Monday, March 16, 2026

The discussion between Prahlada Maharaja and an Ajagara - ప్రహ్లాదాజగర సంవాదము

ప్రహ్లాదాజగర సంవాదము

రాజా! పూర్వం అజగరుడు అనే మునికి; హరిభక్తుడైన ప్రహ్లాదునకు మధ్య నడిచిన సంవాదం, నీకు నేనిపుడు చెప్పే అంశాలకు సంబంధించిందే. దానిని శ్రద్ధగా విను.

మహాభక్తుడైన ప్రహ్లాద చక్రవర్తి పూర్వం లౌకిక తత్త్వం తెలుసు కోవాలనుకొన్నాడు. కొందరు మంత్రులను వెంట తీసుకొని లోకసంచారం చేయసాగాడు. అలా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరం చేరుకొన్నాడు. అక్కడ సహ్యపర్వతాలు విస్తరించి ఉన్నాయి. ప్రహ్లాదుడు ఆ పర్వతసానువులలో సంచరిస్తుండగా, ఆ ప్రదేశంలో దుమ్ము కొట్టుకొని పోయిన దేహంతో అజగరుడనే ముని శయనించి ఉన్నాడు. శరీరం ధూళితో నిండి ఉన్నా ఆయన అద్భుతమైన తేజస్సు నిగూఢంగా వెలుగుతున్నది. కార్యంవల్ల కానీ, ఆకారంవల్ల కానీ, మాటవల్ల కానీ, లింగభేదంవల్ల కానీ వర్ణాశ్రమాదులవల్ల కానీ, ఏమాత్రం గుర్తించటానికి వీలులేకుండా కొండ చిలువవలె నిర్వికారంగా నేలపై పడుకొని ఉన్నాడు. ప్రహ్లాదుడు మహామహిమాన్వితుడైన ఆ మునీశ్వరుని సమీపించి యథా విధిగా పూజించి నమస్కరించాడు. ఆ మునీశ్వరుని పవిత్ర చరిత్ర తెలుసుకోవాలని నిశ్చయించుకొని ఇలా పలికాడు.

ఋషివర్యా! లోకాన పనీ పాటా చేస్తూ, అన్నపానాదులను అనుభవిస్తూ ఉండే వానివలె పెద్దదేహం ధరించి ఉన్నావు; కాని కదలవు; మెదలవు; చిత్రం! పని చేసేవానికే ధనం వస్తుంది. ధనవంతునకే భోగం కలుగుతుంది, సుఖం అన్నపానాదులు ఉన్నవానికే నిండైన దేహం ఉంటుంది. పని, ధనం, సుఖం-ఏవీలేకుండ నీకు ఈ సాటిలేని తేజోవంతమైన దేహం ఎలా కలిగింది? సమాన భావంతో, పాండిత్యంతో, బుద్ధిబలంతో వెలిగే నీవు ఎవరినీ పొగడవు; అట్లని తెగడవు కూడ. మరి ప్రతిదినం ఇలా నిద్రలో కాలం గడుపుతున్నావేమిటి?

ప్రహ్లాదుని సుమధురమైన మాటలను వినిన అజగర మునీంద్రుడు విప్పారిన ముఖంతోను చిరునవ్వుతోనూ చూస్తూ ఇలా బదులిచ్చాడు.

రాక్షసోత్తమ! పుణ్యచరితా! సజ్జన సమ్మతి బడసిన నీవు, లో చూపుతో సర్వజ్ఞుడివి! నీకు తెలియని ప్రవృత్తి నివృత్తి ధర్మాలు లేవు. దేవుడయిన శ్రీహరి నీ మనస్సులో సూర్యునివలె వెలుగుతూ, చీకట్లు హరించి వేయగా, నీవు పరమ సత్త్వగుణసంపన్నుడవైనావు. శుభశీలుడవైన నీవు, నన్ను కోరినావు గావున నేను విన్న ధర్మమంతటిని నీకు వివరిస్తాను. నిన్ను చూడటం నీతో మాట్లాడంతో ఆత్మశుద్ధి కలుగుతుంది.

