Monday, September 7, 2026

Yugadharmaprakruthaadi Pralayachathustaya Vivechanamu - యుగధర్మప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము - 
యుగధర్మప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము

అలా చెప్పిన యోగిశ్రేష్ఠుడైన శుకమహర్షిని పరీక్షిత్తు ఇలా ప్రశ్నించాడు. “కలియుగం మహాపాతకాలతో కూడినది. కాబట్టి ప్రజలు తమకు పాపాలు రాకుండా ఎలా చేస్తారు? కాలం ఏ విధంగా నడుస్తుంది? కాలస్వరూపుడైన హరి ప్రభావం ఎలా తెలుస్తుంది?” అని రాజు ప్రశ్నించగా శుకమహర్షి ఇలా చెప్పాడు. 

కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు యుగాలు క్రమంగా ప్రవర్తిస్తాయి. ధర్మానికి సత్యం, దయ, తపస్సు, దానం అనేవి నాలుగు పాదాలు. మొదటిదైన కృతయుగంలో శాంతి, దాంతి, ఆత్మజ్ఞానం, వర్జాచారాలు ఆశ్రమాచారాలు మొదలైన వాటిని కలిగి ధర్మం నాలుగు పాదాలతో సంపూర్ణత్వం పొంది నడుస్తుంది. 

రెండవ యుగమైన త్రేతాయుగంలో శాంతి, దాంతి, కర్మాచరణం అనేవాటితో ధర్మం మూడు పాదాలతో నడుస్తుంది. మూడవ యుగమైన ద్వాపరయుగంలో బ్రాహ్మణపూజ, అహింసావ్రతం, జపం, అనుష్ఠానం మొదలైన లక్షణాలు కలిగి ధర్మం రెండు పాదాలతో నడిచి ప్రకాశిస్తుంది.

నాలుగవయుగం కలియుగం. ఈ యుగంలో జనులు అధర్మపరులుగా, అన్యాయపరులుగా; క్రోధం, మాత్సర్యం, మోహం, లోభం మొదలైన దుర్గుణాలతో కూడుకొన్న వాళ్లుగా ఉంటారు. వర్ణాచారాలను, ఆశ్రమాచారాలను వదలిపెట్టేస్తారు. దురాచారాలు అవలంబిస్తారు. 

తినకూడని అన్నం తింటారు. శూద్రులను సేవించడంలో ఇష్టం కలిగి ఉంటారు. దయలేనివాళ్లై, నిష్కారణంగా శత్రుత్వం వహించిన వాళ్లవుతారు. దయ, సత్యం, శౌచం మొదలైన గుణాలు లేనివాళ్లై, అబద్దాలాడుతూ, కపటోపాయాలు పన్నుతూ, ధనం లేనివాళ్లై, దోషం మాత్రమే గ్రహించే వాళ్లై, పాపపరులైన రాజులను సేవిస్తూ ఉంటారు. 

తండ్రులను, కొడుకులను, సోదరులను, చుట్టాలను, దాయాదులను, స్నేహితులను విడిచిపెట్టి, కేవలం కామకర్మలయందే అపేక్ష గలిగి కులపవిత్రతను నాశనం చేస్తారు. అంతేగాక కరవు, ఉపద్రవాలు వచ్చి ప్రజలు నశిస్తారు. బ్రాహ్మణులు అయోగ్య దానాలను గ్రహిస్తూ, ఇతరుల ధనం మీద ఆసక్తి కలిగి యజ్ఞయాగాది కర్మలు చేస్తూ నీచులు కావడం వల్ల నశిస్తారు.

కావున, ఈ కలియుగంలో ఒక క్షణమైనా విష్ణుభక్తి పరులై 'శ్రీనృసింహా! వాసుదేవా! సంకర్షణా! మొదలైన శ్రీహరి నామాలను సుస్థిరమైన భక్తితో స్మరించే వాళ్లకు వంద యజ్ఞాలు చేస్తే వచ్చినంత ఫలం లభిస్తుంది. 

