Friday, July 31, 2026

The Story of Vindhyachala - వింధ్యాచల వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - వింధ్యాచల వృత్తాంతం

మహామునులారా! పర్వతాలలోకెల్లా గౌరవాస్పదమైనది వింధ్యపర్వతం. దట్టంగా అడవులు, మహావృక్షాలు, ఫలపుష్పభరితంగా లతలూ పొదలూ. వరాహ మహిష వ్యాఘ్ర శార్దూల వానర శశక ఋక్ష(ఎలుగుబంటి) శృగాలాది(నక్క) జంతువులు. శుకశారికాది పక్షులు. అన్ని ప్రాణులకు తుష్టినీ పుష్టిని కలిగించే మహాపర్వతం. నదీనదజలాలతో ఇసుకతిన్నెలతో దేవగంధర్వ కిన్నర కింపురుషాప్సరో జాతులను ఆకర్షించే గిరిరాజం.

లీలావినోదంగా లోకాలన్నీ పర్యటించే నారదుడు ఒకనాడు వింధ్యాద్రికి వచ్చాడు. వింధ్యుడు ఎదురేగి అర్ఘ్యపాద్యాది అతిథిసత్కారాలు జరిపి సముచితాసనంమీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేశాడు.

దేవర్షీ! ఎక్కడినుంచి ఎక్కడికి వెడుతూ ఇక్కడికి వచ్చావు? నీ రాకతో నా మందిరం పావనమయ్యింది. సూర్యుడిలా నిరంతరం నువ్వు సంచరిస్తూనే ఉంటావు. నీ సంచారం ప్రాణికోటికి అభయప్రదం. మహానుభావా! సృష్టిలో నీకు తెలియని వింతలూ విడ్డూరాలూ ఉండవు. అటువంటి అపూర్వమూ అద్భుతావహమూ వృత్తాంతమేదైనా ఒకటి చెప్పి చెవులకు విందుచెయ్యి.

వింధ్యాద్రీ! నేనిప్పుడు బంగారుకొండ మేరుపర్వతంనుంచి వస్తున్నాను. ఆ శిఖరంమీద ఇంద్రాగ్నియమవరుణలోకాలున్నాయి. అష్టదిక్పాలకులకూ భవనాలున్నాయి. అవ్వి భవనాలంటే భవనాలా? సకల భోగాలకూ భువనాలు - అని చెప్పి నారదుడు గట్టిగా నిట్టూర్చి ఊరుకున్నాడు.

అదేమిటి దేవర్షి! అలా నిట్టూర్చావు. కారణం ఏమిటి? అని సంభ్రమంగా ఆడిగాడు వింధ్యాద్రి.

నారదుడికి ముఖం విప్పారింది. అద్రిరాజా! ఏమి చెప్పమంటావ్‌! హిమవంతుడున్నాడా, పార్వతీదేవికి తండ్రి, శివుడంతటివాడికి మామగారూను. కదా! ఆ శివుడి సంబంధంతో హిమవంతుడు పరమ పూజ్యుడయ్యాడు. అలాగే కైలాసమూను. అది శివుడికి సాక్షాత్తు నివాసభవనమాయె. పూజ్యుడయ్యాడు, పాపవినాశకుడనే కీర్తి పొందాడు. ఇలాగే నిషధ - నీల - గంధమాదనాదులూ ఏవేవో ప్రత్యేకతలతో మన్ననలు అందుకుంటున్నాయి. ఎవరి గౌరవం వారికి దక్కుతోంది. బాగానే ఉంది. కానీ ఆ మేరుపర్వతం ఏమిటో మరీ విర్రవీగుతోంది. విశ్వాత్మకుడు సూర్యుడు గ్రహబృందాలతో నక్షత్రగణాలతో సహా తనచుట్టూ తిరుగుతూ ఉంటాడట. తానేమో కనకపర్వతంట. అన్ని పర్వతాలలోకీ తానే ఉత్తమోత్తమమంట. శ్రేష్ఠంట, వరిష్ఠంట. తనకు సాటివచ్చే పర్వతం మరొకటి ఈ సృష్టిలోనే లేదుట. ఏమిటో ఇలాగ తనకుతాను భావించేసుకుని తెగవిర్రవీగిపోతున్నాడు ఆ మేరుపర్వతరాజు. జ్ఞాపకంవచ్చి నిట్టూర్చాను. అంతకన్నా ఏమీ లేదులే వింధ్యపర్వతరాజా! అయినా నాలాంటి తపస్వులకు ఇలాంటి గొడవలతో పనేమిటి చెప్పు? ఏదో ప్రసంగవశాత్తూ వచ్చింది కాబట్టి, ఆదయినా నువ్వు అడిగావు కాబట్టీ ఈ మాటన్నా చెప్పాను. వెళ్ళొస్తా.