విషయ సుఖాలచేత తృప్తి పొందక పరుగులుపెట్టే దురాశ వెంటబడి నేను కర్మబంధాలలో చిక్కుకొని సంసార చక్రంలో పరిభ్రమించాను. నానా జన్మలూ ఎత్తాను. మరణించాను. ఈ పరిభ్రమణంలో చిట్ట చివరకు ఎట్ట కేలకూ మనుష్య దేహం ధరించాను. ఆ జన్మలలో ధర్మాలూ, పుణ్యాలూ చేసి స్వర్గ ద్వారాలు చేరుకొన్నాను. అధర్మాలూ, పాపాలూ చేసి శునక, సూకరాది జంతువుల యోనులలో పుట్టి నానా బాధలూ పడ్డాను. మరలా ఆలోచించి మానవ జన్మ ఎత్తాలి అనే వివేకంతో సుఖ సంపాదన కోసం, దుఃఖ నివారణ కోసం ధర్మం చేసే దంపతులను దర్శించాను. సమస్తక్రియల నుంచీ నివృత్తి పొందిన జీవుడు స్వతంత్రుడై ప్రకాశిస్తాడని నిర్ణయించుకొన్నాను. భోగాలు కోరికల వల్ల జనించేవే కాని శాశ్వతాలు కావని పరీక్షించి నిర్ణయించుకున్నాను. కర్మబంధాలనుంచి నివృత్తి పొంది, ఏ ప్రయత్నమూ, ఏ కోరికా లేకుండా ఇలా నిద్రిస్తూ, ప్రారబ్ద భోగాలు అనుభవిస్తూ పడి ఉన్నాను.

ఈ విధంగా తనకు కావలసిన సుఖరూపమైన పురుషార్థం తన లోనే జన్మిస్తుందని పురుషుడు తెలుసుకోలేక పోతున్నాడు. పరిశుద్ధ జల ప్రవాహాన్ని విడిచిపెట్టి ఎండమావుల వెంటపడి పరుగెత్తే మూర్ఖునివలె జీవుడు అసత్యమైన ద్వైతంలో పడిపోతున్నాడు. ఘోర సంసార చక్రంలో పడి తిరుగుతున్నాడు. దైవ తంత్రాలైన దేహాదులచేత ఆత్మకు సుఖమునూ, దుఃఖనాశనమునూ కోరుకొనే నిరీశు డైనటువంటి వాని ప్రయత్నాలు నిష్ఫలా లవుతాయి. అదీకాక నరునకు ధనం ప్రాప్తిస్తే అది దుఃఖం కలిగిస్తుందే తప్ప సుఖం కలిగించదు. లుబ్ధులైన ధనవంతులు నిద్రాహారాలు మాని ప్రభువులనూ, యాచకులనూ, చోరులనూ, శత్రువులనూ, మిత్రులనూ అందరినీ అనుమానిస్తూ, దానం చేయటం, అనుభవించటం మరచిపోతారు. నిత్యం దుఃఖంతో బాధ పడుతుంటారు. ప్రాణంమీద, ధనంమీద తీపిఉన్న వాళ్ళను నిత్యం భయం వెంటాడుతూ ఉంటుంది. శోకం, మోహం, భయం, క్రోధం, రాగం, శ్రమ, మున్నగు వానికి కోరికలే కారణం. కాబట్టి కోరికలు లేకుండా ఉండటం శ్రేయస్కరం.

తేనెటీగలు సంపాదించే తేనె మానవుల పాలవుతుంది. లోభులు కూడబెట్టిన సంపద పరులపాలవుతుంది. అయితే సర్పం దొరికినది తిని, తన దీర్ఘదేహాన్ని చిరకాలం నిలుపగలుగుతుంది. ఈ రెంటి జీవనాన్ని చూచి నేను ఏకాంతంగా.

కొండచిలువను, తేనేటీగను గురువులుగా భావించి వాటి జీవనాన్ని అనుకరిస్తూ ఏకాంతంగా సర్వక్రియలు విడిచి ఏ చింతా లేక జీవిస్తున్నాను.

చర్మాలైనా, నారబట్టలైనా, సన్ననిమంచిదుస్తులైనా ధరిస్తాను; ధరించకుండానైనా సంతసిస్తాను; పల్లకీలు, రథాలు, గుర్రాలు, ఏనుగలపై ఎక్కిగాని ఎక్కకగాని సంచరిస్తుంటాను; కర్పూరం, శ్రీగంధం, కస్తూరి-వీటి పూతనైనా, నేలదుమ్మునైనా, ఒడలికి పూసుకుంటాను; బంగారు పాన్పులమీదైనా, ఆకులమీదైనా, రాళ్ళమీదైనా, గడ్జిమీదైనా, బూడిదమీదైనా పడుకుంటాను. ఇక భోజనం, తియ్యనైనా, చేదైనా, ఎక్కువైనా, తక్కువైనా, గౌరవంగా పెట్టినా, అవమానంతో పెట్టినా (సమానభావంతో) స్వీకరిస్తాను.

