Wednesday, March 18, 2026

Gajendra Previous Birth (Past Life) Story - గజేంద్రుని పూర్వ జన్మ వృత్తాంతము

గజేంద్రుని పూర్వ జన్మ వృత్తాంతము

ఓ రాజా! ఆ తరువాత విష్ణుదేవుడు తన పొడవైన హస్తాన్ని సాచి గజరాజును మడుగులో నుండి బయటికి లాగాడు. దాని దేహం మీద మదజలరేఖలను తుడిచాడు. నెమ్మదిగా దాని దేహాన్ని నిమిరాడు. దాని దుఃఖాన్ని పోగొట్టాడు.

అలా శ్రీహరి తనను చేతితో బాగాతాకి లాలించగానే గజేంద్రుడి శరీరంలోని తాపమంతా చల్లబడింది. అతడు మునుపటి శక్తిని, ధైర్యాన్ని పొందాడు. తన ఆడ ఏనుగుల సమూహంతో కలసి సొంపుగా ఘీంకారం చేశాడు.

శ్రీహరి దయవల్ల మళ్లీ ప్రాణం పోసుకొన్న గజరాజు మరలా తన ఏనుగుల్ని చేరుకొని కలయ తిరిగాడు. మళ్ళీ మునుపటిలాగానే తొండంతో వాటిని మెల్లగా నిమిరాడు. వాటి తొండాలను తన తొండంతో పెనవెసుకొని పట్టుకొన్నాడు.

(పశుప్రవృత్తిలోని అద్భుతమైన రహస్యం ఒకటి ఇక్కడ ఉంది. మనిషి విషయం ఇంతే. మళ్ళీ బ్రతుకు కల్లగానే ఆడ ఏనుగుల్ని కలుసుకొని మునుపటి లాగానే ఉండగోరినాడు గజరాజు. ఇదే ఈ కథకు చక్కని ముగింపు.)

రాజా! గొప్పదైన ఆ మొసలి పూర్వజన్మలో 'హూహూ' అన్న పేరుగల గంధర్వుడు. దేవలుడు అనే ముని పెట్టిన శాపంవల్ల మొసలిగా మారి దుర్భర జీవితం గడిపి, గజేంద్రుడికి విమోచనం కాగానే, తన పూర్వ గంధర్వరూపాన్ని పొందాడు. అవ్యయుడడైన శ్రీహరికి అతిభక్తియుక్తుడై నమస్కరించి ఆసక్తితో స్వామివారిని స్తుతిస్తూ ఎన్నో గీతాలు పాడాడు. ఆ దేవుని కృపను పొంది, మాటిమాటికి నమస్కరిస్తూ పాపాలు పోగొట్టుకొని సంతోషంగా తన లోకానికి వెళ్ళిపోయాడు. గజరాజు కూడా శ్రీహరి హస్త స్పర్శ ప్రభావంచేత అజ్ఞానం పోయి పుణ్యం పొంది శ్రీహరిసారూప్యం పొందాడు.

(గజేంద్రుడు భగవదనుగ్రహం వల్ల భగవత్‌సారూప్యమనే మోక్షస్థితిని పొందాడు.)

ఓ రాజా! మొసలితో ఇంత ఘోరయుద్ధం చేసిన గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే పేరు గలిగిన ద్రవిడ దేశాధిపతి. చాలా పుణ్యాత్ముడాయన. వైష్ణవభక్తులలో ప్రముఖుడుగా పేరు పొందినవాడు. మౌనవ్రతం పూని ఒక పర్వత శిఖరం మీద శ్రీహరి సన్నిధిని ఏర్పాటుచేసుకొని విశేషంగా పూజలు చేస్తూ ఉండేవాడు.)

ఓ రాజా! ఒకరోజు ఆ రాజు మౌనవ్రతం దాల్చి అచ్యుతుడైన శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తూ నిశ్చలంగా ఉండగా, ఆ చోటికి వచ్చిన అగస్యమహర్షి తన్నుచూచి లేచి నమస్కరించి పూజించని ఆ రాజును చూచి కోపం తెచ్చుకొని 'ఓయి మూర్ఖుడా! లుబ్ధుడా! పెద్ద యేనుగు జాతిలో జన్మించు' అని శాపమిచ్చాడు.

శ్రేష్ఠుడైన అగస్యమహర్షిని పూజించకుండా అవమానించి విష్ణుభక్తులలో శ్రేష్ఠుడైన ఇంద్రద్యుమ్నుడు ఏనుగుల జాతిలో పుట్టాడు. ఇది అంతే. ఎంత గొప్ప పుణ్యాత్ములకైనా తపోధనులైన బ్రాహ్మణులను అవమానించడం తగని పని.

ఓ రాజా! ఆ విధంగా ఇంద్రద్యుమ్నుడు గజరాజు జన్మ పొందాడు. అతని సేవకులు, మున్నగువారందరూ ఏనుగులుగా పుట్టారు. ఏనుగుగా పుట్టినా పూర్వజన్మలో చేసిన హరిపూజాఫలంగా ఆ గజేంద్రునికి సారూప్యపదవి లభించింది.

