Monday, September 7, 2026

Vedavyaasudu Vedamulanu, Puranamulanu Lokamandu Pravartimpa Jeyuta - వేదవ్యాసుడు వేదములను, పురాణములను లోకమందు ప్రవర్తింప జేయుట

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము - 
వేదవ్యాసుడు వేదములను, పురాణములను లోకమందు ప్రవర్తింప జేయుట

వ్యాసుడికి పూజ్యులైన పైల, సుమంత, జైమిని మునులూ, ధీరుడైన వైశంపాయనుడూ కలసి నలుగురు శిష్యులు ఉండిరి.

(పరాశరుని కొడుకు పారాశర్యుడు. అంటే వ్యాసుడు. పరాశర మహర్షికి దాశరాజు కూతురు మత్స్యగంధి(సత్యవతి) కి పుట్టినవాడు వ్యాసుడు. పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు - ఈ నలుగురూ వ్యాసుని శిష్యులు.

పైలుడు : ఋగ్వేదాన్ని ధారణ చేసిన వ్యాసమమహార్షి శిష్యుడు. పైలుని శిష్యుడు ఉదంకుడు.

సుమంతుడు : అధర్వవేదాన్ని పఠించిన వ్యాసుని శిష్యుడు.

జైమిని : వ్యాసుని శిష్యుడు. సామవేదాన్ని ధారణ చేసినవాడు. వ్యాసభారతాన్ని ప్రచారం చేసిన వాళ్లలో ఇతడూ ఒకడు.

వైశంపాయనుడు : యజుర్వేదాన్ని ధారణ చేసినవాడు. జనమేజయుడికి భారతకథ చెప్పడానికి వ్యాసునిచే నియుక్తుడైన వాడితడు. ఇతని శిష్యుడు యాజ్ఞవల్క్యుడు.)

ఆ నలుగురూ తమ గురువైన వ్యాసుడు బోధించిన క్రమంలో ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అథర్వవేదాన్ని లోకంలో ప్రచారం చేశారు. ఆ మాట విని శౌనకుడు ఆ క్రమ మేమిటని ప్రశ్నించగా 
సూతుడిలా చెప్పనారంభించాడు. 

మొట్టమొదట బ్రహ్మ హృదయంలో ఒక నాదం పుట్టింది. చిత్తవ్యాపారాన్ని నిరోధించడం వల్ల ఆ నాదం రూపుదాల్చి స్పష్టంగా కనిపించింది. అటువంటి ధ్వనిని ఉపాసించడం వల్ల యోగులు పాపరహితులై ముక్తి నొందుతారు. ఆ నాదంలోనే 'ఓం'కారం జనించింది. 'ఓం'కారం అన్ని మంత్రాలకు; ఉపనిషత్తులకు మూలం కావడం వల్ల వేదమాత అని ఖ్యాతి పొందింది. 

ఓంకారం అకార, ఉకార, మకారాలనే మూడు వర్ణాలతో, సత్త్వరజస్తమోగుణాలతో ప్రకాశిస్తూ ఉంది. భగవంతుడైన బ్రహ్మ ఆ ఓంకారం నుండి స్వరాలు, స్పర్శాలు, అంతస్థాలు, ఊష్మాలు మొదలైన లక్షణాలతో కూడిన వర్ణ(అక్షర) సముదాయాన్ని కల్పించాడు. ఆ అక్షర సముదాయం తోడ్పాటుతో తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను కలుగజేశాడు. తన పుత్రులైన బ్రహ్మవాదులకు (వేదాంతులకు) ఆ వేదాలను ఒక క్రమంలో ఉపదేశించాడు. వాళ్లు ఆ వేదాలను తండ్రి బోధించిన క్రమంలోనే తమ శిష్యులకు ఉపదేశించారు. ఈ విధంగా వేదాలు ప్రతియుగంలోనూ ఋషులచే సమగ్రంగా అభ్యాసం చేయబడుతూ వచ్చాయి.

అలాంటి వేదాలను సమగ్రంగా చదువలేని అశక్తులకు సహాయం చేయడం కోసం భగవంతుడు ద్వాపరయుగ ప్రారంభంలో సత్యవతీదేవి పరాశరమహర్షులకు కొడుకుగా పుట్టి సమగ్రవేదరాశిని ఋక్‌, యజుస్‌, సామ, అథర్వ వేదాలుగా విడదీసి క్రమంగా వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే తన నలుగురు శిష్యులకు బోధించాడు. 