లేదు అని ఎవరినీ అడుగను; దొరకలేదని విచారించను; ఇతరులు తెప్పించిన ఏ వస్తువునైనా వద్దని అనను. మనస్సున ఖేదమోదాలకు అతీతంగా ఆడుకుంటాను.

రాజా! నా ప్రవర్తనలో అతి ఉండదు; ఏనాడూ పరులను దూషించను; పలుబాధలు కలిగినా దుఃఖించను; మనస్సున ఏడ్వను; అట్లని సంపదలకు ఆనందించను కూడ.

ఈ విధంగా ఏ కోరికా లేకుండా పూర్వం కొన్నాళ్ళు దిగంబరంగా పిశాచంలాగా ప్రవర్తిస్తుండేవాణ్ణి. ఇపుడు చాలా రోజులనుంచీ పెద్ద కొండ చిలువలాగా కళ్లు మూసుకొని భావం భగవంతుని పాదపద్మాలపై కేంద్రీకరించి ఇలా ఉండిపోయాను. భ్రాంతిని భేదభావం చూపే చిత్త వృత్తులలోనూ, చిత్తాన్ని అర్థరూపాలపై పరిభ్రమించే మనస్సులోనూ, మనస్సును అహంకారంలోనూ, అహంకారాన్ని మాయలోనూ, మాయను ఆత్మానుభూతిలోనూ కేంద్రీకరించి విలీనం చేశాను. అది మొదలు సత్యదర్శనం చేస్తూ విరక్తి పొందాను. స్వానుభవంతో ఆత్మస్థితి అలవాటు చేసుకొన్నాను. ప్రహ్లాదా! నీవు భక్తశిఖామణివి కాబట్టి ఈ రహస్యమైన పరమహంస ధర్మాన్ని నాకు తెలిసినంతవరకు నీకు అర్ధమయ్యేలాగా చెప్పాను. అని అజగరముని అన్నాడు.

ధర్మరాజా! అజగరమునిశ్రేష్ఠుని పూజించి, అతనిని వీడ్కొని, మనస్సు నిండిన ఆహ్లాదంతో నిండగా తన యింటికి ప్రహ్లాదుడు వెళ్ళాడు.

అని నారదుడు పలుకగా మళ్ళీ ధర్మరాజు ఇలా అడిగాడు.

అజగర వృత్తాంత శ్రవణం తరువాత, ధర్మరాజుకు తనకూ అటువంటి స్థితి కావాలి అనిపించింది. దానికై తాను చేయవలసిందేమిటి? ఏ మార్గాన తానూ మోక్షాన్ని పొందగలనో వేగంగా తెలుపుమని నారదమునిని ప్రశ్నించాడు.

అని పలికిన ధర్మరాజుతో నారదవచనా లివి; సంసారి కృష్ణార్పణంగా ఇంటిపనులు నిర్వహిస్తూ మహర్షులను, కొలిచి, వారినుండి విష్ణుని అవతారకథలు వింటూ; ఆయా సమయసందర్భాలనుబట్టి, ప్రశాంతులయిన ఉత్తములతో కలిసి మెలుగుతూ కొడుకులు, మిత్రులు, భార్యల కలయికలు కలలుగా గ్రహిస్తూ, లోపల కోర్కె లేకుండ, బయట కార్యక్రమాలు చేస్తూ లంపటం మాని ధనదానంతో తల్లిదండ్రులను, కొడుకులను, తోబుట్టువులను, మిత్రులను, బంధువులను సంతోషాలలో తేల్చుచు, ధనధాన్యాలు, నిధులు అదృష్టాలవల్ల దొరికిన వానిపట్ల, అభిమానం లేక అనుభవిస్తూ, ఉదరపోషణకోసం ఇళ్ళుపాలాలల్లో దూరి దొంగిలించేవారిని శిక్షించకుండ, పాములు లేళ్ళు గాడిదలు ఒంటెలు మొదలైన జంతువులను హింసించక, కొడుకులవలె చూస్తూ, స్థల కాలదైవాలను అనుసరించి త్రిపురుషార్థాలు - ధర్మాచరణ, అర్థార్జన, కామ పరిపూర్తి చేస్తూ, కుక్కలు, చెడినవారు, అంటరానివారికైనా అన్నాది వస్తువులు అందిస్తూ, తన వృత్తివల్ల దొరికినవాటితో, దేవతలను పితరులను ఇతర జీవులను నరులను సంతృప్తిపరుస్తూ యాగవిశేషాలతో అంతర్గతుడైన తనను తాను పోషిస్తూ జీవనయాత్ర సాగించాలి.

(పంచ మహాయజ్ఞాలు : దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం.)

