Thursday, March 12, 2026

Sanaka, Sanandana, Sanatana, and Sanatkumara (the Four Kumaras) cursed Vishnu’s gatekeepers, Jaya and Vijaya - శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట

శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట

ధర్మరాజా చాలమంది కామం, ద్వేషం, భయం, స్నేహం, సేవ అనే లక్షణాలలో ఏదో ఒకటి మిక్కుటం కాగా శ్రీహరి సంబంధం పెట్టుకొని ఆయనలో ఐక్యమయ్యారు. శ్రీహరిని గూర్చి పైన చెప్పిన క్రోధాదులైదింటిలో ఒక్క లక్షణమైనను లేకపోవడంచేత వేనుడు వ్యర్జుడై భ్రష్టుడై నశించాడు.

మీ పినతల్లి కుమారులైన శిశుపాల దంతవక్త్రులు పూర్వం విష్ణుమూర్తి మందిరానికి ద్వారపాలకులు. బ్రాహ్మణశాపం వల్ల వారు వారి పదవులను కోల్పోయి భూలోకంలో జన్మించారు. అని నారదుడు చెప్పగా విని ధర్మరాజు నారదునితో ఇలా అన్నాడు.

ఓ నారదా! బ్రాహ్మణోత్తములు ఈ ద్వారపాలకులపై కోపించడానికి కారణం ఏమిటి? ఆ విప్రులు ఎవరు? నిత్యవైకుంఠ నివాసులైన ఈ ద్వారపాలకులు సామాన్యులు కారని వీరు విష్ణువుపై స్థిరభక్తిగలవారు, విష్ణువే పరతత్త్వంగా ఆరాధించే అనన్య భక్తిపరులు, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం గలవారు, సంసారబంధానికి చిక్కనివారు, నిరంతరం పరమాత్మను అనుసరించి ప్రవర్తించేవారు అని నేను విని ఉన్నాను. అటువంటి వారికి ఇటువంటి నీచజన్మలు ఎలా ప్రాప్తించాయి. వినాలని కుతూహలంగా ఉంది (అన్నాడు ధర్మరాజు).

నారదుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు. ఒకనాడు బ్రహ్మమానస పుత్రులైన సనకసనందనాదులు దైవవశాన మూడులోకాలు తిరుగుతూ ఐదారేండ్ల బాలకులలాగా దిగంబరులై హరిమందిరం అయిన వైకుంఠానికి వచ్చారు. వాళ్లు లోనికి ప్రవేశించే సమయంలో ద్వారం ముందు కాపలా ఉన్న ఇద్దరు పురుషులు ఈ బాలకులను చూచి

ఓ ధర్మరాజా! మిక్కిలి దైవవిశ్వాసంతో, స్వామిగుణకీర్తనం ఆసక్తితో చేస్తూ, నిర్మల మనస్సుగల బాలరూపంతో, వున్న సనకసనందనాదులను, విష్ణుమూర్తి నివాసంలోనికి వెళ్ళనీయకుండా ఆ ద్వారపాలకులు తరిమివేశారు.

ధర్మరాజా! ద్వారపాలకులు సనకసనందనాదులను లోనికి వెళ్ళకుండ అడ్డగించగా; విష్ణుదర్శనం చేసికోవాలన్న కుతూహలంతో ఉన్న విప్రులు సహించలేక "మీరు తప్పక రాక్షసయోనిలో జన్మింతురు గాక" అని ఆవేశంతో(తిట్టారు) శపించారు.

బాలకులు జ్ఞానవృద్దులు అయిన సనకసనందనాదులు ఆ ద్వారపాలకులను చూచి, మీరిద్దరు ఇక్కడ ఉండటానికి అర్హులు కారు. విష్ణుచరణాలను విడిచిపెట్టి రజోగుణతమోగుణాలు కలిగిన రాక్షసవంశంలో పుట్టుండని శపించారు. వారు ఆ శాపంవల్ల ద్వారపాలక పదవినుండి భ్రష్టులై, సనకసనందనాదులను ప్రార్ధింపగా, ఆ మహాత్ములు దయగలవారై వెంటనే కరుణించి, "మీకు మూడు జన్మలలో విష్ణువుపై వైరంతో భగవత్‌ సాన్నిధ్యం లభిస్తుంది" అని చెప్పి వెళ్ళిపోయారు.