అందుచేత ఓ రాజ చూడామణి! నువ్వు నిరంతరం విష్ణువును స్మరించు. కలియుగం అనేక పాపాలకు నిలయం. కాబట్టి ఒక నిమిష మాత్రం విష్ణువును స్మరించినా పరమ పవిత్రతను పొంది కృతార్థుడ వవుతావు' అని చెప్పి ఇంకా

మూడవది అయిన ద్వాపరయుగంలో ఎంతో వేడ్కతో హరిని గురించి పాడుతూ కృష్ణా అనుకొంటూ బుద్ధిమంతులై కలిని తలచి భగవంతుని యందు క్రీడిస్తారు.

పరీక్షిత్తు కల్పాంతంలో వచ్చే ప్రళయం ఏ విధంగా జరుగుతుందని అడిగాడు. దానికి శుకుడు ఇలా చెప్పాడు. యుగచతుష్టయాలు ఒక వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. అట్లే రాత్రికూడా అంత ప్రమాణం కలిగి ఉంటుంది. ఇటువంటి రాత్రింబవళ్లు కలిస్తే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. 

బ్రహ్మకు అయ్యే ఆ ఒక్కరోజు నైమిత్తిక ప్రళయంగా పిలవబడుతుంది. ఆ సమయంలో బ్రహ్మ లోకాలన్నింటిని తన ఆత్మలో చేర్చుకొని నిద్రిస్తాడు. అప్పుడు ప్రకృతి నశిస్తుంది. అది ప్రాకృత ప్రళయం అనబడుతుంది. ఆ ప్రళయ విషయం చెపుతాను విను. పగటి పూట నైమిత్తిక ప్రళయం, రాత్రిపూట ప్రాకృత ప్రళయం అయితే అది బ్రహ్మకు ఒకరోజు అవుతుంది. 

ఇటువంటి రోజులు మూడు వందల అరవై అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. అటువంటి సంవత్సరాలు నూరయితే

అంతట బ్రహ్మకు అంతిమసమయం వచ్చినపుడు నూరేండ్లు భూమిలో వానలు కురవవు. దానితో మానవులు ఆకలిదప్పులకు తట్టుకోలేక ఒకరినొకరు తినడం మొదలుపెట్టి కాలవశులై నశిస్తారు. 

అప్పుడు కమలమిత్రుడైన సూర్యుడు సముద్రాలలోను, శరీరాలలోను, భూమిలోను ఉన్న జలాలను తన కిరణ సముదాయంచేత కాల్చి పీల్చివేస్తాడు. అప్పుడు ప్రళయాగ్ని సంకర్షణం అనే పేరుతో అన్ని దిక్కులలో వ్యాపించి ఆక్రమిస్తుంది. అప్పుడు నూరు సంవత్సరాలపాటు బలమైన గాలి వీస్తుంది.

ఈ విధంగా నూరేండ్లపాటు వానలుండవు. తరువాత నూరేండ్లు పండ్రెండుగురు సూర్యుల తీవ్రమైన కిరణాలు తాండవిస్తాయి. పిదప నూరేండ్లు ప్రళయకాలాగ్నిచేత దగ్ధమవుతుంది. తరువాత ఏడు రకాల గాలులు సుడిగాలి వేగంతో వీస్తాయి. ఆపై నూరేండ్లు నూతనమేఘాలు మహాధ్వనులతో ఏనుగుతొండాలవంటి జలధారలను కురిపించి సకల భూమిని జలమయం చేస్తాయి. 

బ్రహ్మాండమంతా జలమయం కావడంచేత భూమి తన గంధగుణాన్ని పోగొట్టుకొని నీటిలో లీనమైపోతుంది. నీరు తన రసగుణాన్ని పోగొట్టుకొని కాంతిలో అణగిపోతుంది. కాంతి అనగా తేజస్సు తన రూపగుణాన్ని పోగొట్టుకొని వాయువులో కలుస్తుంది. వాయువు తన స్పర్శగుణాన్ని పోగొట్టుకొని ఆకాశంలో చేరుతుంది.

ఆకాశం తన శబ్దగుణాన్ని పోగొట్టుకొని ఆదిభూతంలో ప్రవేశిస్తుంది. అది తేజోమయమైన మహద్రూపంతో అహంకారం కలదై, వికారగుణాలు కలదై ఇంద్రియాలను లీనం చేసుకొంటుంది. అహంకారం సత్త్వాది గుణాలను మింగుతుంది. అది కాల ప్రేరితమై ప్రకృతిలో అణగుతుంది. 