నరుడు డబ్బుకోసం తండ్రినైనా, గురువునైనాకూడా చంపడానికి వెనుకాడడు; ఆలికోసం ప్రాణమైనా అర్పిస్తాడు; అట్టి భార్యచేత, అతిధిసేవ చేయించి, అతడు జయింపరాని శివునిగూడ జయిస్తాడు.

సర్వజగన్నాథుడైన దేవుడు, బ్రాహ్మణుని నోటిద్వారా భుజించి సంతుష్టుడైనట్లుగా, యాగంలో అగ్నిద్వారా హవ్యరాసులు భుజించిగూడ సంతుష్టుడు కాడు.

కాబట్టి, గృహస్తు బ్రాహ్మణులలో, దేవతలలో, నరులలో, పశుపక్ష్యాది జీవులలోపల నివసించువాడూ, బ్రాహ్మణుడే(తన) ముఖంగా గలవాడు అయిన పరమాత్మకు కోర్కెలు సమర్పించి భోజనోత్సవం చేయాలి; భాద్రపదమాసంలో కృష్ణపక్షంలో, దక్షిణాయన, ఉత్తరాయణకాలాలలో, (కర్కాటక, మకర సంక్రమణాలలో) రేయింబగళ్లు సమానమైన సమయాలలో (విషువత్‌కాలంలో), అతిక్రమాలలో, తిథి తగ్గినపుడు, సూర్యచంద్రగ్రహణసమయాలలో, శ్రవణనక్షత్ర కలిసిన ద్వాదశినాడు, వైశాఖమాస శుక్షపక్ష తృతీయనాడు, కార్తికమాస శుక్లపక్ష నవమినాడు, హేమంత శిశిర ఋతువులలో నాల్గు శ్రాద్ధకాలాల్లో, మాఘ శుక్షసప్తమినాడు, తమ తమ జన్మనక్షత్రాలతో గూడిన పూర్ణిమలలో, ద్వాదశితోకూడిన ఉత్తరాత్రయ (ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర) శ్రవణ, అనురాధ నక్షత్రాలలో ఉత్తరాత్రయంతో కూడిన ఏకాదశులలో తమ తమ జన్మ నక్షత్రాలు వచ్చిన రోజులలో మరియు ఇతర పుణ్యకాలాలలో చనిపోయిన తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలూ, జపహోమవ్రతాలు; సమారాధనలు చేయాలి; ఆలికి పుంసవనమూ, శిశువునకు జాతకర్మలు, తనకు యాగదీక్ష, పోయినవారికి దహనాదిక్రియలూ, చనిపోయిన తిథినాడు సాంవత్సరికం జరపాలి.

రాజా! ఎక్కడ, దయతో, సద్గుణాలతో, తపస్సుతో, చదువుతో గూడిన విప్రులుంటారో, ఎక్కడ గంగ ఇతర ముఖ్యనదులు ప్రవహిస్తాయో, ఎక్కడ అత్యధికంగా శ్రీహరి పూజలు జరుగుతుంటాయో, అక్కడ ధర్మాచరణ చేయటం ఉచితం. ఉత్తమం.

అనఘా! శ్రీహరి ఉదరంలో విశ్వం విస్తరించి ఉంటుంది. అటువంటి శ్రీహరి సాధు పురుషులలో ఉంటాడు. సత్పాత్రు లున్నదేశం పుణ్యప్రదేశం కాబట్టి దేశ, కాల, పాత్రలను గుర్తించి అవి ప్రాప్తించిన వెంటనే ఆ అవకాశం జారవిడువకుండా పుణ్యకార్యాలు చేయాలి.

రాజా! పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధాలు, కురుక్షేత్రం, గయ, ప్రయాగ, పులహాశ్రమం, నైమిశం, ఫాల్గుణం, రామసేతువు, ప్రభాసతీర్థం, కుశస్థలి, వారణాసి, మధురానగరి, పంపబిందుసరస్సులూ నారాయణ సీతారామ ఆశ్రమాలు; మహేంద్ర మలయాది కులపర్వతాలూ, హరిమూర్తులుగల క్షేత్రాలు, హరిభక్తులు నివసించే స్థలాలూ-ఇవి అన్నీ ప్రశస్త పుణ్యక్షత్రాలు. క్షేమాన్ని కోరేవాడు వీటిని సేవించాలి.

రాజా! ఈ పుణ్యక్షేత్రాలలో చేసే ధర్మకార్యం స్వల్పమయినా, హరిదయవల్ల వేయిరెట్లు అధిక ప్రయోజనాన్ని కల్గిస్తుంది.