ఆ విధంగా శాపంవల్ల మొదటి జన్మలో ద్వారపాలకులు ఇద్దరూ దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులనే పేర్లతో జన్మించారు. వారిద్దరిలో హిరణ్యాక్షుణ్జి, హరి వరాహరూపంతో సంహరించాడు. హిరణ్యకశిపుడు నరసింహరూపం ధరించిన విష్ణువు చేతిలో మరణించాడు. ఆ హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు, తండ్రి హింసించినా కూడా మానకుండా నారాయణ పదార్చనాతత్పరుడై శాశ్వతకీర్తిని పరమపదాన్ని పొందాడు.

రెండవజన్మలో ఆ ద్వారపాలకులు కైకసి అనే రాక్షసికి, రావణ కుంభకర్ణులై జన్మించగా, విష్ణుమూర్తి రఘుకులంలో శ్రీరామచంద్రుడై అవతరించి వారిని సంహరించాడు. ఆ రాముని అమోఘపరాక్రమాన్ని మార్కండేయమహర్షి ద్వారా నీవు వింటావు.

పిదప మూడవజన్మలో వారిరువురు మీ పినతల్లికి శిశుపాలదంతవక్త్రులనే పేర్లతో జన్మించారు.

ఆ ద్వారపాలకులు మూడు జన్మలలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, చివరగా శిశుపాల దంతవక్త్రులుగాను జన్మించి, తీవ్రమైన పగతో, విష్ణుమూర్తిపై ఎప్పుడూ క్రోధాన్ని చూపుతూ, ఆ కోపంలో నిత్యం ఆయననే స్మరిస్తూ, వారి పాపాలన్నీ ఆ విష్ణుస్మరణంతో నశించగా, శ్రీకృష్ణునిచక్రంచేత శిరస్సులు ఖండింపబడగా, అప్పటికి వారికి సనకసనందనాదులు ఇచ్చిన శాపంయొక్క గడువు పూర్తికాగా, వైకుంఠంలో విష్ణుమూర్తికి సమానమైన రూపాలతో సమీపవర్తులై చరించారు.

అని నారదుడు పలుకగా విన్న ధర్మరాజు ఇలా అన్నాడు.

ఓ మహాత్మా! నారదా! తన సుతుడు చిన్న వయసువాడు కదా! నిరంతరహరిపదధ్యానతత్పరుడు, గుణవంతుడు, మంచి బుద్దిగలవాడు అయిన కుమారుని చూచి సంతోషించక, హిరణ్యకశిపుడు ఎందుకు శిక్షించాడు?

నరసింహస్వామి చరిత్ర కథనాలు, అందరి వ్యథలను పోగొట్టగలవు. అగాధమైన సంసారసముద్రాన్ని పూర్తిగా మథించగల నేర్పుగలిగినవి. దేవతలు యక్షులు నాగులు మొదలైన సమస్త జాతుల స్త్రీపురుషులను రక్షించగలవి (కాబట్టి ఆ నరసింహుని గూర్చి వినాలన్న కుతూహలం ఇక్కడ స్పష్టమవుతోంది.)

మునీంద్రా! నాకు వినిపించు అనగా నారదుడు ఇలా అన్నాడు. విష్ణుమూర్తి చేతిలో తన సోదరుడైన హిరణ్యాక్షుడు చనిపోయాడని విని, హిరణ్యకశిపుడు కోపంతో, దుఃఖంతో కుమిలిపోతూ భయంకరమైన కార్చిచ్చు జ్వాలలవంటి చూపులతో ఆకాశంలో పొగలు ఎగిసిపడేలాగా చూచి, మెరుపులు మెరుస్తున్నట్లుగా మిరుమిట్లు గొలిపేలా, పెదవులు కొరుకుతూ, కనుబొమలు ముడివడి భయం గొలిపే ఫాలభాగంతో, ఆపడానికి వీలులేని తీవ్రమైన కోపంతో కాంతులు చిందే శూలాన్ని చేతబట్టి, సభలో నిలబడి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలైన రాక్షసులను చూచి ఇలా అన్నాడు.

