Wednesday, March 18, 2026

Story of Ksheera Sagara Madhanam - క్షీరసాగర మథన కథా ప్రారంభము

క్షీరసాగర మథన కథా ప్రారంభము

అని పలుకగా పరీక్షిత్తు శుకమహర్షితో ఇలా అన్నాడు.

ఓ మహర్షీ! నామనవి వినండి. శ్రీమహావిష్ణువు క్షీరసాగరాన్ని ఎందుకు మధించాడు? కూర్మరూపం ధరించి సముద్రంలో ప్రవేశించి కవ్వంగా వాడబడుతూ ఉండిన అంత పెద్ద మందర పర్వతాన్ని ఎలా మోశాడు? దేవతలకు అమృతం ఎలా లభించింది? సముద్రంలో ఏమేమి పుట్టాయి? అంతా ఆశ్చర్యంగా ఉంది. దయతో నాకు ఆ వివరాల్ని చెప్పండి.

ఓ పండితోత్తముడైన శుకమహర్షీ! ఇప్పటివరకు ఎన్నో భగవంతుని కథల్ని చెప్పారు. ఎంత విన్నా నాకు సంతృప్తి కావడం లేదు. ఇంకా వినాలని ఉంది. నా చెవులనిండుగా శ్రీమహావిష్టు కథలను ఇంకా వినిపించు.

ఈ విధంగా పరీక్షిత్తు అడగ్గా శుకమహర్షి సంతోషించి విష్ణుకథలు చెప్పడానికి ఉపక్రమించాడు అని సూతుడు శౌనకాదిమునులతో ఇలా అన్నాడు - ఈ విధంగా శుకుడు పరీక్షిత్తును చూచి

శుకుడు ఇలా చెప్పాడు : “రాజా! రాక్షసులు కసి పెంచుకొని అతి సుకుమారమైన ఆయుధాలతోనే దేవతల ప్రాణాలు తీశారు. వీరి యుద్ధ విజృంభణకు తాళలేక వారిని ఎలా జయించాలో తెలియక దేవతలు శక్తి కోల్పోయారు. ఓడిపోయారు. చాలామంది చనిపోయారు.

ఆ సమయంలో కొందరు దేవముఖ్యులు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలైన దిక్పాలకులతో, కలిసి మేరు పర్వతంమీద ఉన్న బ్రహ్మాదేవుని దర్శించారు. దేవతలు బ్రహ్మాదేవుని ఎన్నో విధాలుగా స్తుతించారు. ఎంతో బాధతో దేవతలందరూ రాక్షసుల దుర్మార్గాలను ఇలా విన్నవించారు.

దుర్వాసుని శాపంవల్ల ఇంద్రునితోపాటు సంపదలు లేనివయ్యాయి. పలువురు దేవతలు మరణించారు. వేడుకలు లేక శోభలేనివయ్యాయి.

వారివారి స్థానాలు వదలివచ్చి కాంతి విహీనులై కనిపిస్తున్న దేవతలను చూసి, బ్రహ్మదేవుడు పరమాత్ముడైన శ్రీమహావిష్ణువును ధ్యానించి నమస్కరించుకొని, వికసించిన ముఖంతో ఇలా వారికి తెలియజేశాడు.

నేను, మీరు, ఈ కాలమూ, మానవులు, పక్షులు, జంతువులు, తీగలు, చెట్లు, చెమట నుండి పుట్టె సూక్ష్మజీవులు, ఏ పరమాత్ముని తేజోరూపాలుగా జన్మించామో; ఆ భగవంతునికి నమస్కరిద్దాం. అంతే తప్ప దీనికి ఏడవటం ఎందుకు?