ఆ వరుసలో పైలుడు నేర్చుకొన్న ఋగ్వేదం అసంఖ్యాకమైన స్తోత్రాలతో కూడి ఉండడం వల్ల 'బహ్వృచశాఖ' అని ప్రసిద్ధి పొందింది. పైలుడు తాను నేర్చుకొన్న వేదాన్ని ఇంద్రప్రమితికి, బాష్కలునికి ఉపదేశించాడు. బాష్కలుడు తాను నేర్చుకొన్న భాగాన్ని నాలుగు విభాగాలు చేసి బోధ్యుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, అగ్నిమిత్రుడు అనే తన శిష్యులకు ఉపదేశించాడు. 

ఇంద్రప్రమితి తాను నేర్చుకొన్న భాగాన్ని మాండూకేయుడు అనే వాడికి ఉపదేశించాడు. 
మాండూకేయుడు దేవమిత్రుడు అనేవాడికి ఉపదేశించాడు. దేవమిత్రునికి సౌభర్యుడు మొదలైన శిష్యులు అనేకులు ఉన్నారు. వాళ్లలో సౌభరి కొడుకైన శాకల్యుడు తాను నేర్చుకొన్న వేదశాఖను ఐదుభాగాలుగా విభజించి వాత్స్యుడు, మౌద్గల్యుడు, శాలీయుడు, గోముఖుడు, శిశిరుడు అనే తన ఐదుగురు శిష్యులకు ఉపదేశించాడు. 

ఈ ఐదుగురు శిష్యులు జాతుకర్ణి అనే వాడికి ఉపదేశించారు. జాతుకర్ణి ఆ భాగాలను బలాకుడు, పైంగుడు, వైతాళుడు, విరజుడు అనే నలుగురికి చెప్పాడు. ముందు చెప్పిన బాష్కలునికి బాష్కలి అనే కొడుకున్నాడు. ఆ బాష్కలి వాలఖిల్య సంహితను బాలాయని, గార్గ్యుడు, కాసారుడు అనే వాళ్లకు బోధించాడు. ఈ విధంగా బహ్వృచ సంహితలు(ఋగ్వేద భాగాలు) అనేక విధాలుగా ముందు చెప్పిన బ్రహ్మవాదుల చేత ధరింపబడి నిలిచి ఉన్నాయి.

యజుర్వేదాన్ని ఉపదేశం పొందిన వైశంపాయనమహర్షి శిష్యులందరూ యజ్ఞాలన్నిటిలో పాల్గొని ఆధ్వర్యవ కృత్యాలలో ప్రసిద్ధి పొందారు. యాజ్ఞవల్క్యుడు కూడా వైశంపాయనుని శిష్యుడే. యాజ్ఞవల్క్యుడు గురువుపట్ల అపరాధం చేయగా వైశంపాయనుడు తన దగ్గర నేర్చుకొన్న వేదాలను మళ్లీ తనకిచ్చి వెళ్లిపొమ్మన్నాడు. 

అందువల్ల యాజ్ఞవల్క్యుడు తాను నేర్చుకొన్న యజుస్సంహితలను నేర్చుకొన్న క్రమంలోనే వమనం(వాంతి) చేశాడు. వమనం ద్వారా బయటకు వచ్చిన ఆ సంహితలు రక్తసిక్తమై ఉండగా యజుర్మంత్ర గణాల అధిష్ఠాన దేవతలు తిత్తిరిపక్షుల రూపంలో వచ్చి వాటిని తినేశారు. 

అందువల్ల ఆ భాగాలకు తైత్తిరీయ శాఖలని పేరు వచ్చింది. తాను నేర్చుకొన్న వేదశాఖలు పోవడంవల్ల యాజ్ఞవల్క్యుడు నిర్వేది(వేదాలు లేనివాడు) అయ్యాడు. దుఃఖంతో తీవ్రమైన తపస్సుచేసి సూర్యదేవుని సంతృప్తి పరచాడు.

సూర్యుడు సంతసించి గుర్రం రూపం ధరించి యజుర్మంత్ర సంహితలను యాజ్ఞవల్క్యునికి ఉపదేశించాడు. అందువల్ల వాటికి 'వాజసనేయశాఖ' అనే పేరు కలిగింది. ఈ శాఖలో ఉండే యజుస్సంహితలను కాణ్వులు, మాధ్యందినులు మొదలైన వాళ్లు అభ్యసించారు. ఈ విధంగా యజుర్వేదం లోకంలో వ్యాప్తి చెందింది.

సామవేదాన్ని అభ్యసించిన జైమిని దానిని తన కుమారుడైన సుమంతుడికి ఉపదేశించాడు. సుమంతుడు దానిని తన కొడుకైన సుకర్ముడికి చెప్పాడు. సుకర్ముడు ఆ వేదాన్ని వెయ్యిశాఖలుగా విభజించి కోసలుని పుత్రుడైన హిరణ్యనాభుడికి, తన కుమారుడైన పౌష్పంజికి ఉపదేశించాడు. వాళ్లిద్దరు బ్రహ్మవేత్తలైన అవంత్యులు, ఉదీచ్యులు అనే ఐదువందల మందికి ఉపదేశించి సామవేదపారగులుగా చేశారు. ఈ విధంగా సామవేదం లోకంలో ప్రశస్తి పొందింది.