ఓ దానవ మిత్రులారా! ఈ కఠోరవార్తను విన్నారా? నా సోదరుడు, మీ స్నేహితుడు, యుద్ధ విద్యానిపుణుడు బాహుబలంతో దేవయక్షులను ఓడించినవాడు అయిన హిరణ్యాక్షుణ్ణి, అతని భార్యల సౌఖ్యాలు వ్యర్థం అయ్యేలా శ్రీహరి మహావరాహరూపాన్ని ధరించి వధించి పోయాడట!

వరాహరూపంగా - ఈ వరాహరూపంగాడు అడవులలో, నీళ్ళలో ఉంటాడు. అవిసె చెట్లలో చరిస్తాడు. ఇతడి పుట్టుక ఎవ్వరికీ తెలియదు. వీడి అడుగుల జాడలుకూడా తెలియవు. సమీపిస్తే ఎదుర్కొంటాడు, కృషిస్తేగాని దొరకడు. కనుక ఏదో ఒక ఉపాయంతో మనమందరం వాడికి దొరకకుండా వాడే మనకు దొరకాలంటే ఏం చేయాలి?

విష్ణురూపంగా ఘోణికాడు - ఇతడు సామాన్య వరాహం కాదు. నారాయణుడు కనుక ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉంటాడు. మునీశ్వరుల హృదయాలలో సంచరిస్తాడు. ఇతని జన్మ కర్మ రహస్యాలు ఎవ్వరికీ తెలియవు. ఇతని ఉనికి ఒకింతయు ఎక్కడో తెలియదు. ఇతన్ని ఆశ్రయిస్తేనే ఇతడు లభిస్తాడు. మన మనస్సు ఈయనకు లోబడితేనే ఈయన మనకు దొరుకుతాడు.

(జాగ్రత్తగా పరిశీలించి చూస్తే హిరణ్యకశిపుడు వరాహావతారాన్ని ధరించిన విష్ణువును నిందిస్తున్నట్లు కనిపిస్తున్నా ఆంతర్యంలో విష్ణుమూర్తి సర్వవ్యాపకత్వం అనే నిజస్థితి కన్పడుతుంది. 'ఘోణిగాండు అన్న మాట నిందార్థకం. దానికిది వ్యంజకం. “వ్యాజస్తుతిర్ముఖేనిందా స్తుతిర్వారూఢిరన్యధా” పైకి నిందగా కన్పిస్తున్న ఈ పద్యంలో, అంతర్వాహినిగా విష్ణుతత్త్వం  ప్రవహిస్తూంది. సంస్కృత మూలంలో లేని క్రొత్తపోకడగా ఈ పద్యం మనకు కానవస్తుంది.)

ఆ విష్ణుమూర్తి నాతో యుద్ధం చేయడానికి భయపడి భూమిపై నిలువలేక సముద్రంలో మునిగి (మత్స్యం మాదిరి) దాగవచ్చునుగాక. చలించని నా సంభ్రమానికి పరుగెత్తి వెన్నిచ్చి (తాబేలు) పారిపోవుగాక. నాతో పోరాడలేక సౌకర్యంగా (పంది) భూమికింద దాగిన దాగుగాక. ఈ పై విధములుగా కాకుండా పౌరుషంతో నాపై సింహం(నరసింహ రూపం) లాగా నాతో యుద్ధంచేసినా చేయుగాక. ఏది ఏ విధంగా జరిగినాసరే కఠినంగా, పదనుగా ఉండే నా శూలంతో విష్ణువు కంఠాన్ని తెగనరికి; వాని రక్తంతో నా సోదరుడైన హిరణ్యాక్షునికి తర్పణం చేసి నా ప్రతాపంతో తిరిగివస్తాను. ఓ రాక్షసమిత్రులారా! మీకు క్షేమాన్ని కలిగిస్తాను.