ఈ మాటకాస్తా చెప్పేసి స్వైరచారి దేవర్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వింధ్యుడికి మనన్సు కుతకుతలాడిపోయింది. లోపల లోపల చిచ్చు రగుల్కుంటోంది. శాంతి లేదు. ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? మేరువుని జయించడం ఎలాగ? అందాకా శాంతిలేదు. సౌఖ్యం లేదు. ఓడించకపోతే నా ఉత్సాహం ఎందుకు, నా మానాభిమానాలు ఎందుకు, నా కీర్తి ఎందుకు, నా కులం ఎందుకు, నా బలం ఎందుకు, నా పౌరుషం ఎందుకు. నా జ్ఞానం ఎందుకు, నా వంశం ఎందుకు? ఇలా మథనపడుతుండగా అతడి మనస్సులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. దోషకారిణి బుద్దిపుట్టింది.

రోజూ సూర్యుడు గ్రహనక్షత్ర బృందాలతో ప్రదక్షిణం చేస్తాడుటగదా ఆ మేరువుకి. సరే. ఆ సూర్యుడి మార్గానికి అడ్డం నిలుస్తాను. ఎలా ప్రదక్షిణం చేస్తాడో చూస్తాను. మేరువుకి గర్వభంగం చేసాను.

ఈ బుద్ది పుట్టడమేమిటి. వెంటనే వింధ్యాద్రి ఆకాశానికి ఎదిగింది. కొండకొమ్ములతో ఆవరించింది. సూర్యుడు ఉదయించనీ, ఎటు కదులుతాడో చూస్తాను - అని ఆకాశాన్ని తన్నిపెట్టుకు నిలబడింది.

రాత్రి గడిచింది. నిర్మలంగా తెలవారింది. దిక్కులు తేటపడ్డాయి. తూర్పుకొండనుంచి సూర్యరథం కదిలింది. కిరణాలు దశదిశలకూ పరుచుకున్నాయి. పద్మాలు వికసించాయి. కలువలు ముకుళించాయి. లోకులు తమతమ పనులకు ఉపక్రమించారు.

పూర్వాహ్ణ అపరా
హ్ణ మధ్యాహ్న విభాగం కల్పించి హవ్య కవ్య భూతబలులను దేవతలకు వృద్దిపరిచే సూర్యుడు తూర్పునుంచి కదిలి ఆగ్నేయానికి సాగి అక్కడినుంచి దక్షిణదిశగా ప్రయాణం సాగించాడు. అతడు వచ్చి వెడుతూంటే దిక్కాంతలు విరహవేదనకు లోనవుతున్నారు. దక్షిణదిశగా వెడుతున్న రథం హఠాత్తుగా ఆగిపోయింది. సారథి అనూరుడు ఒక్కపెట్టున అరిచాడు.

సూర్యదేవా! వింధ్యపర్వతం ఎదిగి ఆకాశమార్గాన అదిగో అడ్డంగా నిలిచింది. నీ ప్రదక్షిణం కోరి మేరువుతో పోటీపడుతున్నట్టుంది.

సూర్యుడు ఆశ్చర్యపోయాడు. ఆకాశమార్గంలోకూడా అడ్డంకులా! అవునుమరి అభివృద్ధి చెందుతున్న శూరుడు ఏదైనా సాధిస్తాడు. అతడికి అసాధ్యం ఏదీ ఉండదు. రథం ఆగిపోయింది. దేవుడే కాపాడాలి. దైవమే బలీయం. రాహువు బాహువులు సాచి కబళించినా క్షణకాలమైనా ఆగని నేను ఇప్పుడిలా అడ్డగింపబడ్డానంటే విధి బలీయం కాక మరింకేమిటనుకోను!

సూర్యుడు ఆగిపోయాడు. ఏ లోకానికీ దిక్కుతోచలేదు. ఎవరిని శరణువేడాలి? కర్తవ్యం ఏమిటి? ఏమీ తోచలేదు. మానవులేకాదు చిత్రగుప్తాదులుకూడా సూర్యుణ్ణిబట్టే కాలాన్ని గణిస్తారు. ఇప్పుడు ఏమి చెయ్యాలో వారికి పాలుపోలేదు. ఒక పర్వతం సూర్యభగవానుడిని అడ్డుకోవడమా! ఆహా! దైవవిపర్యయం!

