జగజ్జనని చేష్టలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అచింత్య అవ్యక్తరూపకదా! అన్నీ జగత్కల్యాణ కారకాలే. లోకమంటే నిర్వ్యాజమైన ప్రేమ. కన్నతల్లిగదా! బిడ్డలమీద ప్రేమకాక ఏముంటుంది!
యద్యచ్చరితం శ్రీదేవ్యాస్తత్సర్వం లోకహేతవే ।
నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా ॥
పూర్వకాలాన పాతాళంలో అరుణుడు అని ఒక మహాదైత్యుడు ఉండేవాడు. దేవద్వేషి మహాబలుడు. మహాఖలుడు, దేవతలను జయించాలనే కోరికతో వాడు హిమవత్పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి తీవ్రతపస్సుచేశాడు. గంగాతీరంలో పండుటాకులు తింటూ యోగమార్గాన గాయత్రీ మహామంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. వాడి శరీరంనుంచి బయల్వెడలిన తపోగ్ని జగత్తుని దహించివేయనారంభించింది. అది ఏమిటో తెలియక దేవతలూ మానవులూ గగ్గోలు పెట్టారు. బ్రహ్మను శరణువేడారు. ఆయన గాయత్రీసహితుడై హంసను అధిరోహించి హిమాలయానికి వచ్చాడు. ప్రాణమాత్రావశిష్టుడై రెండవ ఆగ్నిదేవుడిలా వెలిగిపోతున్న అరుణదైత్యుణ్ణి చూశాడు. వత్సా! వరం కోరుకో అన్నాడు. ఈ మాటలు వినపడటంతోనే అమృతం చిలికినట్టయ్యింది. అరుణుడు సాష్టాంగపడ్డాడు. ఇద్దరినీ భక్తిప్రపత్తులతో స్తుతించాడు. మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు.
అరుణా! హరిహరాదిదేవనాయకులు సైతం మృత్యూవుకి అతీతులు కారు. నాకూ మరణం ఉంది. ఇక ఇతరులమాట చెప్పాలా! కనక, దానవోత్తమా! యోగ్యమైన వరం కోరుకో ఇస్తాను. ఇవ్వడానికి శక్యమైనది అడుగు. అంతేగానీ అలవిగానివి అడిగి పంతానికి పోకు. అది బుద్దిమంతుల లక్షణం కాదు.
అయితే చతుర్ముఖా! యుద్దంలోగానీ మరొకచోటగానీ శస్త్రాస్త్రాలతోగానీ పురుషులతోగానీ స్త్రీలతోగానీ ద్విపాత్తులతోగానీ చతుష్పాత్తులతోగానీ రెండూ కలిసిన వాటితోగానీ నాకు మృత్యువులేకుండా వరం అనుగ్రహించు. దేవతలను జయించడానికి కావలసిన బలం ఇయ్యి.
బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. హంసవాహనం కదిలింది. వెళ్ళిపోయాడు. అరుణుడు పాతాళం చేరుకున్నాడు. దైత్యులనందరినీ సమావేశపరిచాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరంగురించి చెప్పాడు. వెంటనే అమరావతిమీదకి దండువెళ్ళాలి అన్నాడు. యుద్ధవార్తను తెలియపరిచిరమ్మని ఇంద్రుడి దగ్గరికి దూతను పంపాడు. దేవేంద్రుడు గడగడలాడాడు. దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడి సన్నిధికి పరుగుతీశాడు. విష్ణుమూర్తిని కలుపుకుని అందరూ శివుడి మందిరానికి వెళ్ళారు. అరుణాదిదైత్యులను సంహరించడమెలాగా అని విచారణ చేశారు.
అంతలోనే అరుణుడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. సూర్యచంద్రులనూ దిక్పాలకులనూ తోసిరాజన్నాడు. తానే అన్ని రూపాలూ ధరించి ఆయా పదవులు అధిష్టించాడు. దిక్కుతోచని దిక్పాలకులు శివుడి సన్నిధికి చేరుకున్నారు. పరిస్థితి విషమించిందని మొరపెట్టుకున్నారు.
