శింశుపావృక్షంమీది నుండి చూస్తుంటే అశోకవనం అంతా స్పష్టంగా గోచరిస్తున్నది. ఋతుభేదం లేకుండా అన్నీ చివుళ్ళతో, మొగ్గలతో, పూలతో, పండ్లతో అలరారే లతా, తరువులే.
నిండుగా పూచిన అశోకాలతో ఆ వనం రాత్రిపూట కూడా ఉదయ సూర్యశోభతో ఉంది. విరగబూసిన పూలబరువుకి ఆగలేక కొండగోగు నేల మీదికి వంగింది. కొమ్మ, మ్రాను కనిపించకుండా విరిసింది అశోకం. అంగుళం ఖాళీ లేకుండా పూలు నిండిన వెూాదుగ కాంతులు మిరుమిట్లు గొలుపుతున్నాయి.
పున్నాగం, ఏడాకుల అరటి, సంపెంగ విరగపూసి సువాసనల మత్తు జల్లుతున్నాయి. ఆ వనంలో అశోకాలు కొన్ని బంగారు రంగువి, కొన్ని అగ్నిశిఖా సదృశాలు, దట్టంగా పెరిగి కొన్ని కాటుకరాసిలా ఉన్నాయి.
ఇంద్రుని నందనవనంలా, కుబేరుని చైత్రరథ వనంలా దివ్యంగా వున్న ఆ వనం పూవులనే నక్షత్రాలతో, నీలాకాశంలా, రత్నాకరంలా, మనోహర పరిమళభరితమయిన గంధమాదనంలా వుంది.
ఎదురుగా ఒక ప్రాసాదం కనబడింది.
అది వేయిస్తంభాలతో కైలాసగిరిలా ఉంది.
పగడాల మెట్లతో బంగారువేదికలు.
ఆకాశాన్ని అంటే ఎత్తు,
చూస్తున్నాడు హనుమంతుడు.
నిశితంగా దృష్టిని కేంద్రీకరించాడు.
శుక్ల పాడ్యమినాటి చంద్రరేఖవలె, ఉపవాసాలతో కృశించిన దీనవదనంతో, మలినవస్త్రధారిణియై, రాక్షసీజనపరివృతయై, పొగక్రమ్మిన అగ్ని జ్వాలవలె, కుజగ్రహ పీడితమయిన రోహిణీ నక్షత్రంలా, క్రూర మృగాలమధ్య ఆడులేడిలా, నల్లత్రాచువంటి జడతో, పచ్చనివస్త్రం ధరించి ఉన్న విశాలనయనను చూశాడు.
చూచి చూచి:
ఈవిడ సీత అయివుండాలి.
ఔను - నాడు రావణుడు తీసుకువచ్చేటప్పుడు తాము ఋశ్యమూకం నుండి చూచిన వనితారత్నం యిలానే ఉంది.
అదే చంద్రవదనం, అదే భ్రూమధ్యం, అదే దేహకాంతి. పద్మ దళనయన, బింబాధర, రతీదేవిలా ఉన్నది నియమనిష్టలతో ఉన్న తాపసి. భయకంపితయై రోజుతూన్న నాగరాజ పత్నిలా ఉంది.
సందిగ్ధమయిన స్మృతిలా క్షీణ సంపద వలె, ప్రతిహతమయిన ఆశలా, విఘ్నమయిన కార్యంలా, కలుషమయిన బుద్ధిలా, చెదరిన శ్రద్దవలె, అపవాద దూషితమయిన కీర్తివలె ఉన్నది.
రావణుడు అపహరించాడనే బాధతో కృశించింది. రాక్షస స్త్రీలు పెట్టే బాధలు పడలేనట్లుంది. బెదరిన లేడిపిల్లలా చూస్తున్నది.
కన్నీటితో నిట్టూర్పులు విడుస్తూ, కారుమేఘాల మాటున చంద్రకాంతిలా, మననం లేక విస్మరించిన విద్యలా, వ్యాకరణసంస్కారం లేక అనర్థద్యోతకమయిన వాక్కులా ఉంది.
జానకీదేవి ఏఏ అలంకారాలు ధరించేదని రాముడు వివరించాడో వాటి గుర్తులు కనిపించాయి.
అవే కర్ణాభరణాలు, అవే కంకణాలు. అవిగో మాణిక్య దీప్తులు, పగడాల కాంతులు. కొంచెం తగ్గి నల్లబడ్డాయి.
ఋశ్యమూకం మీద పడవేయగా మిగిలిన నగలు కాబోలివి. ఆనాడు ఆ నగలమూటకు కట్టిన పట్టుచీర చెరగు, ఈ చీరదే, ఇంతకాలంగా కడుతున్నా నలిగినా, మాసినా పూర్తిగా రంగు మాయలేదు.
ఈ కనకాంగి నిశ్చయంగా రామపత్నియే. ఈమె మనస్సు ఆయన మీదనే ఉన్నట్టుంది.
రాముని కీమెయందు జాలి - అబల బలాత్కృతయై అపహరింపబడినదని.
ఈమె యందు ఆదరభావం - తననే నమ్ముకుని వచ్చి యిలా కష్టాలపాలయిందని.
దుఃఖం - ఇటువంటి యిల్లాలితో వియోగంవల్ల,
మదన తాపం - హృదయేశ్వరి దూరమయిందని.
ఇంక సందేహం లేదు.
ఈవిడే ఆయన భార్య.
వీరుభయుల మనస్సులూ ఒకరియందొకరికి లగ్నమయి ఉండడం వల్లనే యింకా జీవించి ఉన్నారు వీరు.
ఈవిడ దగ్గరలేని దుఃఖంతో ఆయన ఎలా జీవించగలుగుతున్నాడో!
ఎంత దుర్భరమయిన వ్యధ, అని సీతా సందర్శన సంతోషంతో నిండిన హనుమంతుని మనస్సు రామచంద్రుని అభినందించింది.
No comments:
Post a Comment