(ఈ పద్యం పోతన కవిత్వచాతుర్యానికి తార్కాణం. హిరణ్యకశిపుని పలుకులలో పైకి విష్ణుమూర్తిపై గల క్రోధాన్ని తెలియజేస్తున్నట్లున్నా పరిశీలించి చూస్తే విష్ణుమూర్తియొక్క అవతార విశేషాలు ధ్వనిస్తాయి. అది ఎలాగో గమనిద్దాం. మొదటిపాదంలో 'మున్నీట మునిగిన మునుగుగాక' అనేవాక్యం విష్ణుమూర్తియొక్క మత్స్యావతారాన్ని ధ్వనింపజేస్తుంది.

రెండవపాదంలో 'అచల సంభ్రమము' అనేచోట 'అచలము' అను పదానికి 'పర్వతం' అనే అర్ధం ప్రతీయమానమై 'వెన్నిచ్చిన ఇచ్చుగాక' అనుచోట మంథర పర్వతాన్ని మోయడానికి 'వెన్నును ఇచ్చిన కూర్మావతారం' ధ్వనిస్తోంది.

మూడవపాదంలో 'సౌకర్యకాంక్షియై' అనేచోట సూకరశబ్దం వరాహపర్యాయపదం గాబట్టి 'సౌకర్యకాంక్షియై' “యిలక్రింద నీంగిన నీంగుంగాక” అను పదాలవల్ల ఇలను పైకెత్తిన వరాహావతారం స్ఫురిస్తోంది. నాల్గవపాదంలో 'కొంతపౌరుషమున' అనుచోట కొంతమేర(నరుడు) పురుషుడుగా కన్పించి “హరిభంగి” అనే పదం ద్వారా “సింహం” స్ఫురించి సమీప 'నరసింహ' అవతారం ధ్వనిస్తోంది.)

ఒక వృక్షం మూలాన్ని ఖండించేసరికి దాని కొమ్మలు అన్నీ శక్తిహీనమై ఎండిపోయినట్లుగానే; యుద్ధంలో విష్ణువు ఓడిపోగా, అతడే వారందరికీ ప్రాణసమానుడుగాన దేవతలందరూ కూడా యుద్ధంలో ఓడిపోతారు.

ఓ రాక్షసులారా! మీరందరు గుంపులు గుంపులుగా బ్రాహ్మణులు నివసించే ప్రాంతాలకు పొండి. యజ్ఞము, తపస్సు, స్వాధ్యాయాలతో ఉన్న వారిని, మౌనవ్రతం చేసేవారిని వెదకి చంపండి. విష్ణువు అనగా వేరు కాదు. యజ్ఞం, వేదం విష్ణువే. బ్రాహ్మణుల క్రియాకలాపాలకు అతడే ఆధారం. ఆ విష్ణువే, దేవలోక, ఋషిలోక, పితృలోకాలకు, ధర్మాలకు అతడే గొప్ప ఆధారం. ఏ ఏ ప్రాంతాలలో గోవులు, బ్రాహ్మణులు, వేదాలు, వర్ణధర్మాలు ఆశ్రమధర్మాలు ఆచరింపబడుతూ ఉంటాయో ఆ యా ప్రాంతాలకు మీరువెళ్ళి మీ గర్వం ఉట్టిపడేలా వాటిని బుగ్గిపాలు చేసిరండి.