ఆ ప్రకృతి అనాదిగా ఉంది. అది శాశ్వతమైనది. దానికి నాశం కాని మార్పు కాని లేదు. మాటలకు గాని, మనస్సుకు గాని గోచరం కాక, సత్త్వరజస్తమస్సులనే గుణత్రయం లేనిదై మహత్తు మొదలైన వానితో కలయిక లేనిదై, స్వప్నావస్థ మొదలైన అవస్థాత్రయం లేనిదై, పృథివి మొదలైన పంచభూతాలు లేనిదై, తర్కానికి అందనిదై ఉంటుంది. 

దానిని మూలభూతమైన పదార్ధంగా చెపుతారు. కాలం విపరిణామం చెందినపుడు పురుషుడూ, అవ్యక్తుడూ ఒకరిలో ఒకరు లీనం అవుతారు. ఆ స్థితిని 'ప్రాకృత ప్రళయం' అంటారు.

మరొక విషయం ఉంది. దాన్నికూడా విను. బుద్ధి, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలైన విషయాలు అనే మూడింటినీ ఆశ్రయించుకొని జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం గోచరం కావడం అనే లక్షణం కలిగి, విరుద్ధం కాకపోవడమనే లక్షణం కలిగి, ఆదినీ అంతాన్ని కలదై ఉంటుంది. 

కాంతికంటె దీపం, నేత్రం, వస్తురూపం వేరుకావు. అదే విధంగా బుద్ధి, ఇంద్రియ, విషయాలు పదార్థమూర్తి అయిన పరమాత్మకంటె భిన్నమైనవి కావు. ప్రధానమనేది బుద్ధియందు పుడుతుంది. మెలకువగా ఉండడమనే జాగ్రదవస్థ, కలలు కనడం అనే స్వప్నావస్థ, నిద్రపోవడం అనే సుషుప్తి అవస్థ అనే మూడు విధాలైన అవస్థలు ఆత్మమయాలై బుద్ధితో కలసినట్లయితే అదే 'యోగం' అనిపించుకొంటుంది.

జీవజాలం ఈశ్వరుడిలో లయించడం, పుట్టడం పొందుతూ ఉంటుంది. అన్నీ పరస్పరం ఆశ్రయం లేనివై, మొదలూ తుదీ కలవి కావడం చేత వస్తువులు కానివై వర్తిస్తాయి. ఒకే కాంతి అనేక రంధ్రాలలో నుండి అనేక కాంతులుగా గోచరించినట్టు, ఒకే పరమాత్మ అనేక విధాలుగా భావింపబడుతున్నాడు. నగల భేదాన్నిబట్టి అనేక రీతులుగా కనిపించినప్పటికీ బంగారాన్ని ఒకే విధంగా భావించినట్లు పరమాత్మను ఒక్కటిగానే భావించాలి. 

కళ్లకు అడ్డుగా ఉన్న మబ్బుతెర తొలగితే సూర్యబింబం కనిపించినట్లు బంధకారణమైన అహంకారం ఆత్మజ్ఞానం వల్ల తొలగిపోయినప్పుడే పరమాత్మ స్వచ్చంగా కనిపిస్తుంది. ఆ పరమాత్మను యోగులు నిరంతరం స్మరిస్తూ అతనియందే లగ్నమైన మనస్సు కలవారై ఉంటారు. 

కాలవేగం చేత జగత్తుకంతటికీ భిన్నదశలు కలుగుతూ ఉంటాయి. పరమేశ్వర స్వరూపమైన కాలంలో ఆకాశంలో పగలు నక్షత్రాలు కనిపించని విధంగా, కల్పావస్థలు కనిపించకుండా సంచరిస్తూ ఉంటాయి.

నిత్యప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆత్యంతిక ప్రళయం అని ప్రళయాలు నాలుగు విధాలు. ఆయా కాలాల్లో సంభవించే శ్రీమన్నారాయణుని లీలలైన అవతారాలను బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన వారైనా చెప్పలేరు(వివరించలేరు). నాకు తెలిసినంతవరకూ చెప్పాను. 