జగత్తు స్తంభించిపోయింది. స్వాహా స్వధాకారాలు లేవు. ఇది పశ్చిమ దిక్కువారి అవస్థ. ఇక దాక్షిణాత్యుల పరిస్థితి ఏమిటంటే - రాత్రి తరగడం లేదు. మెలకువ వచ్చినా వేకువ కావడం లేదు. తూర్పు ఊత్తర దిక్కులవారు నిలబడిపోయిన సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఏ రకంగానైనా మొత్తం ప్రజానీకమంతా మృతమూ నష్టమూ భగ్నమూ వినాశమూ ఆయిపోతోంది. అంతటా హాహాకారాలే వినవస్తున్నాయి. సంధ్యావందన హోమాదిక్రతువులు ఆగిపోయాయి. దానితో ఇంద్రుడీతోసహా దేవతలంతా ఏమి చెయ్యాలోతోచక మడమలు తొక్కుకున్నారు.

శౌనకాది మహామునులారా! పరిస్థితి ఇలా విషమించడంతో ఇంద్రాది దేవతలందరూ కలిసి సృష్టికర్తను ముందు నిలుపుకుని రుద్రుణ్ణి శరణువేడారు.

ఉమాలలిత పంకజా! గణాధ్యక్షా! అష్టసిద్ధి విభూతిదాతా! మహామాయావిలాసస్థానమా! పరమాత్మా! వృషాంకా! అమరేశా! కైలాసవాసా! అహిర్బుధ్నా! మాన్యా! మనూ! మానదా! అజా! స్వాత్మారామా! శంభూ! గణనాధా! దేవా! గిరీశా! మహావిష్ణుస్తుతా! విష్ణుహృదయపద్మనివాసా! మహాయోగరతా! యోగగమ్యా! యోగివిభూ! యోగీశా! యోగఫలప్రదా! దీనరక్షాపరా! దయా సాగరా! ఆర్తిప్రశమనా! ఉగ్రవీర్యా! గుణమూర్తీ! వృషధ్వజా! కాలస్వరూపా! కాలకాలా! నమో నమః, నమో 
నమః - అంటూ అందరూ సాగిలపడ్డారు.

ఉబ్బులింగడు పరవశించాడు. చిరునవ్వులు చిందించాడు. దేవతలారా! మీ స్తోత్రం నన్ను అలరించింది. ప్రసన్నుడిని అయ్యాను. మీ మనోరథాలు ఏమిటో చెప్పండి. తీరుస్తాను - అన్నాడు గంభీరంగా.

సర్వదేవేశా! గిరీశా! శశిమౌళీ! ఆర్తులకు సుఖసంతోషాలు(శమ్‌) కలిగిస్తావు కనక శంకరుడవయ్యావు. ఇప్పుడు మేమంతా ఆర్తులము. నిన్ను శరణు అంటున్నాం. మాకు శమ్‌ కలిగించు. వింధ్యపర్వతమని ఒకటి ఉంది. మేరువుతో దానికి పంతమూ పోటీ. అదిప్పుడు శరీరం పెంచి సూర్యగమనాన్ని నిరోధించింది. లోకాలన్నీ అల్లల్లాడిపోతున్నాయి. దాని విజృంభణాన్ని నిలువరించు. లోకాలకు మేలు చెయ్యి. సూర్యుడే ఆగిపోతే ఇక కాలజ్ఞానం ఎలాగ? యజ్ఞయాగాలులేక స్వాహా స్వధాకారాలులేక మేమంతా జీవించేది ఎలాగ? ఎవరిని శరణువేడాలి అని ఆలోచిస్తే మాకందరికి నువ్వే స్ఫురించావు. ఈ ఆపద తొలగించడానికి నువ్వే సమర్ధుడవు. మాకు మరొక దిక్కులేదు. కాపాడు.

దేవతలారా! మీకు నామీద ఉన్న నమ్మకానికి సంతోషమే కానీ నాకు అంతటి శక్తిలేదు. ఏ పర్వతాన్నయినా అణిచివెయ్యగల సమర్ధుడు రమాకాంతుడొక్కడే, అతడే మనకందరికీ ప్రభువు. సర్వకారణకారణుడు. నేనూ వస్తాను. పదండి. వైకుంఠానికి వెడదాం. శ్రీహరితో విన్నవించుకుందాం. కష్టాలు కడతేరుస్తాడు - అనడమేమిటి శివుడివెంట దేవతలందరూ బయలుదేరి వేగంగా వైకంఠం చేరుకున్నారు.