హిరణ్యకశిపుడు ఈ విధంగా ఆదేశించగా అతని ఆజ్ఞలు తలదాల్చి రక్కసులు భూలోకానికి వెళ్ళి,

రాక్షసులు భూమిలోగల గ్రామాలు, పెద్దనగరాలు, పుణ్యక్షేత్రాలు, చిన్నగ్రామాలు, వాడలు, పల్లెలు, తోటలు మొదలైనవన్నీ వెదికి, సరస్సులు పాడుచేసి, పెద్ద ప్రహరీలు, గోపురాలు, వారధులు త్రవ్వి, జమ్మి, మారేడు మొదలైన పవిత్ర వృక్షసమూహాలు నరికి, పెద్ద పెద్ద భవనాలు, చలివేంద్రాలు, గృహాలు, పర్ణశాలలు పాడుచేసి, సాధుసమూహం, గోసమూహం, బ్రాహ్మణసమూహాలకు కీడు కలిగించి, వేదమార్గాలు చెడగొట్టి, భూతలాన్నంతటినీ ఆటోపంతో పాడుచేయగా, దేవతలందఱు  తమ తమ ఆకారాలు చెడినవారై స్వర్గాన్ని విడిచి అరణ్యాలలో ప్రవేశించారు.

హిరణ్యకశిపుడు చాలా దుఃఖించి చనిపోయిన తనసోదరుడు హిరణ్యాక్షునికి తిలోదకాలు మొదలైన ఉత్తరక్రియలు చేశాడు. హిరణ్యాక్షుని కుమారులైన శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ మొదలైనవాళ్ళను ఓదార్చాడు. వాళ్ళ తల్లిని, హిరణ్యాక్షుని మిగిలిన భార్యలను పిలిపించాడు. తమ తల్లియైన దితిని చూచి ఇలా అన్నాడు.

ఓ తల్లీ! ఈ ప్రపంచంలోని జనులందరూ చలువపందిరిలో కలుసుకొని కొంతసేపు కలిసియుండి తరువాత ఎవరికి వారు వెళ్ళిపోయేవారే. ఒకే చోటనే ఎల్లకాలం కలసి ఉండటం జరుగని పని. ఇది సత్యం. నీ కుమారుడైన హిరణ్యాక్షుడు మహాశూరుడు. అతడు వీరులు ప్రయాణించే మార్గంలో వెళ్ళాడు. అతని మరణానికి నీవు దుఃఖించే పనిలేదు.

(నదీ ప్రవాహంలో రెండు కట్టెలు కొంతదూరం కలసి విడిపోతాయి. అలానే సంసార ప్రవాహంలో ఎందరో కలుస్తుంటారు. విడిపోతుంటారు.)

పరమాత్మ సర్వజ్ఞుడు, ప్రభువు, సర్వాత్ముడు, నాశము లేనివాడు, స్వచ్చమైనవాడు, సత్యస్వరూపుడు, అంతము లేనివాడు, శ్రేష్ఠుడు ఎల్లప్పుడు ఆత్మరూపంతో తన మాయాప్రవర్తనవల్ల త్రిగుణాలను కల్పించి వాటి కలయికతో లింగశరీరాన్ని ధరిస్తూ ఉంటాడు. కదులుతూ ఉన్న నీటిలో పడిన చెట్లనీడలు కదలుచూ ఉన్నట్లు కనబడినట్లుగా, భ్రమకు లోనైన మానవుని కళ్లకు భూమి కదలుతున్నట్లు కనబడినట్లుగా, వికలభావాలు లేని ఆ ఆత్మమయుడు తాను కదలని వాడైనప్పటికీ కదలుతూ ఉన్న అంతరంగాలలో కదులుతూ ఉన్నట్లు కనిపిస్తాడు. అంతే తప్ప వాస్తవానికి అతడు కదలిక లేని అచలుడు.

(ఇక్కడ హిరణ్యకశిపుడు తల్లిని ఓదారుస్తూ భగవంతుని లీలావిభూతి తత్త్వాన్ని వివరించాడు.)

No comments:

Post a Comment

Creation of the universe by Svayambhuvamanu - స్వాయంభువమను సృష్టి

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - స్వాయంభువమను సృష్టి నారాయణ డిట్లనెను: నారదా! ఆ ప్రకారముగ విష్ణువు తన శతబాహూవులతో భూమిని యథాస్థానమున నెలకొల...