ఈ విధంగా స్తుతించి “దేవా! నీవు యాదవజాతిని నాశనం చేసి వెళ్లిపోతే మేము ఏ విధంగా జీవించగలం? నీకు సహచరులమై నీతో కలసి చేసిన స్నాన, పాన, భోజన, శయన, ఆసనాదులను ఎలా మరచిపోగలం?” అని ఉద్ధవుడు అనగా
శ్రీకృష్ణుడిలా అన్నాడు. “బ్రహ్మ మొదలైన దేవతలు చేసిన విన్నపాన్ని అనుసరించి భూమి బరువును తొలగించాను. ఇక నేటికి ఏడవరోజు సముద్రుడు ద్వారకానగరాన్ని ముంచివేస్తాడు. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం వస్తుంది. కలియుగంలో మానవులు ధర్మం వదిలినవారూ, సదాచారరహితులూ, అన్యాయపరులూ, అధికమైన కోపం గలవారూ, మందమతులూ, తక్కువ ఆయువు కలవారూ, బహురోగాలచేత పీడింపబడుతూ ఉండేవారూ, ఫలించని పనులు చేసేవారూ, నాస్తికులూ అయి ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుండా ఉంటారు.
కాబట్టి నీవు స్నేహితులు, చుట్టాలు మొదలైనవాళ్ల అనుబంధాన్ని వదిలిపెట్టు. ఇంద్రియసౌఖ్యాలలో మునిగిపోకు. భూతలంమీద గల పుణ్యతీర్ధాలలో స్నానం చెయ్యి. మనస్సుతో పంచేంద్రియాలతో గ్రహింపదగు వస్తుసముదాయమంతా నశించేది అని తెలుసుకో. పురుషుడు(జీవుడు) అనేకాలైన సంపదలను సంపాదించి తన గుణదోషాలతో మోహితుడై ఉంటాడు.
కాబట్టి మావటివాడు మదగజాన్ని కట్టివేసిన విధంగా ఇంద్రియాలనూ, మనోవికారాలనూ నిగ్రహించి; భార్యాపుత్రులు ధనం విషయంలో ఆసక్తి వదలి సుఖదుఃఖాలలో సమంగా ప్రవర్తించు.
ఈ ప్రపంచమంతా పరమాత్మయే అధిష్ఠానంగా కల్గిందిగా తెలుసుకో. మాయ ఆత్మకు వశమైనదిగా గ్రహించు. జ్ఞానవిజ్ఞానవంతుడవై ఆత్మానుభవంతో తృప్తిపొంది విశ్వాన్ని నన్నుగా భావించి ప్రవర్తించు” అని శ్రీకృష్ణుడు ఆనతిచ్చాడు.
ఉద్ధవుడు భక్తితో, భయంతో, వినయంతో చెతులు జోడించి “మహాత్మా! సన్న్యాస జీవితం చాలా కష్టం. పామరులైనవాళ్లు ఆచరించలేరు. నీ మాయచేత భ్రాంతులైనవారు ఈ సంసారసముద్రాన్ని దాటి ఎలా మోక్షం పొందుతారు? సేవకుడనైన నామీద దయతో చెప్పాలి. బ్రహ్మ మొదలైన దేవతల సమూహం కూడా బాహ్యవస్తువులందు భ్రాంతులై తిరుగుతూ ఉంటారు.
నీ భక్తులైన పరమభాగవతులుమాత్రమే ఆ మాయను తిరస్కరించగలుగుతారు. గృహిణులకైనా, గృహస్థులకైనా, సన్న్యాసులకైనా ఎప్పుడూ నీ నామస్మరణే మోక్షసామ్రాజ్యాన్ని అందిస్తుంది.
కాబట్టి పరమేశ్వరా! నీ పాదాలను శరణు పొందుతున్నాను. నామీద కరుణరసాన్ని ప్రసరింపజేయి” అని ప్రియసేవకుడైన ఉద్ధవుడు పలికాడు. అప్పుడు అతనితో శ్రీకృష్ణుడిలా అన్నాడు.