విను. చరాచరజగత్తు హరిమయం కాబట్టి పాత్ర నిర్ణేతలు హరినే పూజకు ముఖ్యపాత్ర మన్నారు. దేవర్షులు, సనకాదులు కొలువై ఉండగా, రాజసూయంలో అగ్రపూజకు హరి అంగీకరించటం ఈ అంశానికి తార్కాణం. బ్రహ్మాండం అనేక జీవజాతుల సమూహాలతో విలసిల్లే మహావృక్షం. దానికి మూలం నారాయణుడు. కాగా, నారాయణ సంతర్పణమంటే సర్వజగజ్జంతు సంతర్పణ. జీవుల శరీరాలు పురాలు; వానిలో అధిక అల్పాంశ రూపాన వసించటంవలన అతడు పురుషుడని వ్యవహరించబడుతున్నాడు. అందుకే పురుషులలో విష్ణుదేహమయిన వేదాలను ధరించటంవలన బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. వారిలో ఆత్మజ్ఞానపరిపూర్ణుడయిన యోగి మరీ శ్రేష్ఠుడు. త్రేతాయుగంలో పరస్పర యోగ్యతలను సహించని నరులకు పూజనార్థమై హరిప్రతిమలు కల్పించబడ్డాయి. కొందరు ప్రతిమార్చన చేస్తారు. కొందరు చేయరు. పూజ్యులైనవారిని ద్వేషిస్తూ విగ్రహారాధన చేసేవారి పూజ ఫలప్రదం కాదు. కాని, జ్ఞానంలో అల్పాధికారులకు ప్రతిమా సమర్చన పురుషార్థసాధకమే.

రాజా! ఎల్లలోకాలకు విష్ణువు దేవుడు; పరిశీలిస్తే తనపాదధూళిలేశంతో ముల్లోకాలూ పవిత్రం చేసే విప్రుడు ఆ హరికి దేవుడు.

హరిని మించిన బ్రాహ్మణులలో, కర్మల తపస్సులో వేదశాస్రాలలో జ్ఞానయోగాలలో సిద్దులయినవారున్నారు. వారిలో జ్ఞాననిష్ఠునికి, సంసారికి, పితరులకోసం కవ్యాలు దేవతలకోసం హవ్యాలు సమర్పించాలి; దైవకార్యాలకైతే ఒకరిద్దరు, పితృకార్యాలకైతే, ఒకరిని లేదా ముగ్గురుని భోజనాలతో తృప్తిపరచాలి; ధనవంతుడైనా శ్రాద్ధకర్మలు విస్తరించరాదు; భోజనాలలో మాంసాదులు కూడదు, కందమూలాలు ప్రశస్తతరాలు; జీవహింసను మానుటకు మించిన ధర్మాచరణ లేదు. యాగవేత్తలు బాహ్యక్రియలను వదలి అంతర్ముఖులై జ్ఞానయోగంతో ధర్మాలు నిర్వహిస్తారు. అది అందరికి అనుసరించ తగింది.

రాజా! విప్రడు జంతువులను హింసించి చేసే యాగాలు చూచి మిగిలిన జీవప్రపంచం, తాము గూడ వాటివలె తెగిపడవలసి వస్తుందేమోనని కృశించి శోకిస్తాయి.

కాగా తత్త్వమెరిగినవాడు కందమూలాలతోనే తన నిత్యక్రియలు, నైమిత్తిక క్రియలూ చేసికోవాలి. స్వధర్మబాధకమైన పరధర్మచోదితమైన ఆచరణకు దూరంగా మెలగాలి; అట్లే వేదబాహ్యమైన ఆభాసమాత్రమైన అసంబద్ధమైన ధర్మాన్ని అతడు మానుకోవాలి. సహజధర్మం వల్ల పాపనాశనం గలుగుతుంది. ధర్మార్జనకై తీర్థయాత్రలు చేస్తూ కూడ ధనహీనుడు ధనాన్ని కాంక్షించరాదు. బ్రదుకు తెరువుకై లోకంలో పలువిధాల పరుగులు పెట్టటంమాని, ప్రాప్తలాభంతో జీవించే పెద్దపాములాగా సుఖశాంతులతో మెలగాలి. పాదరక్షలు, నడిచే వానిని కంటకాది బాధనుండి రక్షించేవిధంగా, కామరాహిత్యము నరుని జీవయాత్రాయాతనలనుండి కాపాడుతుంది. జిహ్వకు లోగి ఉపస్థకు దాసుడై పురుషుడు, ఇంటికాపలా కుక్కవలె వర్తిస్తూ సంతుష్టహీనుడై నశిస్తున్నాడు. అసంతుష్ట విప్రుని చదువుసంధ్యలు, కీర్తి వైభవాలు నిష్ప్రయోజనాలు. ఇంద్రియాలకు లొంగటంవలన జ్ఞానం నశిస్తుంది. ఆకలిదప్పుల వలన కోర్కెలను, హింసవలన క్రోధాన్ని నిర్ణించుట అసంభవం. కాబట్టి సంకల్ప త్యాగంతో కామాన్ని కామ త్యాగంతో క్రోధాన్ని సమ్యక్‌దర్శనంతో లోభాన్ని, అద్వైతభావంతో వెఱపును, ఆత్మవివేకంతో శోకాన్ని సత్త్వంతో దంభాన్ని, మౌనంతో యోగవిఘ్నాన్ని, వైరాగ్యంతో హింసను, ప్రాణాయామంతో మన్మథబాధను జయించి నరుడు ముక్తిమార్గాన పయనించవచ్చు.