విష్ణుమూర్తీ! జయము, జయము రమావల్లభా! శరణు, శరణు మహాపురుషా! దైత్యారీ! కామజనకా! సర్వకామఫలప్రదా! మహావరాహా! గోవిందా! మహాయజ్ఞస్వరూపకా! మహావిష్ణు! ధ్రువేశా! జగదుత్పత్తి కారణా! మత్స్యావతారం ధరించి వేదాలను ఉద్దరించావు. సత్యవ్రతా! ధరాదీశా! సురకార్యసాధకా! అమృతాప్తికరా! ఈశానా! నమో నమః. ఆదిదైత్యుడిని సంహరించడానికి ఆదినూకరరూపం ధరించినవాడా! భూమీ భారవాహా! కూర్మరూపా! హిరణ్యకశిపుడిని మట్టుబెట్టడానికి నరసింహావతారం ఎత్తినవాడా! బలిచక్రవర్తిని కికురించడానికి వామనమూర్తివైనవాడా! దుర్మార్గులైన క్షత్రియుల్ని అంతమొందించడానికి రేణుకాజమదగ్నులకు పుత్రుడవైన పరశురామా! దశకంధర సంహారంకోసం భూలోకాన అవతరించిన దాశరథీ! కంసదుర్యోధనాది రాక్షసాంశలను తునిమి భూభారం తొలగించడానికీ ధర్మసంస్థాపనకూ కృష్ణావతారం ధరించినవాడా! పశుహింసను వారించి దుష్టయజ్ఞాలను నిషేధించిన బుద్దావతారా! దుష్టుల పాలనలో మగ్గిపోతున్న లోకాన్ని కాపాడటంకోసం కల్కిరూపం ధరించినవాడా! శిష్టరక్షణకూ దుష్టశిక్షణకూ దశావతారాలు ఎత్తి సర్వదుఃఖహరుడవయ్యావు. భక్తుల ఆర్తిని తొలగించడంకోసం స్త్రీజన్మలేకాదు జలజంతువుల రూపాలనుకూడా ధరించావంటే నీకంటే దయానిధులుంటారా? భక్తార్తిహరా! నమో నమః, నమో నమః - దేవతలు భక్తిప్రపత్తులతో స్తుతించి సాష్టాంగపడ్డారు.

గదాధరుడు ప్రసన్నుడయ్యాడు. మందహాసం చిందించాడు. దేవతలారా! నేను ప్రసన్నుడిని అయ్యాను. మీకింక భయంలేదు. వేదనలన్నీ మరిచిపాండి. భరింపరాని మీ దుఃఖాన్ని తొలగిస్తాను. ఎంతటి దుర్లభమైన వరమయినా సరే - ఇస్తాను. కోరుకోండి. మీ స్తోత్రము ఇంతగా నన్ను ఆనందింపజేసింది. వరువాత లేచి శుచియై ఈ స్తవాన్ని పఠించినవారికి ఏ దుఃఖాలూ రావు. అనారోగ్యంకానీ దారిద్య్రంకానీ వారి ఇళ్ళ దరిదాపులకైనా రావు. దుష్టగ్రహ భూతప్రేత పీడలు ఉండవు. మంచి సంతానంతో భోగభాగ్యాలతో సుఖాలనుభవిస్తూ చిరకాలం జీవిస్తారు. వెయ్యేల, ఈ స్తోత్రం సర్వార్థసాధకం. భుక్తిముక్తి ప్రదాయకం, విబుధులారా! మీ మనస్సులో బాధ ఏమిటో చెప్పండి. తప్పకుండా తొలగిస్తాను. అణుమాత్రం కూడా సందేహించకండి.

శ్రీహరి ప్రసంగంతో ఇంద్ర రుద్ర బ్రహ్మాదిదేవతలకు ఉత్సాహం కలిగింది. వింధ్య వృత్తాంతం విన్నవించారు.

దేవదేవా! మహావిష్టూ! సృష్టిస్థితిలయకారణా! వింధ్యపర్వతం సూర్యభగవానుడిని అడ్డుకుంది. మేమంతా భోగభాగ్యరహితులమైపోయాం. ఏమి చెయ్యాలో ఎక్కడికి పోవాలో దిక్కుతోచక నీ సన్నిధికి వచ్చాం. నువ్వే కాపాడాలి - అని మొరపెట్టుకున్నారు.