చంపదగినవాడు, రక్షింపదగ్గవాడు, కష్టపెట్టదగ్గవాడు, గౌరవింపదగ్గవాడు - అనే తేడాలు లేని ఆ భగవంతుడు మాత్రమే సృష్టి రక్షణ, లయ - అనే మూడు వ్యాపారాలను జరుపుతాడు. కాబట్టి మన చింతలు తీర్చుటకు ఆ పరమాత్ముడే తగినవాడు. (అతనినే శరణు వేడుకుందాం)

వరప్రదాత, లోకగురువు, దయామయుడు అయిన పరమాత్ముని మనం దర్శిస్తే మన దుఃఖ జ్వరాలు అన్నీ శమిస్తాయి అని వారికి విశ్వాసం కల్పించి బ్రహ్మదేవుడు వారందరితో కలిసి 'అజిత' భగవానుని నివాసానికి వెళ్ళాడు.

బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి త్వరగా అజిత భగవానుని నివాసం చేరి, అదృశ్యరూపుడుగా ఉన్న ఆ ప్రభువును దివ్యమైన వేదమంత్రాలతో ఇలా స్తుతించాడు.

ఈ సమస్త జగత్తూ ఎవని మాయవల్ల మోహంలో మునిగిపోతుందో - ఎవని మాయదాట రానిదో; ఎవరు తన మాయచేత జగత్తు అంతా గెల్చుకున్నాడో, ఎవనిని మహాఋషులు కూడా చూడలేరో, సకలభూతాల విషయంలోనూ ఎవరు సమంగా ప్రవర్తిస్తారో, అలాంటి పరమాత్మ నుండే ఈ జగత్తు ఏర్పడింది. భూమి అతని పాదాలు. చంద్రుడు మనస్సు. అగ్ని ముఖం. కన్నులు సూర్యచంద్రులు. చెవులు దిక్కులు. వీర్యం జలం. త్రిమూర్తులకు మూలమితడే. అతని గర్భంలో జగత్తంతా దాగి ఉంది. ఆకాశమే అతని తల - ఇలా ప్రకాశించే ఆ పరమాత్మునికి నమస్కరిస్తాను.

ఏ పరమాత్ముని బలంచేత ఇంద్రుడు, అనుగ్రహంచేత దేవతలు, కోపం వల్ల రుద్రుడు, పౌరుషంచేత బ్రహ్మ అవయవాల నుండి వేదాలు, మునులు, పురుషావయవం నుండి ప్రజాపతి, వక్షస్థలం నుండి లక్ష్మీదేవి; నీడ నుండి పితృదేవతలు; రొమ్మునుండి ధర్మం; వీపు నుండి అధర్మం; తలనుండి స్వర్గం, నవ్వునుండి అప్పరసలు, గుహ్యావయవం నుండి బ్రహ్మ; ముఖంనుండి బ్రాహ్మణులు, భుజాలనుండి రాజులు, తొడలనుండి వైశ్యులు; పాదాలనుండి శూద్రులు; క్రింది పెదవినుండి లోభం, పైపెదవినుండి ప్రేమ; ముకుపుటాల నుండి కాంతి, స్పర్శవల్ల కామం, కనుబొమలనుండి కాలధర్మం, పక్కనుండి కాలం పుట్టాయి. అతని యోగమాయనుండే ద్రవ్యం, కర్మలు, గుణ విశేషాలు ప్రభవించాయి. నాలుగు విధాలైన జీవరాసుల పుట్టుక అతని స్వయం నిర్మాణ చాతుర్యమే; లోకాలు, లోకపాలకులు అతనినుండే పుట్టి వృద్ధి పొందుతుంటారు. దేవతలకు ఆయుస్సు, బలమూ ఆయనే. ప్రజలను పుట్టించి, వారి రక్షణం కోసం పుట్టిన యజ్ఞయాగాదుల కోసం జన్మించిన అగ్ని దేవుడూ ఆయనే. సముద్రంలోని ధాతుసమూహమంతా ఆయన సృష్టే సకల సృష్టీ ఆయనలోనే నిండి ఉంది. ముక్తికి ద్వారమూ అతనే. చావు బ్రతుకు రెండూ అతని రూపాలే. చరాచరప్రాణి సంఘానికి చైతన్యదాత ఆయనే. తేజస్సు, మనోబలం, బలం, వాయురూపాలతో, ప్రాణుల అవయవాలలో, ఆత్మలో, శరీరంలో నిండి ఉండి - అంతటా వ్యాపించిన మహా 'విభూతి' స్వరూపం ఆయనదే. ఆ పరమశక్తియుతుడు మాపై దయజూపు గాక!