రాజా! హరి మహిమను తనకు బోధించిన గురుని, మానవమాత్రునిగా భావించి ప్రవర్తించు నరుని శ్రమ మొత్తం గజస్నానంవలె తుదకు నిరర్ధకంగా ముగిస్తుంది.

రాజా! ఈ హరి ఈశ్వరుల కీశ్వరుడు, పురుషోత్తముడు, సురలకు శరణమైనవాడు, అయినా సజ్జన విధేయుడు, ప్రాక్తన యోగిపుంగవులచే సేవలందుకొనే చరణకమలాలు గలవాడు; కాని సామాన్యజనులు వివేకశూన్యులై ఈ మహాత్ముడిని మానవమాత్రునిగా భావిస్తున్నారు.

ఆరింద్రియాలలో ఒకదానిలో ఆసక్తులై, ఇచ్చాపూర్వక పద్ధతులతో యోగాభ్యాసులైనవారు సాధించేది శూన్యం. శ్రమించటం, కుటుంబపోషణకు తప్ప, మోక్షసాధనకు ఉపకరించదు. సాంసారపుపొత్తు చిత్తభ్రంశాన్ని గలిగిస్తుంది. కాబట్టి మనోవిజయప్రయత్నంతో తొట్టతొలుత సన్న్యసించాలి. బిచ్చపు మెతుకులతో శరీరధారణ చేస్తూ ఏకాంత ప్రదేశంలో ఆసీనుడై ఓంకారనాదం చేస్తూ ప్రాణ-అపానవాయువులను, రేచక పూరక కుంభకమైన యోగమార్గంలో నిరోధించి, మనఃపరిభ్రమణాన్ని మాని, నాసాగ్రాన దృష్టినిలిపి ఉంచితే, కట్టెలు లేని నిప్పువలె తుదకు చిత్తం శమిస్తుంది. ఆ ప్రశాంత నిర్మలచిత్తం, బ్రహ్మానందసుఖ సమాశ్లిష్టమై ఇక మరలిరాదు.

విప్రుడు సన్న్యసించి, పురుషార్థత్రయాన్ని విడిచిపుచ్చి, కొంతకాలం తరువాత, మరల పూర్వజీవనంలో ప్రవేశిస్తే, అపుడు, లోభాసక్తితో కక్కిన కూడు నాశించి తిరిగి తిన్నట్లుగా వాడు, హీనుడై పలువిధాల అపహాస్యానికి గురై జీవిస్తాడు.

ధర్మరాజా! మలంలోపడి క్రిమి ఉన్నట్లుగా ఉండే దేహం అది ఆత్మకాదు అది హేయమని ఆత్మజ్జులు తలుస్తారు. అజ్ఞులు దేహాన్నే ఆత్మగా తలచి దానిని ప్రశంసిస్తారు.

బ్రహ్మచారి తన వ్రతాన్ని మానరాదు. సంసారి తన నిత్యనైమిత్తిక క్రియలను మానరాదు. ఇక తపశ్చర్యలలో ఉన్నవానికి ఊరిలో నివాసం, సన్న్యసించినవారికి యువతితో పొత్తు తగదుగాక తగదు.