సంసారమనే సముద్రాన్ని దాటడానికి 'విష్ణుకథ' అనే నావ ఒక్కటే సాధనం. మరొక సాధనం లేదు. అని చెప్పి-

(ద్వాదశభాస్కరులు : సూర్యులు పండ్రెండుగురుగా ప్రసిద్ధి ఉంది. ద్వాదశాదిత్యులు అనే మాటా ప్రసిద్ధమే. అదితి సంతానం కనుక ఆదిత్యులు. వరుణుడు, సూర్యుడు, సహస్రాంశుడు, ధాత, తపనుడు, సవితృడు, గభస్తి, రవి, పర్జన్యుడు, త్వష్ట, మిత్రుడు, విష్ణువు - ఈ పండ్రెండుగురు సూర్యులు. మరొక అభిప్రాయం ప్రకారం - ఆర్యముడు, మిత్రుడు, అరుణుడు, అర్కుడు, భగుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూషుడు, పర్జన్యుడు, త్వష్ట, విష్ణువు, అజఘన్యుడు - పండ్రెండుగురు సూర్యులు. 

వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని 'ఆదిత్యహృదయం' స్తోత్రంలో ఈ పేర్లలో చాలా, ఇవిగాక మరికొన్ని కనిపిస్తాయి.

అహంకారం : అహమంటే నేను అని అర్థం. నేను అని భావించడమే అహంకారం. నావి అనే దేహాది ఉపాధులతో కలవకుండా భావించగలిగితే అహంకారం ఆత్మస్వరూపం అవుతుంది.

మహత్‌ : సాంఖ్యుల పంచవింశతి తత్త్వాలలో ఒకటి. అవ్యక్తమైన ప్రధానం నుండి వచ్చినదది. గొప్పది, పవిత్రమైనది అనే సామాన్యార్థాలు కూడా ఉన్నాయి. తనయందు ఆరోపితమైన గుణదోషాలను అంటనివ్వకుండా ఉండేది మహత్తు.

రాజా! నేను చనిపోతాననే భయాన్ని పూర్తిగా మనస్సునుండి విడిచిపెట్టు. పుట్టిన మానవుల కందరికీ చావు తప్పదు. కాబట్టి శ్రీహరిని ధ్యానించు. దీనివల్ల నీవు మళ్లీ భూమిపై పుట్టడం జరుగదు. మాధవలోకమైన వైకుంఠంలో నివసించి సుఖించేయోగం పొందుతావు.

(నిరంతరం విష్ణునామస్మరణచేస్తే ఒక్క పరీక్షిత్తుకే గాక మానవుల కందరకూ వైకుంఠవాససౌఖ్యం కలుగుతుంది. శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన భాగవతసారం, ఇచ్చిన సందేశం ఇదే. మూలశ్లోకం కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నది.

'త్వంతు రాజన్‌ మరిష్యేతి పశుబుద్ధిమిమాం జహి
న జాతః ప్రాగభూతో
ద్య దేహవత్త్వం న నంక్ష్యసి' (12-5-2)

రాజా! మరణించెదననే బుద్దిని విడిచిపెట్టు. ఈ బుద్ది దేహమే ఆత్మ అనే అవివేకం నుండి పుట్టింది. నీవు ఇదివరకు పుట్టలేదు. ఇప్పుడు నశించవు. దేహం పుట్టింది. అదిమాత్రమే నశిస్తుంది. 'నీవు' అంటే ఆత్మ అని అర్థం. ఆత్మ శాశ్వతమైనది.

దానికి చావు పుట్టుకలు లేవు. చావు పుట్టుకలు శరీరానికే!

పరీక్షిత్తు తక్షకునిచే దష్టుండై మృతి నొంద నతని పుత్త్రుడు సర్పయాగము సేయుట
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

No comments:

Post a Comment

Yugadharmaprakruthaadi Pralayachathustaya Vivechanamu - యుగధర్మప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము -  యుగధర్మప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము అలా చెప్పిన యోగిశ్రేష్ఠుడైన శుకమహర్షిని పరీక్షిత్తు ఇలా ప్రశ్నించాడ...