“పురుషునికి, ఆత్మకు ఆత్మే గురువు. చెడు మార్గాలలోకి వెళ్లకుండా మంచిమార్గంలో వర్తిస్తూ మిక్కిలి గొప్పదైన నా నివాసానికి(వైకుంఠానికి) చేరుకో. సమస్తశక్తులు గల నన్ను సాంఖ్యయోగులు ఎప్పుడూ పురుషభావంతో(పరమాత్మభావంతో) భావిస్తూ ఉంటారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు కాళ్లు కలవి, అసలు కాళ్లు లేనివి అయిన జీవులలో రెండుకాళ్లుగల మనుష్యులు ఉత్తములు.
అలాంటి ఉత్తములైన మనుష్యులలో నిరంతర ధ్యానగరిష్ఠులైన యోగీశ్వరులు ఉత్తములు. వాళ్లలో సందేహించేవాళ్లు గ్రహించలేని నన్ను సత్త్వగుణులు గ్రహిస్తారని తెలిసి తమ మనః పద్మాలలో జీవాత్మ, పరమాత్మలను ఒకటిచేసి శంఖం, చక్రం, గద, ఖడ్గం, శార్‌ఙ్గం, కౌమోదకి, కౌస్తుభం - వీటితో కూడినవానిగా నన్ను భావించేవారు పరమయోగీంద్రులు, పరమజ్ఞానులు” అని చెప్పి ఇంకా 'అవధూత - యదు సంవాదం' అనే ప్రాచీనమైన కథ ఒకటి ఉంది. చెపుతాను వినుమన్నాడు.
(శ్రీమన్నారాయణుడు “సర్వమూలశక్తి సంపన్నుండు” అంటే సర్వజ్ఞత్వ, సత్య సంకల్పాది శక్తులతో కూడి జగత్ సృష్టి చేయగలిగిన వాడని అర్థం. సాంఖ్యయోగపరులంటే -సాంఖ్యయోగాన్ని అభ్యసించినవాళ్లు. సంఖ్యతో కూడినది సాంఖ్యం. సాంఖ్యమంటే జ్ఞానం. జ్ఞానవిచారణలో అనాత్మ వస్తువులను లెక్కించవలసి ఉంటుంది. లెక్కచెప్పేటప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది కాబట్టి సాంఖ్యమని పేరేర్పడింది. ప్రకృతిలోగల తత్త్వాలను లెక్కించి వాటిలో అనాత్మరూపాలను త్యజించి, పరమాత్మజ్ఞానాన్ని గ్రహించడమే సాంఖ్యవిద్య. అందువల్ల ఆత్మానాత్మ రూపమైన విజ్ఞానమే సాంఖ్యం.
(శ్రీమన్నారాయణుడు “సర్వమూలశక్తి సంపన్నుండు” అంటే సర్వజ్ఞత్వ, సత్య సంకల్పాది శక్తులతో కూడి జగత్ సృష్టి చేయగలిగిన వాడని అర్థం. సాంఖ్యయోగపరులంటే -సాంఖ్యయోగాన్ని అభ్యసించినవాళ్లు. సంఖ్యతో కూడినది సాంఖ్యం. సాంఖ్యమంటే జ్ఞానం. జ్ఞానవిచారణలో అనాత్మ వస్తువులను లెక్కించవలసి ఉంటుంది. లెక్కచెప్పేటప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది కాబట్టి సాంఖ్యమని పేరేర్పడింది. ప్రకృతిలోగల తత్త్వాలను లెక్కించి వాటిలో అనాత్మరూపాలను త్యజించి, పరమాత్మజ్ఞానాన్ని గ్రహించడమే సాంఖ్యవిద్య. అందువల్ల ఆత్మానాత్మ రూపమైన విజ్ఞానమే సాంఖ్యం.
షడ్దర్శనాలలో సాంఖ్య దర్శనం ఒకటి. న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, మీమాంస, వేదాంతం షడ్దర్శనాలు.
No comments:
Post a Comment