నారదుడు ఆనంద భరితుడై మరొక ప్రశ్నవేశాడు. సావిత్రీయమసంవాదం మిషగా గాయత్రి ఉపాఖ్యానం విన్నాను. జస్మ ధన్యమయ్యింది. ఇప్పుడు లక్ష్మి ఉపాఖ్యానం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు - అని అడిగాడు. నారాయణమహర్షి ప్రారంభించాడు.
నారదా! సృష్టికి ఆదిలో శీకృష్ణపరమాత్మకు వామాంగంనుంచి రాసమండలంలో మహాదేవి ఆవిర్భవించింది. అత్యంత సుందకాకారం, శ్యామ, న్యగ్రోధపరిమండిత, పన్నెండేళ్ళ నవయౌవనవతి. శ్వేతచంపకవర్ణంలో చూపులకి హాయిగా ఉంది. మనోహారిణి. శరత్పూర్ణచంద్రబింబానన. శరత్పద్మపత్ర విశాలాక్షి ఆవిర్భవించిన ఆదేవి ఈశ్వరేచ్చతో హఠాత్తుగా రెండురూపాలు ధరించింది. రూపం రంగు తేజస్సు వయస్సు కాంతి యశస్సు వస్త్రధారణ భూషణధారణ చిరునవ్వు గుణగణాలు వీక్షణాలు ప్రేమ అనునయం అన్నింటా అచ్చం ఒకేలాగా ఉన్నరెండు స్త్రీమూర్తులు. వామభాగం మహాలక్ష్మిగా దక్షిణభాగం రాధాదేవిగా రూపుదాల్చింది.
వీరిలో ముందుగా రాధాదేవి ద్విభుజ శ్రీకృష్ణపరమాత్మను వరించింది. తరవాత మహాలక్ష్మి వరించింది. అప్పుడు వారిపట్ల గౌరవాచరాలతో పరమాత్మ తానుకూడా రెండు రూపాలు ధరించాడు. దక్షిణభాగం నుంచి ద్విభుజుడు, వామభాగం నుంచి చతుర్భుజుడూ అవతరించారు. ద్విభుజుడు రాధాకాంతుడు. చతుర్భుజుడు లక్ష్మీకాంతుడు. శుద్ధసత్త్వస్వరూపుడై గోపగోపీగణ పరివృతుడై చతుర్భుజ నారాయణుడు లక్ష్మీసహితంగా వైకుంఠానికి తరలివెళ్ళాడు. అన్నింటా సమానులైన ఆ పురుషులిద్దరూ కృష్ణనారాయణులు.
స్నిగ్ధదృష్టులతో సమస్త విశ్వాన్నీ లక్షిన్తుంది కనక ఈ మహాదేవిని మహాలక్ష్మి అన్నారు. యోగశక్తి సంపన్న ఈ లక్ష్మీదేవి చాలా అంశావతారాలు ధరించింది. వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి పరిపూర్ణతమ. సాత్త్వికురాలు, శుద్ధసత్త్వస్వరూప, సర్వసౌభాగ్యసంయుత, నారాయణుడికి అత్యంత ప్రేమాస్పద. సర్వాంగనా ప్రధాన. ఇంద్రలోకంలో ఇంద్రుడికి సర్వసంపత్స్వరూపిణిగా స్వర్గలక్ష్మి పేరుతో ఈవిడ అంశావతారం వెలుగొందుతోంది. పాతాళంలో నాగలక్ష్మిగా, రాజులలో రాజలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, గోవులలో కామధేనువుగా, యజ్ఞాలలో దక్షిణాదేవిగా పద్మినులలో క్షీరసముద్రరాజతనయగా, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, సూర్యుడిలో తేజోలక్ష్మిగా ఇలా రత్నాలలో ఫలాలలో జలాలలో రాజులలో రాజపత్నులలో దివ్యస్త్రీలలో గృహాలలో సర్వసస్యాలలో వస్త్రాలలో స్థలాలలో దేవతాప్రతిమలలో మంగళఘటాలలో మాణిక్యాలలో ముత్యాలలో పుష్పమాలికలలో మణులలో హీరాలలో క్షీరాలలో చందనాలలో వృక్షాలలో నవమేఘాలలో - అంతటా శోభాదాయకంగా లక్ష్మీదేవి అంశలు విరాజిల్లుతున్నాయి.
