దేవతలు వెళ్ళాక అగస్త్యుడు ధర్మపత్ని లోపాముద్రను పిలిచాడు. రాకుమారీ! మన కాశీనివాసానికి విఘ్నం రానే వచ్చింది. వింధ్యపర్వతం సూర్యుడి దారికి అవరోధం కలిగించిందిట. దానిని తొలగించమని దేవతల ఆజ్ఞ. మనం వెళ్ళక తప్పదు. కాశీ గురించి పూర్వీకులు చెప్పినమాట వాస్తవం. కాశీలో నివసించేవారికి విఘ్నాలు చాలా వస్తాయి. అయినా ముముక్షువులు అవిముక్తాన్ని (కాశీని) విడిచిపెట్టకూడదు - అన్నారు.
అన్నట్టుగానే అంతరాయం రానే వచ్చింది. సరే పద, దక్షిణాపథానికి బయలుదేరదాం - అన్నాడు. ఇద్దరూ కలిసి మణికర్ణికలో స్నానంచేసి విశ్వేశ్వరుణ్ణి దర్శించారు. అటుపైని దండపాణిని అర్చించారు. కాలభైరవమూర్తిని సందర్శించారు.
కాలరాజా! మహాబాహూ! భయనాశకా! కాశీ పట్టణానికి నువ్వు ప్రభువువు. కాశీవాసులకు కలిగే విఘ్నాలను అన్నింటినీ తొలగించేవాడవు. భక్తులను రక్షించేవాడవు. నన్నెందుకు దూరం చేస్తున్నావు స్వామీ! నేను చేసిన అపరాధం ఏమిటి? ఎవరిమీదనైనా అపవాదులు వేశానా? అసత్యాలు పలికానా? లోభగుణానికి లొంగిపోయానా? ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష విధిస్తున్నావు? ఎందుకు వెళ్ళగొడుత్తున్నావు?
సాక్షిగణపతీ! విఘ్ననివారణా! నీకూ కోపమే వచ్చిందా? కాశీని విడిచివెళ్ళవలసిన అవసరాన్ని ఎందుకు కల్పించావు?
ఆ మునిదంపతులు ఇలా కాశీదేవతలనందరినీ దర్శించి ప్రార్థించి విన్నపాలు చేసుకుని దక్షిణదిక్కుకు బయలుదేరారు. కాశీని విడిచిపెట్టవలసి వస్తోందే అన్న బాధ అనుక్షణం వారిని పీడించింది. గుండె దిటవు పరుచుకుని ప్రయాణం సాగించారు. అడుగడుగునా కాశీని తలచుకుంటూనే నడిచారు. కొంతదూరం వెళ్ళాక నడక చాలించి తపశ్శక్తినే విమానం చేసుకుని ఆకాశమార్గాన దక్షిణాపథం వైపు వచ్చారు.
నిముషన్నరలో ఎట్టయెదుట వింధ్యపర్వతం కనిపించింది. ఆకాశానికి తన్నుకుని నిలబడి ఉంది. మునిదంపతులు ఆశ్చర్యచకితులై చూస్తూ నిలబడ్డారు.
అగస్త్యుడిని ఆల్లంతదూరంలోనే చూసిన వింధ్యుడు వొణికిపోయాడు. మహర్షికి మర్యాదలు చెయ్యాలి. స్వాగతం పలకాలి. ఎలాగ? ఎలాగ? అని కంగారుపడ్డాడు. తనను తాను కుంచించుకుని వినయంగా భక్తిగా సాష్టాంగపడ్డాడు. అగస్త్యుడి మనస్సు ప్రసన్నమయ్యింది. ముఖం విప్పారింది.
వత్సా! దక్షిణాపథానికి వెళ్ళి నేను తిరిగి వచ్చేవరకూ నువ్వు ఇలాగే ఉండు. ఆకాశానికి అడ్డంగా ఎదిగి ఎత్తుగా నువ్వుంటే నీ శిఖరాలను అధిరోహించి దాటివెళ్ళగలిగిన ఓపిక నాకులేదయ్యా. అందుకని పుత్రకా! నేను వెళ్ళివచ్చేవరకూ నువ్వు ఇలాగే ఉండు - అని చెప్పేసి లోపాముద్రాగస్త్యులు వింధ్యను దాటి దక్షిణదిశకు వచ్చేశారు. శ్రీశైలాన్ని దర్శించి మలయాద్రి మీద ఆశ్రమం నిర్మించుకుని కాపురం ఉన్నారు.
అగస్త్యుడి అభ్యర్థనమేరకు శ్రీ మన్మహాదేవి వింధ్యపర్వతాన విడిది చేసింది. భక్తాగ్రేసరుడి అర్చనలకు తానై అందుబాటులో నిలిచింది. వింధ్యవాసినిగా ప్రసిద్దికెక్కింది.
స్వాయంభువమనువు ఈ వింధ్యవాసినినే ఉపాసించాడని నారాయణమహర్షి నారదుడికి చెప్పిన వృత్తాంతాన్ని సూతుడు శౌనకాది మహర్షులకు వినిపించాడు. ఈ ఉపాఖ్యానం పుణ్యప్రదం. పాపనాశకం. రాజులకు విజయాన్నీ ద్విజులకు జ్ఞానాన్నీ వైశ్యులకు ధనధాన్యసమృద్దినీ మిగిలినవారికి సుఖసంతోషాలనూ కలిగిస్తుంది. ఒక్కసారి చదివినా విన్నా చాలు - అని ఫలశ్రుతి కూడా చెప్పాడు.
మన్వంతరాలలో మహాదేవి
No comments:
Post a Comment