చెట్టుకు పాదులో నీళ్ళుపోస్తే చిటారుకొమ్మలలోనూ, కాండంలోనూ(చివరికి వేళ్ళలో కూడా) చల్లదనం పొంది ఆనందిస్తుంది. అలాగే విష్ణుదేవునికి మొదట నమస్కరిస్తే సకలదేవతలు, నేను (బ్రహ్మ) సంతోషిస్తాము.

(మంత్రాలను 'హరిఃఓమ్‌” అని ప్రారంభించడంలోని అర్ధం ఇదే. పూజానంతరం 'సర్వం శ్రీకృష్ణార్ణణమస్తు' అనటంలోని రహస్యమూ ఇదే. శ్రీహరి సకలదేవతారూపుడు.

'సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి' అని అనటంలోని వివేకం ఇదే. నదులన్నీ సముద్రంలో కలిసిన విధంగా దేవతలందరికీ చేసిన పూజలు ఆ మహానారాయణ తత్త్వానికే చివరికి చెందుతాయి.)

ఓ దయానిలయా! తేజోరూపా! పుణ్యాత్మా! ఆపదలో ఉన్నవారూ, నిన్ను చూడాలని తపించేవారూ నీ ముఖ కమలాన్ని చూడగానే తక్షణమే సమయమెరిగి సంపదలను పొందుతారు. నీ ముఖ దర్శనం కల్గించు స్వామీ!

అని ఈ విధంగా దేవగణాలతో కూడి అనేక విధాలుగా కీర్తిస్తున్న ఆ బ్రహ్మదేవుని కరుణించి మిక్కిలి దయాగుణం కల్గిన వారిలో శ్రేష్ఠుడైన విశ్వగర్భుడు (పరమాత్ముడు) అక్కడ ఉదయించాడు (కనిపించాడు)

వేయి సూర్యులకాంతి ఒకచోట చేర్చి పోతపోసినట్టు, ఆ కాంతులన్నీ ఒకేసారి వచ్చినట్టు హరి అక్కడ ప్రత్య క్షం కాగా దేవతల చూపులు చెదిరిపోయాయి. విషాదం పొందారు. తేరిపార చూడటానికి సాహసించలేదు. కొంతసేపు అలాగే ఉండిపోయారు. ఆ తేజోరూపాన్ని చూడటానికి వాళ్ళకు సాధ్యమా!

ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు దివ్యమైన హారాలతో, కిరీటంతో భుజకీర్తులతో, కాలి అందెలతో, మొలనూలుతో, కంకణాలతో, కౌస్తుభమణినితో, శంఖ చక్ర గదాది ఆయుధాలతో దర్శనమిచ్చాడు. మరకతం లాంటి అతని దేహం, పద్మాలవంటి కన్నులు, కుండలాల కాంతితో మెరుస్తున్న చెక్కిళ్లతో, బంగారురంగు పట్టువస్తంతో, కంఠంలో వనమాలతో మిక్కిలి సుందరంగా ప్రకాశిస్తున్న దివ్యసౌభాగ్య రూపుడైన ఆ స్వామివారిని రుద్రాది దేవతలతోపాటు బ్రహ్మ తాను కూడా దర్శించి సంతోషంతో పొంగిపోయాడు. వినయంతో ఈ విధంగా స్వామివారిని స్తుతించటానికి పూనుకొన్నాడు.

('వనమాల' అంటే వెజయంతి మాల అని కొందరు అంటారు. కాబట్టి తులసీమాలనే వనమాల అనటం సంప్రదాయంగా ఉంది.)

సృష్టి స్థితి లయములు లేనివానిని, ఋషులచేత నిరంతరం పొగడబడేవానిని; మోక్షసౌఖ్యసముద్రుని, చిన్నవాటికన్నా చిన్నవాడును; గొప్పవాటికన్నా గొప్పవాడుగా ప్రకాశించే ఆ పుణ్యాత్ముని, మహానుభావుని ప్రస్తుతిస్తాను.

ఓ పురుషోత్తముడా! అన్ని లోకాలలోనూ నీ రూపం పరమశ్రేష్ఠమైంది. ఆ రూపం శాశ్వతమైన వేదసంబంధం కూడి మాకు మీయందే కనిపిస్తున్నది.

కుండకు మట్టి ఎలా ఆధారమవుతున్నదో అలాగే నువ్వు ఈ సృష్టికి ఆది మధ్యాంతాలు అవుతున్నావు. నీ విశ్వరూపంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అర్థం.

నీవు నీ యోగమాయతో ఈ ప్రపంచాన్ని పలుమార్లు సృష్టించి అంతటా నీవే నిండి ఉంటావని వైదిక రహస్యం తెలిసిన పరమయోగులు గుణాతీతుడైన నీ అవతార మహిమను సగుణరూపంతో 'విష్ణువు' గా కనుగొంటారు.

ఈ భూమిలో అన్నాన్ని; గోవులలో పాలను; కట్టెలలో అగ్నిని; ఎలా పొందుతారో అలాగే యోగమార్గంలో ఆత్మజ్ఞానవిదులు బుద్ధిచేత నిన్ను ఈ విశ్వంలో చూస్తారు.

(అన్నం 'భూమిలో' కనిపించదు. 'పాలు' ఆవులో కనిపించవు, అలాగే 'అగ్ని' కట్టెలలో కనిపించదు. 'బుద్ధి' ద్వారా(వివేకం) వీటిలో 'గుణ' రూపంగా ఇవి పరిణామంలో బయట పడుతున్నాయని జ్ఞానులు గుర్తిస్తారు. భగవత్‌ తత్త్వమూ అంతే. విశ్వంద్వారా 'ఆత్మ' స్వరూపాన్ని ఇలాగే గుర్తిస్తాం.

కట్టెను మథిస్తేనే నిప్పు పుడుతుంది; భూమిలో వ్యవసాయం చేస్తేనే ఆహారం పుడుతుంది. అలాగే ఆవుకు గడ్డివేసి పితికితేనే పాలు వస్తాయి - ఈ ప్రయత్నాలవంటిదే భగవంతుని గుర్తించడానికి గుణప్రకృతుల రూపంలో పనిచేస్తున్న 'కర్త' మరొకటి ఉందని గుర్తించడం కూడా. దానికి 'యోగమే' సాధనం.

మేము ఏ ఆశ్రయమూ లేక చాలా విధాలుగా క్రుంగిపోయాము. చిట్టచివరికి నిన్ను దర్శించాము. ఇక మా కష్టాలు తీరినట్టె. మా కోరిక తప్పక నెరవేరుతుంది. ఇప్పటి మా పరిస్థితి ఎలా ఉందంటే - మిక్కిలి వేడిమితో కూడిన కార్చిచ్చులో కాలిపోతున్న ఏనుగుల గుంపు ఉప్పాంగుతున్న నదిలోని నీటిని చూసినట్టుగా సంతోషంగా ఉంది.

(ఇంతకు మునుపు వర్ణించినట్టు స్వామి దయాసముద్రుడు. ఆ దయాగుణమే ఇక్కడ గంగానది. రాక్షసుల బాధలు కార్చిచ్చు. ఇంత గంభీరమైన 'ఉపమా' సామగ్రిని పోతనగారు యథామూలంగా గ్రహించి భాగవతాన్ని రామాయణ భారతాలతో సదృశంగా తీర్చిదిద్దారు.)

ఓ విశ్వసాక్షీ! నీకు మేము కొత్తగా చెప్పవలసింది ఏముంది! నీకు తెలుసుగదా! లోకాన్ని అంతటినీ నిరంతరం చూస్తూ ఉంటావు నీవు. నీ పాదదర్శనం మాకు శుభాల్ని కల్గిస్తుంది. అగ్నిలోని విస్ఫులింగాలలాగా నేను, లోకపాలకులు, ఈ దేవతలు - అందరం నీలోని అంశాలమే.

ఈ విధంగా బ్రహ్మాదులు స్వామివారికి విన్నపం చేశారని చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్పాడు.

ఈ విధంగా బ్రహ్మాది దేవతలు స్తుతించగా, సంతోషించిన వాడై, పులకరించిన శరీరాలు కలిగినవారు; అప్పుడే కష్టాల నుండి గట్టెక్కిన వారు ప్రేమపాత్రులు, ప్రారబ్ధమనే భయంకరమైన సముద్రాన్ని చిలకడానికి, కోరికతో ఉన్న దేవతలను చూచి, నిండుగా మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు.

(క్షీరసాగరమథన కథాసారాంశాన్ని అంతా ఈ పద్యంలోని ఒక మాటలో ఇమిడ్చి పోతనగారు నిరూపించారు. ఆ అంశమే 'ప్రారబ్ధమనే' 'సముద్రం' చిలకడమనేది. రాక్షసులు, దేవతలు చిలికింది క్షీరసాగరాన్ని కాదు. తమతమ ప్రారబ్దాలనే. దానికి అనుగుణమైన ఫలితాన్ని పొందారు.)

ఓ బ్రహ్మా! ఓ ఇంద్రా! ఓ రుద్రా! ఓ దేవతోత్తములారా! దానవులతో ఈ సమయంలో పోరాటం లేకుండా స్నేహంతో బ్రతకటమే తగినపని.

అది ఎలాగంటే (ముందు చెబుతున్నాడు).

తనకు ఎప్పటికి బలం సిద్ధిస్తుందో(అనువు దొరుకుతుందో) అందాకా శత్రువును చూస్తూ కూడా ఎలుక గమనించకుండా పాము ఎలా దాక్కుని ఉండి ఒక్కసారి పైన పడుతుందో; అలాగే తమ ఉనికిని సంరక్షించుకోవాలి.

దేవతలారా! ఒక మార్గం ఉంది. తొలుత అమృతాన్ని ఉత్పాదనం చేయటానికి ప్రయత్నించటం తగినపని. ఎందుకంటే అమృతం తాగిన ప్రాణులకు దీర్ఘాయుస్సు కలిగి మృతిలేని రీతిగా బతుకగలుగుతారు(మరణాన్నే జయిస్తారు).

స్వామి పాలసముద్రం ఎలా చిలకాలో చెబుతున్నాడు. “క్షీరసముద్రంలో అన్నివిధాలైన తృణాలను, లతలను, ఓషధులను దండిగా సంపాదించి వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని కవ్వపు తాడుగా సిద్ధం చేసుకొని, వెంటనే, నా సహాయంతో మీరందరూ (రాక్షసులతో కలిసి అని) జాగ్రత్తగా చిలకండి. మీదట దాని ఫలితం లభిస్తుంది. పాపచింతన కల్గిన దానవులు చాలా దుఃఖాల పాలవుతారు. మీరు ఇబ్బంది పడకుండానే అన్ని సంపదలూ పొందుతారు. సముద్రంలో విషం పుడుతుంది. మనసులు వికలం చేసుకొని భయపడి పారిపోకండి. ఎన్నో వస్తువులు పుడతాయి. వాటికోసం కోరికలూ కినుకలూ వద్దు.

అని ఆదేశించిన వాడై, ఆద్యంతరహితుడు, నాశరహితుడు అయిన శ్రీమహావిష్ణువు ఈ విధంగా వారిని ఆజ్ఞాపించి మాయమయ్యాడు. అంత బ్రహ్మ, రుద్రుడు దేవతలను వీడ్కొని తమతమ స్వస్థానాలకు వెళ్ళిపోయారు.

ఇక దేవతలు యుద్ధం చేయటానికి ఇష్టపడక బలి చక్రవర్తిని చేరి స్నేహంగా ఉంటూ నమస్కారాలు పెడుతూ; కానుక లిస్తూ, అతడు దేవద్వేషి అని తెలిసినా, వాడికి అనుకూలంగా ఉంటూ సేవలు చేశారు.

ఇలా బలహీనులుగా తనకు వశవర్తులుగా మంచితనం నటిస్తూ సేవిస్తున్న దేవతల్ని, కసి పెరిగి రాక్షసులు చంపేద్దామని ముందుకు రాగా, రాజనీతి తెలిసిన బలిచక్రవర్తి నేర్పుతో వారిని వారించాడు.

ఆ విధంగా చంపడానికి సిద్ధమైన రక్కసిమూకను నివారిస్తూ బలి చక్రవర్తి ఇలా చెప్పాడు.

శత్రువులు శరణు వేడినప్పుడు ధీరులైనవారు తమ పరాక్రమం చూపరాదు. సమయాన్ని గమనించాలి. అందుచేత దేవతలపైన ఇప్పుడు మనం పరాక్రమం చూపరాదు.

కొలువుకూటంలో రాక్షసులంతా బలిచక్రవర్తిని చుట్టుముట్టి సేవిస్తుండగా; ఆ బలి అన్ని లోకాల రాజ్యాలను గెలుచుకున్న వైభవంతో, సకల దేవతా వీరుల్ని జయించానన్న అహంకారంతో సుఖంగా కొలువుతీర్చి సంతోషపడుతుండినాడు. అప్పుడు ఇంద్రుడు మంచి మంత్రిలాగా బలిని చూచి ఓదార్పుమాటలు చెప్పి అతనికి శాంతి కల్గించాడు. శ్రీహరి బోధించిన నీతి మార్గాన్ని అనుసరించి అక్కడ చేరిన రాక్షస ప్రముఖులైన శంబరుడు, అరిష్టనేమి, త్రిపురాసురులు; జంభుడు, హయగ్రీవుడు, నముచి, తారకుడు, బాణుడు, విప్రచిత్తి, శకుని, విరోచనుడు, ప్రహేతి, మయుడు, మాలి, సుమాలి, కుంభుడు, నికుంభుడు, పౌలోముడు, కాలకేయులు, నివాతకవచులు, వజ్రదంష్ట్రి మొదలైన వారిలో ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా స్నేహం ప్రకటించి వశుల్ని చేసుకొని ఇలా అన్నాడు. “అక్కా చెల్లెండ్ల సంతానమైన మనమధ్య పగ తగదు. కలిసికట్టుగా ఒకే లక్ష్యసిద్ధికోసం పనిచేసి ఎదురులేకుండా బ్రదుకుదాం. మనలో ఒకరి నొకరు ద్వేషించుకోవటం ఎందుకు? ముందు ఇలా విరోధం పెట్టుకునే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇకముందు దేవతలకు, రాక్షసులకు బలిచక్రవర్తే రాజు. అందరం కలిసి అతని ఆజ్ఞను పాటిద్దాం. మన రెండు వంశాలు వృద్ధిపొందే ఉపాయం చెబుతానని క్షీరసాగర మథనం ఎలా చేయాలో తెలియజెప్పాడు. ఆ తరువాత దేవతలు రాక్షసులు ఇంద్రుని, బలిని నాయకులుగా గ్రహించి గొప్ప పూనికతో అమృతాన్ని సంపాదించాలని నిశ్చయించుకొని, ఐకమత్యంతో, త్వరితగతిన, మందరపర్వతం దగ్గరికి వెళ్ళారు.

దేవతలు రాక్షసులు దేవతల శిల్పి త్వష్ట పదునుపెట్టిన గునపాలతో(తవ్వుగోలలతో) కొంత తవ్వారు. రోకండ్లను లోనికి చొప్పించి అడుగున దిగబడిన కొండను కదిల్పారు. పొడుగాటి తాళ్ళతో బిగించి కట్టారు. ఆ కొండను మెల్లగా కుళ్ళగించి, చేతులతో గట్టిగా పట్టి కదిలించారు. తమ తమ పేర్లు, బిరుదులు ప్రకటిస్తూ, బిగ్గరగా కేకలు వేస్తూ, కొండను ఊడబెరికి పైకి ఎత్తుకొని బలమైన తమ చేతులతో, తలలతో, భుజాలతో కొండ జారకుండా ఆని పట్టుకున్నారు. మెల్లగా కదులుతూ తప్పటడుగులు వేస్తూ 'బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి' అంటూ గబగబా ఆ కొండను సముద్రం వైపుకు మోసుకొని తీసుకువచ్చారు.

దేవదానవులు ఆ మందరపర్వతాన్ని మోయలేకపోవటంచేత అది ఆశ్చర్యకరంగా అందరిమీదా పడిపోయింది. కొందరు భూమిమీద పడి చనిపోయారు. కొందరు నుగ్గునుగ్గయ్యారు. కొందరు భయంతో పరిగెత్తారు.

శ్రీహరి దగ్గరికి ఎందుకు వెళ్ళాము? ఆయన మాట మీద ఈ పనికి ఎందుకు పూనుకొన్నాము? ఎందుకింత పెద్ద పర్వతాన్ని లీలగా ఊడబెరికి తెచ్చాము? ఎందుకింత మంది మధ్యలో చనిపోయారు? ఇదంతా మన ప్రారబ్ధం కాక మరేమిటి?

ఆయన మనకు ఈ పని ఎందుకు పెట్టాడు? మన బోటివారికి ఇంతలేసి పెద్ద పనులు ఎందుకు? (ఊరికే ఉండక అని) ఇంకా ఆ శ్రీపతి మనకు సహాయంగా రాలేదేమిటి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకు మనల్ని మరచిపోయాడు?

ఆ మందరపర్వతం పడిపోవటం వల్ల పుట్టిన కష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖిస్తున్న దేవదానవుల భయాన్ని అందరిలోనూ వ్యాపించి ఉండే ఆ శ్రీహరి మనసులో గుర్తించినవాడై వారి సమీపంలో ప్రత్యక్షమయ్యాడు.

శ్రీహరి గరుడునిపై కూర్చొని, దయతో, కోటిసూర్యుల కాంతితో ప్రకాశిస్తూ, గదాద్యాయుధాలు ధరించి వారి ముందు ప్రత్యక్షమై 'అరే! ఎందుకు భయపడతారు?' అంటూ లీలగా ఒక చేతితో బంతిలాగా ఆ కొండను తీసుకొని ఆడుకోవటం ప్రారంభించాడు. దయామృతం నిండిన చూపులతో వారిని కాపాడాడు.

దేవదానవులు శ్రీహరిని సేవిస్తుండగా; 'క్షీరసముద్రానికి తీసుకుపో' అని స్వామివారు సెలవివ్వగానే గరుత్మంతుడు తనమూపుపై స్వామిని, ఆ పర్వతాన్ని అవలీలగా ధరించి అతి శీఘ్రంగా పాలకడలి దగ్గరికి ఎగిరిపోయాడు.

వెళ్ళి హరిని గిరిని ఆ సముద్రతీరంలో దించి, స్వామికి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించి గరుత్మంతుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు.

ఆ సమయంలో...

ఓ రాజా! ఆ తరువాత దేవాసురులు సర్పరాజైన వాసుకిని పిలిపించారు. అతనితో మంచిమాటలు మాట్లాడి; అమృతంలో నీకూ భాగమిస్తామని చెప్పి, అతనిని ఒప్పించి; తమ చేతులతో నెమ్మదిగా ఆ వాసుకి శరీరాన్ని నిమిరి (పాము కాబట్టి); 'నీవు తప్ప ఈ పనికి ఎవరయ్యా తగినవారు? ఒప్పుకో'అని అతనిని ఒప్పించి, మందరపర్వతాన్ని బాగా చదునుగా చేసి, వాసుకి పడగల్ని పట్టుకొని శరీరాన్ని ఆ కొండకు చుట్టారు. అమృత సముద్రాన్ని కలశంగా తీర్చారు. బాగా ఆలోచించి పంచెలుపైకి ఎగగట్టి; జుట్లు ముడివేసుకొని, ఆ రెండు గుంపులవారు కలిసి చిలకటం ప్రారంభించారు.

ఆ తరువాత

శ్రీహరి, దేవతలు ఆ వాసుకి పడగల్ని పట్టుకోవడానికి సిద్ధపడుతుండగా, రాక్షసులంతా చేరి అతిశయంతో ఇలా మాట్లాడసాగారు.

“మీరంతా స్వచ్చంగా ఉండే పడగల్ని పట్టుకొని చిలుకుతుంటే మేము తోకను పట్టుకోవడమా! మేము కూడా(మీలాగా) పౌరుషం కలవారమే. మీలాగా మేమూ తపస్సు, బలము, చదువు, పౌరుషం కలిగిన వాళ్ళమై ఉండి నీచమైన ఈ పనికి (తోకను పట్టుకోవడానికి) ఏల ఒప్పుకుంటాం? మాకు పడగలే ఇవ్వండి” అన్నారు

అని పలుకు రాక్షసులను చూసి విష్ణువు(శ్రీహరి) ఆశ్చర్యంగా వారిని చూసి సరే అలాగే అంటూ పడగను వదిలివేశాడు. రాక్షసులు నవ్వుతూ గెలిచినట్టు కేకలు పెట్టారు. దేవతలు వినయంగా తోకను పట్టుకున్నారు.

ఇలా ఎవరెవరు ఏయే చోట నిలబడి లాగాలో నిర్ణయం చేసుకొని, దేవతలు తోకను, రాక్షసులు పడగలను పట్టుకొని, ఆ క్షీరసాగరం మధ్యలో పర్వతాన్ని ఉంచి, మిక్కిలి పూనికతో, అమృతం కోసం చిలుకసాగారు.

('పూర్వదేవతలు' అంటే దేవతలకన్నా పూర్వులు, పెద్దవారు అనే అర్థం. 'కశ్యపనందనాః (8-7-5) అని మూలంలో ఉన్నది. కశ్యపప్రజాపతికి దితితో దైత్యులు, అదితితో దేవతలు జన్మించారు. పెద్దవారు కాబట్టి పూర్వదేవతలు అయ్యారు.)

ఆ సమయంలో వాసుకి గట్టిగా 'వదలండి వదలండి' అని కేక పెట్టాడు. అడుగున ఏ ఆధారమూ (కుదురు) లేకుండా ఉంచటం చేత, అధిక భారానికి ఆ పర్వతం బుడబుడమని ధ్వనిచేస్తూ సముద్రంలో మునిగిపోయింది. దాన్ని చూచి సమస్తమూ గడగడ వణకి పోసాగారు.

దాని బరువు చాలా ఎక్కువ కావటం చేత బలవంతులే అయినా దేవదానవుల బలం ఆ పనికి చాలలేదు. వారు పౌరుషహీనులయ్యారు. చాల సిగ్గుపడ్డారు. బలహీనులై సముద్రతీరాన పడిపోయారు. ప్రబలమైన విధిని దాటడానికి ఎవరికీ సాధ్యం కాదు కదా!

శ్రీహరి అలా సముద్రజలాల్లో మునిగిపోతున్న ఆ కొండనూ, చింతాసాగరంలో మునిగిపోతున్న దేవతల్ని చూసి, సముద్రమధ్యంలో వారందరూ చూస్తుండగా

No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...