రాజా! ముక్తిరూప పరబ్రహ్మలక్ష్యాన్ని ఛేదించాలి-అంటే నరుడు ఇట్లా సంసిద్దుడు కావాలి; దేహం రథం; ఇంద్రియాలు గుఱ్ఱాలు; మనస్సు పగ్గాలు; ప్రాణం ఇరుసు; ధర్మ-అధర్మాలు చక్రాలు; వీటిని ఒకటిగా బంధించేది ప్రజ్ఞ ; బుద్ధి సారథి; ఇక జీవుడు రథంమీద ఉన్నవాడు; ఓంకారం ధనుస్సు; కేవల జీవుడు బాణం; వరసగా ప్రేమ, భయం, పొగరు, పగ, శోకం, ఆశ, మోహమత్సరాలు మొదలయినవి జయించవలసిన శత్రువులు.

(1. ఆత్మానం రథినం విద్ధి - శరీరం రథమేవచ ।
బుద్ధింతు సారధిం విద్ధి - మనః ప్రగ్రహమేవ చ ॥

ఇంద్రియాణి హయాన్యాహుః - విషయాం స్తేషు గోచరాన్‌ ।
ఆత్మేంద్రియ మనోయుక్తం - భోక్తే త్యాహుర్మనీషిణః ॥ - కఠోపనిషత్‌ (3-57,58)

2. ప్రణవోధనుః శరోహ్యాత్మా - బ్రహ్మతల్లక్ష్యముచ్యతే ।
అప్రమత్తేన వేద్ధవ్యం - శరవత్తన్మయో భవేత్‌ ॥ - ముండకోపనిషత్‌)

ఈ విధంగా జీవరూప రథికుడు శరీరరథాన్ని స్వాధీనంచేసికొని, భగవద్భక్తుల సేవానిర్వహణం వలన పదునైన జ్ఞానరూపఖడ్గం ధరించి, విష్ణుదయాబలంతో రాగద్వేషాది శత్రుసంహారం చేసి, ఓంకారరూప ధనుస్సుతో, కేవలజీవబాణాన్ని సంధించి, పరబ్రహ్మమనే లక్ష్యంపై వదలాలి. వదలి ఇక, నిష్క్రియుడై మిగిలి, స్వానందమయుడుగా నిలవాలి. అయితే, అది సంభవింపనిపక్షాన ఇంద్రియరూప అశ్వాలు, బుద్ధిసారథితోకూడి, అతని పరాకుమూలంగా తిరిగి మరలి వచ్చి, ప్రవృత్తి మార్గాన విషయరూప శత్రువుల నడుమ రథాన్ని పడవెేస్తే;

అక్కడి విషయాల రూపంలో నిరీక్షిస్తున్న శత్రువులందురు (ప్రేమ-పగ; ఈర్ష్య-అసూయ -వంటివి) పరాక్రమంతో, సారథితోసహ, రథికుని పట్టుకొని, ఘోరమైన చీకటి, మరణంతో కలిసి ఉండే సంసారపుబావిలో పడదోస్తారు.

వైదికకర్మ రెండు విధాలు-ప్రవృత్తము; నివృత్తము; అని. ప్రవృత్త మార్గాన నడచినవారికి; పునరావర్తనము (మరలి వచ్చుట) సిద్ధిస్తుంది. నివృత్తి మార్గంలో నడచినవారికి మోక్షం సిద్ధిస్తుంది. ప్రవృత్త కర్మలలో ఇష్టం, పూర్తం - అనే రెండు త్రోవలు ఉన్నాయి. అమావాస్యనాటి యజ్ఞం, పూర్ణిమనాటి యజ్ఞం, పశువుతో, సోమరసాదులతో, చేసే యజ్ఞాలు మొదలయినవి ఇష్టములు. దేవాలయం, ఉద్యానవనం, బావి, చెరువు మొదలయినవాటి నిర్మాణాలు పూర్తములు. ప్రవృత్తి కర్మంవలన, దేహి, దేహం వదలి, దేహాంతర స్వీకార ప్రారంభసమయాన, మనస్సు అగ్రభాగాన జ్వలిస్తాడు. అనంతరం చంద్రలోకంజేరి, భోగాల అనుభవానంతరం దేహం లీనమై పోగా, వానద్వారా క్రమంగా, ఓషధిగా, లతగా, అన్నంగా శుక్లంగా మారి మరల భూమిమీద ఆవిర్భవిస్తాడు. ఇది పునర్భవరూపమైన పితరుల మార్గం. ఇక నివృత్తి మార్గగామి, నివృత్త కర్మలలో నిష్ఠతో నిలిచి తన ఇంద్రియాలను జ్ఞానంతో ప్రజ్వలింపబేసి ఆ జ్వలనంలో క్రియారూపయాగాలన్నిటిని భస్మంచేసి ఇంద్రియాల సంకల్పశక్తికి మూలమైన మనస్సులో వికృతులతోడి మనస్సును వాక్కులో, చదువువలన లక్షణం మారినవాక్కును; అక్షరసమామ్నాయంలో అక్షరసమామ్నాయాన్ని, స్వరత్రయాత్మకమైన ఓంకారంలో ఓంకారాన్ని, బిందువులో బిందువును, నాదంలో నాదంను, ప్రాణంలో ప్రాణాన్ని బ్రహ్మమందు నిలపాలి. అపుడు అతడు దేవమార్గంలో, ఉత్తరాయణకాలాన, శుక్షపక్షాన, పగలు ఉదయాన, రాత్రి పదహారుకళలుగల పూర్ణిమనాడు, సూర్యునిద్వారా బ్రహ్మలోకం చేరి భోగం ముగిసిన తరువాత; స్థూలోపాధికుడైన విశ్వుని తేజస్సులో తేజస్సుని కారణోపాధికుడైన ప్రాజ్ఞునిలో, ప్రాజ్ఞుని బ్రహ్మంలో లీనంచేసి ముక్తుడు అవుతాడు.