భక్తుడు తన నిత్యకృత్యాలు నిర్వర్తిస్తూ విష్ణువును సేవించాలి. ఈ రెండు నియమాలను చక్కగా పాటిస్తే క్రమంగా పాపాలన్నీ పోతాయి. విష్ణుభక్తిలో ఆసక్తి ఎప్పటికీ పోదు.

దైవబలం లేని దుర్జనులకు ఏనుగులు, గుర్రాలు, ఎంత సంపదా ఉన్నా నశిస్తాయి. వారి ఆలుబిడ్డలూ నశిస్తారు. గుణవంతులైన వారు సన్మార్గంచేత చెడిపోకుండా బ్రతుకుతారు. అంతేకాక వారికి విష్ణువులో ఉన్న భక్తి, శ్రద్ధ క్రమంగా పెరుగుతాయి తప్ప, ఎన్నటికీ నశించవు.

అప్పుడు లోకానికి తండ్రి అయిన ఆ పరమాత్ముడు చిరునవ్వుతో కూడిన ముఖపద్మంతో ప్రకాశిస్తున్న లక్ష్మీదేవికి ఇలా చెప్పాడు.

తామర వంటి ముఖం కల్గిన ఓ చిన్నదానా! నా వెంబడి ఆకాశంలో వస్తూ ఉండిన సమయంలో నా చేతిలో వదలకుండా నీపైట కొంగును అలాగే పట్టుకొని ఉండినందుకు మనస్సులో నన్ను గురించి ఏమనుకొన్నావో చెప్పవా!

ఓ మగువా! నాకు అన్నీ తెలుసు. (నీ మనస్సులో ఉన్నదికూడా); నన్ను ఎవరు మరిచి పోతారో వారిని నేను కూడా మరచిపోతాను. ఇతరులను ఆశ్రయించి స్తుతించకుండా నన్ను ఎవరు మరువకుండా స్తుతిస్తారో, ఆశ్రయిస్తారో వారిని నేనూ ఎప్పుడూ మరవను.

అని చెప్పగా, చిరునవ్వు చిందే ముఖారవిందంతో ఆ లక్ష్మీదేవి విష్ణువుతో ఇలా అన్నది.

స్వామీ! నీవు సర్వానికీ అధిపతివి. నాకు నాథుడవు. నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా ధర్మం. అంచేత ఏమంటాను? ఏమనకుండా నే నీ వెంట వచ్చాను. అంతేకదా! అన్నది.

(నవ విధ భక్తిమార్గాలలో అంఘ్రిసేవన(పాదసేవనం) వల్ల తరించిన భక్తురాలుగా లక్ష్మీదేవిని చెబుతారు. (తదంఘ్రిభజనే లక్ష్మీ - అన్నారు). ఆ విధంగా శ్రీనివాసునికి అత్యంత అనుకూలవతి లక్ష్మి - ఆయన హృదయం సంపూర్ణంగా ఎరిగి ఆయనను అనుసరించి ప్రతి అవతారంలోనూ తానూ పుట్టి స్వామిని అనుసరించి సేవించింది. అందుకే ఆమెను అనపాయిని (వదలనిది) అంటారు.)

దీనరక్షకా! దీనబంధూ! దీనపరాధీనా! జగత్‌ప్రభూ! దేవాధిదేవా! నిన్ను ఏమని పొగడగలమయ్యా! దీనుల మొరను ప్రీతితో విని వారిని రక్షించడమూ, మంచి మంచి దీవనలు (మంగళాశాసనాలు) పొందడం నీకే తగును.

పై విధంగా అని, ఇంకా లక్ష్మీదేవి ఎన్నో రీతుల స్వామివారిని స్తుతించింది. ఆ పరమ విష్ణుభక్తురాలిని స్వామివారు ఆదరంతో దగ్గరికి తీసుకొని, ఇంపైన మాటలతో, పరిహాసంతో, చిరునవ్వుతో ఆలింగనం చేసుకున్నారు. సపరివారంగా, గరుడ, గంధర్వ, దేవగణాలు 'జయజయ' ధ్వానాలు చేస్తుండగా, గరుడ వాహనమెక్కి తన స్థానమయిన వైకుంఠానికి చేరుకున్నారు - అని చెప్పి పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు.

నేను నీకు వివరించిన గజేంద్ర మోక్ష గాథను వినేవారు కీర్తిమంతులవుతారు. పాపాలు నశిస్తాయి. చెడ్డకలలు రావు. దుఃఖాలు రావు. ఎవరు ప్రతిరోజూ ఉదయం పవిత్రమైన నియమంతో నిర్మలమైన మనస్సుతో ఈ కథను చదువుతారో అలాంటి వారికి (జ్ఞానులకు), సంపద కల్గుతుంది. వైభవం సిద్ధిస్తుంది. ఆపదలు రావు. శుభాలు వృద్ధిపొందుతాయి. మోక్షం సులభంగా సిద్ధిస్తుంది. సంతోషంగా ఉంటారు - అని విష్ణువు సెలవిచ్చాడు. (ఇది ఫలశ్రుతి)