ఈ మహాలక్ష్మిని మొట్టమొదట వైకుంఠంలో చతుర్భుజనారాయణుడు అర్చించాడు. తరవాత బ్రహ్మదేవుడూ శంకరుడూ అర్చించారు. క్షీరసముద్రంలో విష్ణుమూర్తి పూజించాడు. స్వాయంభువమనువు అటుపైని మహారాజులూ ఉపాసించారు. ఋషీంద్రులూ మునీంద్రులూ మానవులూ అర్చించారు. పాతాళంలో నాగులు ఉపాసించారు.
భాద్రపద శుక్షాష్టమినాడు ప్రారంభించి పక్షం రోజులపాటు బ్రహ్మదేవుడు మహాలక్ష్మీవ్రతం చేశాడు. చైత్ర భాద్రపద పుష్యమాసాలలో ప్రతి మంగళవారంనాడూ విష్ణుమూర్తి అర్చించాడు. పుష్యసంక్రాంతి నాడూ మాఘమంగళవారాలలోనూ వర్గాంతంలోనూ భువనత్రయాలలో స్వాయంభువమనువు లక్ష్మీపూజలు చేశాడు. ఇంద్రుడూ మంగళవారాలే ఆర్చించాడు. కేదార - నీల - సుబల - నల - ధ్రువ - ఉత్తానపాద - బలి - కశ్యప - దక్ష - కర్ణమ - వివస్వత్ - ప్రియవ్రత - చంద్ర - కుబేర - వాయు - యమ - వహ్ని - వరుణాది దేవతలందరూ సర్వత్ర భక్తితో పూజలు చేశారు. మహాలక్ష్మి అంటే ఐశ్వర్యాధిదేవత. సర్వసంపత్స్వరూపిణి.
నారాయణప్రియ వైకుంఠవాసిని వైకుంఠాధిష్టానదేవత సనాతని అయిన మహాలక్ష్మి భూలోకంలో సింధుకన్యకగా ఎలా జన్మించింది? ఎవరు ఎలా స్తుతించారు? ఎలా అర్చించారు? అంటూ నారదుడు ప్రశ్నలు గుప్పించాడు. మహర్షి అందుకున్నాడు -
నారదా! పూర్వకాలంలో దుర్వాసుడి శాపానికి గురియై ఇంద్రుడూ దేవతలూ పదవిసంపద్భ్రష్టులై భూలోకానికి పోవలసివచ్చింది. అప్పుడు స్వర్గలక్ష్మి దుఃఖంతో కోపంతో స్వర్గలోకం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళి మహాలక్ష్మిలో లినమయ్యింది.
ఆ తరవాత దేవతలు గుమికూడి బ్రహ్మను శరణు వేడారు. అతడు శంకరుణ్ణి సంప్రదించాడు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళి చతుర్భుజ నారాయణుడిని శరణువేడుకొన్నారు. ఆప్పుడు ఆయన ఒక ఉపాయం ఆలోచించి లక్ష్మీదేవిని కళాంశతో క్షీరసముద్రుడి ఇంట కన్యగా అవతరించమని ఆజ్ఞాపించాడు. అలా సింధురాజకన్య అయ్యింది.
దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించినవేళ దర్శనమిచ్చింది. స్తుతించిన దేవతలకు వరాలిచ్చింది. విష్ణుమూర్తికి దివ్యవనమాల ఇచ్చింది. ఇలా దేవతలు తిరిగి తమ రాజ్యసంపదలను పొందగలిగారు.
క్లుప్తంగా ముగించాడు నారాయణమహర్షి వింటున్న నారదుడికి సంతృప్తి కలగలేదు. దుర్వాసుడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు? ఇంద్రుడు ఏ తప్పుచేశాడు? లేకపోతే బ్రహ్మిష్ఠుడు ఉత్తినే శపిస్తాడా! దేవదానవులు క్షీరసముద్రాన్ని ఎలా మథించారు? మహాలక్ష్మి దర్శన మిచ్చినప్పుడు ఇంద్రుడు ఎలా స్తుతించాడు? వారిద్దరికీమధ్య నడిచిన సంవాద స్వరూపం ఏమిటి? - ఇవన్నీ చెప్పకపోతే నాకు తృప్తి కలగదు అంటూ నారదుడు మారాముచేశాడు. సరే నారాయణమహర్షి ఆరంభించాడు.
No comments:
Post a Comment