శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -
విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణ సందర్శనంబుకు వచ్చుట
సాటిలేని అందమైన శరీరం ధరించి, అన్ని పనులూ చేయడంలో ఆసక్తి కలవాడైన శ్రీకృష్ణుడు యాదవులను నశింపజేయాలనే ఆలోచనలో ఉండిన సమయాన జటావల్కలాలు, కమండలాలు ధరించి; నల్లజింకచర్మాలు, రుద్రాక్షలు, విభూతి అలంకరించిన శరీరాలతో విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యులు; అత్రి, వసిష్ఠుడు, నారదుడు మొదలైన మునిశ్రేష్ఠులు స్వేచ్చావిహారం చేస్తూ ద్వారకానగరానికి వచ్చారు. ఆ ద్వారకానగరంలో
వాలఖిల్యులు నిత్య బ్రహ్మచారులు, ఊర్థ్వరేతస్కులు. అంగుష్ఠప్రమాణదేహులు. ఎప్పుడూ తలకిందులుగా తపస్సుచేస్తూనే ఉంటారు. వీళ్లను బ్రహ్మపుత్రులుగా పురాణాలు పేర్కొంటున్నాయి. వీళ్లు అరవైవేలమంది. వీళ్లుకూడా మహర్షులతో కలసి ద్వారకకు వచ్చారు.
గొప్పవాడూ, కౌస్తుభమణిని ఆభరణంగా కలవాడూ, చెవిపోగులజంటతో అందమైనచెంపలు కలవాడూ, తెల్లతామరలవంటి కండ్లుకలవాడూ, మేఘంవలె నల్లనివాడూ, అనేకరత్నాలు పొదిగిన కిరీటం ధరించినవాడూ, ఆజానుబాహుడూ, అడ్డులేని(చక్రాది) ఆయుధాలు చేతులలో ధరించినవాడూ, శుభకరమైన పసుపు పచ్చని పట్టువస్త్రం కట్టుకొన్నవాడూ, రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యునివంటివాడూ, బ్రహ్మాదిదేవతలచేత సేవించదగిన చరణ కమలాలు కలవాడూ, కోటిమన్మథుల కాంతులతో ఒప్పే కోమలమైన శరీరం కలవాడూ, దీనజనరక్షణతో ప్రసిద్ధమైన నడవడి కలవాడూ, దయకు సముద్రం వంటివాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి ఆ ఘనులైన మునులు దర్శించారు.
ద్వారకకు విచ్చేసిన మునులకు అర్ఘ్యం, పాద్యం మొదలైన మర్యాదలు చేసిన తరువాత వారు బంగారు గద్దెలపై కూర్చొని, పద్మనేత్రుడైన శ్రీకృష్ణునితో...
పద్మనాభా! జనులు అడవులలో ఉన్నప్పటికి నిన్ను కొలవని రోజులు వృథాగా గడచిపోతూ ఉంటాయి. శరీరాలు స్థిరమైనవి కావు కదా!
శ్రీకృష్ణా! భూమిపై పరమపవిత్రమైన నీ పాదాలు సంసారసముద్రాన్ని దాటించే తెప్పలు. పాపాలనే తీగలను హరించేవి. వేదాలకు అలంకారాలు. పీడితజనానికి దిక్కైనవి.
పద్మలోచనా! లక్ష్మీవల్లభా! ఒక సమయంలో చాలా చిన్నరూపాన్ని పొందుతావు. మరొక సమయంలో సృష్టి అంతా నీవే అయి పెద్ద రూపాన్ని ధరిస్తావు. ఇలా అనేక రూపాలను ధరిస్తున్న నీ ఆధిక్యతను స్తోత్రం చేయడానికి మాకు అలవి గాక ఆశ్చర్యం కలుగుతోంది.
లక్షీపతీ! పద్మలోచనా! నీ నామం అనేక జన్మలు అనే వ్యాధులకు కారణమైన కర్మలను సమర్థంగా నశింపజేసే మందు. అయ్యో! చెడుతలంపు కలవాళ్లు దీనిని తెలుసుకోలేక పోతున్నారు గదా!
ఇలా ఎన్నో విధాలుగా స్తోత్రం చేసిన (నారదాది) మునిశ్రేష్ఠులను దయగల కడకంటి చూపులతో చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నా ధ్యానం, నా నామస్మరణం, జన్మ నెత్తడం అనే రోగాన్ని హరిస్తాయి. బ్రహ్మ శివుడు మొదలైనవారికి శరణమవుతాయి. శుభాలను కలిగిస్తాయి. నా రూపాలైన బ్రాహ్మణుల బాధలను తొలిగించే వారిని నేను ఐశ్వర్యవంతులను చేస్తాను అని యోగీశ్వరులకే ప్రభువైన శ్రీకృష్ణుడు సెలవిచ్చి తరువాత 'మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు' అని అడిగాడు. దానికి ఆ మునులు 'మీ పాదపద్మాలను దర్శించడంకంటె మరొక విశేషం ఏముటుంది?' అన్నారు. వాసుదేవుని ముఖచంద్రామృతాన్ని తమకండ్లు అనే చకోరాలతో తాగి తమ ఇష్టానుసారం విహరించేవాళ్లై ద్వారకానగరానికి సమీపంలోగల పిండారకమనే పవిత్రతీర్థానికి వెళ్లారు. ఆ తరువాత...