అథర్వవేదం అభ్యసించిన సుమంతుడు దాన్ని తన శిష్యునికి బోధించాడు. ఆ శిష్యుడు తన శిష్యులైన వేదదర్శుడు, పథ్యుడు అనే వాళ్లకు ఉపదేశించాడు. వేదదర్శుడు శౌల్కాయని, బ్రహ్మబలి, నిర్దోషుడు, పిప్పలాయనుడు అనే నలుగురికి బోధించగా, పథ్యుడు కుముదుడు, శునకుడు, జాబాలి, బభ్రువు, అంగిరసుడు, సైంధవాయనుడు అనే ఆరుగురికి బోధించాడు. ఈ విధంగా అథర్వవేదం వృద్ధి పొందింది.

ఇలా నాలుగు వేదాల ఉత్పత్తిని, వ్యాప్తిని తెలిపాను. ఇప్పుడు పురాణాల క్రమాన్ని గురించి చెపుతాను విను. లోకంలో పురాణాలను ప్రచారం చేసిన వాళ్లుగా త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అనే ఆర్గురు ప్రసిద్దులు. వ్యాసుని శిష్యుడు, నా తండ్రి అయిన రోమహర్షణుని దగ్గరే ఈ ఆరుగురు పురాణాలను నేర్చుకొన్నారు. 

పురాణం సర్గ మొదలైన పది లక్షణాలకు లక్ష్యంగా ఉంటుంది. కొందరు పురాణానికి సర్గ మొదలైన ఐదు లక్షణాలు ఉంటాయని చెపుతారు. పురాణవిదులైన మహర్షులు చెప్పిన పద్ధతి ననుసరించి పురాణాలను క్రమంగా చెపుతాను విను. బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణుపురాణం, శివపురాణం, భాగవతపురాణం, భవిష్యోత్తర పురాణం, నారదపురాణం, మార్కండేయపురాణం, అగ్నిపురాణం, బ్రహ్మవైవర్తపురాణం, లింగపురాణం, వరాహపురాణం, స్కాంద పురాణం, వామనపురాణం, కూర్మపురాణం, మత్స్యపురాణం, బ్రహ్మాండపురాణం, గరుడ పురాణం - ఈ పద్దెనిమిదీ మహాపురాణాలు. 

ఇవిగాక ఇంకా ఉపపురాణాలున్నాయి. ఈ పురాణాలను రాసినా, చదివినా, విన్నా పాపాలు నశించిపోతాయి అని సూతుడు శౌనకాదిమునులకు చెప్పాడు. 'నీవు నారాయణుని గుణాలను, ఆయన కథలను చెప్పావు. ఇక తప్పుచేసినవాళ్లు, పాపబుద్ధి కలవాళ్లు సంసారసాగరాన్ని ఎలా దాటుతారో కూడా చెప్పవా!' అని మునులు అడిగారు. అప్పుడా విషయం చెప్పదలచి సూతుడు ఇలా అన్నాడు.

(వేదమంటే జ్ఞానం. వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించడం వల్ల వ్యాసుడు వేదవ్యాసుడయ్యాడు. వ్యాసుడు సత్యవతీ పరాశరులకు కృష్ణద్వీపంలో జన్మించడం వల్ల కృష్ణద్వైపాయనుడయ్యాడు. శ్రీమన్నారాయణుని ఏకవింశతి అవతారాలలో వ్యాసావతారం కూడా ఒకటి. శ్రీమన్నారాయణుని పదిహేడవ అవతారం వ్యాసుడని భాగవతమే పేర్కొన్నది. (ప్రథమస్కంధం. 63 వ వచనం). ప్రతి మహాయుగంలోనూ విష్ణువే వ్యాసుడిరూపంలో అవతరిస్తుంటాడని, వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడచి 28 వ మహాయుగంలో కలియుగం జరుగుతూ ఉందని, కలియుగంలో వ్యాసుడు కృష్ణ
ద్వైపాయనుడుగా అవతరించాడని చెపుతారు. వ్యాసుడి కొడుకు శుకుడు. వ్యాసుడు భాగవతపురాణం రాసి శుకుడిచేత చదివించాడు.

వేదాలకు ఒక రకంగా వ్యాఖ్యానాలు పురాణాలు. పురాణశబ్దానికి 'పురా అపి నవం పురాణం' అని వ్యుత్పత్త్యర్థం. పాతదైనా కొత్తగా కనిపించేదే పురాణమని అర్ధం. పురాణానికి ఐదు లక్షణాలున్నట్లు కింది శ్లోకం చెపుతుంది.

'సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశాను చరితం చైవ పురాణం పంచ లక్షణమ్‌'

సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనేవి ఆ ఐదు లక్షణాలు. కొందరు పురాణం 'దశలక్షణ లక్షితంగా' ఉంటుందన్నారు. ఆ పది లక్షణాలు సర్గం, విసర్గం, వృత్తి, రక్ష మన్వంతరం, వంశం, వంశానుచరితం, ప్రళయం, హేతువు, అపాశ్రయం.

పద్దెనిమిది పురాణాలతో పాటు పద్దెనిమిది ఉపపురాణాలు కూడా ఉన్నాయి. సనత్కుమార, నారసింహ, నారదీయ, శివ, దౌర్వాస, కాపిల, మానవ, ఉశన, ఆరుణ, కాలిక, సాంబ, సౌర, ఆదిత్య, మహేశ్వర, దేవీభాగవత, వాశిష్ఠ, విష్ణుధర్మోత్తర, నీలమత పురాణాలు ఉపపురాణాలు. అష్టాదశ పురాణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే శ్లోకమిది ఆ

'భద్వయం మద్వయం చైవ బ్రత్రయం వ చతుష్టయమ్‌
అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్‌ పృథక్‌.'

భ ద్వయం - భాగవత భవిష్యపురాణాలు
మ ద్వయం - మత్స్యమార్కండేయపురాణాలు.
బ్రత్రయం - బ్రహ్మ బ్రహ్మవైవర్త, బ్రహ్మాండపురాణాలు.
వ చతుష్టయం - విష్ణు, వరాహ, వామన, వాయుపురాణాలు

అ - అగ్నిపురాణం; నా - నారదపురాణం; ప - పద్మపురాణం; లిం - లింగపురాణం; గ - గరుడపురాణం; కూ - కూర్మపురాణం; స్క - స్కాందపురాణం

ఓంకారం : సోహం అనే మాటలో సకార హకారాలు లోపిస్తే ఓం అయిందంటారు. సః అహం సోహం. వాడే నేను అంటే ఈశ్వరుడే నేను, నాకూ వాడికీ తేడా లేదని భావం, దీన్ని అనుభవానికి తెచ్చుకోడానికి 'ఓం' ను అ+ఉ+మ అనే మూడు వర్ణాలుగా విభజించారు. 'అ' అనేది జాగ్రదవస్థకూ, అందులో ఉన్న విశ్వుడనే జీవుడికీ సంకేతం. 'ఉ' అనేది స్వప్నానికీ తైజసుడికీ సంకేతం. 'మ' అనేది సుషుప్తికీ అందులోని ప్రాజ్ఞుడికీ సంకేతం.

సంకేతాన్ని ఉచ్చరించేటప్పుడు ఈ అవస్థాత్రయాన్ని, అందులో బందీ అయిన జీవుడిని భావన చేసి కడపట మకారమనే నాదం ఆగిపోకుండా దాన్ని తురీయావస్థగా గుర్తించగలిగితే అప్పుడు ఈ జీవభావమంతా ఎగిరిపోయి 'జీవుడు ఈశ్వరుడే' అనే ఏకాత్మభావం అనుభవానికి వస్తుంది. 

కనుకనే 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌ మామనుస్మరన్‌, యః ప్రయాతి త్యజన్దేహం సయాతి పరమాం గతిమ్‌' (ఎవడు 'ఓం' అనే ఒకే అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్ను ఎడతెగకుండా స్మరిస్తూ శరీరాన్ని వదలుతాడో అతడు సర్వోత్తమస్థానం పొందుతాడు) అని భగవద్దీత (అక్షరపరబ్రహ్మయోగం. 13వ శ్లోకం) బోధించింది. కాబట్టి 'ఓం' అనేది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరం. దీనికి ప్రణవం అని కూడా పేరు.

స్వరాలు : అ కారం మొదలు ఔ కారం వరకు గల వర్ణా లు. 
స్పర్శాలు : కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, ప వర్గాలలోని వర్గాలు. 
అంతస్థాలు: య,వ,ర, ల అనే వర్ణాలు.
ఊషాలు : శ, ష, స, హ అనే వర్ణాలు


 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

No comments:

Post a Comment

Vedavyaasudu Vedamulanu, Puranamulanu Lokamandu Pravartimpa Jeyuta - వేదవ్యాసుడు వేదములను, పురాణములను లోకమందు ప్రవర్తింప జేయుట

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము -  వేదవ్యాసుడు వేదములను, పురాణములను లోకమందు ప్రవర్తింప జేయుట వ్యాసుడికి పూజ్యులైన పైల, సుమంత, జైమిని మునులూ, ధ...