దేవనాయకులందరూ తలలు పట్టుకున్నారు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంతచేసిందని లోపల లోపల పిసుక్కున్నారు. ఏమి చెయ్యడానికీ తోచలేదు. ఆరుణుడి విజృంభణకు అడ్డుకట్ట చేసితీరాలి. ఎలాగ? ఎలాగ?
సరిగ్గా అదే సమయానికి ఆశరీరవాణి వినిపించింది. జగన్మాతను ఆశ్రయించండి. మీపని నెరవేరుతుంది. అరుణుడు గాయత్రీ జపతత్పరుడు. ఆ మంత్రజపాన్ని వాడు విడిచిపెడితే చాలు మృత్యుయోగ్యుడవుతాడు. ఈ మాటలతో దేవతలకు ఒకదారి దొరికినట్టనిపించింది. వెంటనే ఇంద్రుడు బృహస్పతిని ఆహ్వానించాడు. అరుణుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. వాడు గాయత్రిని విడిచిపెట్టేట్టు ఎలాగోలాగా చెయ్యమన్నాడు. ఇది దేవకార్యం. నీకు తప్పదన్నాడు. ఈలోగా మేమందరమూ భువనేశ్వరిని ఉపాసిస్తాం, అనుగ్రహం సంపాదిస్తాం. నీ కర్తవ్యం తేలిక అవుతుంది - అని చెప్పి దేవగురువును పంపించాడు. ఆయన అటువెళ్ళగానే దేవతలందరూ సుస్నాతులై జాంబూనదేశ్వరిని ఉపాసించారు. మాయాబీజాక్షర సహితంగా మహామంత్రాన్ని జపిస్తూ దేవీయజ్ఞాలు నిర్వహించారు.
బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు. అతడు గద్దించి ప్రశ్నించాడు. బృహస్పతీ! ఎక్కడినుంచి రాక! ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను మీవాణ్ణి కాదు. పైగా శత్రువును.
దైత్యనాయకా! ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావ్? నువ్వు మావాడివి కాకపోవడమేమిటి? మేము ఉపాసించే దేవినే నువ్వూ నిత్యం ఉపాసిస్తున్నావు. మరి పరాయివాడవెలా అవుతావు? దేవపక్షపాతివే. సందేహం లేదు.
బృహస్పతి మాటలకు అరుణుడు హుంకరించాడు. దేవతలు ఉపాసించే దేవిని నేను ఆరాధించడమేమిటి. దేవద్వేషినికదా! కూడదుగాక కూడదు అనుకున్నాడు. దురభిమానానికి పోయాడు. ఆ క్షణంలోనే గాయత్రీమంత్రాన్ని విడిచి పెట్టేశాడు. అంతే - నిస్తేజస్కుడైపోయాడు. బృహస్పతి గమనించాడు, పని జరిగిపోయిందని సంబరపడుతూ నిర్గమించాడు. ఇంద్రుడికి సమాచారం అందించాడు. దేవతలంతా సంతోషించారు. పరమేశ్వరిని మరింత దీక్షగా ఉపాసించారు. ఎట్టకేలకు జగన్మాత సాక్షాత్కరించింది.
జగన్మంగళకారిణి, కోటిసూర్యప్రతీకాశ, కోటికందర్పసుందర, చిత్రానులేపన, విచిత్రవస్త్రద్వయ విభూషిత, విచిత్ర మాల్యాభరణ, చిత్రభ్రమరముష్టిక, వరాభయకర, శాంత, కరుణామృతసాగర, నానాభ్రమర సంయుక్త పుష్పమాలావిరాజిత. చిత్రవిచిత్రమైన అసంఖ్యాక భ్రమరీగణంతో (ఆడుతుమ్మెదల గుంపు) పరివృత. వాటి ఝంకారాలు హ్రీం బీజాక్షరధ్వనులుగా నిరంతరం వినిపిస్తున్నాయి. కోటానుకోట్లుగా తుమ్మెదలు తిరుగాడుతున్నాయి.