(నారదాదులు పిండారక తీర్థానికి వెళ్లిన తరువాత) కొందరు యాదవులు పొగరెక్కి తమనేర్పుతో సాంబుణ్ణి అందంగా అలంకరించి, కప్పురపుతావిగల స్త్రీవలె కనిపించేటట్లు తయారుచేసి,
(సాంబుడు జాంబవతి శ్రీకృష్ణుల కొడుకు. యాదవవంశాన్ని నిర్మూలించిన ముసలానికి జన్మనిచ్చిందితడే.)
కొందరు యాదవులు గుంపుగా చేరి పెద్దగా నవ్వుతూ, అరుస్తూ, కేరింతలు కొడుతూ స్త్రీ వేషంలో ఉండిన సాంబుని ముందుంచుకొని వెళ్లారు. మునులసమూహానికి సాగిలబడి నమస్కరించారు. స్పష్టంగా కనపడుతున్న బరువైన గర్భంగల ఈ స్త్రీ కడుపులో ఉన్నది మగపిల్లవాడా లేక ఆడపిల్లా ఆలోచించి తేల్చి చెప్పుమని మునులను అడిగారు. అలా అడగగానే (మునులు) విపరీతంగా కోప్పడి
అలా వచ్చిన యాదవ బాలకులను చూచి వీళ్లు కొవ్వెక్కి వచ్చినారని భావించారు మునులు. కోపంతో కనుల చివర నిప్పులు వ్యాపించగా మమ్మల్ని ఎగతాళి చేయవచ్చా? అంటూ
యదువంశాన్ని నిర్మూలించగల ఒక రోకలి ఈ అమ్మాయికి తప్పకుండా పుడుతుంది. ఆలస్యం లేదు. ఇక వెళ్లండి అని చెప్పగా
దర్పంతో అతిశయించిన యాదవబాలకులు మునులు ఇచ్చిన శాపం విని భయపడి వడవడ వణకుతూ సాంబుని పొట్టచుట్టూ చుట్టిన వస్త్రం ముడి విప్పారు. అప్పుడు ఆ వస్త్రం నుండి ఒక రోకలి నేలమీద పడింది. యాదవ బాలకులకు ఆశ్చర్యం కలిగింది. దానిని తీసుకొనివెళ్లి శ్రీకృష్ణుని ముందుపెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తాను కల్పించిన మాయవల్లనే జరిగిందని తెలిసికూడా తెలియని వాడిలాగా శ్రీకృష్ణుడు వాళ్లతో ఇలా అన్నాడు.
బుద్ది వక్రించి కండ్లు కనపడక పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహర్షులను పరిహాసం చేసే ప్రయత్నం చేసి, కులనాశనానికి మూలకారణమైన శాపం పొందే అవివేకులు ఉంటారా? (ఉండరు)
బ్రాహ్మణశాపాన్ని విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలైన వారైనా అడ్డుకోగలరా? ఇక మానవమాత్రులు ఎంతటివాళ్లు? పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించకుండా తోసి పారెయ్యడానికి సాధ్యం కాదు గదా!
యతులను మిక్కిలి తూలనాడడంవల్ల యందువంశం నాశనం కాక తప్పదు. ఇందులో సందేహంలేదు. అని పలికి శ్రీకృష్ణుడు యాదవులతో సముద్రపు ఒడ్డున ఒక పెద్దకొండ ఉంది. అక్కడ ఎత్తుగా విశాలంగా భయం కలిగిస్తూ ఉండే బండమీద మీ భుజబలంతో ఈ ఇనుపరోకలిని బాగా పొడిచేసి ఆ పొడిని సముద్ర జలంలో కలిపి రండి. వెళ్లండి అన్నాడు. విశ్వపతి అయిన శ్రీకృష్ణుడు అలా చెప్పగానే వాళ్లు ఆ రోకలిని పొడిచేసి, దానికంటుకొని మిగిలి ఉండిన లోహపు ముక్కను పట్టించుకోకుండా సముద్రజలంలో పడవేశారు. ఆ లోహపుముక్కను ఒక చేప మింగింది. దానిని ఒక బోయవాడు వల సహాయంతో పట్టుకొన్నాడు. దాని కడుపులో ఉండిన ఇనుపముక్కను తీసి, తన బాణం చివర మొనగా చేసుకొన్నాడు. అని ఆ కథా విషయమంతా చెప్పిన శుకమహర్షిని చూచి పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.
మహర్షీ! మనస్సు ఎలా చలనరహితంగా నిలుస్తుంది? వసుదేవుడు మన్మథజనకుడైన శ్రీమన్నారాయణుని చరణ కమలాలను ఎల్లవేళలా సేవించడం మిక్కిలి ఉత్తమమని నమ్మి, ఏవిధంగా తన మనస్సును నిశ్చలంగా నిలిపి పరమాత్మను పొందాడు.
అలా అడిగిన మహారాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు.
వసుదేవునకు నారదుడు పురాతనంబగు విదేహర్షభ సంవాదం దెలువుట
Subscribe to:
Post Comments (Atom)
Triratra Vrathadeeksha - త్రిరాత్ర వ్రతదీక్ష
త్రిరాత్ర వ్రతదీక్ష ఆ జగన్మాత దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణావల్లి, ఆ తల్లి అమృతహృదయ, ఆమె చల్లని చూపులకోసం ముల్లోకాలు ఎదురు చూస...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment