Monday, March 23, 2026

The Pralayam (great deluge or dissolution) in the Matsya Avatar Started - మత్స్యావతార ప్రళయకాల ప్రారంభం

మత్స్యావతార ప్రళయకాల ప్రారంభం

అటు పిమ్మట ప్రళయం సమీపించింది.

మెరుపులతోకూడిన మేఘాలు ఎడతెరపిలేకుండా భయంకరమైన వర్షం కురిపించినాయి. సముద్రాలు చెలియలికట్టలు దాటి పొంగిపొరలి దేశాలను ముంచివేసినాయి.

ఓ రాజా! బ్రహ్మకల్పం యొక్క అంత్యకాలంలో ఏర్పడిన ఆ ప్రళయం నైమిత్తికమైనది. ఆకాశంలో ఎగసిపడుతున్న అలలుగల ప్రళయకాల జలరాశిలో సకలభూతరాశులు కూలిపోయినాయి. లోకాల సరిహద్దులు మాయమైనాయి.

(ప్రళయం ఐదువిధాలు. అవి దైనందినం, బ్రాహ్మం, ఆధిభౌతికం, నిత్యం, నైమిత్తికం అనేవి. నిత్యం, నైమిత్తికం, దైనందినం, మనుప్రళయం, మహాప్రళయం అని కూడా కొందరు చెప్తారు. జలప్రళయం(ఉప్పెన), అగ్నిప్రళయం(దహనం), పృథివీప్రళయం(భూకంపం), వాయుప్రళయం (వాయుగుండం), ఆకాశప్రళయం(కుంభవృష్టి) అనే పాంచభౌతిక ప్రళయాలూ ఉన్నాయి.)

ఓ రాజా! బ్రహ్మదేవుడు విశ్రాంతిలేకుండా పూనికతో ప్రాణులను సృష్టించి సృష్టించి అలసిపోయినాడు. ఆయన నడుమూ వీపూ బిగుసుకుపోయినాయి. అతడు నీలుగుతూ ఆవులిస్తూ సృష్టికార్యాన్ని ఆపినాడు. శరీరాన్ని వాల్చి రెప్పలుమూసుకొని చెయ్యి తలగడగా ఉంచుకొని గురకలు పెడుతూ కలలుకంటూ నిద్రపోయినాడు.

బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి నిద్రించినాడు. ఆయన నోళ్ల నుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడనే ఒక రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించినాడు. ఆతని దరిచేరటానికి ఇతరులకు సాధ్యమా?(సాధ్యంకాదు.)

(హయగ్రీవుడు అనే దేవుడు విష్ణువు అవతారంగా పురాణాలలో కీర్తింపబడినాడు. అతడు జ్ఞానానంద స్వరూపుడు. సర్వవిద్యలకు ఆధారమైనవాడు. ఇక్కడి దానవుని పేరుకూడా హయగ్రీవుడే. ఇతడు జ్ఞాననిలయాలైన వేదాలను బ్రహ్మదగ్గరనుండి దొంగిలించినవాడు.)

వేదాలను చేజిక్కించుకొన్న రాక్షసుడు వాటిని చదువుతూ, బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడినాడు. బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం కనిపెట్టి వాడు వేగంగా సాగరంలోకి ప్రవేశించినాడు.

ఆ ప్రళయకాలంలో వేదాలను అపహరించి సముద్ర జలాలలో మునిగి దాగిన ఆ రాక్షసుడిని జయించడమూ, ఓషధులూ విత్తనాల పొట్లాలు సముద్రంలో తడిసిపోకుండా రక్షించడం ఈ రెండూ పురుషోత్తముడగు విష్ణుదేవునకు కర్తవ్యా లయినాయి. ఆ పురుషోత్తముడు ఆ మహారాత్రి ప్రవేశించే సమయాన

విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించినాడు. చిన్న రెక్కలూ పెద్ద మీసాలూ పొట్టితోకా బంగారు కాంతులీను మేనూ, అందమైన మచ్చలూ చక్కనిమొగమూ ఒక కొమ్మూ మిరుమిట్లు కొలిపే చూపులు కలిగి ఆ మహామత్స్యం విరాజిల్లుతున్నది.

ఆ విధంగా విష్ణుమూర్తి లక్షఆమడల పొడవైన మత్స్యరూపం ధరించి సముద్రంలో ప్రవేశించినాడు.

మత్స్యావతారుని క్రీడలు అద్భుతంగా ఉన్నాయి. తళతళలాడే పెనుచేప రూపంతో ప్రళయ జలాలలో వేదాలను వెదకటానికి పూనుకొన్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. ఒకసారి ఆకసానికి ఎగురుతాడు. ఒకసారి నీళ్లలో ఒదిగి దాగుతాడు. ఒకసారి సముద్రంలో మునిగితేలుతాడు. ఒకసారి బ్రహ్మాండాన్ని ఒరుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపలగుంపును మింగుతాడు. ఒకసారి నీళ్లను పీల్చి వెలుపలికి చిమ్ము (ఉమ్ము)తాడు. ఇలా ఆ మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదలిస్తూ, మేనిపొడలు మెరపిస్తూ, కన్నులకాంతులు ప్రసరిస్తూ, ఒడలు విరచుకుంటూ, తళతళలాడుతూ సముద్రగర్భంలో విహరించినాడు.

సత్యవ్రతుడు నారాయణుని స్మరిస్తుంటాడు. ప్రళయ సముద్రం భూలోకాన్ని ముంచెత్తే సమయం వచ్చింది. శ్రీహరి ప్రేరణతో ఒక ఓడ అక్కడకు వచ్చింది. ఆ ఓడను చూచినాడు సత్యవ్రతుడు.

సత్యవ్రతరాజు ఓడపై పెక్కు ఓషధులను విత్తనాలను అమర్చినాడు. విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ మునులతోపాటు నావపై కూర్చున్నాడు. భయంతో సముద్రంపై తేలిపోతున్నాడు. అప్పుడు ఆ రాజుకు భక్తుల హృదయాలను అలంకరించే విష్ణుమూర్తి మహామత్స్యరూపంతో ఎదుట సాక్షాత్కరించినాడు.

సత్యవ్రతుడు ఒక పెద్దపామును తాడుగాచేసి ఆ ఓడను మహామత్స్యంకొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకొన్నాడు. ఋషులతోపాటు అతడు విష్ణుమూర్తిని ఇలా పొగడసాగాడు.

ఓ భగవంతుడా! తమలో ఆవరించిన అజ్ఞానంవల్ల కొందరు భ్రాంతితో తిరుగుతుంటారు. మునుగుతూ కల్లోలపడుతూ పెక్కుదారులవెంట పరుగులు తీస్తుంటారు. అలాంటివారు అదృష్టంవల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి కైవల్యాన్నిపొంది సంతోషిస్తుంటారు. అలా అందరినీ ఆదరించేనీవు మమ్ములను రక్షించు.

ఓ లక్ష్మీపతీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తుంటావు. జ్ఞానం లేనివానికి దుర్బుద్ధికలవానికి తండ్రివి నీవే. కనుక కనులున్నవాడు కనులులేనివానికి దారిచూపిన రీతిగా మమ్ములను ఉద్ధరించు. గురుడవై మాకు దారిని చూపించు.

శ్రీహరీ! అగ్నితో చేరడంవల్ల బంగారానికి రంగు / మెరుగు కలుగుతుంది. ఆ విధంగానే నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై ముక్తి లభిస్తుంది.

లక్ష్మీరమణా! నీ అనుగ్రహంలో పదివేలవంతులో ఒక లేశభాగంవల్ల దేవేంద్రపదవి కలుగుతుందట. ఇక నీకు మెప్పుకలిగిస్తే లభించనిభాగ్యం ఏముంటుంది?

దయాసముద్రుడా! పనికిమాలినవానిని గొప్పవాడనుకొనిపోతే అతడు పనికిమాలిన మార్గాన్నే చూపిస్తాడు. ఆ దారిలో వెళ్లినవాడు చెడిపోతాడు. నిన్ను నమ్మి మంచిదారిని నడవగలిగితే సందేహంలేని మంచి స్థానాన్ని పొందుతాడు.

నారాయణా! నీవు చెలికానిగా చుట్టంగా జ్ఞానస్వరూపునిగా మానవుల మనస్సులలో మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభువువై కోరికలు నెరవేరుస్తావు. అలాంటి నిన్ను ఆదరించక లోకం పెక్కింటిపై పేరాసతో పరుగులు తీస్తుంది. అదృష్టం లేనివాడు బంగారు రాశి దొరకినా దక్కించుకోలేడు కదా!

కర్మఫలానికి కట్టుబడి సముద్రంలో మునిగి కూరుకపోయిన లోకం ఏ మహానుభావుని చేత ఎప్పటికప్పుడు మేలుకొంటుందో అలాంటి మహానుభావుడవు నీవు. మాకు గురుడవయ్యావు.

ఓ సర్వేశ్వరా! మా విజ్ఞాపము వినవయ్యా. నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి తీసుకొని వెళ్లుమని దేవదేవా! నిన్ను వేడుకొంటున్నాను.

ఈ విధంగా సత్యవ్రతుని ప్రార్ధనను ఆలకించి మత్స్యావతారుడై సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించినాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగశాస్త్రాలతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించినాడు. మునీశ్వరులతోపాటు సత్యవ్రతుడు పరమపురుషుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ధన్యుడైనాడు. సత్యవ్రతుడు ఈ కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో జన్మించి విష్ణుమూర్తి దయవల్ల ఏడవమనువైనాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతమూ ఆ విధంగా విష్ణువు మత్స్యరూపంతో తిరుగుతున్నాడు.

ప్రళయసముద్రంలో వ్యర్థమై మునిగి ఉన్న వేదాల దైన్యస్థితిని అవి మొరపెట్టుకోగా మీనావతారుడగు విష్ణుమూర్తి విన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరచినాడు. ఉత్సాహంతో తోక ఊగించినాడు. మేను మెరిపించినాడు. దౌడలు చక్కచేసికొన్నాడు. మీసాలు కదలించినాడు. పిడికిటిపోటుతో కొండలను పిండి చేయగలవాడు, దుర్జనుడు అయిన హయగ్రీవుని హతమార్చినాడు.

ఎప్పుడు తెల్లవారునా అని ఆతురులై ఎదురుచూస్తున్న మునీశ్వరులకు సంతోషకరంగా వేకువ కనిపించింది. మెలకువశక్తితో నిద్రిస్తున్న సరస్వతిలేచి బ్రహ్మ ప్రక్కన కూర్చొని జారిన పయ్యెదకొంగును సవరించుకొన్నది. నిద్రవలన ప్రళయకాలంలో మసకబారిన బ్రహ్మాదేవుని ముఖం ప్రకాశించింది. జీవులు సంపాదించుకొన్న పూర్వపుణ్యాలు ఆయన కడకన్నులకు కనిపించినాయి. బ్రహ్మదేవుడు తన అవయవాలను కదలించినాడు. ఆవలించి నిదుర నుండి మేల్మొన్నాడు. కొద్దిగా నీలిగినాడు, ఒత్తిగిలినాడు, ఒడలు విరుచుకొన్నాడు. కన్నులు నులుముకొన్నాడు. తిరిగి సృష్టి చేయటం కోసం సిద్ధమై కూర్చున్నాడు.

భగవానుడు విష్ణువు హయగ్రీవుని చంపి వాడు దొంగిలించిన వేదాలను చిక్కునుండి విడిపించినాడు. వాటిని మేల్కొన్న బ్రహ్మాదేవునికి దయతో అప్పగించినాడు.

విష్ణుమూర్తికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించినాడు. ప్రళయ సముద్రంనుంచి బయటపడినాడు. మనువు అయినాడు. విష్ణువును పూజించక ఎక్కడైనా ఐశ్వర్యం ప్రాప్తిస్తుందా? (ప్రాప్తించదు.)

రాజర్షి అయిన సత్యవ్రతుడూ, మీనరూపుడైన శ్రీపతీ ప్రవర్తించిన ఈ పవిత్రగాథను విన్నవారు బంధాలనుంచి విముక్తిని పొందుతారు.

ఓ రాజా! ప్రతిదినం మత్స్యావతార కథను శ్రద్ధతో చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు. ఆతని కోర్కెలూ నెరవేరుతాయి. ఇది సత్యం సుమా!

(పై రెండు పద్యాలలో మత్స్యావతార కథకు 'ఫలశ్రుతి' చెప్పబడినది.)

ప్రళయకాల సముద్రంలో మేనుమరచి నిద్రించిన బ్రహ్మాదేవుని ముఖాలనుండి వెలువడిన వేదాలను దొంగిలించిన రాక్షసునిచంపి, సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలియచేసి, అన్నింటికి మూలమై, మత్స్యావతారంతో సాగరాన మునుగుతూ తేలుతూ సంచారం చేసి ప్రకాశించే విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను.

ఈ విధంగా శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునకు చెప్పినాడు.

శ్రీరామా! నీవు రాజేంద్రుడవు. దైత్యులు-దానవులు అనబడే రాక్షసులు అనే అరణ్యాలను దహించినవాడవు. రాజులు, రాజులలో ఉన్నతులు కూడా నిన్ను గౌరవించినారు. చంద్రధారిఅయిన శివునిచేత పూజించబడినవాడా! సద్గుణసంపన్నా! రఘువంశలలామా రామా!

(దితి తనూజులు దైత్యులు. దనువు తనూజులు దానవులు)

రక్కసులను తెగటార్చినవాడా! వేల్పులకు మేలుచేయువాడా! (దుష్టులచే బరువెక్కిన) భూమిభారాన్ని తొలగించువాడా! పుణ్యాత్ములను కాపాడువాడా! నిర్మలమైన శుభకరమైన రూపం కలవాడా! ఆత్మీయులను పోషించేవాడా! స్వచ్చమైన గొప్ప కీర్తకలవాడా! ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆదరించేవాడా!

॥ శ్రీకృష్ణార్పణమస్తు 

No comments:

Post a Comment

History of Emperor Sagara - సగర చక్రవర్తి కథాప్రారంభము

సగర చక్రవర్తి కథాప్రారంభము బాహుకుడు తన శత్రువులు తననోడించి రాజ్యం ఆక్రమించగా తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్దాప్యం కారణంగా మరణించాడు. అతనిభా...