రాజా! పైన తెల్పినవి, దేవతలు నిర్మించిన, పితరుల, దేవతల మార్గాలు. ఆ మార్గాలను గ్రహించినవాడు, శాస్త్రదృష్టి కలుగుటవలన, దేహధారియైనా మోహాన్ని పొందడు. లోకంలో స్వబుద్ధితో ప్రకాశిస్తాడు.

శరీరాది కార్యాలకు, కారణంగా మొదట, హద్దుగా చివర, ఉంటూ, బయటకు భోగ్యంగా, లోపలభోక్తగా, ఉత్తమం, అనుత్తమం, జ్ఞానం జ్ఞేయం, వచనం వాచ్యం, చీకటి వెలుగు అయిన పదార్థాలకు భిన్నంగా మరొకటి లేదు. ప్రతిబింబం వస్తుస్వభావానుసారంగా భ్రాంతిగలదిగా (అదే వస్తువుగా భ్రాంతి) అనిపిస్తుందిగాని సత్యంగాదు; శరీరం మొదలయిన కార్యాలు, మిథ్యాస్వరూపాలు; వాటికారణాలయిన నేలమొదలైనవి మిథ్య అనటం స్పష్టం. పరమాత్మకు, అజ్ఞానకారణాన ఎంతవరకు వికల్పం కనిపిస్తుందో, అంతవరకు భ్రాంతిగూడ నిలబడి ఉంటుంది. అయితే, అజ్ఞానం అంతరించిన పిదప, అంతా మిథ్యగా తెలిసి యథార్థజ్ఞానం సిద్ధిస్తుంది. శాస్త్రంలో చెప్పిబడిన విధినిషేధాలు కలలో మేల్కొన్న విధంగా అవుతాయి. అద్వైతం - మూడువిధాలు: భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం, అని; వటతంతు న్యాయంతో (కార్యకారణాలు -రెండూవాస్తవానికి ఒకటే) భిన్నంగా కనిపించే వస్తు ప్రపంచమంతా ఒకటే అనే భావంతో మెలగడం -భావాద్వైతం; మనోవాక్కాయాల ద్వారా జరిగే సర్వక్రియలూ వాటి ఫలితాలతోసహ; పరమాత్మకు సమర్పించడం క్రియాద్వైతం; పుత్రమిత్ర కళత్రాదులయిన సర్వజీవకోటికీ, తనుకూ, పంచభూతాత్మకదేహం ద్వారా, భోక్త ఒక్కడే అని గ్రహించి, అర్ధం, కామం-అనే పురుషార్థాలు రెండిటిలోను సమభావంతో మెలగడం, ద్రవ్యాద్వైతం; ఈ విధంగా, త్రివిధ - అద్వైత భావాలతో, సృష్టిలోని సకలభేదాలు, స్వప్నప్రాయాలుగా గ్రహించి, నరుడు ముని కావాలి.

వాదాలు, వివాదాలు, సంవాదాలు వేయేల? వద్దు. వేదోక్తవిధితో జీవించే పండితుడు, తన యింటనే శ్రీహరి పాదపూజచేసి మోక్షపదవిని చేరగలడు.

రాజా! మీరు ఉన్నతభక్తి విశేషంతో, నారాయణుని పాదపద్మాలను నిష్ఠాగరిష్ఠులై సేవించే గదా! ఘోర విపత్తుల పాలు గాకుండ, ఎల్లదిగంతాలను గెలిచి దేవేంద్ర వైభవంతో యజ్ఞం నిర్వహించారు.

నారదుని పూర్వజన్మవృత్తాంతము

No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...