Monday, August 24, 2026

Srikrishnudu Rukminidevini Bendli Yaduta - శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని బెండ్లి యాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని బెండ్లి యాడుట

అప్పుడు యాదవశ్రేష్ఠుడైన ఆ శ్రీకృష్ణునినగరంలో పెళ్లివేడుకలు మొదలయ్యాయి. పాటలు, వాద్యాలు, ఆటలు ఎక్కడచూచినా జరుగుతున్నాయి. ప్రతి ఇంటిలోనూ స్త్రీ పురుషులు అందంగా అలంకరించుకొన్నారు. పెళ్లికి దేశదేశాల రాజులు ఆహ్వానింపబడ్డారు. 

వాళ్లు ఏనుగుల నెక్కి వస్తున్నారు. ఆ మదపుటేనుగుల చెక్కిళ్లనుండి మదజలం ధారగా స్రవిస్తూంది. ఆ ధారకు నగరవీథులు తడిసిపోయాయి. ప్రతివాకిలికీ మంగళతోరణాలు కట్టారు. పోక, అరటి బోదెల్ని వాకిళ్లకు అలంకరించారు. కర్పూరం, కుంకుమలతో అలంకారాలు తీర్చారు. 

అగరుపొగలతో పరిమళింపచేశారు. దీపాలు వెలిగించారు. పూర్ణకుంభాలు నిలిపారు. ప్రతి ఇంటి అరుగు, వాకిలి, గడప, స్తంభాలను రకరకాలుగా అలంకరించారు. రంగురంగుల అపూర్వ పుష్పాలనూ, వస్త్రాలనూ, రత్నాలనూ, తోరణాలనూ కట్టి అందగింపచేశారు. పతాకలు గాలికి ఎగురుతూ రెపరెపలాడుతూ ద్వారకానగరం విలసిల్లింది. ఆ సమయంలో

రుక్మిణి శ్రీకృష్ణుని మనస్సును దోచుకుంది. అభిమానవతి. సంపద ఉన్నది. నిబ్బరంగా వ్యవహరించేది. సర్వసంపదలనూ కలిగించేది. మంచివారైన బంధువులను సమ్మానించేది, పవిత్రమైన నడవడిక కలది. హీనమైన దరిద్రాన్ని కూడా పోగొట్ట గలిగింది. మంచి నగలను, వస్త్రాలనూ దాల్చింది. గుణవతులైన స్త్రీలకు తలమానికంవంటిది. ఇన్ని గుణాలున్న రు
క్మిణీదేవిని శ్రీకృష్ణుడు శాశ్వతమైన కీర్తి కలిగేలా వివాహం చేసుకున్నాడు.

అపుడు ప్రజలు తాము తమ భార్యలతో కలిసి వివాహానికి వచ్చి, దయాగుణంతో పైపైకి ఎదిగే లక్షణమున్నవాళ్లూ, పదిమంది చెప్పుకునేలా తేజస్సుతో వెలుగుతున్న వాళ్లూ అయిన రుక్మిణీ కృష్ణులను వారు సకుటుంబంగా దర్శించి, మంచి మనస్సులతో కానుకలను సమర్పించారు.

శ్రీకృష్ణుని వివాహానికి కేకయ, కురు, సృంజయ, యాదవ, విదర్భ, కుంతి రాజ్యాలనుండి వచ్చిన రాజులు చాలమంది నిశ్చయమైన అభిప్రాయంతో వచ్చి పరమానందం పొందారు.

అన్నిదిక్కుల్లో ఉన్న రాజులు, రాజకుమారులు శ్రీకృష్ణుడు ఈ విధంగా రు
క్మిణిని తెచ్చి పెళ్లి చేసుకోవడం అనన్య సామాన్యమైన కార్యమని ఆశ్చర్యపడ్డారు.

పాపరహితుడవైన పరీక్షిన్మహారాజా! ఆదిలక్ష్మీదేవి అవతారం అయిన రుక్మిణితో హాయిగా కాలం గడుపుతున్న శ్రీ కృష్ణుణ్ణి పురప్రజలందరూ దర్శించి 'భయంనుండి విముక్తులై' సంతోషంతో పొంగిపోయారు.

అని ఈ విధంగా రు
క్మిణీ శ్రీకృష్ణుల పరిణయగాథను చెప్పిన తరువాత. ఇంకా

భూమండలాన్ని రక్షించడంలో ఆసక్తికలవాడా! కలువరేకులవలె నీలపువన్నెగల సుకుమారమైన శరీరం కలవాడా! భూపాలకులకు శిరోభూషణమైనవాడా! భూప్రజలచేత పొగడబడే సుగుణరాశి కలవాడా! పద్మాలవంటి చేతులున్నవాడా! అన్నిలోకాలచేత పాగడబడినవాడా! 

సాటిలేనిమంగళస్వరూపా! స్వచ్చమైన, వన్నెకెక్కిన కీర్తి కలిగినవాడా! శత్రువుల గుండెలను చీల్చువాడా! భక్తుల సమూహానికి సహాయం చేసేవాడా; పెద్దవారినీ, పండితులను పోషించేవాడా! భయంకరమైన రాక్షసులను అణచివేసేవాడా!

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Pradyumna Kumara Charitra Prarambhamu - ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము పూర్వం నారాయణాంశ ఉన్నప్పుడే మన్మథుడు శివునికంటిమంటల్లో భస్మమయ్యా...