శోకం కలిగించక పోదు.

మనం పిలనగ్రోవులమై ఉంటే మాధవుడు కెమ్మోవిసుధ లిచ్చి మన్నించేవాడు. నెమలిపురి దండలమై ఉంటే గోవిందుడు శిరసున ధరించేవాడు. పీతాంబరాలమైఉంటే బుజాలపై విడువక ధరించి ఉండేవాడు. వనమాలికలమై ఉంటే కమలాక్షుడు మిక్కిలి ఆసక్తితో కంఠాన అలంకరించుకొనేవాడు. అందమైన బృందావనంలో వృక్షాలమై ఉంటే కృష్ణుడు ఆనందంతో చెంతకు జేరి క్రీడించేవాడు. ఓ యమ్మా! పూర్వజన్మలలో ఎట్టివ్రతాలనైనా ఆచరించి, ఇలా ఎందుకు కాలేకపోయామో! ఇపుడు ఇంకేమి చేయగలం?

పాపాత్ముడైన బ్రహ్మ మునుపే మనల్ని ఆ వ్రేపల్లెలో పుట్టించి ఉండగూడదా? ఈ మథురలో ఎందుకు పుట్టించాడో! ఆ గొల్ల పల్లెల్లోనే పుట్టించి ఉంటే ఈ సుందరాంగుణ్ణి పొందే సౌభాగ్యం, సంతోషం ఎల్లప్పుడు మనకు సమకూడి ఉండేవి గదా! ఈ గోపకుమారుణ్ణి పొందడానికి ఆ గోపికలు పూర్వం ఎట్టి నోములు నోచారో!

గోపాలకృష్ణుడితో చేరి గోవులను మేపుతూ సంచరించే గొల్లలు ఎంత అదృష్టవంతులో? మరి భూపాలకులకైనా ఈ గోపాలురకుండే ఘనవైభవం లేదు.

(గోపాల శబ్దం రెండుర్థాలుగల మాట; గొల్ల అని, రాజు అని అర్థం. గో అంటే గోవు, భూమి మొదలగు అర్థాలున్నాయి.)

మంచునీటి చుక్కలతో తడిసి మనోహరంగా ఉండే పద్మం మాదిరి, కమలాక్షుడి ముఖకమలం చెమట బిందువులచే తడిసి ప్రకాశిస్తున్నది.

సభకు వెళ్ళరాదు; వెళ్ళితే సభలోనివారుచేసే తప్పిదాలను తెలిసి ఉపేక్షించినప్పటికీ, ఆ దోషాలు తెలుసుకోలేక పోయినప్పటికీ, దోషాలు తెలిసికూడా న్యాయవిరుద్ధంగా పలికిన ఎంత పండితుడయినా పాపం అనుభవించి తీరుతాడు.

ఈ విధంగా సభలో ఉన్న పలువురు పలువిధాల మాట్లాడుతుండగా ఆ ముష్టియుద్ధంలో

సాటిలేని సంసారమనే సముద్రాన్ని దాటడానికి నౌకవంటివాడూ, శత్రుపట్టణాలను ధ్వంస మొనర్చినవాడూ, కువలయాపీడగజాన్ని జయించినవాడూ, గోవర్ధనగిరిని ఎత్తినవాడూ, విస్తారమైన సింహగర్జనంతో పర్వత గుహలను పూరించినవాడూ అయిన శ్రీకృష్ణుడికి చాణూరుడు ధైర్యం చెడి లోబడిపోయాడు.

పగవాడైన చాణూరుడు కృష్ణుడికి లోబడినప్పటికీ, భయపడక మహాభయంకరమైన పిడికిలితో వెన్నుని రొమ్మును పొడిచాడు. పూలదండచే కొట్టబడిన ఏనుగు లాగా ఆ పోటును లెక్కచెయ్యక శ్రీహరి యుద్ధంలో విజృంభించి, పరాక్రమం చూపాడు.

పరాక్రమవంతుడూ, యుద్ధమందు గంభీరుడూ, భీతి గొలిపేవాడూ, దొడ్డదేహకలవాడూ, వీరుడూ అయిన చాణూరుణ్ణి, కృష్ణుడు చొచ్చుకొని పోయి కర్కశంగా వాడిచేతులు పట్టుకొని గిరగిర తిప్పి నెలపై కొట్టాడు

ఆ విధంగా అచ్యుతుడిచేత గిరగిర తిప్పబడిన చాణూరుడు బాగా నలిగినవాడై నోటినుంచి నెత్తురు కారగా పుడమి మీద బడి ప్రాణాలు విడిచాడు. అతడి ప్రాణం పోగానే కంసుని ప్రాణం కలకబారింది.

బలభద్రుడు నిజంగా బలభద్రుడే-బలంచే క్షేమం కలవాడే అంటూ లోకులు అంటుండగా, ఇంద్రుడు మేలు మేలని మెచ్చుకోగా, బలరాముడు అపారమైన బాహుబలంతో శక్తిశాలియైన ముప్టికుణ్ణి పట్టుకుని, ఇటూ అటూ త్రిప్పాడు. అది చూచి కంసుడిసేన బెదిరింది.

బలరాముడు అలా తిప్పి తిప్పి నేలపై దబ్బున పడవేయగా ముష్టికుడి గుహవంటి నోటినుంచి నెత్తురు వరదలై పారింది. బలరాముడి భయంకరమైన ముష్టిఘాతంతో ముష్టికుడు సత్తువ గోల్పోయి పెనుగాలివల్ల మహావృక్షం కూలినట్లు నేలపై కూలాడు.

గొప్ప భుజబలాటోపంగలవాడూ, రాజుకు చీడపురుగులాంటివాడూ, కల్లరీడూ, వదరుబోతూ, మిక్కిలి భయంకరమైన నుదురుగలవాడూ అయిన కూటుడనే మల్లుణ్ణి; బలభద్రుడు దిటవైన తన పిడికిలితో సూటిగా పడబొడిచాడు.

అటుతర్వాత రాక్షసులకు అంతకుడైన బలరాముడు ముప్టికుడి మిత్రులైన కూటుడు, తోసలుడు, శలుడు అనే వాళ్ళను తన కాలిదెబ్బలతో తలలు పగులగొట్టి యముడిచెంతకు పంపించాడు.

కేవలం గోపాలబాలకులనే భావంతో వారితో యుద్ధంచేసిన మనమల్లశ్రేష్ఠులు మరణించారు. రామకృష్ణులు బలవంతులు; తొలగండి తొలగండి అంటూ మిగిలిన మల్లురు చెల్లాచెదరై పారిపోయారు.

మల్లురను సంహరించి గొల్లలమధ్య సింహాలవలె శోభిల్లుతూ పద్మాలవంటి పాదాలలో అందెలు మ్రోగుతూ ఉండగా వస్తూన్న గొల్లలరాజైన నందుడి నందనులను బ్రాహ్మణులు మొదలైన వారందరూ రెప్పవాల్చక చూచి ప్రీతితో పొగిడారు. ఒక్క కంసుడు మాత్రం మచ్చరంతో వారిని మెచ్చుకోలేదు.

శ్రీ కృష్ణుండు కంసుని వధించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...