(మరి ఇంకా ఫలశ్రుతి వాక్యాలుగా శ్రీమహావిష్ణువు ఇలా సెలవిచ్చాడు)'ఇంతేకాదు. తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును, గజరాజును, పద్మసరస్సును, శ్వేతద్వీపాన్ని, క్షీరసాగరాన్ని త్రికూట పర్వతంలోని గుహలను, అడవులను, పేము, వెదురు, పొదలతో కూడిన కల్పవృక్షాలను, విష్ణువు, బ్రహ్మ, శివుడు నివసించే త్రికూట శిఖరాలను, కౌమోదకి, కౌస్తుభం, సుందర్శనం, పాంచజన్యం - శ్రీలక్ష్మి, ఆదిశేషుడు, గరుడుడు, వాసుకి, ప్రహ్లాదుడు, నారదుడు వీరిని; మత్స్యకూర్మవరాహాది అవతారాలను; ఆ అవతారాలలో విష్ణువు చేసిన అతిమానుష కార్యాలను; సూర్యచంద్ర అగ్నులను, ఓంకారాన్ని ధర్మాన్ని తపస్సును, సత్యాన్ని వేదాన్ని వేదాంగాలను, శాస్త్రాలను, గోబ్రాహ్మణులను, సాధువులను, పతివ్రతలను, చంద్రుడి భార్యలను (27 నక్షత్రాలను); కశ్యపుని భార్యలను (వినత, కద్రువ, అదితి, దితి); గౌరిని, గంగా, సరస్వతి, యమున, సునంద మొదలైన పుణ్యనదులను, దేవతలను, దేవతా వృక్షాలను, ఐరావతాన్ని అమృతాన్ని ధ్రువుని, బ్రహ్మర్షులను, పుణ్యాత్ములైన మానవులను, తలచువారు; మరణించే సమయంలో నిర్మలమైన విష్ణువు రక్షణ పొందుతారని కూడా విష్ణువు చెప్పాడు. శంఖం పూరించాడు. దేవతలంతా స్వామిపాదపద్మాలకు నమస్కరించగా అందుకొని గరుడవాహనం అధిరోహించి స్వామి పయనించాడు. దేవతలందరూ సంతోషించారు - అని చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.

ఈ గజేంద్ర మోక్షణ గాథను శ్రద్ధతో చదివే భక్తులకు శ్రీమహావిష్ణువు ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలుగా గల భోగాలను, చివరికి ముక్తిని (ఇహపరాలను) ప్రసాదిస్తాడు.

(విష్ణుదేవాలయాలలో అర్చనసమయంలో పంచస్తవాలను పఠించడం ఆనవాయితీ.
1). విష్ణుసహస్రనామం 2) భీష్మసూక్తం 3) గజేంద్రమోక్షణం 4) భగవద్గీత 5) మనుస్మృతి.)

ఓ రాజా! తామస మనువు తమ్ముడు రైవతుడు ఐదవ మనువు అయ్యాడు. అతని కొడుకులైన ప్రతివింధ్యుడు, అర్జునుడు మొదలైనవారు భూలోకానికి రాజులయ్యారు.

ఓ రాజా! ఈ మనువు కాలంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశీర్షుడు మొదలైనవారు సప్తర్షులయ్యారు. భూతరయుడు మొదలైనవారు దేవతలయ్యారు. శుభుడు - వికుంఠ అనే పుణ్యదంపతులకు ఆత్మతేజంతో శ్రీమహావిష్ణువు వైకుంఠుడనే పేరుతో అవతరించాడు. సర్వలోకాలలోని వారూ నమస్కరించగా వైకుంఠమనే లోకాన్ని కల్పించాడు. లక్ష్మీదేవి స్వయంగా వరించి ఆయనను పెళ్ళాడింది. ఆయన మహిమను, కల్యాణగుణాలను ఊహించడానికి సాధ్యపడుతుందా? ఈ భూమి మీది ధూళికణాలను లెక్కించవచ్చునేమో కాని హరి గుణగణాలను లెక్కించటం సాధ్యం కాదు.

ఆ తరువాత. చక్షువు కుమారుడు మహావీరుడైన చాక్షుషుడు ఆరవ మనువయ్యాడు. పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైన అతని కుమారులు రాజులయ్యారు. మంత్రద్యుముడు ఇంద్రుడయ్యాడు; ఆప్యులు మొదలైనవారు దేవతలయ్యారు. హవిష్మంతుడు, వీరకరుడు మొదలైనవారు సప్తర్షులయ్యారు. శ్రీమహావిష్ణువే సంభూతి అనే స్త్రీకి, వైరాజు అనే పురుషునికీ కుమారుడుగా 'అజితుడు' అనే పేరుతో జన్మించాడు. అతనే కూర్మరూపాన్ని ధరించి సముద్రంలో పడిపోకుండా మందరపర్వతాన్ని మోశాడు. అతనే దేవతల కోరిక మేరకు క్షీరసముద్రాన్నీ చిలికి అమృతాన్ని వారికి ఇచ్చాడు.

క్షీరసాగర మథన కథా ప్రారంభము

No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...