సర్వశృంగారవేషాఢ్య, సర్వవేదప్రశంసిత, సర్వాత్మిక, సర్వమయి, సర్వమంగళరూపిణి, సర్వజ్ఞ, సర్వజనని, సర్వేశ్వరి, శివ ఈ జగదంబికను చూడటంతోనే బ్రహ్మాదిదేవతలు సాష్టాంగదండ ప్రణామాలు చేశారు. అత్యద్భుతంగా స్తుతించారు.
అప్పటివరకూ అమ్మవారి ఒక గుప్పిడ మూసిఉంది. అందులో గండుతుమ్మెదలున్నాయి (విచిత్రభ్రమరముష్టిక). ఇప్పుడు ఆ గుప్పిడ విప్పింది. చుట్టూ గుంపులుగా తిరుగుతున్న చిత్రవిచిత్ర భ్రమరకోటులను కోటానుకోట్ల రెట్టుగా వృద్దిపాందించింది. ముల్లోకాలూ తుమ్మెదలే. ఎక్కడచూసినా తుమ్మెదలే. రంగురంగుల తుమ్మెదలు. రకరకాల తుమ్మెదలు. రాగాల తుమ్మెదలు. నాట్యాల తుమ్మెదలు. తుమ్మెదలు. తుమ్మెదలు. అంతటా తుమ్మెదలు. ఆకాశాన్ని ఆవరించిన తుమ్మెదలు. భూగోళాన్ని చీకట్లలో ముంచిన తుమ్మెదలు. గిరిశిఖరాలమీద చెట్టుకొమ్మలమీద అంతటా తుమ్మెదలే, తుమ్మెదలన్నీ ఒక్కపెట్టున ఎగురుకుంటూ వెళ్ళి దైత్యులను ఏరికోరి పీక్కుతిన్నాయి. తేనెతుట్టను కదిలించినవాడిని తేనెటీగలు ముంచెత్తినట్టు. దైత్యుల శస్త్రాలూ అస్త్రాలూ ఎందుకూ కొరగాలేదు. ఒక యుద్దం లేదు. ఒక వాగ్వాదం లేదు. కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాగినా వెంటాడి వెంటాడి కుట్టీ చంపాయి. ఎవరు ఎమయ్యారో ఎవరికీ తెలియకుండా మరణించారు. అరుణిడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు. తుమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదంబికను చేరుకున్నాయి. దేవతలు ఆశ్చర్యం ఆశ్చర్యం అని గుండెలు బాదుకున్నారు. ఆశ్యర్యమేముంది, అమ్మవారి మాయ అన్నారు అందరూ చివరికి.
బ్రహ్మాదిదేవతలు ఆనందించారు. పరమేశ్వరిని పునఃపునః స్తుతించారు. షోడశోపచారాలతో అర్చించారు. విలువైన కానుకలు సమర్పించారు. జయజయధ్వనులు చేశారు. దేవలోకంలో దుందుభులు మ్రోగాయి. మునీశ్వరులు వేదనపఠనం చేశారు. అప్పరసలు నృత్యం చేశారు. గంధర్వులు ఆనందగీతికలు ఆలపించారు. మంగళవాద్యాలు మిన్నుముట్టాయి. దేవతలు శిరస్సులు వంచి అంజలి ఘటించారు. జగదీశ్వరి సంతోషించింది. అందరికీ వరాలు కురిపించింది. దేవీభక్తిని అనుగ్రహించింది. అంతర్థానం చెందింది.
నారదా! ఇదీ భ్రామరీవృత్తాంతం. సర్వపాపవినాశకం. సర్వవాంఛాప్రదం. సంసారార్ణవతారకం
దేవీసాయుజ్యదాయకం - అని నారాయణమహర్షి ముగించాడు.
No comments:
Post a Comment