దేవతలారా! చరాచరజగత్తుకంతటికీ కన్నతల్లి శ్రీమన్మహామాత. ఆ దేవిని నిరంతరం అర్చించే అగస్త్యమహర్షి వారణాసిలో ఉన్నాడు. మహాతేజస్వి. అతడు వింధ్యగర్వాన్ని అణగ్గొడతాడు. ముక్తిధామమైన అ కాశీకి వెళ్ళి అగస్త్యుణ్ణి అభ్యర్థించండి.

విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం దేవతలందరూ కాశీకి వెళ్ళారు. భక్తియుక్తులై మణికర్ణికలో సచేలస్నానాలు చేశారు. దేవపితృతర్పణాలు విడిచిపెట్టారు. దానధర్మాలు చేశారు. అగస్త్యుడి ఆశ్రమం చేరుకున్నారు. ప్రశాంతమైన వాతావరణం. గుబురుగా ఎదిగిన చెట్లు. మయూర సారస హంస చక్రవాకాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వ్యాఘ్ర శార్దూలాది క్రూరమృగాలు సైతం నిశ్శబ్దంగా ప్రసన్నంగా తపస్వుల్లాగా ఉన్నాయి. కుటీరంలో మహర్షి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. దేవతలు ఆట్టే అలికిడి చెయ్యకుండా వెళ్ళి సాష్టాంగపడ్డారు.

బ్రాహ్మణోత్తమా! పరమపూజ్యా! వాతాపి బలనాశకా! కుంభసంభవా! లోపాముద్రాపతీ! మిత్రావరుణనందనా! సర్వవిద్యానిధీ! శాస్త్రనిధీ! నువ్వు ఉదయిస్తే జలప్రవాహాలు తేరుకుంటాయి. రెల్లు దుబ్బులు వికసిస్తాయి. రావణుడంతటివాడు నీ భక్తుడు. జటామండలధారీ! శిష్యబృందవిహారీ! నమో నమః. దేవతాస్తుత్యగుణరాశీ! ఆపోశితవారాశీ! (సముద్రాలను ఆపోశనం పట్టినవాడా) శరణు. శరణు. స్వామీ! శరణు. శరణు. వింధ్యపర్వతానికి గర్వభంగం చేసి లోకాలను కాపాడు.

దేవతల స్తుతిని అభ్యర్థననూ ఆలకించిన అగస్త్యుడు ప్రసన్నుడై మెల్లగా కన్నులు విప్పాడు. మీరంతా ఉత్తమోత్తములు, దేవతలు త్రిభువనేశ్వరులు, లోకపాలకులు, మహాత్ములు, నిగ్రహానుగ్రహ సమర్థులు తిరుగులేని వజ్రాయుధం చేతబట్టిన ఇంద్రుడున్నాడు. హవ్యకవ్య వాహకుడు అగ్ని ఉన్నాడు. దేవతలకు అతడేకదా ముఖస్థానీయుడు. రాక్షసగణాలను గడగడలాడించగలిగిన వరుణుడున్నాడు. యముడున్నాడు. వీరిలో ఏ ఒక్కరు తలచుకున్నా వింధ్యపర్వతానికి శృంగభంగమైపోతుందే. అలాంటిది అందరూవచ్చి నన్ను కోరుతున్నారంటే వింతగా ఉందే!

మహర్షీ! వింత ఏమీలేదు. ఇది మాకెవ్వరికీ సాధ్యంకాదు. విష్ణుమూర్తి సూచనపై నిన్ను అభ్యర్థిస్తున్నాం. నువ్వే సమర్ధుడివి. నిశ్చేష్టమైపోయిన ముల్లోకాలనూ కాపాడే శక్తి నీకే ఉంది. సూర్యుడికి గతి కల్పించు. వింధ్యుడికి సన్మతి పుట్టించు. నీ తేజస్సుకి లొంగుతాడు. నమ్రుడవుతాడు. కేవలం ఈ పనిమీదనే వచ్చాం. ఉపకారం చేసిపెట్టు. చెయ్యాలి. తప్పదు - దేవతల విజ్ఞప్తిని అగస్తుడు అంగీకరించాడు. సరే అన్నాడు. విబుధుల అంతరంగాలు తేలికపడ్డాయి. తృప్తిగా ఊపిరి పీల్చుకుని తిరిగి వెళ్ళారు.

అగస్త్సుడి దక్షిణాపథయాత్ర



No comments:

Post a Comment

Varieties of Bhasma - Bhasma Bhedalu - భస్మ భేదాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మ భేదాలు విరించిపుత్రా! శాంతిక పౌష్టిక కామదభేదాలతో ఈ భస్మం మూడు విధాలు. ఇది నీకు కుతూహలం కలిగించే విషయం....